రెండు మౌనాల మధ్య

అర్థరాత్రి అవుతున్నట్లు ఉంది. కానీ, ఆ గదిలో రెండు మంచాలపై పడుకుని ఉన్న మనుష్యులకు మాత్రం నిద్ర వస్తున్న దాఖలాలు లేవు. వారిద్దరూ చెరో వైపు కి తిరిగి పడుకుని ఉన్నారు. ఎవరికి వారే పక్కన వారు పడుకుని ఉన్నారు అన్న భ్రమ లో ఉన్నట్లు ఉన్నారు. అందుకనే ఏమీ మాట్లాడటం లేదు. ఆమె ఒక చేతిని కళ్ళపై తెరలా కప్పి పడుకుంది. అది ఆ చీకటి నుంచి వచ్చే వెలుతురు ని కూడా రానివ్వరాదన్న పట్టుదలో, లేక ఏదన్నా బాధతో నిండిన ఆలోచనలు దాడి చేస్తున్నాయో. అతనేమో – రాముడు మంచి బాలుడిలా రెండు చేతులూ కట్టుకుని ఒక వైపుకి వాలి పడుకున్నాడు. ఒక్కోళ్ళ మనసులోనూ ఒక్కో ఆలోచన.

ఆమె: పాతికేళ్ళైంది మా పెళ్ళై. ఎప్పుడూ ఇలాంటిదే ఏదో ఓ తగువు. ఎప్పుడూ ఇలాంటిదే ఓ చిన్న మాట. చిలికి చిలికి గాలి వానౌతుంది. ఇంకా ఎన్నాళ్ళో ఇలాగ. ఈయనెప్పుడూ ఇంతే. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడని – ఈయన తంతు కూడా అంతే. అరే … ఇదేమన్నా పెద్ద విషయమా? ప్రతి చిన్న దానికీ ఇలా అలిగితే ఎలా? ఇప్పుడిది అలకో, మామూలు మౌనమో, లేకుంటే నిజంగానే నిద్రపోయారో… ఎలా తెలుసుకోవడం? పోనీ .. మాట్లాడదామా? మరి ఆయన జవాబివ్వక పోతే నేను తట్టుకోగలనా? పోనీ పోట్లాడనా? అప్పటికి అరుచుకున్నా ఈ దిగులు తగ్గుతుంది కదా… మరి ఆయనా నాలాగే అరిస్తేనో? అన్యోన్య దాంపత్యం అని అనుకుంటూ ఉంటా నేనెప్పుడు మా దాంపత్యం గురించి. అలా అరుచుకుంటే అన్యోన్యత్వం పోతుందా ఏం? అయినా .. ఇంత చిన్న విషయానికి ఈయన గారికి ఇంత పంతం ఎందుకో! ఏం? యాభై ఏళ్ళు వస్తే రింగులు పెట్టుకోరాదా చెవులకి? ఎక్కడన్నా రాసుందా అలా అని? అసలు రింగులు పెట్టుకుంటే నేను అందంగా ఉంటాను అని అందరూ అంటారు. అందరిదాకా ఎందుకు? ఈయన గారే అంటారు కదా. ఎన్ని సార్లు అన్నారో ఆయనకి తెలీదూ? ఉన్నట్లుండి అదేం కోరికో – రింగులు పెట్టుకోవద్దు అని. మామూలుగా ఇవి తీసి వేరేవి పెట్టుకో అని చెప్పి ఉండొచ్చు కదా. అప్పుడు బహుశా తీసేసేదాన్నేమో! “ఈ వయసుకి రింగులేంటి?” అని అడిగారు. అదేం ప్రశ్న? రింగులేసుకోవడానికి కూడా ఓ వయసుంటుందా ఏం? ఆయన తియ్యమని అన్నాక నేను జవాబివక పోయే సరికి మాట్లాడ్డం మానేశారు! ఆయనేం చెబితే అది నేను చేసేయాలి కాబోలు! చిన్నప్పటి నుంచి రింగులే పెట్ట్ఉకుంటున్నా చెవులకి. ఇప్పుడు మాత్రం ఎందుకు మార్చడం? నాకివంటే ఎంతో ఇష్టం. అది ఆయనకూ తెలుసు. అయినా కూడా… ప్చ్. చిలికి చిలికి గాలి వాన అయ్యేలా ఉంది ఈ తంతు … చెవులకి నాకిష్టమైనవి పెట్టుకునే స్వాతంత్ర్యం కూడా లేదు ఈ జీవితానికి…

అతను: ఇప్పుడు ఈ రింగులు పెట్టుకోకుంటే ఏం? ఎప్పుడైనా తను చేసింది ఏదన్నా కాదన్నానా ఈ పాతికేళ్ళలో? ఎప్పుడన్నా ఇది చేయవద్దు అని చెప్పానా? ఒక్క సారి ఆ రింగులు మాత్రం తీయమంటే ఈ అలక ఎందుకో? “ఈ వయసు కి రింగులేంటి?” – అని అన్నంత మాత్రాన మాట్లాడ్డం మానేయాలా? అసలు అలా ఆ క్షణం లో ఎందుకన్నానబ్బా? ఆ…గుర్తొచ్చింది. ఇందాక ఆఫీసు లో ఆ వెధవ గుర్నాథం గాడు ఎదురు సీటులో కూర్చుని ఉన్న సుజాత గారి గురించి – “టింగు రంగా అని రింగులేసుకుని ఎలా వస్తోందో చూడండి… రిటైర్ కాబోతూ కూడా ఇంకా అలా షోగ్గా తయారు కావడం ఎందుకో?” – అనుకుంటూ కామెంటేశాడు. వెధవ, ప్రతి ఒక్కర్నీ విమర్శిస్తాడు. మరి నా వాణి గురించి కూడా ఎవరన్నా అలాగే అంటేనో? – మక్కెలిరగ తంతాను వాడిని, నా వాణి ని ఏమన్నా అంటే. కానీ … నాకు తెలుస్తూ, నా ముందు నిలబడి అంటారా ఏం ఆ అనేవాళ్ళు? అందుకే – ఇందాక సాయంత్రం ఆ రింగులు తీయమన్నాను. ఏ దుద్దులో పెట్టుకోవచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చాను. తనేమో తియ్యననింది. నాక్కాస్త చిరాకేసింది. అదేం పెద్ద విషయమని? తీస్తే తన సొమ్మేం పోయింది? ఇప్పుడు అది తీసి చెవులకి వేరేవి మార్చినంత మాత్రాన పెద్ద మారేదేముందని? తనకవంటే చాలా ఇష్టం. నాక్కూడానూ. రింగులేసుకుని ఉన్న మొహం తప్ప పాతికేళ్ళలో వాణి ని ఇంకోలా చూడలేదు. చెవులకి ఆ రింగుల వల్ల మొహానికి బోలెడు అందం వచ్చింది తనకి. నిజమే. కానీ, ఏదో, నేను చెప్పాను కదా అని ఓ సారి మార్చొచ్చు కదా? దేనికి ఇంత పట్టు? పోనీ, నేనే మాట్లాడనా? మరి నాకు జవాబివ్వకపోతే? అసలవతల మనిషి నిజంగానే పడుకుందో, నటిస్తోందో. ఎలా తెలుసుకోవడం? సరదా సరదాగా సాగిపోతున్న జీవితం లో ఈ చిన్న చిన్న గొడవలు ఏమిటో! ఛ!

ఆలోచనల్లో ఒకరిగురించి ఒకరికి సందేహాలు.. ఇంతలోనే కరంటు పోయింది. ఫ్యాను కదలడం తగ్గిపోయేకొద్దీ నిశ్శబ్దం పెద్దదవుతోంది. ఇద్దరూ అసహనంగా కదిలారు. ఆమెకి అర్థమయింది, అతడు నిద్రపోలేదని, అతడికీ అర్థమయింది, ఆమె కూడా నిద్రపోలేదని.. . మళ్ళీ ఇద్దరూ మనసుల్లో ఉడుక్కున్నారు – అవతలివారు కావాలనే తమతో మాట్లాడ్డం లేదని. బయట చల్ల గాలి వీస్తోంది. శబ్దం బట్టి అర్థమైంది. దానితో ఆమెకి కిటికీ తెరవాలనిపించింది. బద్ధకంగా చేతిని కిటికీ దాకా తీసుకెళ్ళింది. కానీ, దాన్ని తోద్దామంటే దూరంగా ఉంది. ఆయనకైతే పక్కనే ఉంది. కానీ, అడగాలంటే అహం. దానితో, అలాగే తెరవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది గమనించిన భర్త ఆ తలుపు ని మెల్లిగా తీసి మళ్ళీ పక్కకి తిరిగాడు. అలా తిరగడంతో మాట్లాడదామనుకున్న భార్య కి కోపమొచ్చింది. తాను మరో వైపు కి తిరిగింది మళ్ళీ.

“పార్త ముతల్ నాళే..” – అర్థరాత్రి కింద రోడ్డుపై ఏదో ఆటోలోంచి తమిళ పాట. తెలీకుండానే తామిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న మొదటి రోజుకి .. పెళ్ళి చూపుల రోజుకి వెళ్ళిపోయాయి ఇద్దరి ఆలోచనలూ. ఇద్దరి మనసుల్లోనూ అవతలివారి గురించిన గుర్తులు…

“ఎంత అమాయకంగా ఉండిందో ఆ రోజు. చూసీచూడనట్లు చూసింది.. తల ఎత్తీ ఎత్తనట్లు ఎత్తి. ”

“తెల్ల చొక్కా వేసుకుని నవ్వులు రువ్వుతూ ఎంత బాగున్నారో ఆ రోజు..”

“వాలుజడ, చెవులకి రింగులు, గుండ్రటి బొట్టు – గోరంత దీపం లో వాణిశ్రీ లా ఉండింది అప్పట్లో. ఇప్పుడు కదిలిస్తే ఛాయాదేవి పూనుతుందేమో అనిపిస్తోంది.”

“ఆరోజైతే సినిమా హీరో లా అనిపించారు. ఇప్పుడు ఆ అందం ఎగిరిపోయినట్లు ఉంది. ఈ మాటంటే ఏమంటారో ఏమిటో … వద్దులే… ఎందుకొచ్చిన గొడవ.”

“అబ్బ! ఆరోజు ఎంత అందంగా అనిపించింది? ఆ కోల ముఖానిపై తను తల వంచినప్పుడు, ఎత్తినప్పుడు ఆ రింగులు ఊగుతూ ఉంటే ఎంత బాగుండిందో”

“ఆరోజు నా చెవులకి ఆ రింగులు చాలా నప్పాయని, అది చూసే నన్ను ఇష్టపడ్డానని ఎన్ని సార్లు చెప్పలేదు ఆయన? అదే మనిషి ఈరోజు చూస్తే ఇలాగ.”

“నిజం…రింగులు ఎంత బాగుంటాయో తనకి. ఎప్పటికీ తననే చూస్తూ ఉండిపోవాలనుంటుంది. అలా తనని చూస్తే పెళ్ళై పాతికేళ్ళౌతున్న విషయం కూడా గుర్తు ఉండదు.”

“ఏమో.. నిజంగానే నాకు రింగులు బాగా లేవేమో ఇప్పుడు. కానీ, మొన్నేమో శ్రుతి వచ్చినప్పుడు కూడా – “అమ్మా! రింగుల్లో నువ్వు భలే ఉంటావు” అనే వెళ్ళిందే… ఆ…అయినా, చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది లే. ”

“ఆ గుర్నాథం గాడి మాటలను ఇంత పట్టించుకోవడం అవసరమా? ”

“పోనీలే.. తీసేస్తే పోయె. మళ్ళీ ఎప్పుడో ఆయనే పెట్టుకోమంటారు. ఇప్పుడు ఇలా మౌన వ్రతం చేయడం మహా కష్టంగా ఉంది.”

“ఛ! ఎవరో ఏదో అంటే నాకేంటి? నా వాణి కి రింగులుంటేనే నాకిష్టం. తనక్కూడానూ. పోనీ, ఈ విషయం ఇలా వదిలేస్తే పోలా? తను అలా బాధపడుతూంటే ఏదో లా ఉంది.”

“కానీ, ఎలా మాట్లాడ్డం? ఎలా ఆయనకి మీ ఇష్టప్రకారమే చేస్తున్నా మహాప్రభూ! ఇంక అలక మానండి అని చెప్పడం?”

“కానీ, ఎలా చెప్పను? సాయంత్రమే కదా కఠినంగా వద్దు అని చెప్పినది?”

“ఇలా అయితే ఇక నేను “అలిగిన వేళనే చూడాలి..” అనుకుంటూ వెళ్ళీ పలకరించాలి కాబోలు…..”

ఇంతలో, బయట కాస్త కాస్త గా వీస్తున్న గాలి కూడా ఆగిపోయింది. ఉక్క పోతగా ఉంది లోపలగా. ఒక పక్క ఆమె – జలుబు చేసింది ఏమో – ముక్కు ఎగబీల్చడం మొదలుపెట్టింది. మొదటి నుండి కూడా పీలుస్తూనే ఉందేమో కానీ, ఆ క్షణం లో ఆ నిశ్శబ్ద తరంగాల మధ్యన అది “మౌనాన్ని పీల్చుకుని, మగతను చీల్చుకుని …” ఒక విధమైన చలనాన్ని కలిగించింది లోపల బిగుసుకుపోయిన గాలిలో. అసలే ఎలా పలకరించాలా అన్న ఆలోచనల్లోనూ, కరెంటు పోయిన చిరాకు లోనూ ఉన్న అతనికి ఈ చర్య మరింత చిరాకుని కలిగించింది.

వెంటనే అడిగాడు – “అబ్బ! ఎందుకలా చిరాగ్గా ఎగబీలుస్తావు? మందులు వేసుకొమ్మంటే వినవు. రాత్రుళ్ళు ఇలా ఎగబీలుస్తూ ఉంటావు. ఏం? కాస్త విక్స్ అన్నా వాడొచ్చు కదా!”

” మ్ మ్ … సరే లెండి వాడతాను…” అంటూ ఆమె నసిగింది.

” ఏమిటో … మరీ రాను రాను చిన్న పిల్ల అయిపోతోంది ఈవిడ.” కావాలని పైకే అన్నాడు.

“నేనా? మీరా? ”

“నువ్వే మరి. నా రింగులో.. నా రింగులో అని ఏడుస్తున్నావు కదా. ఏదో ఓ సారి తియ్యమని అన్నానే అనుకో… అంతలోపే అలక మొదలెట్టేశావు.”

“ఏంటీ నేనా అలిగింది? మరిందాక నన్ను చూడగానే అటుపక్కకి తిరిగింది ఎవరో. ”

“మరి సాయంత్రం మొదట మాట్లాడ్డం మానింది ఎవరో.”

“మరి నాకిష్టం లేదంటే వినకపోతే ఇంకేం మాట్లాడాలో.”

“ఇష్టం లేదని మరో సారి చెప్తే నీ సొమ్మేం పోయిందో? అయినా నీకిష్టం లేకుంటే బలవంతం చేస్తానా ఏం? ”

“ఆ … ఎందుకొచ్చింది లేండి. ఆ వెధవ రింగులు తీసేస్తే పోయె. ముసలి దాన్ని కదా మీ ప్రకారం. నాకు రింగులెందుకు? అసలే రింగులు పడుచు పిల్లలకేనట కదా.”

” అబ్బ! చాల్లే. ఏదో పొరపాటున అన్నాను. నీ ఇష్టం రింగులే వేసుకో చెవులకి. యాభై ఏళ్ళైతేనేం, వందైతేనేం … అవి అలాగే ఉంచుకో. కాకుంటే అప్పుడప్పుడు కనీసం శుభ్రం చేసుకోడానికైనా తీయి.”

“చాల్లెండి వెటకారం. తీసేస్తా రేపొద్దున్నే. మీరే అడిగినా మళ్ళీ పెట్టుకోను. ఏమనుకున్నారో.”

“ఆ పని మాత్రం చేయకు. రింగులు లేని నిన్ను ఊహించుకోలేను. నా వాణి కి రింగులు అందం. రింగులకి వాణి చెవి అందం.”

“చాల్లే ఆపండి. చేసేదంతా చేసి మళ్ళీ కవిత్వం ఒకటి.”

“మరి ఇంతకీ రింగులు అలాగే ఉంచేసుకుంటున్నావ్ కదా?”

“అసలు నాకు తీసే ఉద్దేశ్యం ఉంటే కదా.”

“నిజానికి నాకూ తీయమనే ఉద్దేశ్యం లేదనుకో….”

“కోతలు…”

నవ్వొచ్చింది ఇద్దరికి. తామిద్దరం మాట్లాడుకుంటున్న విషయం అప్పుడే గమనించారు ఇద్దరూ. ఇక శాంతి కుదిరిందని వారికి అర్థమైపోయింది. కింద ఆటోవాడికి, పైన్నుంచి వచ్చే గాలిని ఆపి అలకల గాలంతా బయటకు వచ్చేలా చేసిన ఆకాశానికి ఇద్దరూ ఒకే సారి ధన్యవాదాలు చెప్పుకున్నారు, ఎవరి మనసుల్లో వారు. రెండు నిశ్శబ్దాల మధ్య నిలిచిన నిశ్శబ్దం కాస్తా పటాపంచలవడం, కరెంటు రావడం ఒకే సారి జరిగింది.