నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?)

మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.

– తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని. మన పక్కింటి వాడిమీద అనుమానం పుట్టిందో ఏమో తెలియదు. కారణం ఏదయితేనేం, ఈ నినాదం ఇప్పుడు వామపక్ష రాజకీయులకి, అరాజకీయుల (?)కీ కూడా ముఖ్య ఆయుధం అయ్యింది. ఇంతకుముందు ప్రాచీన భాషకోసం చేసిన సందడిలో వామపక్షీయులు మరీ యెడంగా ఉండబట్టి, చదువుకున్న వాళ్ళు ( అంటే intellectualsఅని నా భావం!) వాళ్ళని మరిచిపోయారనే బాధ కాబోలు!

అసలు, అంతర్జాతీయ భాష అంటే అర్థం ఏమిటి? దాని స్వరూపనిరూపణకి గుర్తు(లు) ఏమిటి? ఇది చాలా జటిలమైన ప్రశ్న.

అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.

ఐక్య రాజ్య సమితి వాళ్ళు అధికారయుతంగా గుర్తించిన భాష అంతర్జాతీయ భాష అనా? అదే అయితే, మన జాతీయభాష హిందీ కే దిక్కులేదు! అయినా, ఐక్య రాజ్య సమితిలో ఎవడి ఇష్టమైన భాషలో వాడు మాట్లాడచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు రొద పెట్టచ్చు. మిగిలేది కేవలం రణగొణ ధ్వనే తప్ప, అక్కడ ఎవడన్నా ఏదన్నా వింటేనా? ఒప్పుకుంటేనా?

అదికాకపోతే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఫలానా ఈ భాషలో మాట్లాడితే అందరికీ కాకపోయినా చాలామందికి అర్థం అవుతుందనా? అదే అయితే, ఇంగ్లీషుకే దిక్కులేదు! యూరపులోను, రష్యాలోను, చైనా లోనూ, (ఉత్తర భారతంలోనూ కూడా!) ఇంగ్లీషు హుళక్కే! అందాకా ఎందుకు; – అమెరికా దేశంలోనే, కొన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీషు చలామణి కావడం లేదు, స్పానిష్ చలామణీ అయినంత, సులువుగా, జోరుగా!

అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! అయితే, ఒక్క విషయం ఒప్పుకో తీరాలి. కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.

అసలు విషయానికి వద్దాం. ఈ నినాదం నిజంగా తెలుగు భాషమీద మమకారంతో పుట్టిందని అనడం కేవలం భ్రమే! పైగా, ఇందులో చెయ్యి కలిపిన రాజకీయనాయకులకి కేవలం నిస్స్వార్ధ భాషాసేవా వాంఛ, ఈ నినాదానికి హేతువు అని ఎవరన్నా పొరపాటునైనా అనుకుంటే, వాళ్ళు తప్పకుండా తక్షణం మానసిక శాస్త్ర వైద్యుణ్ణి చూడటం అవసరం.

పాఠశాలల్లో తెలుగు బోధన, తెలుగుభాష మాధ్యమంగా బోధనా ఎంతదిగజారిపోయాయో వేరే చెప్పనక్కర లేదు. అసలు, తెలుగు medium బళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరు? ముఖ్యంగా నిరుపేదలు. పోతే, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇంగ్లీషులో బోధించే ప్రైవేటు పాఠశాలలు అరుదవడం మరోకారణం. కాస్తో కూస్తో డబ్బులున్నవాళ్ళు, వాళ్ళ పిల్లలని పట్టణంలో ఇంగ్లీషు బడికే పంపిస్తున్నారు. ఇదేమీ తప్పు అనటల్లేదు. ఇంగ్లీషు బడిలో చదువుకుంటే, అమెరికా వెళ్ళక పోయినా భారతంలోనే, ఎక్కడో అక్కడ, ఏదో ఒక call centerలో తేలిగ్గా ఉద్యోగం వస్తుందికదా! 2030 వ సంవత్సరం వరకూ ఈ ఉద్యోగాలకి ఢోకా లేదని కొందరి ప్రముఖుల అంచనా. ఇది వదంతే కావచ్చు! కానీ, తెలుగు బడిలోనే చదువుకుంటే, చప్రాసీ ఉద్యోగంకూడా రాదుకదా! ఇది ప్రస్తుత కాలంలో పచ్చి ఆర్థిక సత్యం అని వేరే చెప్పనక్కరలేదు.

అందుకనే కాబోలు, ఈ మధ్య లాభాపేక్షలేని కొన్ని స్వచ్ఛంద (?) సంస్థలు, ప్రభుత్వంతో లాయికీ అయి, ఇంగ్లీష్ medium బడులు, దిగువ మధ్య తరగతి వారికి, పేదలకోసం (నిరుపేదలు కాదని గమనించాలి!) ప్రారంభిస్తున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ బడులలో, తెలుగు భాష optional గా తీసుకోవచ్చుట! ఈ బడుల ఉద్యమానికి, ప్రభుతలో ఉన్న రాజకీయ నాయకులు, విద్యాశాఖలో పెద్ద పెద్ద ఆఫీసర్లూ సుముఖులేనట! అయితే, పైకి అలాగని చెప్పరు; ఒప్పుకోరు! చూసీ చూడనట్టుంటారట. కూర్మపృష్టాన్ని కర్రతో బాదుతున్న మూర్ఖుడు, చెడగఱపు బోడ కథ తెలియదూ? ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదనుకుంటా.

మనకి, రాజకీయ స్వాతంత్ర్యం రాకముందునుంచి ఒక elite class వుండేది. స్వరాజ్యం వచ్చిన తరువాత మన ప్రభుత్వం వారి సంకర విద్యావిధానం మూలంగా మరొక (NewClass ) తయారయ్యింది. ; — ఈ కొత్త ఇంగ్లీషు బడులతో సరికొత్త Newer Class తయారవబోతున్నది. అలాగని నేను ఒక సంస్థ అధికారితో ఒక చిన్న సభలో అంటే, ఆయన: So what? You have anything better? అన్నారు. Amen! అన్నారు సభికులందరూ, కరతాళధ్వనుల మధ్య!!

మళ్ళి మొదటికొద్దాం. అయితే, తెలుగు అధికార భాషగా, బోధనా భాషగా, –ప్రాచీన భాషగా, అంతర్జాతీయ భాషగా, Universal భాషగా (హా! హా!) — గందరగోళం చేస్తున్న రాజకీయనాయకుల గురించి ఏమంటారు? Fabulous Façade అని అందామా?