ఆ రోజులు

ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!
చేప పొలుసుల లాంటి మబ్బుతునకల మాటుగా
జాలువారే వెన్నెల సెలయేరులు
నీ మానస సరోవరాన వికసించిన
కలల తెల్లకలువలని డోలాయమానం చేసిన వేళలు
ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!!!

చెట్ల చిటారు కొమ్మలలో నిదురించే
నున్నని ఆకుల కపోలాల ముద్దిడే
ప్రాతఃకాలపు పిల్లతెమ్మెర
యవ్వనప్రాంగణం లో అడుగిడిన నీ
ముంగురులు సవరించిన రోజులు
ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!

ఉవ్వెత్తున ఎగసే కెరటమై
రివ్వున దూసుకెళ్ళే బాణమై
ఆశయపరవశమైన మనసు
ఇంద్రధనుస్సుపై అవలీలగా
ప్రాణత్యాగం చేయగలిగే
ఆరోజులు నీవెలా మరచిపోగలవు!!