ఆరు చిత్తు రూపాలు

అమ్మ

వాడు నా కన్నా నాలుగేళ్ళు పెద్ద. ఒకటి, రెండు సార్లు వీపు విమానం మ్రోత మ్రోగిన తర్వాత, మా అమ్మ ముందర వాడ్ని వాడు అనడం మానేశా. ఇంట్లో ఆఖరోడ్ని కావటంతో, మెత్త మెత్తటి మాయమ్మ ఒడికి నాకెవరూ పోటీ లేరు. చల్ల చల్లని మాయమ్మ ప్రేమంతా నాదే, చక్క చక్కని మాయమ్మ ముద్దులన్నీ నాయే, వెచ్చ వెచ్చని, మెత్త మెత్తని మాయమ్మ గుండెలన్నీ నాయే, మాయమ్మ గుండెల్నిండా నేనే. కానీ ఈడు, ఈ కిష్టాడ్డి గాడు, ఈడొక్కడే నాకు తెలీకుండానే మా అమ్మ ఒళ్ళో వొదిగి కూర్చునేవాడు, మాయమ్మ గుండెల్లో నక్కి దాక్కునేవాడు, ఈడు ఈ కిష్టాడ్డి గాడు, నేను మాయమ్మ కొంగుతో ఆడుకుంటుంటే, వాడు తయారు, నాకు మాయమ్మ ముళ్ళు గుచ్చుకోకుండా చేప ఒలిచి, వొత్తొత్తి మాయమ్మ నానోట్లో పెడ్తుంటే, ఎచ్చని నీళ్ళతో, చక్కచక్కగా సుందుపిండి రుద్ది మాయమ్మ స్నానం చేయిస్తుంటే, పెద్ద పండక్కి చేసే నిప్పట్ల పిండి, నేను మా యమ్మ దగ్గర కుచోని ఆ మాటా ఈమాటా చెప్పి నేను కొంచం కొంచం చేతిలోకి తీసుకోని నాక్కుంటావుంటే, వాడు. మా యమ్మ నా వీపు సాఫు చేసేప్పుడు, నా నెత్తిమీద పఠక్‌, పఠక్ మని మొట్టికాయలు వేసేటప్పుడు మాత్రం ఎతికినా కనపడడు. నా మాట నమ్మకం లేకపోతే, నాకన్నా ఆరేళ్ళు పెద్ద మాయక్కనడగండి. నా కన్నా ఏడేళ్ళు పెద్ద మా చిన్నన్ననడగండి. నాకన్నా తొమ్మిదేళ్ళు పెద్ద మా పెద్దన్ననడగండి. ఇంట్లో ఎవరు కొత్త గుడ్డలు కుట్టిచ్చుకున్నా, ఎవరి పుట్టినరోజొచ్చినా, ఎవరు ఫస్టు క్లాస్ లో పాసైనా, అన్నిటి దగ్గరా వాడు. మీరు చూళ్ళేదు గానీ, ఈకలు తీసిన కోడిపెట్టలాగుంటాడు వాడు. సావనసాయుంటాడేవో, మహా అంటే అంతే. ఐతేనేం, వాడు పచ్చటి పసుపంట, సక్కగా సూర్య బింబంలాగా కళకళలాడే మొకవంట వాడిది, మాయమ్మ చెప్తే వినాల వాడి గురించి, ఇదేందిరా ఈడు, సినిమా హీరోని, ఐన్ స్టైన్‌ని, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌ని రోట్లో ఏసి రుబ్బి ఈడ్ని చేసేరా అనుకోవాల మీరు మాయమ్మ మాటల్నింటే. వాడికి చదువు చట్టుబండలు ఏవీ లేవు, ఐనా సరే, వాడు లాయరో, డాక్టరో, ఇంజినీరో అయ్యుండేవాడు. వాడికేం తక్కువ, వాడు దేశాన్నేలుండేవాడు మాయమ్మ మాటల్లో. ఏ ఏటికాఏడు వాడందం పెరుగుతానే వచ్చింది. అందంతోపాటు, వాడి తెలివి, చిలిపితనం, వినయం, ఎవరైనా వీడు మా వాడు అని గర్వంగా చెప్పుకునే గుణాలన్నీ ప్రతి ఏడు నిలకడగా పెరుగుతూనే వున్నయ్ వాడిలో.

మాయన్నలు తాతలైపోయారు. మాయక్క అమ్మమ్మైపోయింది. నా పిలకాయలు పెళ్ళీడుకొచ్చారు. మాయమ్మ తల ముగ్గు బుట్టైపోయింది. చూపు తగ్గి, రూపుమాసి, అప్పుడెప్పుడో మాయమ్మ కట్టుకున్న వెలిసిన నూలుచీరలాగా, మిణుకు, మిణుకు మనే గుళ్ళో ప్రమిదలాగా చిన్నదైపోయింది, మా చేతుల్లో ఒదిగిపోయే మా బిడ్డైపోయింది. కిష్టాడ్డిగాడు మటుకు ఇప్పటిక్కూడా ఆ తల్లి కళ్ళల్లో ఇంకా వెలిగిపోతునే వుండాడు. నలభై ఐదేళ్ళ క్రితం నే పుట్టకముందే దేవుడ్ని చేరిన మాయన్న, మా కిష్టాడ్డి, మాయమ్మ ఒణికే గుండెలో ఇంకా కొట్టుకుంటానే వుండాడు. దేవుడా నువ్వుండావో లేవో నాకు తెలీదు. నువ్వు నిజంగానే వుండుంటే, నీకు మాయమ్మ కున్నంత ప్రేమే నీ బిడ్డలమీదుండుంటే ఈ లోకం ఇంకెంత బాగుండేదో కదా! అమ్మా, అత్తా, అక్కా, చెల్లీ, పెళ్ళాం, కూతురు, అమ్మల్లారా, తల్లుల్లారా, ఏ జన్మలో మేవు చేసుకున్న ఏ అదృష్టవో, మీరు మాకిన్ని రూపాల్లో దొరికేరు. అమ్మల్లారా, తల్లుల్లారా ఏవి చేసి మీరుణం తీర్చుకోవు!

స్నేహం

సరేరా, నాకర్థవైందిలే నీ బాధ. నీ కొడుకు, ప్రేమలో పడ్డాడు, అది నీకు వాడు చెప్పలా, ఏ గొట్టంగాడో వాళ్ళని ఎక్కడో చూసి, నీకు చెప్పేడు. నీకు పరాభవమైపోయింది. వాడి ప్రేమ నీకు కోపం కలిగించలా, ఆ పిల్ల కులగోత్రాలేవీ నీకు పట్టింపులే. నీ కొడుక్కి కావాలనుకునే తోడు దొరకటం నీకు ఆనందంగానే వుంది. ఐతే తంటా అల్లా, వాడు నీకు ముందర చెప్పక పోవటవే. అదే నీ బాధ. నాకు తెలుసు, నాకు తెలుసు అదే నీ బాధంతా, నువ్వు మళ్ళా చెప్పనవసరంలే. అబ్బా కొడుకుల సంబంధం కన్నా మీ మధ్య వుండే స్నేహం ఎంతో గొప్పది, అదీరోజు కనిపించకుండా పోయింది. అంతే కదా నువ్వు గంట నుంచి నాకు కొడ్తున్న సుత్తి. నో, నో నోరు తెరవకు మందు కోసం తప్ప, నువ్వు నాకు చాలా ఎమోషనల్గా, చాలా సేపట్నుంచి, చాలా సుత్తేశావ్. ఇంక నోరు మూసుకోని నా సుత్తి నువ్విను.

నాకు తెలుసు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు కూడా నీతో చాలా స్నేహంగా వుండే వాళ్ళు. మీ ఇల్లంటే నా కెంత ఇష్టవో నీకు తెలుసు కదా. ఇంట్లో వుండే వాళ్లే కాదు, ఇంట్లో కొచ్చిన నాలాటి వాళ్ళుకూడా ఎంతో రిలీఫ్ గా హాయిగా ఫీలయ్యే వాళ్ళు. నీ ఇల్లుకూడా అంతే. ఇంటికొచ్చిన మేవెవరవూ, సోఫా అంచుల్న కూర్చోనవసరం లేదు. ఎప్పుడు ఏవి జరుగుతుందో, ఏ కోపాలు, ఏ తాపాలు చటుక్కని తలపైకి లేపుతాయో అని గాభరా పడనక్కర లేదు. వున్న ఆ కొద్ది నిముషాలూ బయట చికాకులన్నీ మరచిపోయేంత సంతోషవైన వాతావరణం. నువ్వూ, నీ భార్య, నీ పిల్లలూ అందరూ కలసి మెలసి నిర్మించుకున్న చిన్న స్వర్గ ఖంఢం. ఐతే ఇదంతా కూడా మీరు భార్యా, భర్తల్లాగా, తల్లి తండ్రులూ, పిల్లల్లాగా వుండకుండా, స్నేహితుల్లాగా వుండటం వలనే వీలైందని నీ ఉద్దేశ్యం,కదా.

ఒరే, నువ్వూ నేను కూడా స్నేహితులవే కదా. ఓ ముప్పై ఏళ్ళనుంచి. నా గురించి నీకూ నీ గురించి నాకూ తెలియని విషయాలేవైనా వున్నాయా? ఏవొ వొకటి రెండు పడగ్గదుల విషయాలు తప్ప. నువ్వూ నీకొడుకూ కూడా స్నేహితులే. వాడికీ నీకూ మధ్య, నీకూ నాకూ వున్నటువంటి సంబంధవే వుందని నీ అభిప్రాయం కదా. ఒరే, వీర వెంకట శివ శంకర రెడ్డీ, ఐతే ఇన్ని సంవత్సరాలుగా నీగురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను ఈ రోజు నీ పెళ్ళాన్నీ, నీ పిల్లలనీ కూర్చో పెట్టుకోని చెప్పదలచుకున్నా. మనం వేసిన వెధవ్వేషాలన్నీ వొక్కటికూడా బీరు పోకుండా, అన్నీ వాళ్ళకి చెప్పదలచుకున్నా. నీకు వాళ్ళు కూడా నా లాటి స్నేహితులే కదా. అందులోనూ వాళ్ళు నీ బతుకును పంచుకున్న వాళ్ళు, నీ రక్తం పంచుకున్న వాళ్ళూనూ. దానికీ, దీనికి సంబంధం లేదంటావా. ఎందుకులేదు నాయనా. వుంది కాబట్టే కదా నువ్వింత బాధపడిపోతున్నావ్. నీ కొడుకు నిన్ను మోసంచేసినట్టు అంత ఫీలైపోతున్నావ్.

కూర్చో, కూర్చో అంతకోపవెందుకు. నామీద కోపవొస్తే నాకేం పరవాలేదు. కానీ మందుమీద కోపవొచ్చి దాన్ని మధ్యలోనే వదిలిపోతే, చాలా నష్టం మనకి. సురకి అవమానం జరిగితే, ఇంద్రుడికి అవమానం జరిగినట్టే. ఇంద్రుడికి అవమానం జరిగితే, దేవతలందరికీ అవమానం జరిగినట్టే. ఆ తర్వాత మనకి నరకం తప్ప స్వర్గలోక ప్రాప్తి వుండదు. అందువలన ముందరా పెగ్గు పూర్తిచెయ్. చాలా, చాలా విషయాలు, మన విషయాలు నీకూ నాకూ తప్ప మరో నరమానవుడికి తెలియవు. అవేం అంత గొప్ప విషయాలు కావు, అంత అసహ్యమైన రహస్యాలు కావు. కాకపోతే నీకూ నాకూ మాత్రవే అర్థవయ్యే విషయాలు, నీకూ నాకూ మాత్రవే అర్థవున్న విషయాలూ. అంత మాత్రంచేత మన మధ్య వున్న ఈ సంబంధం, స్నేహవనే ఈ సంబంధం బ్రతుకులో వుండే మరే ఇతర సంబంధాలకంటే కూడా గొప్పదేం కాదు. రేపు నా ఖర్మ కాలి నే పోతే, నీకూ నాకూ వున్న ఈ ఇంత గొప్ప స్నేహం నా పిల్లలకి నన్ను తిరిగియ్యదు. నిజవే, నిజవే, నీకు వీలైన సహాయం, వీలుకానిది కూడా చెయ్యాలనే చూస్తావ్. నాకా నమ్మకవుంది. నా పిల్లలకీ, నా పెళ్ళానికీ లక్షమంది స్నేహితులు, ప్రాణ స్నేహితులుండొచ్చు. ఐనా నా పెళ్ళానికి మొగుడుండడు, నా పిల్లలకి నాన్నుండడు. అబ్బయా, శంకర్రెడ్డీ, మనిషి బ్రతుకులో వుండే ఏ సంబంధం, ఏ సంబంధంకన్నా గొప్ప కాదు నాయనా. దేని ప్రత్యేకత దానికుంది. దేని స్థానం దానికుంది. దేని గొప్ప దానికుంది. స్నేహవనేదాన్ని చాలా పెంచేసి. దాన్ని అన్నిటికీ కొలబద్దను చెయ్యకు. మీ మధ్యనుండే స్నేహం వలన కాదు మీ ఇల్లు సంతోషంగా వుండేది, మీ మధ్య నుండే వొకరి మీదోకరికి వుండే ప్రేమ వలన. నీ పెళ్ళాం పిల్లలతో, మీ అమ్మా, నాన్నలతో, నీ అన్నదమ్ములూ, అక్కచెళ్ళెళ్ళతో వుండేది స్నేహంకాదు. ఏ సంబంధంలోనైనా అది బలపడటానికి కారణం, ఆ రిలేషన్‌షిప్లో వుండే ప్రత్యేకవైన ప్రేమతోపాటూ వుండాల్సింది, కొంచెం ఎదుటిమనిషిని అర్థం చేసుకునే గుణం, కొంచెం ఓపెన్ నెస్, కొంచెం కోపం తెచ్చుకోని ఓపిక, సంతోషంగా వుండాలనే ప్రయత్నం, సంతోష పెట్టాలనే కోరిక, కొంచెం స్వార్థం, కొంచెం నిస్వార్థం ఇంకా ఇట్లాటివే సవా లక్ష గుణాలు. ఏరకవైన సంబంధాలైనా సరే, స్నేహంతోపాటూ, ఆ గుణాల్లో ఎన్నుంటే ఆ సంబంధం అంత బాగుంటుంది. వాళ్ళకీ, వాళ్ళకి సన్నిహితులైన వాళ్ళకీ, అందరికీ. లే! లేసి అక్కడింకో బాటిలుంది పట్రా. ఎట్లా నీకీరోజు ఆంటీ చేతులో అక్షింతలు తప్పవ్.

జోయి

అంతా చేరి ఒక అరగంటై వుండదు నేను బయటకి పోయి. ఇంతలోనే కావాల్సిన మనిషిని ఎంత కాలంనుంచో చూడని దానిలాగా, వాసిపోయి ఎదురొస్తుంది. అడుగు ముందుకెయ్యనీదు. ఎంత కాలవైంది నిన్ను చూసి, అన్నట్టు నా గుండెలమీదకెక్కుతుంది. నువ్వు నీ బీర్ని తర్వాత పెట్టుకో ఆ సద్ది పెట్టెలో, ప్రపంచం ఏంమునిగిపోదు, ముందర నా వీపంతా గీరు, నా మూతి క్రింద చక్కగా సవరదియ్యి, ఎంత కాలవైందో నిన్ను చూసి, కానీ, కానీ ఇంక ఆలస్యం చెయ్యకు, చూశావా, నీ ముద్దుల కూతురు తల తిప్పికూడా చూళ్ళా, నీ బంగారు పెళ్ళాం చిరునవ్వు కూడా నవ్వలా నువ్వొచ్చావని, కానీ, కానీ ఇంకాలస్యం చెయ్యకు, ఎంత కాలవైందో నీ స్పర్శ తగిలి. చెప్తే నమ్మరుగానీ మా జోయమ్మ ఆనందాన్ని వర్నించలేం ఆ క్షణంలో. నా పెళ్ళాం J1 వైవర్ కోసం మేవంతా హిల్ బిల్లీ కంట్రీలో వనవాసం చేస్తున్నప్పుడు వచ్చిందది మా ఇంటికి, నా కూతురి పుట్టిన రోజు బహుమతిగా. నా కూతురు పెద్దదైపోయింది, పన్నేండేళ్ళ పిల్లయింది. కానీ మా జోయి మాత్రం ఆ రోజునించి మా ఇంట్లో తిరుగుతున్న చిన్న బిడ్డైపోయింది, మా బంగారు తల్లై పోయింది. మొదట్లో జోయీతో అంటీ ముట్టనట్టు వుండే నా పెళ్ళాం కూడా, నేనెప్పుడన్నా జోయీని విసుక్కుంటే, నా మీద ఇంతెత్తున లేస్తుంది. అప్పుడప్పుడూ నేనూ, నా కూతురు, నా కూతురమ్మా ముగ్గురం ఒకటో, రెండో, ఒక్కోసారి మూడో ప్రపంచ యుద్దాలు కూడా చేస్తుంటాం. కానీ ఎవ్వరూ కూడా మా జోయమ్మని యేవీ అనడానికిలే. ఇంకా అప్పుడప్పుడూ నేనే దాని మీద విసుక్కుంటా, నా ఖర్మ కాలి, మిగతా ఇద్దరి చేత తిట్లుతిండానికి. దానికీ వయసొచ్చేసింది. ఇప్పుడు మునుపట్లాగా వుషారు లేదు. కొంచెం కీళ్ళనొప్పులు కూడా రావటంతో వీలైనంత వరకూ పడు్కునే వుంటది. దాన్ని చూస్తే మనసంతా దిగులు దిగులుగా అవుతుంది. అది కుక్క మనం మనిషి, అయితేఏం, మా జోయమ్మ మా బిడ్డే కదా. కళ్ళ ముందర బిడ్డని పోగొట్టుకోవడం కన్నా నరకం ఏవుంటుంది ఎవరికైనా. నిజంగా ఆ దేవుడుండుంటే, మనకి కావాల్సిన వాళ్ళందరికన్న లైన్లో మనవే ముందర వుండేలా చూడడా!

నేను?

రాత్రి పది గంటలయ్యుంటేదేవో. చలిగాలి రివ్వున వీచే శబ్ధం షాప్ లోకి కూడా వినిపిస్తుంది. ఎప్పుడో కాని పడని ఐస్ వానతో ఆ రోజు రోడ్లమీద సంచారవే లేదు. ఆర్లింగ్టన్, టెక్సాస్. యుటిఎ ప్రక్కనే వుండే సెవెనెలెవన్లో రాత్రి షిఫ్టు. పగటిపూట ఖాళీ ఐన బీర్ కూలర్లో బీర్ స్టాక్ చేస్తున్నాను. ఇంతలో తలుపు తీసిన శబ్ధం. పాతికేళ్ళ పిల్ల, ఒంటిమీద సరైన చలి దుస్తులు కూడా లేవు. కౌంటర్ దగ్గరకి నడిచేను. ఒక నిముషం అటూ ఇటూ తిరిగింది. తను కావాలనుకున్నదేదో దొరికినట్టు లేదు. నా వైపు నడిచింది. ఎర్రగా నీళ్ళుకారుతున్న కళ్ళు. జలుబు దాంతోపాటు జ్వరం మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయ్.
మే ఐ హెల్ప్ యూ?
టైలనాల్ కోల్డ్ వుందా?
బాక్స్ తీసి కవుంటర్ మీద పెట్టేను.
నో, నో అదికాదు, a small pouch of one or two tablets.
Sorry ma’am, out of stock.
ఈ పేకేట్ ఎంత.
నాలుగు డాలర్లా డెబ్బై సెంట్లు.
వొక టాబ్లెట్ ఇయ్యగలవా.
Sorry ma’am, I can’t do that, మొత్తం పేకెట్ కొనాలి మీరు. అయ్యో అనిపించేంత నిరాశ మొహంలో. నేను తిరిగి బీర్ కూలర్ వైపు నడిచెను. తలుపు మూసుకున్న శబ్దం. కనీసం కారు కూడా లేనట్లుంది. ఈ చల్లో ఎలా నడుస్త……. ఠింగ్, తెరుచుకున్న తలుపు.
I am a white girl. జలుబు తెచ్చిన రాపుగొంతుతో కచ్చగా అరిచిన అరుపు.తిరిగి చూసేలోపే మాయవైన మొహం, మూసుకున్న తలుపు. పదిహేనేళ్ళ క్రితం సంఘటన. అవును నేను తెల్ల వాడిని కాదు. నా పాస్పోర్ట్ తో సంబంధం లేదు, నేను ఆ కళ్ళకి అమెరికన్ ని కూడా కాదు. ఎవర్ని నేను, ఇక్కడ అమెరికన్ ని కాదు, పోనీ ఇండియాలో? నార్త్ లో మదరాసీని, తమిళ్ నాడు లో గొల్టీని, హైదరాబాద్ లో ఆంద్రోడ్ని, ఆంధ్రాలో రెడ్డిని, కమ్మోడ్ని, బాపనోడ్ని, మాలోడ్ని, మాదిగోడ్ని, ఎరుకలోడ్ని, ఏనాదోడ్ని. ఎవర్ని నేను, రంగు, కులాని కతీతంగా?

సర్వరోగ నివారిణి

పాపా, ముక్కు కారిపోతుందిరా, ఒళ్ళు కూడా భలే నొప్పులుగున్నాయ్.
సిగరెట్లు మానెయ్.
రాత్రుళ్ళు పడుకుంటె గొంతు గర గర మంటుందిరా.
సిగరెట్లు మానెయ్.
ట్రెడ్ మిల్ మీద నాలుగైదు నిమిషాలకే హార్ట్ రేట్ మరీ పెరిగి పోతుందిరా.
సిగరెట్లు మానెయ్.
నిద్రలో మద్యలో మెలుకువ వస్తుందిరా.
సిగరెట్లు మానెయ్.
ఈ మద్య కీళ్ళు కూడా నోప్పేస్తున్నయ్ పాపా.
సిగరెట్లు మానెయ్.
ఇండియాలో ఆరేళ్ళు కదండీ కొంచెం అటు ఇటుగా, ఇక్కడ ఇంకో ఆరేళ్ళు చదువు. ఎందుకు బుర్ర చెడకొట్టుగోడానికి కాకపోతే. పన్నేండేళ్ళు మెడికల్ స్కూల్ లో చదివి నేర్చుకుంది, అదొక్కటేనా. దానికి నిన్నడగడవెందుకు, నాకు నేనే చెప్పుకోలేనా, సిగరెట్లు మానెయ్ అని. మా ఉర్లో ఐదో కలాసు చదువుకున్న డా. ఎ.పి.వి.రావ్ ఆర్.ఎమ్.పి (వైద్య విద్వాన్, వైద్యా చార్య, గుప్త రోగములకు ప్రత్యేక చికిత్స కలదు) కూడా అదే చెప్పేడు. ఇక వాడికి నీ బోడి ఎమ్.డి కీ భేదవేంది?

తెల్ల, తెల్ల గా కురుస్తున్న మంచు ని చూస్తూ, చలి చలిగా చిన్నగా వణుకుతూ సిగరెట్ తాగటవెంత మజా. అప్పుడప్పుడే చిగిరిస్తున్న చెట్లని చూస్తూ, ఇంకా పూర్తిగా వేడెక్కని గాల్లో పరచుకున్న చిన్న చల్ల దనానికి పరవశిస్తూ సిగరెట్ తాగటం ఎంత మజా. ఎండ వేడికి కారిన చెవటని తుడుచుకోని, గుండెల నిండా పొగపీల్చి వదలడం ఎంత మజా. ఆఫీస్ లో ప్రతి గంటకీ తీసుకునే పదినిముషాల సిగరెట్ బ్రేక్ ఎంత మజా. కోపవొచ్చినా, సంతోషంతో గుండె నిండినా పెళ్ళాం తో కొట్లాడినా సిగరెట్ పొగ ఎంతెంత మజా. కానీ తప్పదు, ఎదిగే నా బిడ్డని నేను మరికొంత కాలం చూసుకోవాలంటే, వెచ్చ, వెచ్చని నా పెళ్ళాం కౌగిలి ఇంకా, ఇంకా కావాలనుకుంటే, తప్పదు,నా పెళ్ళాం సలహా వినక తప్పదు.

తొలి ప్రేమ

ఏవిటిది,ఏవిటిది
పండిన నా తల్లో వినిపించే ఈ పడుచుకాలపు రాగం
ఏవిటిది,ఏవిటిది.
గుండె గొంతుకలో కొట్లాడుతూ, మాట రాని మౌనం
ఏవిటిది, ఏవిటిది.
ఒళ్ళంతా పరచుకుంటూ, ఎగిరిపడే గుండెల్లో విచ్చుకునే ఈ వెచ్చని ఙ్ఞాపకం
ఏవిటిది, ఏవిటిది.
తలనెరిసి, రూపు చెదిరిన ఈ అమ్మమ్మని చూస్తే మనిషంతా మనసై, మనసంతా మనిషై అలల్లాగా ఎగసిపడే ఈ ఆనందపు తరంగం
ఏవిటిది, ఏవిటిది.
ఈ చిరు వెచ్చని కంటి తడి
ఏవిటిది, ఏవిటిది.