అగ్ని స్నానం

నగరంలో నీడ
చెట్టును వెతుకుతోంది.
అగ్ని స్నానాల్లో
పల్లె మునకలు వేస్తోంది.
పూరి గుడిసె గుండె
కరెంటు తీగను వేలాడుతోంది.
మధ్య తరగతి ఆక్రోశం
విసనకర్రపై దండెత్తింది.
ఇరవయ్యో అంతస్థులో
ప్రగతి గుర్రు తీస్తోంది.
ఎండిన కొబ్బరాకుతో
బొండంలో నీళ్ళు
నేల కళ్ళు చారికల్ని తుడుస్తున్నాయి.
పుచ్చకాయలు బంగారంతో కుస్తీ చేస్తున్నాయి.
ఈతి బాధల్ని చూసి
ఐస్ జాలి అలవరుకుంటోంది.
ఉదయం పూసిన జ్ఞాపకాలు
రాత్రి నిద్రతో
యుద్ధానికి సిద్ధపడుతున్నాయి.
తాపం పెరిగిన కోపం
సూర్యుణ్ణి నిలదీస్తోంది.
క్షమించండి – నీడలాగే నేనూ వెతుకుతున్నాను!
మీ ఆనంద గోదావరిలో స్నానమాడిన చెట్టుకోసం!!
తీరికలేని కాల భ్రమణంలో చల్లనైన ఆవలి గట్టు కోసం!!
వేడెక్కిన విశ్వాన్ని అలవాటు చేసుకొనే ఓపిక కోసం!!!