కిటికీ

సన్న జాజి తీగ
జోరు వానకి చలిస్తోంది
తడి పిచుక ఒకటి
కమ్మీల మీద రెక్కలార్చుతోంది
మేజా మీది టీ కప్పు
చలి గాలితో పోరాడుతోంది.
జల్లు దూకి వస్తోన్నా
కిటికీ మూయలేను.

షికారు

ఈ వేళప్పుడు ఈ వైపుకి ఎవరూ రారు
అయితే-
గొల్లభామలు తిరుగుతూ ఉంటాయి
స్వేచ్ఛగా.
గడ్డి దుబ్బులు
అలలు అలలుగా కదులుతున్నాయి
నల్ల మబ్బుల ఆకాశం కింద
తూనీగలు లక్ష్య రహితంగా ఎగురుతున్నాయి
షికారుకి పోవడానికి మనకిది సరైన సమయం.