ఏటి ఒడ్డున – పరిచయం

“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది. తెలుగు భాష మనుగడపై ఈ మధ్య కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దానితో బాటు కవిత్వం, ఇతర కళల గురించి కూడా. ఐతే, నాకు ఈ నిరాశావాదం మీద పెద్ద నమ్మకంలేదు. జీవంలాగే, కవిత్వం కూడా తన మనుగడకు కావలసిన ఆధారాల్ని తప్పక పదిలపరుచుకుంటుంది. ప్రతి తరంలోనూ కవిత్వాన్ని సృజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, దానికోసం తీవ్రంగా తపించేవాళ్ళు ఎదురౌతూనేఉంటారు. వీరి సంఖ్య పరిమితమే కావచ్చు గాని వీరు చిరంజీవులు. యువతరం కవుల్లో ఉందాల్సిన తీవ్రమైన ఆకాంక్ష, తపన, ఉత్సాహం నాకు సుబ్రహ్మణ్యంలో కనిపిస్తాయి. సరైన పరిశ్రమ తోడైతే, మంచి కవిగా మారటానికి యివి దోహదపడతాయి.

“రక్షతి రక్షితః” అన్న సూత్రం ధర్మానికి, వృక్షానికే కాకుండా, కవిత్వానికి కూడా వర్తిస్తుంది. కవిత్వం జీవితాన్ని వెలిగిస్తుంది. కాంతిమయం చేస్తుంది. ఐతే, కవి కూడా ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. నిరంతరం కవిత్వ స్పృహ కలిగిఉండాలి. ఈ కాలంలో కవిత్వం వృత్తిగా బతుకుతున్నవాళ్ళు చాలా తక్కువమంది. అధికశాతం ఇతరేతర వృత్తులలో కొనసాగుతూ కవిత్వ రచన చెయ్యాలని ఆశపడుతున్నవాళ్ళే. అంతమాత్రం చేత కవిత్వం అప్రధానమైపోతుందని అనుకోనక్కర్లేదు.కవిత్వం వీరికి జీవనోపాధి కాకపోవచ్చు గాని, అది వారి జీవనాధారం. దానికి తగిన సాధన, క్రమ శిక్షణ అలవాటు చేసుకుంటే పూర్తికాలం కవిగా కొనసాగవచ్చు. ఆ రకమైన హామీ తన కవితల ద్వారా సుబ్రహ్మణ్యం మనకు యిస్తున్నాడు.

ఇందులో కావేరి నది మీద రెండు పద్యలున్నాయి. మొదటిది

ముందు ముందు ఎన్ని కల్మషాలు
కలుపుకుంటుందో తెలియదు గానీ
ఇక్కడ మాత్రం ఈ నది
పురిటి బిడ్డలా ఎంత స్వచ్చం!

(తల కావేరి)

రెండవది :

అల్లిబిల్లిగా నన్ను తాకిన
చల్లని ఈ సెలయేటి స్పర్శలో
కళ్ళన్నీ తెరుచుకోగా
ఒళ్ళు మరిచి మాయమై

సెలయేటి అడుగున
మిల మిలా మెరుస్తూ
ఏటి పాటకి శ్రుతి కలుపుతున్న
తోటి గులకరాళ్ళ మధ్య
తేటగా నా హృదయం.

(సెలయేటికి)

ఈ రెంటిలోనూ స్వచ్చత లేదా తేటదనం ప్రస్తావించబడటం యాధృచ్చికం కాదనుకుంటాను. కవిత్వానికి ముఖ్యంగా కావలసింది స్వచ్చత – మనసులో, భావనలో, భాషలో, కవిత్వంపై ఉండే మమకారంలో. జన్మ స్థానంలో నదిలా కవిత్వ సృజనలో మనసు స్వచ్చమౌతుంది. ఎంత మలిన పడ్డా, నీటి అడుగున గులకరాయి తేట పడినట్టే, కవిత్వంలో ఓలలాడిన మనసు తేట పడుతుంది.

కవికి కావలసిన మరొక ముఖ్యమైన లక్షణం జిజ్ఞాస, అన్వేషణ. సుబ్రహ్మణ్యం అనేక కవితలలో ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి, సమాధానాల కోసం తలలోకి తాను తొంగిచూసుకొనే నిజాయితీ కనిపిస్తాయి.

“కవిత్వమనే దుర్భిణి సృష్టించి
హృదయంతరాలలోకి
దీక్షగా చూస్తే, వర్ణనాతీతం
కనిపించిన ఆ దృశ్యం
దుర్భిణి సహాయంతో
హృదయంలోకి చూస్తున్న దృశ్యాన్ని
దుర్భిణి సహాయంతో
చూస్తున్న నేనే” (దుర్భిణి)

ఈ కవి కొన్ని సార్లు మౌలిక ప్రశ్నలు వేస్తాడు. ఒక తాత్విక ధోరణిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు.

“కోటి అలోచనలతో
ఏటి ఒడ్డున.

ఎక్కడి నుంచి వస్తోంది
ఎక్కడికి వెళుతోంది
వెనక్కెందుకు ప్రవహించదు?”

(ఏటి ఒడ్డున)

ముందు ముందు ఇటువంటి ప్రయత్నంలో మరింత పరిణతి వస్తుందని ఆశించవచ్చు.

సుబ్రహ్మణ్యం కవిత్వంలో మరొక మంచి లక్షణం పదాల పొదుపరితనం. కవితల్ని అవసరానికి మించి విస్తరించటం, చెప్పినదే పదే పదే చెప్పబోవటం వంటివి చెయ్యలేదు. తక్కువ మాటలతో విశేషార్థాన్ని స్ఫురింపజెయ్యాలనే ఆలోచన ఈ కవికి ఉందని అనేకచోట్ల మనకు స్పష్టమౌతూనే ఉంటుంది.

“కొద్ది కాలం క్రితం శ్మశానంలో
మృత్యువు నాతో చెప్పింది కదా..
వేణువు వెదురుగా మారకముందే
రాగాలు అందరికీ వినిపించు.”

(వేణువు వెదురుగా మారకముందే)

కవిత్వం రాయాలనే ఉత్సాహం, కవిత్వ రచన మీద అవగాహన ఎంతున్నా, ఒక కవి పద్యం రాసినప్పుడు ఆ ప్రయత్నం ఫలవంతం కావటాన్ని అంతిమంగా నిర్ణయించేవి అతని ప్రతిభాపాటవాలే. అతని ఊహా వైచిత్రి, పదచిత్రాల ఎంపిక వంటివాటిలో ఇది వ్యక్తమౌతుంది. అందమైన, అరుదైన ప్రతీకలతో ఈ కవి అక్కడక్కడ మనల్ని ఆశ్చర్యపరుస్తాడు:

“తను సృష్టించుకున్న ఎండల్లో
తానే తిరిగి తిరిగి
ఎర్రగా కందిపోయిన సూర్యుడు.”

(ఓ మలి సంధ్య దృశ్యం)

“ధ్యానముద్రలోని విత్తనానికి
జ్ఞాననేత్రం తెరుచునేలా
వానబొట్టు ఉపదేశం”

(చెట్టు)

ప్రకృతితో కవికున్న బంధం విడదీయరానిది. అలాగే, తన తోటి మనుషులతో వారి సుఖదుఃఖాలతో కూడా. మనుషుల్ని ప్రేమించగలగటం, వారితో కలిసి సంస్పందించటం ఒక కవి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. అతను కూడా తన జీవితంలో జరిగే సంఘటనలకి ఆనందపడటం, నవ్వుకోవటం, కన్నీరు పెట్టుకోవటం వంటివి చేస్తాడు. వీటన్నింటిని తన కవిత్వంలో ఆవిష్కరించాలని చూస్తాడు. తండ్రి మరణం దగర్నించి,ప్రాజెక్టు డెడ్ లైను దగ్గరపడటం వరకు అనేక సంఘటనలకి సంబంధించిన స్పందనల్లతో కూడిన కవితలు ఈపుస్తకంలో ఉన్నాయి. సున్నితమైన ఊహలతో మెప్పించే కొన్ని ప్రేమకవితలున్నాయి. ఒక అనుభవాన్ని లోతుగా తరచి చూడటంతోబాటు, విస్తృతమైన అనుభవాల్ని స్పృశించటం కూడా కవిత్వాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక కవి కవితల్ని విడివిడిగా చూసినప్పటికంటే ఒక సంకలనంగా పరిశీలించినప్పుడు ఈ విషయం మరింత స్పష్టంగా మనకు బోధపడుతుంది.

సుబ్రహ్మణ్యంకి మంచి కవితా హృదయంఉంది. ఎక్కడ మంచి కవిత్వం చదివినా విశేషంగా కదిలిపోయే స్వభావంఉంది. ఐతే ఈవిషయంలో కొంత జాగ్రత్త అవసరమనుకుంటాను. గొప్ప కవిత్వం చదివినప్పుడు చిగురుటాకులా చలించిపోవటం, వెన్నలా కరిగిపోవటం మంచిదే. కాని, తను కవిత్వం రాసే సమయంలో మాత్రం కవికి తానే ప్రమాణం కావాలి. మంచి పద్యానికి మెరుపు ఎంత అవసరమో, మరుపు కూడా అంతే అవసరం. తను రాసిన పాత పద్యాల్ని, తను చదివిన కొత్త పద్యాల్ని మరిచిపోయినప్పుడే, కవి తనదైన మరొక పద్యం రాయగలుగుతాడు.

సుబ్రహ్మణ్యం కవిగా తనను తాను నిరూపించుకునే దిశలో ఈ పుస్తకం తొలి అడుగు. ఏటి ఒడ్డున ప్రారంభమైన ఈ పాద యాత్ర, భవిష్యత్తులో సుదూర తీరాల వరకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.