వైరుధ్యం

ఇప్పుడు నీ కళ్ళకు
లోకవ్యవహారపు గంతలు
నువ్వొక జీవిత బేహారివి
నీ జేబులో డబ్బుంటుంది
డబ్బున్నవాడి జేబులో నువ్వుంటావు
అశాంతి అనునిత్యం నిన్ను
అంకుశమై పొడుస్తుంటుంది
జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది

జ్ఞాపకముందా?
చిరిగిన చెట్లగొడుగుల్నుండి దూసుకొచ్చే
ఆకాశపు చిగుళ్ళను ఎగిరెగిరి కోసుకుందామనుకొన్నది

జ్ఞాపకముందా?
పొద్దుపొడుస్తున్నప్పుడు
నిశ్శబ్దం రంగుల వానై నిన్ను తడిపేస్తుంటే
తన్మయంలో నువ్వు మూర్చపోయింది

జ్ఞాపకముందా?
తెలిమబ్బుల రెక్కలగుర్రాలెక్కి
నువ్వు దిగంతాల్లోకి పరుగులు తీసింది

జ్ఞాపకముందా?
చేస్తున్న పనిని ఆపి
నువ్వు దిక్కులతో చర్చిస్తున్నప్పుడు
నాన్నతో చీవాట్లు తిన్నది

జ్ఞాపకముందా?
శరీరాలు ఒకటవ్వదమనే వ్యవహారం తెలియని
ఆ రోజుల్లో నీ సహాద్యాయిని కోసం
పారిజాతం చెట్టుకింద నిరీక్షించిన వేళలు
అంతులేని ఆ ప్రేమలు.