శైశవ గీతి

Written for supporting projects of Association for India’s Development (AID)

నాకు గుర్తు లేదు కానీ
పుడమి స్వాగతాల సవ్వడికి
నేను కనులు తెరిచినప్పుడు
మా అమ్మను చూసే ఉంటాను.

ఆమె ముఖంలో ఒక
అస్పష్టమైన ఆందోళన.
అయినా ముద్దులొలికే నన్ను
ముద్దాడే ఉంటుంది –
మౌనంగా రోదించడానికి ముందు.

నాకు గుర్తు లేదు కానీ
నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రుల మధ్య
నా కళ్ళు ఆత్రంగా వెతికే ఉంటాయి
మా నాన్నను కళ్ళారా చూడాలని

ఆపైన ఏం జరిగిందో
నాకంతగా గుర్తు లేదు కానీ
నిద్దురలోకి జారుకునేముందు
నేననుకునే ఉంటాను
మా అమ్మ చెక్కిట కన్నీటిని తుడిచి ముద్దిడిన వ్యక్తి
మా నాన్నే అయి ఉంటాడని

ఆ రాత్రే
మా ఇంటి ఇరుగు పొరుగు వచ్చి
నేను నిద్దురలోనే కనుమూస్తానని చెప్పినప్పుడు
నాకు గుర్తు లేదు గానీ
నేను మా అమ్మను ఊరడించడానికి ప్రయత్నించే ఉంటాను
“నాకేం ఫరవాలేదమ్మా
నువ్వేం ఏడవద్దమ్మా” అని
ప్రయత్నించే ఉంటాను

ఒక సంవత్సరం కూడా నిండని శిశు మరణాల రేటు:
(Below 1-yr mortality rates)
సంవత్సరానికి 1000కి
ఇండియా: 56
అమెరికా: 6
శ్రీలంక: 14
అంగోలా: 192
వియత్నాం: 30

రచయిత రవి కూచిమంచి గురించి: పార్టికల్ ఫిజిక్స్ లో పోస్ట్-డాక్టరల్ డిగ్రీ ఉన్న రవి కూచిమంచి, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నస్వచ్ఛంద సంస్థ AID సంస్థాపకుడిగా సుపరిచితుడు. ఈయన పెడల్ పవర్ జెనరేటర్ ద్వారా మహారాష్ట్రలోని ఒక గ్రామంలో విజయవంతంగా నిర్వహించిన విద్యుదీకరణ ప్రాజెక్ట్, ఆశుతోష్ గోవరీకర్ నిర్మించిన "స్వదేశ్" సినిమాకు స్ఫూర్తి. తన భార్య అరవిందతో పాటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి. ...