అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు –

ఈమధ్య ఎవరినన్నా ఫలానా కవి గారి పద్యాలు ఎప్పుడైనా చదివారా అని అడగటానికి భయంగా వుంది. అడగంగానే వచ్చే పడికట్టు సమాధానం: ఆ కవి గారి పద్యాల్లో సంస్కృతం పాలు ఎక్కువ. పైగా పెద్ద పెద్ద సమాసాల గందరగోళం, పాషాణపాకం. దానికి తోడు ఛందస్సులో రాసినపద్యాన్ని అన్వయించుకోవడం చాలా కష్టం. ఇల్లాంటి సమాధానాలకి అసలు కారణం, మనం తెలుగు సరిగా నేర్చుకోకపోవడమే అని నా ఉద్దేశ్యం. “ప్రాచీన” కవిత్వం లో సంస్కృతం పాలు ఎక్కువే.

విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రాచీనుడు కాకపోయినా ప్రాచీన పద్ధతిలో రాసిన వాడు. చాలా పద్యాల్లో సంస్కృతం ఝుళిపించాడు. అది ఎవరో అన్నట్టు పాషాణ పాకమే. నిఘంటువు లేకుండా ఆయన కవితలు అర్థం చేసుకోవడం కష్టమే. అయితే, ఆయన కవిత్వం అర్థమయ్యేవాళ్ళకోసమే కవిత్వం రాసాడు. “ప్రజలకోసం” రాస్తున్నానని ఎక్కడా అనలేదు. పైగా, అర్థం కావటల్లేదు అనే నాలాంటి వాళ్ళకి గట్టిగా సమాధానం ఇచ్చాడు.

తొలినాడుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి. ఈ నా
ళుల వ్రాసిన కవిదోషము.
కలి గడిచిన కొలది చిత్రగతులన్ చెలగున్.

అయితే, “ఆధునిక” కవిత్వంలో అర్థం కాని సంస్కృత పదాలు, సమాసాలూ లేవను కోవడం భ్రమే. అర్థం కాకపోవడానికి మరో కారణం, మాటల అర్థాలు మారుతాయి. కొన్ని “పాత” మాటలు వాడుకలోనుంచి నిష్క్రమిస్తాయి. ఇది అన్ని భాషల్లోనూ మామూలే. ఒక్క తెలుగులోనేకాదు.

నా స్నేహితులు చాలామందికి నాకుమల్లేనే మహాకవి శ్రీశ్రీ కవిత్వం అంటే గొప్ప అభిమానం. ఆయన కవిత్వం శాశ్వతంగా నిలబడుతుందనే అభిప్రాయం కూడాను. మీ సాహిత్యంలో గొప్ప కవుల పేర్లు చెప్పండని అడిగితే, “ప్రాచీనుల్లోనన్నయ, తిక్కన, శ్రీనాథుడు,” అని, “ఆథునికుల్లో” విశ్వనాథ, శ్రీశ్రీ అని బల్ల గుద్ది చెప్పడానికి సందేహం ఉండకపోవచ్చుగానీ, వాళ్ళ పద్యాలేవన్నా వల్లించో, చదివో అర్థం చెప్పమంటే, నామటుకు నాకు కొంచెం కంగారు పుడుతుంది. విశ్వనాథని వదిలెయ్యండి. ఆయన నాలాటి plebian లకి కొరుకుడు పడడు అని ప్రస్తుతానికి ఒప్పుకుందాం. ఇందాకనే చెప్పానుగా, ఆయన ప్రజలకోసం రాస్తున్నట్టు ఎక్కడా అనలేదని!

మహాకవి శ్రీశ్రీ కవితలే తీసుకుందాం. ఆయన “ప్రజా కవి.” కార్మిక వర్గాల కల్యాణం కోసం కవిత్వం రాసాడు. ప్రజలకోసం కవిత్వం రాసాడు.

శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు రాసి డెబ్భై యేళ్ళు కూడా నిండ లేదు. ఆ కవితలు కూడా నిఘంటువు లేకండా అర్థం చేసుకోవడం, నాబోటిగాళ్ళకి కష్టమే అవుతున్నది.

మచ్చుకి ఈ కాసినీ చూడండి.

మహాప్రస్థానం అన్న మకుటంతో ఉన్న కవితలో,

“వర్షుకాభ్రముల ప్రళయఘోషవలే,”

ఐ అన్న కవితలో
“రసరాజ్య డోల
నా ఊళ కేదార గౌళ”

జయభేరిలో
“నా కుహూరత శీకరాలే,”
………తూర్య విరావం,”

జ్వాలాతోరణంలో,
“ప్రదీప్తి కీలా ప్రవాళ మాలా
ప్రపంచ వేలా ప్రసారములలో
మిహిరవాజితతి ! మఖవధనుర్ద్యుతి..” అని.

పోతే, మహాప్రస్థానంలో అన్నింటికన్నా గొప్ప కవితగా అందరూ ఒప్పుకున్న కవితా, ఓ కవితా అనే కవితలో, చూడండి.

“ ….. చిత్రవిచిత్ర శ్యమంత
రోచిర్నివహం చూశానో….
ఉన్మాది మనస్సినీవాలిలో
ఘూకం కేకా భేకం బాకా….
ప్రక్షాలిత మామక పాపపరంపర…
…………………………
కవనఘృణీ

…. నా విసరిన రసవిసృమర
కుసుమపరాగం…..”

అలాగే ప్రతిజ్ఞలో,

పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ,”

కేక లో “ ఫేరవ భైరవ భీకర ఘోషలు,”

ఆకాశదీపంలో “ఖండపరశుగళ కపాల గణముల,”

ఒక క్షణంలో, “తణిన్మణి, మణీఘృణి,”

వగైరాలు, వినటానికి బాగానే వుంటాయి గాని, అంటే ఏమిటి స్వామీ అని ఎవరైనా అడిగితే ప్రమాదమే.

పేదలు అన్న కవిత నిజంగా anticlimax.

“ శ్లథశైశిర పలాశరీతులు,
విశుష్కములు, పరిపాండురములు.”
స్వింబర్న్‌ కవికి అన్న కవితలో,
“ షెల్లీ కవనపు హల్లీసకమూ…
కవీ ! నీ గళగళన్మంగళ కళాకాహళ హళాహళిలో….” అంటే?

జగన్నాధుని రథచక్రాలు కవితలో ఈ క్రింది ఉదాహరణ మీద తెలుగు దేశంలో ఒక పత్రికలో రెండేళ్ళకిందట కాస్త గొడవ జరిగింది. గొడవకి కారణం, అర్థం కాకపోవడమేకాదు, పాత ప్రచురణలతో వచ్చిన మరో “అనర్థం,” bad proofing కూడాను! (1970 లో కె.వి. ఆర్‌. సంపాదకత్వంలో వచ్చిన ప్రతిలో ఈ ముద్రా రాక్షసాలు దిద్దబడ్డాయి అనుకున్నాను కాని తీరా చూస్తే అలా జరగలేదని తేలింది!)

“హింసన చణ
ధ్వంస రచన
ధ్వంసన చణ
హింస రచన.”

తప్పకుండా సూర్యరాయాంధ్ర నిఘంటువు చూడవలసినదే. శబ్దరత్నాకరం కూడా పనికి రాదు. అచ్చుతప్పులుంటే, నిఘంటువులో కూడా కొన్ని మాటలు దొరకవు. హింస నచణ అని అచ్చయితే, నచణ అన్నమాటకి అర్థం వుండదు. చణ అన్న మాట నిఘంటువులో దొరుకుతుంది. అల్లాగే హింసన అన్న మాటకూడా దొరుకుతుంది. పోతే, కవిత్వం అర్థం చేసుకోగలవాళ్ళు అన్వయించుకోవాలి.

శ్రీశ్రీ మహాప్రస్థానం సంకలనం ఎన్నోసార్లు పునర్ముద్రించ బడింది, అవే ముద్రా రాక్షసాలతో. ప్రచురణకర్తలకి, కాస్త తెలుగు మరికాస్త సంస్కృతం వచ్చిన పండితులెవ్వరూ దొరికి ఉండక పోవచ్చు. పూర్వపు రోజుల్లో అయితే, పండితులు భుక్తి కోసం proof readerలు గా పనిచేసేవాళ్ళు. ఈ సందర్భంలో, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి కామేశ్వరీ శతకంలో పద్యం గుర్తుకొస్తూన్నది.

అచ్చాఫీసులటంచు హూణులకుపాధ్యాయత్వమంచున్మరిన్‌
వెచ్చంబిచ్చెడి బచ్చుటిణ్డులకడన్‌ వేదాంతమంచున్మహో –
ద్యచ్చారిత్రులు పణ్డితుల్‌ మెల్గనయ్యెంగదా పొట్టకై
చచ్చుంగాలము వచ్చె గౌరవము నాశంబయ్యె కామేశ్వరీ.

ఆకాలంలో తెలుగు పండితుల దుస్థితి చెప్పి వాపోయారు, చెళ్ళపిళ్ళ వారు. ఇప్పుడు, ఈ మాయదారి కాలంలో, అసలు పండితులే కరువై పోతున్నారు.

మహాప్రస్థానం నుంచి ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, శ్రీ శ్రీ కూడా కవిత్వం అర్థం అయ్యేవాళ్ళకోసమే కవితలు రాసాడని ఋజువు చెయ్యడానికి.

ఏడు దశాబ్దాలుగా చాలామంది “ఆధునిక కవులు” శ్రీశ్రీ వేసిన “బాటలో” రాస్తూనేవున్నారు. పెద్దపెద్ద సంస్కృత సమాసాలు, అప్పుడప్పుడు దుష్ట సమాసాలు కూడా గుప్పించడం వీళ్ళందరికీ పరిపాటయిపోయింది. అయితే వీళ్ళల్లో చాలామందికి ప్రజలకోసమే తాముకవిత్వం రాస్తున్నామన్న పిచ్చి భ్రమ కూడా ఉంది. వీరి కవితలనుంచి కూడా ఉదాహరణలు తీసుకోవడం అప్రస్థుతం అనిపించింది. పోతే, మనకి గతశతాబ్దంలో మహాకవులు ఇద్దరే. విశ్వనాథ, శ్రీశ్రీ. వాళ్ళ కవితలని త్వరలోనే ప్రతిపదార్థాలతో, వ్యాఖ్యానాలతో ప్రచురించకపోతే, నన్నయలాగానో, శ్రీనాథుడి లాగానో, మూలపడే దుస్థితి తప్పకుండా వస్తుంది.

ప్రారంభంలో అన్నాను, మాటల అర్థాలు మారిపోతాయని. అర్థం అవకపోవడమే కాదు, అర్థాలు ఎల్లా మారిపోతాయో చూడండి. ఇది సుమతీ శతకంలో పద్యం. సంస్కృతం మాటల భయం లేదు.

నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్‌
నమ్మకు మంగడి వానిని
నమ్మకుమీవామహస్తు నవనిని సుమతీ.

వావిళ్ళవారు అచ్చేసిన సుమతీశతకంలో సుంకరి అన్నమాటకి “పన్ను తీయు వాడు,” అని అర్థం చెప్పారు. అంటే dentist అన్న భావం స్ఫురిస్తుంది. ఇది తప్పే. అసలు అర్థం, పన్నులు వసూలు చేసే వాడని. అంటే IRS వాడని అర్థం. కాళహస్తి వారు తరువాత అచ్చేసిన సుమతీ శతకం పుస్తకంలో పన్ను వసూలు చేసేవాడనే వున్నది. వావిళ్ళవారిది తప్పుకాదు. పన్ను తీయువాడు, పన్ను వసూలు చేయువాడు , ఈ రెండింటి అర్థమూ ఒకటే. మాటల అర్థాలు ఎలామారాయో చూడండి. అంతే. అలాగే, రెండో పాదంలో “నటు” అంటే actor, నటుడని అసలు అర్థం. సంధి వేరుచేసి, “అటు” అంటే “అటుల” అలాగునే” అన్న అర్థం చెప్పడం కూడా జరిగింది. (ఏమిసేయుదున్‌ గురునాథా అన్నట్టు.)

మన సాంస్కృతిక సంస్థలకి నిజంగా మన సాహిత్యం మీద అభిమానం, గౌరవం వుంటే, ఆ సాహిత్యాన్ని ప్రతిపదార్థాలతోను, వ్యాఖ్యానంతోను అచ్చు వేసుకోవడం అవసరం. అది చెయ్యకపోతే అర్థంకాని కవితలు అర్థంలేని కవితలుగా మిగిలిపోతాయి. అందుకేకాబోలు, ఈ రకమైన “తర్జుమా” పాశ్చాత్య సాహిత్యంలో ఎప్పటినుంచో జోరుగా సాగుతూ వున్నది.