నాన్నా తెలుసా

అమ్మో పెద్దైపోతే
అమ్మల్లే నేను కూడ అవుతానేమో!
అమ్మే నాన్నై మరి నా
న్నమ్మయ్యే రోజు ఎపుడు నాన్నా తెలుసా!

మొన్నను నువు రాలేదని
అన్నం తినకుండ రాతిరైనా చూస్తూ
ఉన్నమ్మ చివరికైనా
తిన్నాదోలేదొ నీకు తెలుసా నాన్నా?

నిన్నను నువు తిడుతోంటే
మిన్నక కూచున్న అమ్మ మేడెక్కి, మరే,
కన్నులు తుడుచుకు దిగుతూ
నన్నెత్తుకు నేడిచింది నాన్నా తెలుసా!

అమ్మేదో నిద్దట్లో
కమ్మని కలకన్నదేమొ కలకల నవ్విం
దమ్మను నవ్వుతు చూస్తే
నమ్మకమే కలగలేదు నాన్నా తెలుసా!

అమ్మో పెద్దైపోతే
అమ్మల్లే నేను కూడ అవుతానేమో!