చిన్న అల

ఒకే ఒక్క వాక్యం.
యాభై మంది తెలుగు వాళ్ళ బహుభాషా మేళనంలో, సరికొత్త నగల దగ్గర్నుంచి త్వరలో రాబోతోన్న లెక్సస్
హైబ్రిడ్ ఎస్‌యూవీ దాకా విస్తరించుకున్న సువిశాల చర్చా వ్యాసంగంలో –
ఒకే ఒక్క వాక్యం పదిటన్నుల బాంబులా పేలింది.

అందరూ అవాక్కులై ఎక్కడివారక్కడే ఆగిపోయారు ఓ క్షణం పాటు.
ముందుగా తెలివిలోకి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళ మొహాల వంక చూశారు – ఆ వాక్యం నిజంగానే విన్నామా అనే అనుమానంతో.

చాలా చిన్న వాక్యం అది –
“మా ఇంట్లో కేషే అర మిలియన్ పైగా వుంది తెలుసా?”

డాక్టర్ సుమతి గనుక ఆ మాట అనివుంటే బహుశా కొందరు భక్తితో ఆమె వంక ఓ సారి చూస్తే మరికొందరు లోపలి ఈర్ష్యని బయటికి చిరునవ్వుగా తర్జుమా చేసి ఇకిలించి వుండేవారు.

ఐదేళ్ళ క్రితం ఓ స్టార్టప్ లో అనుకోకుండా పదిహేను మిలియన్లు సంపాయించిన రావు దంపతుల్లో ఎవరైనా అనివుంటే, “బడాయి కాకపోతే, వచ్చిన డబ్బంతా స్టాక్ మార్కెట్ లో తగలేసి మళ్ళీ మొదటికే వచ్చిన సంగతి ఎవరికీ తెలియనట్టు ఈ బుకాయింపులెందుకో!” అని పైకి అనకపోయినా లోపల్లోపలైనా అందరూ అనుకునే వారు.

రెస్టారెంట్ వ్యాపారంలో విపరీతంగా సంపాయించేసిన నారాయణరెడ్డి అని వుంటే, “మొన్నమొన్నటి దాకా ఎంతో వినయంగా చక్కగా వుండే ఇతనికి ఇంతలోనే కొమ్ములొచ్చినట్టున్నాయే!” అనుకునే వారు.

కాని ఆ మాటన్నది వీళ్ళెవరూ కారు.
ఆ అమ్మాయి ఎవరో కూడ అక్కడున్న ఎక్కువ మందికి తెలీదు. పేరు లక్ష్మి ట. ఆ అమ్మాయి నాన్న సుబ్బారెడ్డికి హైస్కూల్లో క్లాస్‌మేట్ ట. ఆర్నెల్ల క్రితం పెళ్ళి చేసుకుని అమెరికా వస్తే చిన్ననాటి స్నేహితుడి కూతురు కదా అని ఈ పార్టీకి వాళ్ళనీ ఆహ్వానించాడు సుబ్బారెడ్డి, అప్పటికీ అతని భార్య లీల వద్దని వారిస్తున్నా.

లీల భయపడ్డట్టే అయింది.
సుబ్బారెడ్డి, లీల ఇరవై ఏళ్ళ క్రితం ఈ దేశం వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడో ఒకరు ఉండేవారట. తెలుగు మాట వినిపిస్తేనే ఒళ్ళు పులకించి అది ఎక్కడినుంచి వచ్చిందో వాళ్ళను వెదుక్కుని వెళ్ళి కలుసుకుని ఇంటికి (అంటే ఎపార్ట్‌మెంట్ కి – వచ్చిన పదేళ్ళ లోగా ఇల్లు కొనే స్తోమతు అప్పట్లో ఎవరికి వుండేది గనక?) ఆహ్వానించి భోజనం పెట్టి హడావుడిగా మిత్రులై పోయేవాళ్ళట.

అలా చిరకాల మిత్రులైన వాళ్ళే ఈ పార్టీకి వస్తున్న వాళ్ళందరూ. ఒకరి గురించి మరొకరికి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిపోయాయి ఈపాటికి. చివరికి మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలు మరొకరు గ్రహించే స్థితికి వచ్చారు. అలాటి మిత్రబృందం లోకి ఎవరో కొత్త వాళ్ళని ప్రవేశపెట్టటం అసాధ్యం అని లీలకి గట్టినమ్మకం.

సెంటిమెంట్స్‌కి పోయి సుబ్బారెడ్డి ఆ అమ్మాయిని, ఆమె భర్తని పార్టీకి పిలిచాడు. లేనిపోని తలనొప్పి కొనితెచ్చాడు.

పోనీ, ఆ కుర్రవాడేమైనా ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళందరిలాగా కంప్యూటర్ ప్రోగ్రామరా (వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజనియర్లని పిలవటానికి మిత్రబృందానికి మనసొప్పటం లేదు – “ఆర్నెల్ల ఆరకిల్ ట్రైనింగ్ ఐన ప్రతివాడూ సాఫ్ట్‌వేర్ ఇంజనియర్ ఐతే ఇక ఇక్కడ యూనివర్సిటీల్లో నానాచావూ చచ్చి ఎమ్మెస్ లూ పి ఎచ్ డీలూ చేసిన వాళ్ళు ఏవిట్టా? వాళ్ళూ వీళ్ళూ ఒకటేనా?” అని ఒకసారి తిరుగులేని వాదన చేసి అనుమానాలు ఉన్నవాళ్ళ నోళ్ళు మూయించేశాడు కృష్ణారెడ్డి అయిదేళ్ళ నాడు; మళ్ళీ ఆ విషయాన్ని తిరగదోడే ధైర్యం ఇప్పటివరకూ ఎవరికీ కలగలేదు!) అంటే అదీ కాదు.
తెలుగు వాళ్ళందరి పరువునీ రోజూ బజార్న పడేస్తూ –
టేక్సీ నడుపుతాట్ట!
ఇంకేమన్నా వుందీ?
కలవక కలవక కొత్తవాళ్ళతో కలవటం అంటే ఇలాటి వాళ్ళతోనా?
అసలిలాటి తలకు మాసిన వాళ్ళూ పొలోమని అమెరికాకి పరిగెత్తుకు రావటమేనా?
పోనీ సొంతగా వచ్చాడా అంటే అదీ కాదు.
వాళ్ళ అక్క ఎప్పుడో పదిహేనేళ్ళ నాడు స్పాన్సర్ చేస్తే నాలుగేళ్ళ నాడు గ్రీన్‌కార్డ్ వచ్చి ఎవర్ని ఉద్ధరిద్దామనో ఈ అమెరికాకి విచ్చేశాడట మహానుభావుడు.
బహుశా ఇండియాలో రోడ్లంట తిరుగుతుంటే అక్కడ పనికిరాడని ఇక్కడికి పంపారేమో!

ఆ పదిటన్నుల బాంబు పడేశాకనైనా ఆ అమ్మాయి కుదురుగా వూరుకుందా అంటే అదీ లేదు.
“మావారు నాలుగేళ్ళలోనే ఇంత సేవ్ చేశారంటే ముందు నమ్మలేక పోయాను గాని నేనిక్కడి వచ్చిన ఆర్నెలల్లో ఎలా సంపాయిస్తున్నదీ చూశాక నా కళ్ళు చెదిరిపోయాయి ఆంటీ! నెలకి ఇరవై వేలు సునాయాసంగా వస్తున్నాయి. ఇంకా కష్టపడితే ఇంకో ఐదారు వేలు సంపాయించొచ్చు గాని డబ్బుకోసమని ఫామిలీ లైఫ్ ని కాంప్రమైజ్ చేసుకుంటే ఎలాగ? అందుకని నేను వచ్చిందగ్గర్నుంచి అంత ఎక్కువగా పనిచెయ్యటం లేదు” అంది లక్ష్మి ఇంకొంచెం కారం పూస్తూ.

కొంచెం దూరంగా వున్నా ఆ నిశ్శబ్దంలో ఇదంతా స్పష్టంగా విన్న కృష్ణారెడ్డి ఇక ఆగలేకపోయాడు.
“ఏమిటేమిటీ, టేక్సీ బిజినెస్ ఇంత ప్రాఫిటబుల్ గా వుంటుందని నాకు తెలీదే? రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే ఏడాదికి టూ హండ్రెడ్ తౌజెండ్ సంపాయించొచ్చు – టేక్సీ నడిపి?” అన్నాడు చివరి భాగాన్ని సాగదీస్తూ.
లక్ష్మి భర్త ఆనంద్ మాట్లాడలేదు.
అందరి కళ్ళూ అతని మీదే వున్నాయి.
“దొరికిపోయావు సుమా! మా దగ్గరా మీ కుప్పిగంతులు?” అన్నట్టు విలాసంగా చిరునవ్వులు నవ్వుతున్నాయి వాళ్ళ కళ్ళు.
ఇంక మాట్లాడక తప్పదన్నట్టు మొదలుపెట్టాడతను – “డాట్ కాం బూం టైంలో గంటకి రెండొందలు సంపాయించటం అంత కష్టం కాలేదండీ. టిప్పుల్లోనే ఓ వంద వచ్చేవి. యేడాదికి రెండొందలు తేలిగ్గా సంపాయించాను. ఇప్పుడు బిజినెస్ అప్పుడంత బాగా లేదు గాని, ఐనా ఓ నూటయాభై వస్తున్నాయి. టేక్స్ ఫ్రీ గా నూటయాభై వచ్చినా పర్లేదు కదా!” అన్నాడతను అదేదో మామూలు విషయం లాగా.
“టేక్స్ ఫ్రీ” అనే మాట కృష్ణారెడ్డి చెవికి ఎంతో యింపుగా వినపడింది.
“ఆహా! ఐతే టేక్సులు ఎగ్గొట్టన్న మాట మీరు సంపాయించేది. అది ఇల్లీగల్ అని తెలుసా?” అన్నాడు గర్జిస్తూ.
“తెలుసంకుల్! అందుకే నా ఆదాయం అంతా కేష్ రూపంలోనే వుండేది. ప్రతి యేడూ టేక్స్‌లు ఫైల్ చేస్తాను కాని నేను చూపించే ఆదాయానికి, నా బిజినెస్ ఖర్చులకీ సరిపోతుంది. అంతా కేషే కాబట్టి నా ఆదాయం ఎంతో ఐ ఆర్ ఎస్ కి ఎలా తెలుస్తుంది?”

అందరికీ రక్తం సలసల మరిగిపోయింది. అతను ఐ ఆర్ ఎస్ ని కాదు, నేరుగా తమనే మోసం చేస్తున్నట్టు అనిపించింది.
అందరూ కలిసి అప్పటికప్పుడే అతన్ని ఎందుకు పీక పిసికి చంపలేదో ఆశ్చర్యమే!

“ఐతే మరి ఆ కేష్ ని ఇన్వెస్ట్ చేసినా, బేంక్ లో వేసినా ఐ ఆర్ ఎస్ కి తెలిసే అవకాశం వుంది కదా!” ఆశ్చర్యం ప్రకటించాడు రామకృష్ణారెడ్డి, బట్టతలని అప్రయత్నంగానే చేత్తో రుద్దుకుంటూ, ఇలాటి ఆలోచన తన బుర్రకి ఎందుకు తట్టలేదా అని విచారిస్తూ.
“అందుకేగదా డబ్బంతా ఇంట్లోనే దాచుకునేది?” నవ్వుతూ అన్నాడు ఆనంద్.
హమ్మా! ఎంత చాలూ గాడివిరా!! అని ముక్కున వేలేసుకున్నారు శ్రోతలంతా. ఇంక ఏం మాట్లాడాలో ఎవరికీ పాలుబోలేదు.
భోజనాలు అయాక ఆనంద్ వాళ్ళు త్వరగానే వెళ్ళిపోయారు.
మామూలుగా ఐతే వెంటనే పేకాట మొదలయ్యేది. ఈరోజు మాత్రం ఎవరికీ ఆ మూడ్ లేదు. ఇంకా షాక్ నుంచి తేరుకో లేదు ఎవరూ.

ఆడా మగా అని తేడా లేకుండా అందరిలోనూ ఒకటే ప్రశ్న –
“ఎలా జరిగిందిది?”

ఇన్నాళ్ళూ ఈవిషయం ఎందుకు తెలియలేదు? పెద్ద పెద్ద చదువులు చదివి, పనికిమాలిన కంపెనీలకి పగలనక రాత్రనక అరవచాకిరీలు చేసి, రాజకీయ పోరాటాలలో రాటుదేలి, నానాగడ్డి కరిచి ప్రమోషన్లు సంపాయించి పైకి పాకి పాకి – చివరికి ఇప్పుడు ఎంతెంత సంపాయిస్తున్నారో అంత, ఇవేవీ చెయ్యకుండానే ఎవడో నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన ఓ కోన్‌కిస్కా గాడు సంపాయించేస్తున్నాడు!
అమాయకంగా అంకుల్, ఆంటీ అని పిలుస్తూ గుండెల్లో బాంబులు పేలుస్తున్నాడు!!
………….

దార్లో ఆనంద్ లక్ష్మిని అడిగాడు – “అదేమిటి లక్ష్మీ, ఎవరితోనూ డబ్బు విషయం మాట్లాడొద్దని ముందే చెప్పాను కదా! ఇప్పుడు ఏమైందో చూశావా?”
“ఏం చెయ్యమంటారు మరి – వాళ్ళందరూ నన్నో పురుగుని చూసినట్టు చూస్తూ, అయ్యో పాపం మీ అమ్మానాన్నలకి ఇంతకు మించిన సంబంధం తెచ్చే స్తోమతు లేక నిన్నీ టేక్సీ డ్రైవర్‌కిచ్చి కట్టబెట్టారన్న మాట! నీకెంత అన్యాయం జరిగిపోయిందో! అన్నట్టు మాట్లాడుతుంటే ఎవరికైనా ఒళ్ళు మండిపోదూ! అందుకే వాళ్ళ నోళ్ళు మూయించా అలా!” అన్నది కొంచెం గర్వంగా.

ఒకవిధంగా అతని పరిస్థితీ అలాగే వుంది. ఇది కుక్క కాటుకి చెప్పు దెబ్బేలే అనిపించింది. ఐతే ఇది ఇంతటితో ఐపోయిందా లేక ఈ కథని కాళ్ళున్నాయా అనేది అతనికి తెలియని విషయం.
…………..

ఓ వారం గడిచింది.

సాయంత్రం ఆరు గంటలు. చలికాలం కనుక అప్పటికే చీకటి పడింది. లక్ష్మి వంట పనులు ముగిస్తున్నది. ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదు.

ఎవరో డోర్‌బెల్ నొక్కారు.
గబగబ వెళ్ళి తలుపు తీసింది లక్ష్మి.
ఎదురుగా సూట్‌లో ఒక నల్ల వ్యక్తి నిలబడివున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తు. బలంగా వున్నాడు.
లక్ష్మికి భయం వేసింది. “ఎవరు? ఏం కావాలి?” అన్నది కీచు గొంతుకతో.
“ఏమీ భయపడనక్కర్లేదు. నేను ఐ ఆర్ ఎస్ ఏజెంట్‌ని. వీళ్ళు నాకు సహాయంగా వచ్చారు” అన్నాడు తలుపు పూర్తిగా తెరుస్తూ.
సబ్ మెషీన్ గన్లు రెడీగా పట్టుకుని అటు ఇద్దరు ఇటు ఇద్దరు నిలబడివున్నారు. ఆమెకి నోట మాట రాలేదు.

ఇంక ఆమె ప్రమేయం లేకుండానే వాళ్ళందరూ లోపలికి నడిచారు. అందులో ఒకతను వెళ్ళి వెనక వైపు తలుపు తెరిస్తే ఇంకో నలుగురు బిలబిల మంటూ లోపలికి వచ్చారు. సూట్ వ్యక్తి వాళ్ళకి చకచక ఉత్తరువులు జారీ చేశాడు. అందరూ తలో పక్క వెళ్ళి ఎంతో చాకచక్యంగా ఇల్లంతా శోధించటం మొదలెట్టారు.

లక్ష్మి ప్రాణం బిక్కుబిక్కు మంటున్నది. డబ్బంతా బెడ్ కింద వుంది. చూస్తారో లేదో, చూస్తే ఏమౌతుందో!

గంటసేపు సాగింది వాళ్ళ శోధన.
అప్పటివరకు లక్ష్మి వంటింట్లోనే కూర్చుని వుంది. ఆనంద్ ఇంకా రానేలేదు.
నల్లతను ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
“ఈ ఇంట్లో చాలా కేష్ వున్నదని మాకు తెలుసు. మర్యాదగా చెప్పకపోతే మేమే గోడలన్నీ పగలగొట్టి చూడాల్సి వుంటుంది. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నా, ఏ విషయం నిర్ణయించుకోవటానికి” అన్నాడతను తీక్షణంగా చూస్తూ.
అతను అంటున్నది ముందు అర్థం కాలేదామెకి. అర్థమయ్యాక ఏం చెప్పాలో నిర్ణయించుకోవటం కష్టమైంది.
చివరికి చెప్పక తప్పదనే తేల్చుకుని “బెడ్ కింద వుంది డబ్బంతా. ఇంక వేరే ఎక్కడా లేదు” అన్నది.
అతనో విషపు నవ్వు నవ్వాడు – “అంటే మీ దగ్గర వున్నదంతా కేవలం నూట పద్నాలుగు డాలర్లేనని నన్ను నమ్మమంటావా?” అన్నాడు ఉక్రోషంగా.

కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అంతే! చూస్తుండగనే ఇల్లంతా పీకి పందిరేశారు వాళ్ళు. గోడలన్నీ పీకేశారు. కప్పు లాగేశారు. సోఫాల్ని చించారు.
ఖాళీ ఉన్నట్టు అనుమానం వచ్చిన ప్రతి వస్తువునీ పగలగొట్టి చూశారు.

ఇంత చేసినా అంతా అయాక లెక్కపెడితే వాళ్ళకి దొరికింది ఆ నూటపద్నాలుగు డాలర్లే!

ఒకడు బయటకు వెళ్ళి ఫ్లడ్ లైట్లు పట్టుకొచ్చాడు. మరొకడు గునపాలు తెచ్చాడు.
అందరూ కలిసి వెనక బేక్ యార్డంతా తవ్వేశారు.
ఐనా ఫలితం కనిపించలేదు.

చివరికి ఒకర్నొకరు బండబూతులు తిట్టుకుంటూ తొమ్మిది గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు.
ఇల్లంతా కిష్కింధలా వుంది.
యుద్ధం ముగిశాక లంకలా వుంది.
లక్ష్మి బావురుమంది అదంతా చూసి.

ఐతే అన్నింట్లోకి మిస్టరీ డబ్బంతా ఏమైందనేది.

పదింటికి ఇంటికి వచ్చాడు ఆనంద్. పరిస్థితి చూసి బిత్తరపోయాడు.
అంత విషాదం లోను అతని పెదాల మీద ఓ చిరునవ్వు మెరిసింది –
సరిగ్గా ఆ ముందు రోజే డబ్బంతా ఓ సూట్‌కేస్‌లో తీసుకెళ్ళి స్టోరేజ్ లో దాచి వుంచటం ఎంతో పనికొచ్చింది!
ఆ స్టోరేజ్‌ని కూడ తన పేరుతో కాకుండా టేక్సీ డిస్పాచర్ గా పనిచేసే ఒక తెల్లమ్మాయి పేరుతో తీయించటం వల్ల దాని గురించి ఐ ఆర్ ఎస్ కి తెలిసే అవకాశం లేదు!

మర్నాడు తెలిసింది – ఐ ఆర్ ఎస్ వాళ్ళు ఇంకో ఐదుగురు ఇండియన్ టేక్సీ డ్రైవర్ల ఇళ్ళని రైడ్ చేశారనీ, ఇద్దరి ఇళ్ళలో చాలా డబ్బు దొరికిందని.

వాళ్ళకు బహుశ జైలు శిక్షలు, పెద్ద పెద్ద పెనాల్టీలు పడబోతున్నాయి.

సుబ్బారెడ్డి గారి పార్టీలో జరిగిన సంఘటనే ఈ పరిణామాలకి దారి తీసిందని స్పష్టంగానే అర్థం ఐంది ఆనంద్ కి, లక్ష్మి కి.
ఐతే, దాని గురించి ఏం చెయ్యగలరు?

ముందుగా, ఐ ఆర్ ఎస్ కి రిపోర్ట్ చేసింది ఎవరో తెలియాలి.
………….

ఆ పని చేసింది కృష్ణారెడ్డే నని చాలా అనుమానంగా వుంది ఆనంద్‌కి.
ఐ ఆర్ ఎస్ లోకల్ ఆఫీసుకి ఫోన్ చేశాడు.
“నేను మీకు ఇండియన్ టేక్సీ డ్రైవర్ల ఫ్రాడ్ గురించి రిపోర్ట్ చేశాను. మీరు వాళ్ళ ఇళ్ళు రైడ్ చేసి చాలా డబ్బు రికవర్ చేశారని విన్నాను. మరి అందులో నాకు కొంత ఫైండర్స్ ఫీ ఇస్తారట కదా!” అని అడిగాడు వాళ్ళని.
“నిజమే. కాకపోతే మీరు మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీ పేరు చెప్పలేదు. అది మీరే ఇచ్చారని ఋజువు చెయ్య గలిగితే స్టాండర్డ్ ఫీ మీకు ఇస్తాం” అన్నారు వాళ్ళు.
“ఋజువు చెయ్యాలంటే ఎలాటి ఆధారాలు చూపించాలి?”
“మీరు మీ ఇంటి దగ్గర్నుంచి ఫోన్ చేసి వుంటే మీ ఫోన్ బిల్ గాని లేకుంటే ఫోన్ బుక్ లో మీ పేరు గాని చూపించాలి. ఆ పేరు మీ ఐడీ కి మేచ్ ఐతే అప్పుడు మీ వాయిస్ ని, మేము రికార్డ్ చేసిన రిపోర్ట్ లోని వాయిస్ ఒకటో కాదో చూస్తాం. అవి సరిపోతే మీ ఫీ మీకు వస్తుంది. అలా కాకుండా మీరు ఏ పే ఫోన్ నుంచో చేసివుంటే మీకు డబ్బు వచ్చే ఛాన్స్ తక్కువ. వాయిస్ ప్రింట్స్ మేచ్ చెయ్యటానికి ప్రయత్నిస్తాం కాని ఆ ఒక్కటే ఆధారమైతే అది మీరేనని పూర్తిగా ప్రూఫ్ కాదు” వివరించిందామె.

ఆ దారి అలా మూసుకుపోయింది.
………….

లోకల్ న్యూస్ పేపర్లలోనూ టీవీ వార్తల్లోనూ ఈ ఉదంతాన్ని ప్రముఖంగా చూపించారు.

అవి చూసిన చాలామంది భారతీయులు పళ్ళు పటపట కొరికారు – ఇలాటి “లో-లైఫ్” జనం తమకు తెచ్చిపెడుతున్న తలవంపుల్ని తల్చుకుని.

బాలిరెడ్డి వ్యవహారంలో టీవీ కెమేరాల ముందుకి పరిగెత్తి అతన్ని వెనకేసుకొచ్చిన సంఘ పెద్దలు ఎవరూ తుపాకీ గుండుకి కూడా దొరక్కుండా దాక్కున్నారు.
ఏం చెయ్యాలో తోచక చివరికి ఇండియన్ గ్రోసరీ షాపుల వాళ్ళని ఇంటర్వ్యూలు చేశారు లోకల్ రిపోర్టర్లు.
వాళ్ళెవరికీ ఏం జరిగిందో కూడ తెలీదు. అంచేత ఎందుకైనా మంచిదని, “మా కస్టమర్లలో అలాటి పనికిమాలిన పన్లు చేసే వాళ్ళు లేనే లేరు” అని నిక్కచ్చిగా చెప్పారు వాళ్ళు.
ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రం తప్పించుకోలేక “చట్టం దాని దారిన అది నడిచాక నిజమేమిటో బయటికొస్తుంది. అప్పుడు గాని నేను ఎలాటి ప్రకటనా చెయ్యలేను” అని పడికట్టు సమాధానం ఇచ్చాడు.
…………..

డాక్టర్ సుమతి మర్నాడు రాత్రికి గాని ఆ విషయం వినలేదు.
ఐతే డబ్బుతో పట్టుబడిన వాళ్లలో ఆనంద్ పేరు లేకపోవటం ఆమెకు చాలా నిరాశ కలిగించింది.
తను వలవిసిరిన పిట్టలు అందులో పడకపోగా అనుకోని మరో రెండు పిట్టలేవో పడ్డాయి.

కాకపోతే, ఇప్పుడు దీని అర్థం ఏమిటి? వాళ్ళు తమ దగ్గర బోలెడంత డబ్బున్నట్టు అబద్ధం ఆడారా, లేకపోతే దాన్ని తెలివిగా మరో చోట దాచి ఐ ఆర్ ఎస్ కి దొరక్కుండా తప్పించుకున్నారా?
…………..

వారం రోజుల తర్వాత కృష్ణారెడ్డి కారుకి పెద్ద ప్రమాదం జరిగింది – ఓ రాత్రి వేళ అతనొక్కడే ఆఫీసు నుంచి ఇంటికొస్తుంటే నిర్మానుష్యంగా వున్న రోడ్డులో హెడ్‌లైట్లు లేని ఏదో వాహనం పక్కగా వచ్చి అతని కారుని తోసేసింది. ఏం జరిగిందో తెలిసే లోగానే అతని కారు రోడ్డు దాటిపోయి పక్కనే వున్న పల్లంలోకి పల్టీలు కొడుతూ దొర్లింది. తెలివొచ్చేసరికి శీర్షాసనంలో వున్నాడతను. కొన్ని ఎముకలు విరిగాయి. కదలకుండా అలాగే జాగారం చేశాడు ఎవరేనా గమనిస్తారేమో నని ఆశిస్తూ.

అది జరిగే సరికి దాదాపుగా తెల్ల వారింది. కోలుకోవటానికి ఇంకో ఆర్నెల్ల పైగా పట్టింది.

అతని కారుని ఎవరు తోశారో పోలీసులు కనుక్కోలేక పోయారు. అది 1967 మోడల్ ఫోర్డ్ ముస్టాంగ్ అని కనిపెట్టారు కాని అలాటివి ఆ ప్రాంతం లోనే పాతిక వేల పైగా వున్నాయి. వాటిలో ఏదో ఎలా తెలుస్తుంది? పైగా, పోలీసు డిపార్ట్‌మెంట్ కున్న ప్రయారిటీస్ లో హిట్ అండ్ రన్ కారుని కనుక్కోవటం అనేది చిల్లర దొంగతనాలకి కూడ కింద వుంటుంది. ఫైల్ చెయ్యాల్సిన పేపర్లు ఫైల్ చేసి ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు.

కృష్ణారెడ్డి కూడ కొన్నాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాడు కాని మొదటి రెండు సార్ల తర్వాత, “ఏమైనా కొత్త సమాచారం దొరికితే మేమే చేస్తాం. ఇకనుంచి ఈ విషయంలో మీరు ఫోన్ చెయ్యక్కర్లేదు” అని మర్యాదగా మందలించారు వాళ్ళు.
…………..

ఐ ఆర్ ఎస్ రైడ్లతో సంబంధం లేకపోయినా సాటి టేక్సీ డ్రైవర్లకి జరిగిన దారుణానికి ప్రతీకారం చేసిన కిషన్ సింగ్‌కి తను చేసిన పనికి తృప్తి కలిగింది.

అతనలా చేస్తాడని ఊహించకపోయినా మిగిలిన టేక్సీ డ్రైవర్లకి కృష్ణారెడ్డి గురించి చెప్పినప్పుడు ఇలాటిదేదో జరిగితే బాగుండునన్న ఆలోచన తనకి కలిగినట్టు ఆనంద్ కి తెలుసు. దానికి అతనూ బాధపడలేదు.
====================