ఒకరికి నచ్చిన పద్యం

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

ఇది పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షణంలో పద్యం. తెలుగు పిల్లలు బడికి వెళ్ళే వయసు రాకముందే ఇంట్లో అమ్మో, అమ్మమ్మో నేర్పించిన పద్యాల్లో ఈ పద్యం తప్పనిసరిగా ఉంటుంది. తేలిగ్గా నోటికి తిరిగి, బట్టీ పట్టటానికి సులువైన పద్యం. సాధారణంగా పద్యం నేర్చుకున్న కొత్త రోజుల్లో చిన్న పిల్లలందరూ పద్యం ఒక్క గుక్కలో అప్పజెప్పడం కద్దు.

“ఒక్క పద్యంలో సులువైన చిన్న చిన్న మాటలతో బోలెడు వేదాంతం చెప్పారు, పోతన గారు. అందుచేత ఈ పద్యం నాకు చాలా నచ్చిన పద్యం,” అని నాలుగేళ్ళక్రితం ఎవరో మెయిల్‌ పంపించారు. పంపించిన వారి పేరు అడ్రసు గల్లంతయ్యాయి. నాకు గుర్తున్నవాళ్ళనందరినీ అడిగాను, “అయ్యా, అమ్మా, మీరా మీరా ఎవరూ” అని. ఫలితం సున్నా. ఎవరు మొదటగా పంపించారో, ఆ ఒకరికి నచ్చిన పద్యం గానే నేను తిరిగి రాస్తున్నాను. ఈ పద్యం నాక్కూడా నచ్చిన పద్యమే. నామటుకు నాకు ఈ పద్యం నచ్చటమే కాదు, దరిమిలా నేను మెచ్చిన పద్యాల్లో కూడా ఒకటి.

ఎందుకంటే, ఇది అతి తేలికగా అర్థమయ్యే పద్యం. చాలా శక్తివంతమైన, అందమైన పద్యం చిన్న మాటలతో, పొల్లుమాటలు ఏవీ లేకుండా అల్లచ్చునని చెప్పడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ.

అంతేకాదు. తెలుగు వాక్య విన్యాసం లేని తెలుగు వాక్యాలు రాసి, అది తెలుగనిపించి, తెలుగుగా చదివించగల శక్తి ఒక్క పోతనగారికే ఉంది. అదీ ఆయనలో గొప్పతనం. అదీ, ఈ పద్యంలో ఉన్న విచిత్రం. నా ఉద్దేశం ఏమిటంటే “ఎవరు మా ఇంటికొచ్చారో, వారితో మాట్లాడాము,” అని మనం అనం. “మా ఇంటికొచ్చినవారితో మాట్లాడాము,” అని అంటాము. ఇది తెలుగు వాక్య విన్యాసం. సంస్కృతంలో వాక్యవిన్యాసం తేడాగా వుంటుంది. ఉదాహరణకి, ఈ క్రింది ప్రార్థన శ్లోకం చూడండి.

యా కున్దేన్దు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా

ఎవరైతే తెల్లటి బట్టలు వేసుకొని వున్నదో, ఎవరైతే తెల్లని పద్మం ఆసనం గా కలదో, ఎవరైతే వీణ పట్టుకొని వున్నదో, ఇలాంటి వాక్యాలు తెలుగు విన్యాసం వున్న వాక్యాలు కావు. సరిగా, ఇలాంటి వాక్యవిన్యాసంతో పోతన గారు సులభమైన తెలుగు పద్యం రాసి చదివించగలిగారు. అందుచేత “ఎవ్వనిచే జనించు” గొప్ప పద్యం అని అంటాను.

నామటుకు నాకు, పోతన గారి పద్యంలో “వేదాంతం,” లేదా “వేదాంతసారం ” కన్నా ఒక భక్తుడు దేవుణ్ణి శరణు కోరుకోవడమే స్ఫురిస్తుంది. గజేంద్రుడు విపరీతంగా అలసిపోయాడు. తనుగా తాను మకరితో ఇక యుద్ధం చెయ్యలేకపోతున్నాడు. తనకు సాధ్యం కాలేకనే, రక్షించమని దేవుణ్ణి మ్రొక్కుతున్నాడు. మొర పెట్టుతున్నాడు. ఇంతమొరపెడుతున్నా, ఏ ఒక్క దేవుడూ తనకి సాయం చెయ్యడానికి రావటల్లేదు. ఆ క్షణంలో తనకి సందేహం కూడా వచ్చింది, ఆ పరమాత్మ అనేవాడు అసలు ఉన్నాడో లేడో అని! పది పద్యాల తరువాత ఈ సందేహం వెలిబుచ్చుతాడు. ” కలడందురు దీనులయెడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురన్ని దిశలను, కలడు కలండనెడివాడు కలడో లేడో.” ఎవరికైనా, తనబలహీనత బయటపడి, విసిగి వేసారిపోయినప్పుడే కదా, ఇలాంటి సందేహం పుట్టేది. సరిగ్గా అదే సందేహం గజేంద్రుడి కి కూడా వచ్చింది.

మరో పది పద్యాల తరువాత పోతన గారు రాస్తారు, ” విశ్వమయత లేమి వినియు నూరక యుండిరంబుజాసనాదు లడ్డ పడక, ” అని. బ్రహ్మ మొదలైన దేవుళ్ళందరూ గజేంద్రుడి గోడు విన్నారు, కానీ, అందరూ ఊరుకొని ఉండి పోయారు. ఒక్క విష్ణువే, గజేంద్రుడి ని రక్షించడానికి పూనుకొన్నాడు. భాగవత పురాణంలో ప్రధానాంశం భక్త రక్షణ.

నాకు తరువాత తెలిసింది. ఆముక్తమాల్యదలో కూడా అచ్చంగా ఇల్లాంటి పద్యమే ఒకటి ఉన్నది.

ఎవ్వని చూడ్కి చేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వని యందు, డిందు మరి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడనే
నెవ్విధినైన నిన్గదియనేని, యనన్విని బంధ మూడ్చినన్‌

రాయల వారు పోతన భాగవత పద్యం చదివే ఉండాలి. భాగవత పద్యానికి ఆయన పద్యం అనుకరణే. పోతన గారి పద్యం గొప్పపద్యం కాబట్టే రాయల వారు అనుకరించి ఉండాలి.

ఇంకో విశేషం. పోతన గారు స్మార్తుడు. ఆయనకి ఇతర దేవుళ్ళు, అంటే బ్రహ్మ, మహేశ్వరుడు, మొదలైన వాళ్ళళ్ళో ఎవరితోటీ పేచీ లేదు. రాయల కాలం నాటికి వైష్ణవమతం బాగా స్థిరపడి పడిపోయింది. అందుకనే కాబోలు, ఆయన అనుకరించిన పద్యంలో, విష్ణుమూర్తిని మాత్రమే పేర్కొన్నాడు. వైష్ణవులు ఇంకోదేవుడి పేరు పలక కూడదు. ఉదాహరణకి విష్ణుమూర్తినే, పరమేశ్వరా అని సంబోధించకూడదు. ఆ పదంలో ఈశ్వరుడున్నాడు, అందుకని. చిన్నప్పుడు చదివించిన ఈ తేలికైన పద్యానికి ఇంత వ్యాఖ్యానం! ఏ దేవుడేమయి పోయినా, ఏ వ్యాఖ్యానం ఎలావున్నా, పోతన గారి “ఎవ్వనిచే జనించు పద్యం మాత్రం చిన్నపిల్లలు తెలుగు పద్యాలు నేర్చుకున్నంతకాలం సుస్థిరంగా ఉంటుంది.