సంసారి

పదహారేళ్ళ క్రితం మాట టీవీ లో క్రికెట్‌ మాచ్చొస్తోంది, ఇంటిల్లిపాదీ ఇల్లదిరేలా సౌండు పెట్టి చూసేస్తున్నారు, రవి శాస్త్రి సిక్సు కొట్టాడని కామెంటేటరు చెబుతున్నాడు. లోపల గదిలోంచి మామ్మగారొచ్చి, ” ఏరా శాస్త్రంటే, మనవాళ్ళేనా…? ” అడిగింది.

రాజా కి నవ్వాగలేదు. చెప్పాడు ” ఆ, మనవాళ్ళే, రాంభట్ల సోవన్న గారి మనవడు, బావున్నాడా?” మామ్మంది “బాగోకేం చక్ఖగా గెడేర స్థంభంలా వున్నాడు, మంచి రంగుకూడాను ” అని, కాసేపాగి “పెళ్ళైందా?” అంది. “అమ్మ బామ్మోయ్‌ చూస్తుంటే నువ్వు రవి శాస్త్రి కీ, శ్రీకాంతుకీ కూడా పెళ్ళి సంబంధాలు చూసేసేట్టున్నావు, అతనిది బొంబాయి, కిరికెట్టాడే పిల్ల కోసం చూస్తున్నాట్ట” అన్నాడు. “వెర్రీ కాదు, వెంపరా కాదు, పంపర అన్నట్టుంది, ఉజ్జోగం చేసే వాడికి ఉజ్జోగప్పిల్ల కావాలీ, ఆటలాడే వాడికి ఆటల పిల్ల కావాలీ, హిల్లా అయితే మరి దింపులు తీసే వాడేవనుకోవాలీ…” అని వంటింట్లోకెళ్ళిపోయింది. అంతా ఒకటే నవ్వు. అలా “మన”వాళ్ళని వెతుక్కుంటూ మామ్మ చాలా పైకెళ్ళిపోయింది. మనవళ్ళు మిగిలిపోయారు. ఇన్నేళ్ళకి ఎదిగిపోయారు. దూరంగా చెదిరిపోయారు. ఒకడు వీసా గాలికి కొట్టుకొచ్చి అమెరికా చెట్టుకి చిక్కుకున్నాడు. ఇంకా..పెళ్ళి కుదరట్లేదని రోజు రోజుకీ చిక్కిపోతున్నాడు, వాడే రాజా.

చాలా నిక్కచ్చైన మనిషి. ప్రతీ సుక్కురారం అతని మిత్ర బృందం అతన్ని ఏదో ఒక బారుకి మోసుకు పోతూనే వుంటారు. వాళ్ళంతా తాగి పడిపోయే టైముకి, ఒక్కొకణ్ణీ కారులోకి మోసుకొచ్చి, పాపం, సీటు బెల్టులు కూడా పెట్టి, ఎవరిళ్ళదెగ్గిర వాళ్ళని పడేసి, ఇంటికిపోయి తొంగోవడం అతని దురలవాటు. అతను తాగకపోయినా, వాళ్ళతో వెళ్ళి, తెల్ల అమ్మాయిల్ని చూడ్డం, రింగులు తిప్పుకోడవంటే అతనికి మహా సరదా.

ఆ సుక్కురారం వాళ్ళ విడిది హూటర్సు బారు. చాలా సేపు గుడ్లూ, వళ్ళూ అప్పగించి కోకు తాగుతూ కొంతమంది తెల్ల పిల్లల్ని తినేసాడు చూపులతో. తరవాత అన్నాడు, “ఒరేయ్‌ రమేషా, తెల్లమ్మాయి దేవుడు చేసిన అద్భుతాల్లో ఒకటి రా. వెధవది, జీవితంలో ఒక్కసారి, ఒక్ఖసారంటే ఒక్కసారి, ఒకే ఒక్క తెల్ల అమ్మాయి…” ఇంకా యేదో చెప్పబోతుంటే ఆపి రమేషన్నాడు..

“వొరే, వీడి టైపు చూస్తుంటే ఎక్కడా ఆగేట్టులేడు, నామాటిని తొందరగా పెళ్ళి చేసుకోరా బాబూ, నీకూ తప్పుద్ది, మాకూ తప్పుద్ది యీ గోల..”

“ఒహవేళ దూకుడుమీద మరి అక్కడా, ఇక్కడా మొహమాట పడి టిఫిన్లేహేహావనుకో, ఇంటికాడ భోయనానికి దెబ్బడిపోద్ది మరి, ఆనక నీపేరు రాజా కాదు, పులి రాజా అని మార్చుకోవలసుంటది, ఆలోహించుకో”సినిమా యాక్టరు మల్లికార్జునరావు ని ఇమిటేట్‌ చేస్తూ చెప్పాడు మిమిక్రీ శీను.

“తమరి వెంకమ్మగారు. మీరంతా ముయ్యండి ” అన్నాడు రాజా.

” అవునుగానొరే, ఆతిట్టేట్రా, వెరైటీగా వుంది ” అన్నాడు శీను.

“ఏకవచనంలో తిడితే, కొంచెం సీపుగా వుంటుందని అలా తిట్టాను. ఓపక్క పెళ్ళి కుదరక నేను ఛస్తుంటే, బోడి సలహాలొకటి, అసలు మీసలహాలినే ఇలా తయారయ్యాను” రాజా..

రాత్రి ఇంటికి ఫోను చెయ్యాలంటే భయం రాజాకి.

“ఏరా ఈసారి పంపించిన ఫొటోలన్నా నచ్చాయా? ” అమ్మ గొంతు.

“అంటే, కొంచెం ఇబ్బందిగా వున్నాయే అమ్మా, ఆ మొదటి ఫొటోలో అమ్మాయి జైల్లోకి వెడుతున్నట్టో, జైల్లోంచి అప్పుడే విడుదలై వస్తున్నట్టో పెట్టింది ఫోజు, పిడికిళ్ళు కూడా బిగించి. రంగేమో గారంటీ రంగు, ఇక రెండో ఫోటోలో ఆ అమ్మాయి కన్నా, వెనకాల కేలండర్లో వున్న దేవుడు బాగా కనబడేట్టు తీసారు ఫొటో. అయినా ఫొటోలు నాకు పంపే ముందు ఒక్కసారి నా ఫొటో, ఆ అమ్మాయి ఫొటో పక్క పక్కన పెట్టి చూసి, మీకు వోకే అనిపిస్తే అప్పుడు పంపించండే ” రాజా.

“ఇదిగో చూడొరేయ్‌ మనవేమీ మన్మధులం కాదు, నీకూ ముద్దుముద్దుగా యిరవై ఏడో, ఎనిమిదో వస్తున్నాయా, మన వాళ్ళల్లో, జాతకాలూ, పౌరుషాలూ, అన్నీ కుదిరి, నీకు కావలసిన చదువుండి, అమ్మానాన్నా రేప్పొద్దున్న గుమ్మంలోకెడితే, కాసిన్ని కాఫి చుక్కలు పోసే కుటుంబాల్లోంచి వెతికేసరికి, వీళ్ళు తేలారు ” అమ్మ

శాస్త్ర ప్రకారం శోభనం జరిపితే ఏదో పుట్టిందని సామెత గుర్తొచ్చి నవ్వొచ్చింది రాజాకి. కానీ సీరియస్‌ మేటరు డిస్కసు చేస్తున్నాడు కాబట్టి ఆపుకున్నాడు. ఇంతలో అవతల రాజా నాన్న తీసుకున్నారు ఫోను.

“మమ్మల్నేం ఛావమన్నావా, ఎక్కేగుమ్మం, దిగే గుమ్మం, ఛస్తున్నాం. నీ మనసులో ఎవరన్నా పిల్లుంటే చెప్పి యేడు. మన వాళ్ళైనా కాకపోయినా ఏదో రెండక్షింతలు వేసేసి, తల తడివేసుకుంటాం. అయినా ఏవిటీ వెధవ ఎంచడాలు, ఏదో వొకటి చేసుకు పోవాలి, కొరుక్కుతింటావేట్రా అందాన్ని. నీకంతగా అందవే ప్రధానవైతే, నువ్వే రెణ్ణెల్లు సెలవు పెట్టి వచ్చి చూసుకుని చేసుకో ” నాన్న.

“అబ్బ మీరుండండి, ఎంతసేపు కస్సూ, బుస్సే. ఒరేయ్‌ నాన్నా చెప్పు, నీకెల్లాంటి పిల్లకావాలి” అమ్మ.

ఇదే ప్రశ్న యే రమేషో, శీనో అడిగుంటే కరెక్టుగా, మళ్ళీ ఎక్కడా పొరపడడానికి అవకాశం లేకుండా, చెప్పుండే వాడు రాజా. కానీ అమ్మకి అలా చెప్పలేడు కదా. అందుకే మళ్ళీ నసుగుడు మొదలెట్టి “అది కాదే అమ్మా, చక్కగా తెలుగులో మాట్లాడే పిల్ల, డిగ్రీ చదువుకున్న పిల్లైతే చాలే ” అన్నాడు రాజా.

మళ్ళీ ఆ పైవారం కథ మామూలే. ఆవారంలో వచ్చిన ఫొటోలన్నీ మార్చి మార్చి చూసాడు. తన ఎక్స్పెక్టేషన్లన్నీ బాగా తగ్గించేసి చూసాడు. లాభం లేకపోయింది. “అమ్మాయి అయితే చాలు” అన్న

వొక్క ఎక్స్పెక్టేషనే వుంటే తప్ప తన పెళ్ళి జరిగేట్టు లేదనిపించింది. ఇంత దూరం వచ్చినా, ఇన్ని సినీమాలు చూసినా, ప్రేమించి పెళ్ళి చేసుకోలేని తన ప్రయోజకత్వాన్ని చూసి మొదట నవ్వొచ్చింది, ఆనక ఏడుపొచ్చింది. అదే కంటిన్యూ చేసాడు కాసేపు.

అన్ని ఇంటర్నెట్‌ పెళ్ళి ప్రకటనల్లోనూ, ఇంట్లో తెలియకుండా కాష్ట్‌ నో బార్‌ అని వేసి చూసాడు, అందరికీ అప్ప్లై కూడా చేశాడు, మీకు లేకపోవచ్చు, మాకు మాత్రం కాష్టు బారే ఇంకోసారి

ఇల్లాంటి క్రాసు పోష్టింగులు చేస్తే కరుసై పోగలరు, ఆపై పూచీ మీదే, మాది కాదు అని చాలామంది కుండ బద్దలుకొట్టినట్టు సమాధానాలిచ్చారు. ఛీఛీ, అసలు మన తెలుగువాళ్ళు ఇంత రేసిష్టులా,

ఇల్లాగైతే నాకసలు పెళ్ళేవద్దు అని నిర్ణయానికొచ్చేసే ముహూర్తంలో, ఎప్పటిలాగే ఇంటినించొచ్చిన ఫొటోలు చూస్తూ, ఓ ఫొటో దగ్గిర ఆగిపోయాడు. ఫరవాలేదనిపించింది. ఆనక మళ్ళీ చూసాడు. బావుందనిపించింది.

“ఏమో, ఇప్పుడు ఫొటోయే కదా చూసాను, ఇంకా బోల్డు వ్యవహారం వుంది, నేను తనకి నచ్చాలి, మాట్లాడాలి, మాటలు కుదరాలి, సంబంధాలు కుదరాలి.. అయినప్పుడు చూద్దాం” అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద, ముహూర్తం దాటిపోయేలోపు, ఆ అమ్మాయితో ఐదు నిమిషాలు ఫోనులో మాట్లాడే వొప్పందం కుదుర్చుకుని ఫోనెత్తాడు. ఐదుగంటల తరవాత ఫోను దానంతట అదే తలగడామీంచి పడిపోయింది.

కొన్నాళ్ళకి వాళ్ళ ఫోను కంపెనీ వాడు రాజా పేరుమీద కొత్త ఆఫీసు భవంతి కట్టుకున్నాడు. అమ్మాయి పేరు చెబితే, తను అమెరికాకి తిరిగొచ్చాకా, ఇద్దరిపేర్లూ ఆ బిల్డింగుమీద చెక్కిస్తానని మాటిచ్చాడు. ఫోను బిల్లులకన్నా విమానం టికెట్టే చీపని చెప్పారు, రమేషూ, శీనూ, మిగితా ఫ్రెండ్లూ. సెలవు లేదన్నాడు యజమాని. మానేస్తానన్నాడు రాజా. ప్రాజెక్టు మధ్యలో వదిలేస్తాడని భయవేసి, సెలవిచ్చేసాడు యజమాని. రాజా ప్రమేయం, ఆ అమ్మాయి ప్రమేయం లేకుండానే పెళ్ళైపోయింది. అర్థరాత్రి దాటాకా మూడో ఝాము ముహూర్తం మరి. ఆనక మొక్కులూ, వ్రతాలూ, వీసాలూ. నెలంటే ఎన్ని రోజులో అర్థం కాలేదు రాజాకి.అలవాటైన చెట్టుకే వచ్చి వాలాడు రాజా, సతీ సమేతంగా. నిజంగా ఎనిమిదిగంటలు ఆఫీసులో పనిచెయ్యాలంటే నరకంలా అనిపించేది మొదట్లో అతనికి. పచ్చకార్డు రాగానే అందరిలాగే కంపెనీ పెట్టేసి, తను పనిచెయ్యకుండా, డబ్బులు సంపాదించేసి, లక్ష్మి ని సుఖపెట్టెయ్యాలనుకున్నాడు. తమ సుక్కురారం కంపెనీ పోయినందుకు అతని ఫ్రెండ్లు బాధపడ్డా, అతనికి మంచి కంపెనీయే దొరికిందని సంతోషపడ్డారు, పాపం ఎంతైనా స్నేహితులు కదా.

అయితే తమకు జరిగిన నష్టానికి పరిహారం గా, ప్రతీ శనివారం రాత్రి, విందుభోజనం, వదిన గారి చేతులమీదుగా లాగించేందుకు ఒప్పందం కుదిర్చేసుకున్నారు. ఇప్పుడు రాజా తెల్ల పిల్ల మాటే మర్చిపోయాడు. ఎప్పుడైనా అటుకేసి చూసినా ఒకటే అనుకుంటాడు “సంసారీ సుఖీ..” అని.

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...