మూడో ముద్రణ

మబ్బులయితే నల్లగా కమ్ముకున్నాయి. గాలి చూస్తే వాన పడేట్టూ ఉంది, తేలిపోయేట్టూ ఉంది. మెయిన్‌ రోడ్డు మీద హడావుడిగా నడుస్తున్న జనాలు మరింత వడివడిగా నడుస్తున్నారు. బోర్డులు చూసుకుంటూ నడుస్తున్న కుర్రాడు సైకిళ్ళ షాపు దగ్గర ఆగి అక్కడ పంచరేస్తున్న పిల్లాడికి డైరెక్షన్లిస్తున్న షాపాయన్ని అడిగాడు “ఇక్కడ శారదా బుక్‌ షాప్‌ ఎక్కడుందో తెలుసా?”.

“ఈ దరిదాపుల్లో పుస్తకాల షాపులు ఎక్కడా లేవే! అదుగో ఆ కూల్‌డ్రింక్స్‌ షాపు లేదూ, అక్కడ అడుగు. ఆ స్టూడెంట్‌ కుర్రాళ్ళంతా అక్కడ చేరతారు. వాళ్ళకి తెలుసుద్ది” అని చెప్పి “ఇంకొద్దిగా గాలి కొట్టరా నువ్వు!” అంటూ అజమాయిషీలో మునిగి పోయేడు.

కూల్‌డ్రింక్స్‌ షాపులో ఎవరూ లేరు. కౌంటర్‌ దగ్గర కూచుని పేపర్‌ చూసుకుంటున్న ముసలాయన అలికిడికి పేపర్‌ లోంచి తలెత్తగానే అడిగాడు. “బుక్‌ షాపా? ఈ కుడివైపు రెండు లైన్లు దాటాక టీకొట్టు దగ్గర కుడిపక్క సందులో ఒకటుండాలి. అన్నపూర్ణో, మరి శారదో ఏదోగానీ పాత పుస్తకాలమ్మే షాపు. ఉందో మూసేశారో గానీ ఇప్పుడు..”

రోడ్డు మీద దుమ్ము రేగుతూంది. నలిగిన కాగితమొకటి కొట్టుకుంటూ పోయి రిక్షా చక్రంలో ఇరుక్కుంది. పక్కన రిక్షావాడితో బేరం తెగడం లేదు భార్యాభర్తలకి. అరటిపళ్ళ బండివాడు ఉండుండి అరుస్తున్నాడు “అరటిపళ్ళు అరటిపళ్ళో” అని. గాలి వాలుకి కాఫీ, టీ వాసనలు కొట్టుకొస్తున్నాయి కలగలిసి. మలుపు తిరిగితే మూలమీద చెత్తకుప్పలోంచి నల్లమచ్చల కుక్క తలెత్తి చూసి గుర్రుమని మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. షాపుందా లేదా, ఉంటే అది శారదా బుక్‌ షాపేనా అని ఆదుర్దాగా చూసుకుంటూ వస్తున్నాడు. ఒక గళ్ళ చొక్కా పిల్లాడు గణగణ గంట కొట్టుకుంటూ సైకిల్‌ మీద దూసుకు వెళితే ఉలిక్కి పడ్డాడు. ఎక్కడో గోడలవెనక పంపులోంచి నీళ్ళు పడుతుంటే బిందె నిండుతున్న శబ్దం.

అసలు ఈ బజారు అవునో కాదో అని అనుమానపడుతుండగా కనపడింది బోర్డు. శారదా బుక్‌షాపే. ఉత్సాహంగా రెండు మెట్లూ ఒక్క అంగలో ఎక్కేసి లోపలికి వెళ్ళాడు.

వాకిలి పక్కనే టేబుల్‌ మీద కాసిని పుస్తకాలూ, వెనక కుర్చీలో కూచుని ఒక పుస్తకం చదువుతూ షాపు వోనరూ, చెక్క అరలన్నీ నిండిపోగా, గోడల పక్కనా, టేబుల్స్‌ పైనా పేర్చిన పుస్తకాలూ. పాతపుస్తకాల వాసనని ఇష్టంగా పీల్చుకుంటూ అడిగాడు “నవలలు ఎటు వైపు ఉన్నాయండీ?”.

ఆయన అరలవైపు చూపించాడు. “అవిగో అవన్నీ కొత్తగా వచ్చిన నవలలే!”

“అహఁ కొత్తవి కాదు పాతవి కావాలి!”

“ఈ గోడ పక్కన ఉన్నయ్యన్నీ అవే! ఇవి కాకుండా ఆ లోపలి గదిలో కూడా ఉన్నాయి చూసుకోండి!”

ఒక పక్క మొదలు పెట్టి వరసగా చూసుకుంటూ పోయాడు. ఆ పుస్తకం కనపడలేదు. లోపలి గదిలోకి పోయి అన్నీ తిరగేసి చూస్తున్నాడు. మధ్యలో దుమ్ముకి రెండు సార్లు తుమ్ములు. కనబడక పోతున్నకొద్దీ నిరాశా, నీరసమూ పెరుగుతున్నాయి. అయినా పట్టుదలగా వెతుకుతున్నాడు.

అక్కడక్కడా ఆసక్తి కలిగించేలా ఉన్న పుస్తకాన్ని తీసుకుని తిరగేసి పక్కనే పెట్టేస్తున్నాడు. పుస్తకాలన్నీ కెలికేసినట్టున్నాయి. ఒక వరసా వావీ ఏవీ లేవు. అలికిడికి తలెత్తి చూశాడు. వాకిట్లో షాపాయన. ఇస్త్రీ చేసిన తెల్ల ప్యాంటూ, పైన తెల్ల ఖద్దరు చొక్కా. పైన ట్యూబ్‌లైటు వెలుతుర్లో బట్టతల మెరుస్తూంది. కళ్ళజోడులోంచి కళ్ళు పెద్దవిగా కనిపిస్తున్నాయి.

” ప్రత్యేకంగా ఏదన్నా పుస్తకం కోసం వెతుకుతున్నారా, ఊరికే ఏవైనా దొరుకుతాయాని చూస్తున్నారా?”

“సాగర కెరటాలు అని పాత నవల కోసం వెతుకుతున్నానండీ, ఆర్కే మూర్తి అని రైటరు. ఎప్పుడో ముప్పయ్యేళ్ళ కింద ప్రింటయ్యింది.” ఉన్నా ఇంత కంగాళీ షాపులో ఎక్కడ ఏదుందో ఈయనకి మాత్రం ఎట్లా తెలుస్తుంది అనుకుంటూ చెప్పాడు.

“సాగర కెరటాలా, ఆ మాట ముందే చెప్తే తీసి ఇచ్చేవాణ్ణిగా!” నవ్వుకుంటూ ఒక మూల కట్టలోంచి తీసి టేబుల్‌ మీద కొట్టి దుమ్ము దులిపి ఇచ్చాడు గర్వంగా.

ఆత్రంగా అందుకుని లోపలి పేజీలు తిప్పి “ప్చ్‌! ఇది సెకండ్‌ ప్రింట్‌” అని తిరిగి ఇచ్చేశాడతను నిరాశగా.

“అయితే ఏమయింది?” ఆశ్చర్యంగా అడిగాడు ఆయన, “పెద్దగా నలగలేదు కూడా!” పక్కకి తిరిగి చూసి ఇంకో పుస్తకం తీసి పేజీ తిప్పి చూసి “ఇదుగో బాబూ మొదటి ముద్రణ కూడా ఉంది!” అంటూ అందించాడు.

అతను అది తీసుకోకుండానే “ఉహుఁ, ఆ రెండుకాపీలూ నా దగ్గర ఉన్నాయి. నాకు మూడో ముద్రణ కాపీ కావాలి!”

“మూడో ముద్రణా? అసలది.. ఎందుకు? తేడా ఏముంటుంది ఎన్నో ముద్రణ అయినా?”

“అందులో ముగింపు వేరే ఉంటుంది. మీరు చదివారా ఆ నవల?”

“ఆ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళెవరూ దీన్ని చదవకుండా ఉండి ఉండరు. బాగా హిట్‌ అయిందిలే!”

“ముగింపు గుర్తుందా మీకు?”

“ట్రాజెడీయే! అసలందుకే ఆరోజుల్లో అందరికీ అంత నచ్చిందని నా అనుమానం!” గుర్తుతెచ్చుకుంటున్నట్టూ, గుర్తు చేస్తున్నట్టూ చెప్పాడు దిగులు నిండిన గొంతుతో “శిరీషకి అన్ని రకాల సాయాలూ చేస్తుంటాడు అనంత్‌ ఆమెకి తెలియకుండానే! ఆమెతో పాటు అతని స్నేహితులూ కుటుంబమూ అందరూ అపార్థం చేసుకుంటారు. తన సంతోషం కోసం కార్తీకే ఇవన్నీ చేస్తున్నాడని నమ్మి అతన్ని ప్రేమిస్తుంది శిరీష. అనంత్‌ తన ప్రేమని ఆమెకి చెప్పలేడు చెప్పినా నమ్మదు కనక. కార్తీక్‌ శిరీషని చేసుకుంటాడు. ఎంత అన్యాయం! ఇక ఎప్పటికీ ఆమెకి నిజం తెలియదు కదా! కనీసం తన కోసం అతను పడ్డ శ్రమా, కష్టం, చేసిన త్యాగాలూ ఆమెకి చివరికన్నా తెలిస్తే, తెలిసినట్టు అతనికి తెలిస్తే.. ప్చ్‌! అతను చిరునవ్వుతో అదంతా భరించటం మరింత విషాదకరం! చదివిన దగ్గరనుంచి ఎంత బాధో చెప్పలేను. ఒక్కోసారయితే అర్థరాత్రి మెలకువ వచ్చేది. ఆయ్యో పాపం అనిపించేది. దాని గురించి ఏమీ చేయలేకపోవటం ఇంకో బాధ!”

“అదేమిటో ఈ రోజుల్లో ట్రాజెడీ అంటేనే ఎవరూ ఇష్టపడటల్లేదు. అంతా సరదాగా, హాస్యంగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఈ కాలం కుర్రాళ్ళు నవలలే చదవటం లేదనుకుంటే ఎప్పటిదో పాత పుస్తకం చదివి అందులో ఏదో పాత్రకి అన్యాయం జరిగిందని బాధపడటం చూసి నవ్వొస్తోంది!”

“మీకర్థం కాదు లెండి! మీకెప్పుడన్నా కథో, నవలో చదివేప్పుడు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయా? ఇన్ని పుస్తకాలు ఉన్నాయి మీ షాపులో ఎప్పుడన్నా చదివి చూడండి తెలుస్తుంది.”

“కళ్ళజోడు లేకుండా చదివినప్పుడల్లా నీళ్ళు తిరగడటమేం, కళ్ళు పీకుతాయి కూడా” అంటూ ఆయన నవ్వి “ముందు కూచుని మాట్లాడుకోవచ్చు రా బాబూ!” అని తన టేబుల్‌వైపు దారి తీశాడు. బయట ఇంకా గాలిగా ఉంది. ఇద్దరూ కూచున్నాక పుస్తకాల వైపు చూసుకుంటూ చెప్పాడు.

“ఆ పాత పుస్తకాలన్నీ నా స్వంత కలెక్షనే!”

“నిజమా?”

“అవును. అన్నీ చదువుదామని ఎంతో ఆశగా కొనుక్కున్నవే! పుస్తకాల షాపుల్లో ఏమిటి, అద్దె పుస్తకాల వాళ్ళనించేమిటి.. ఆఖరికి పుస్తకాలని తూకానికి కొనేవాళ్ళనించి కూడా వదలకుండా పిచ్చిగా కొనేవాడిని. ఫ్రండ్స్‌కైనా, చుట్టాలకైనా ఒక్క పుస్తకం అరువిచ్చేవాణ్ణి కాదు మళ్ళీ తిరిగిరాదని. పిల్లలూ, సంసారమూ, ఉద్యోగమూ వీటితో చదవటానికి నాకు మాత్రం టైమెక్కడ దొరికేది? ఆపైన ఏదో ఒకటి రాయాలనే తపన ఒకటీ. పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాక, రిటైరయ్యాక చదవటం మొదలుపెట్టాక అర్థమయింది ఈ జన్మకు ఇవన్నీ చదవటం అయ్యే పని కాదని. సరే, కాలక్షేపం అవుతుంది వచ్చే పోయేవాళ్ళతో అని ఈ షాపు మొదలుపెట్టాను. పుస్తకాలు కొనే అలవాటు ఇక ఎప్పటికీ మానుకోనక్కర్లేదు కూడా!” అని నవ్వాడు.

“సారీ, పుస్తకం దొరకలేదని నేను బాధలో ఉంటే మీరు ఎగతాళి చేస్తున్నారని ఏదో అన్నాను.”

“అసలది మూడో ప్రింట్‌కొచ్చిందని ఎవరు చెప్పారు? నాకు తెలిసినంతవరకూ రాలేదే!”

“దాని గురించి చాలా రీసెర్చ్‌ చేశాలెండి. ఆ నవల చదివి ఇట్లాగే బాధపడుతుంటే మా ఫ్రండ్‌ వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆ నవల వచ్చిన కొత్తల్లో తను కూడా నాలాగే చాలా బాధపడి ఆ రైటర్‌కి ఉత్తరం రాస్తే ఆయన బదులిచ్చాడట ఇట్లాగే చాలామంది రాస్తున్నారు, తర్వాత వచ్చే మూడో ముద్రణలో ముగింపు మార్చుతున్నానని. తర్వాత ఒక లిటరరీ మీట్‌లో అడిగితే ఒక పాతకాలం రచయిత చెప్పారు మూడో ముద్రణ కాపీ తాను చూసినట్లే గుర్తుందని. ఆ ఆర్కే మూర్తి గారిది అదొక్కటే నవల. తర్వాత ఆయన ఏమై పోయారో తెలియదు. ఆ పబ్లిషర్స్‌ కూడా బిజినెస్‌లో లేరు.

ఎన్ని లైబ్రరీలు, పాత పుస్తకాల షాపులు వెతికానో! ఆబిడ్స్‌ రోడ్డు నుంచి వేటపాలెం లైబ్రరీ దాకా దేన్నీ వదల్లేదు. చివరికి ఎవరో మీ షాపు పేరు చెప్పారు.”

“అసలు మూడో ప్రింటే రాకపోయుంటే? అయినా ఏదో రొమాంటిక్‌ నవల పట్టుకుని..”

“సీరియస్‌ నవల అయితే మనకి ముందే తెలుసు, ఎవరో చావడమో, అంతా అన్యాయమయిపోవడమో జరుగుతుందని. దానికి సిద్ధపడే ఉంటాం కనక బాధేముంది?”

ఆయన ఏదో అనబోయేంతలో బయటనించి “హెయ్‌, హెయ్‌, హేయ్య, హేయ్య!” ఎద్దుల్ని అదిలిస్తూ తోలుతున్నట్టు చప్పుళ్ళూ, లిక్కలు వేస్తూ పదేళ్ళపిల్లాడు వచ్చి ఆగాడు. మాసిన జుట్టూ, వడలిన మొహమూ, మూడు గుండీలు ఊడిన చొక్కా, చేతిలో వైర్ల హోల్డర్లో టీగ్లాసులూ.

“టీ అండీ టీ కావాలా?”

“రెండు గ్లాసులియ్యి” అనగానే రెండు గ్లాసులు తీసి టేబుల్‌ పైన పెట్టాడు.

“వద్దండీ నాకు..” అంటూ మొహమాటపడబోయాడు కుర్రాడు.

“ఫర్లేదులే, తాగు బాబూ!” అని చెప్పి “ఏంట్రా బుజ్జిగా సంగతులు? ఏమిటి హుషారుగా ఉన్నావు?”

“ఎద్దులు మళ్ళీ కొంటానన్నాడు మానాన! ఇంక రెండు తడవలు గట్టిగా వానలు పడితే ఏముందిరా కొనుక్కొచ్చుకుందాం అన్నాడు. కొత్తయి కాదు మనం అమ్మినయ్యే తిరిగి తెచ్చుకుందామంటే సరేనన్నాడు. బయట మబ్బులు చూడు బెమ్మాండంగా పట్టినయ్యి. ఇయ్యాల వాన దంచి కొట్టుద్ది.”

“మరి నువ్వు ఇంకా ఇక్కడే పని చేస్తావా?”

“ఎద్దులొత్తే ఇంకెందుకుంటాను నేను. కొనేప్పుడే నన్ను తీస్కెలతాడుగా!” జవాబు చెబుతున్నా వాడి మెరిసే కళ్ళు బయట ఆకాశం వంకే ఉన్నాయి.

“అయితే ఇంటికి వెళ్ళినా స్కూలుకి వెళ్ళవన్న మాట!”

సిగ్గుగా నవ్వాడు. “ఇంక బడి లేదూ ఏమీ లేదు. అరక నేర్చుకుంటాగా!”

“దగ్గరలోనే పల్లెటూరు. పంటలు పండక పొట్ట గడవక వీణ్ణి ఇక్కడ పెట్టారు” అని చెప్పాడు ఆయన ఆ పిల్లాడి వంకే చూస్తున్న కుర్రాడికి.

“అయితే ఏమంటున్నాడ్రా మీ వోనరూ?”

“పుస్తకాల కొట్టు మూర్తిగారి దగ్గర డబ్బులు రావాల తీసుకురారా అన్నాడండి!”

“ఇదుగో ఈ యాభై లెక్కలో వేసుకోమను. ఈ అయిదూ నువ్వుంచుకో!” అంటూ జేబులోంచి తీసి ఇచ్చాడు.

బుర్రలో ఏదో తట్టింది ఆ కుర్రాడికి. “కొంపదీసి ఆ నవల రాసిన ఆర్కే మూర్తిగారు మీరేనా?” ఆశగా, ఆత్రంగా, సంభ్రమంగా అడిగాడు.

ఆయన నవ్వాడు. బయట ఒక మెరుపు మెరిసింది. ఏదో చెప్పటానికి నోరు తెరిచి ఎక్కడో పిడుగు పడటంతో ఆగిపోయాడు.

“అర్జునా అర్జునా” అనుకుంటూ బుజ్జిగాడు బయటికే చూస్తున్నాడు.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...