ఇసక- 4

భాస్కర కుమార్‌ ఆ చెయ్యి పట్టు విడిపించి ‘రండింకెల్దాం రండి’ అంటే అందరూ పదండి పదండి అని మెట్లు దిగిపోయేరు. దొడ్డ చివరిసారిగా చిన్నమ్మలుతో వాళ్ళత్తగారితోటీ ‘శుక్ర వారం మంచిది అవేల్టికి ఇల్లిచ్చీయండి! ఇల్లు కడిగించుకోవాలీ?’ అని అనుమానంగా బతిమాలుతుంటే చిన్నమ్మలు ‘ఆఁ అలాగేలే!’ అన్నట్టు తిరస్కారంగా తలెగరేస్తుంటే. ఆతీ గౌరీశంకరు అలాగే నవ్వు మొహం తోటే జాబిరీ గడియా వేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళందర్నీ చూస్తూ నిలబడ్డాడు. పొట్టప్పారావు జట్టు లారీలో ఇసకలో బోర్లించిన గమేళాల మీదెక్కి కూర్చున్నారు. డ్రైవరు గారు ఇసకపంతులు గారు కేబిన్లో కూర్చుని బండి రివర్స్‌ చేసుకుంటుంటే, బేకుగాడు హైమవతి గారు క్రిష్ణ బావ అందరూ ఒక్కసారి పెట్రోలు పొగలు కక్కుతూ బయల్దేరిపోతుంటే భాస్కరకుమార్‌ కి ఇసక పంతులు గారికీ అక్కిరెడ్డి పాలెం జట్టుకీ ‘థేంక్స్‌’ అని ఎలా చెప్పాలి అని గుద్దుకున్నట్టుగా వుంది. అతనికి ప్రతి చిన్నదానికీ అయిందానికీ కాందానికీ Thank you so……much! O Gee … Oh… THANKS!! అని ఇలాగంటం బాగా అలవాటయిపోయింది. ఇక్కడ కోరీ లారీ జట్ల లోకంలోన అలాటి మర్యాద లేదు. ఉపకారాలకి థేంక్స్‌ లు లేవు. అపచారాలకి స్వారీలు లేవు. అసలు ‘థేంక్స్‌’ కి సరిపడిన మాటే లేదు. ఆ సందేహాన్ని తీరుస్తూ దొడ్డ నవ్వు మొహంతో లారీ కేబిన్లోకి మెడలెత్తి చూస్తూ “రండి కాపీ తాగీసి వెళిపోదురుగాని నానా మంచి కాఫీ హొటేలుకి పదరా! పార్టీ! …రండి!” అని ఇసక పంతులు గార్ని, అందర్నీ ఆహ్వానించింది.
జైత్ర యాత్రకి వెళ్ళే కాన్వాయ్‌ లాగ బీచీలోకి నడిపించి “మంచి గ్రేండ్‌ గా …. ఇప్పుడు గ్రీన్‌ పార్క్‌ అంటారు…?!” అని విజయోత్సవానికి జాగా కోసం వెతుకుతోంది. భవతారిణి గుడికి దూరంగా ఒక మళయాళీ టీ పార్లర్‌ దగ్గిర హైమవతి గారికి సంజ్ఞలు చేసి కారు ఆపించేడు. ఆ వెనకాలే అందరూ దిగితే దొడ్డ “ఇదా…ఇక్కడా? ఇది మంచిదేనూ…?” అని నసుగుతున్నాది. పార్లర్‌ చూట్టూ సముద్రపు ఇసకలోన తెల్లవి ఎర్రవి ప్లాష్టిక్‌ కుర్చీలు వేసుంటాయి. అందరూ ఫుట్‌ పాత్‌ మెట్లు దిగొచ్చి ఆ కుర్చీల్లో కూర్చుంటే దొడ్డ కూడా ఇంక దిగొచ్చి పొత్తి పంచ చెంగు పొద్దున్న సముద్రం మీంచి నెమ్మదిగా వీచే గాలికి జండా లాగ ఎగిరి పడుతుంటే “ఇదుగో బాబూ ఎవరిక్కడ……. కాఫీలా టీలా..?” అని లోపలికి కేకేసింది. పొట్టప్పారావు ఒక కుర్చీలో కూర్చున్నాడు గాని కోరీ లారీ జట్టు ఎవరెంత చెప్పినా కుర్చీల్లో కూర్చోకుండా పిట్టగోడల మీదే కూర్చున్నారు. ‘ఇక్కడే బాగుంటాది!’ అన్నారు. ‘ఎవరెవరికి ఏఁవిటేఁవిటి కావాలో మొహమాటం పడకుండా తినండి తెలిసిందా ఇవాళ నేను మీకందరికీ టీ పార్టీ!” అని దోశలు కాఫీలు ఇడ్లీలు తెప్పిస్తున్నాది. ఇసకలోకి చూస్తూ కూర్చున్న గోపాల్ని చూస్తూ భాస్కరకుమార్‌ ఇన్నిరోజులూ పొద్దున్నే కనిపించిన ఆతీ ప్రకాష్‌ ఇంక తనకి పొద్దుట లెగ్గానే లేడు కదా అని తల్చుకుంటూ చిక్కటి మీగడ మరకల కాఫీ ఊదుకుంటున్నాడు

ఆతీ ప్రకాష్‌ ఖాళీ చేసిన జాగా లోకి ఇప్పుడు వేరే ఏవో తనకి ఎప్పుడూ ఉండేవి వస్తున్నాయి. వాళ్ళందర్నీ, తన వాళ్ళందర్నీ చూస్తూ. వేట తెచ్చుకున్న పెద్దపులి లాగ తృప్తిగా దోశ తెంపి తింటూ ఇసకపంతులు గారు గ్లాసులో నీళ్ళు మొహం మీద చిలకరించుకుని తువ్వాలతో తుడుచుకుంటూ డ్రైవరు గారు క్రిష్ణ బావ వేడి పూరీని వేలితో పొడిచి సంతోషిస్తూ బేకుడు తదుపరి యుద్ధానికి ఒక టీతో సిద్ధం అవుతున్నట్టు ఆత్రంగా వాచీ చూసుకుంటూ హైమవతి గారు ముక్కు నలుపుకుంటూ ఆనందంగా ఆతీవోడు ఖాళీ అయిపోయిన భవిష్యత్తును అప్పుడే ఊహల్లోనే నిర్మించుకుంటూ దొడ్డా ఈ పరాయి అనుభవంలో తాము ఎప్పుడూ ఆగని ఈ హోటల్‌ పరిసరాల్నీ ఎదురుగా పెద్ద ఇళ్ళనీ వినోదంగా విచిత్రంగా చూస్తూ కోరీ జట్టూ ఇసకలోకి చూస్తూ తనలో తనే నవ్వీ నవ్వనట్టు నవ్వుకుంటూ నందగోపాల్‌. ఇక్కడ్నించి ఎదురుగా చెవిటి రాణీ భవంతుల వెనక చిన్న కోటల్లాగ ఉండే ఎపార్ట్‌ మెంట్ల మధ్యలోంచి చూస్తే రెల్లి వీధి పాత జాలారి పేట కొత్త జాలారి పేట అక్కడక్కడ కనిపిస్తాయి. అవన్నీ వెళ్ళి స్వేచ్ఛగా తిరగడానికీ కనీసం ఒక పది రోజులైనా ఇవన్నీ వచ్చి చూసుకోడానికీ ఆతీ ప్రకాష్‌ తనకి ఇబ్బందిగా అడ్డం పడ్డాడు పొద్దుట లెగ్గానే. అందుకే అతని ఇంటి మీదికి దండయాత్రకి వెళ్ళేనా అని అనుకున్నాడు. దొడ్డకీ ఆతీవోడికీ చిన్నమ్మలుకీ ఆ యుద్ధం ఎందుకు ఎలా మొదలయింది? ఇవేళ అది ఇలా చిత్రంగా ఎలా ఆగిపోయి ఈ విజయోత్సవానికి ఎలా వొచ్చేరు? ఇదంతా ఇసక పంతులు గారి పరాక్రమమేనా? లేక తన వ్యూహ రచనా చతురతా? కాక ఆతీ ప్రకాష్‌ మనసు కరిగిందా చెదిరిందా?! ఆతీ వోడనీసి అసలు ఎవరు…? అని ఇలాటి అలలు నురగ వస్తున్నాయి ఇప్పుడు అతను ఖాళీ చేసిన జాగాలోకే!

అది ఆగిపోయినా ఇంక ఎవరివీ ఏ యుద్ధాల్లోకీ చొరబడకుండా, లాగబడినా యుద్ధం చేసినట్టుగే ఉంటూ నూనె చేతుల్లోంచి పిత్త పరిగె లాగ జారిపోయినా ఒక యుద్ధం మిగిలే ఉంటుంది. తనతో తనే చేసుకొనే యుద్ధం. ఆకాశవాణి సిమెంటు అరుగుల మీద సోడాబుడ్డీ కళ్ళద్దాల్లోంచి ఊర్నీ సముద్రాన్నీ జీడి తోటల్లోకి జేగురు రంగు వానల్నీ చూస్తూ గోపాల్‌ ఈ యుద్ధాన్నే చేస్తాడు. ‘ Indian Airlines ఉడాన్‌ ఏక్‌సౌ నబ్బీస్‌ పర్‌ ఆప్‌ కా స్వాగత్‌ హై! నమష్కార్‌ ! ‘ అని పెదాలకి దట్టమైన ఎర్రటి లిప్‌ష్టిక్‌ వేసుకుని నవ్వే ఆవిడ్ని చూస్తూ పక్కన కూర్చున్నావోడి తోటి ‘ఇండియా షైనింగ్‌ మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని ఇలాటివి మాటాడేటప్పుడూ భాస్కర కుమార్‌ కూడా రహస్యంగా ఈ యుద్ధమే చేస్తాడు. ఈ రణ స్థలం లోన ఊహలూ ఊహలే ఒకదాంతో ఒకటీ తలపడి గొప్ప రోషంతో ‘అఱఱఱఱ…లబ లబ లబ…’ మని సింహనాదాలు చేసుకుంటూ ఎక్కడ్నుంచో పరుగెట్టుకుంటూ వచ్చి ఒక దాంతో మరొకటీ కలబడి రక్తాలు కారే లాగ తలలు ఢీ కొట్టుకుని ఓడినవి తలలు పగిలి చచ్చి పడిపోతే గెలిచినవి ఱొమ్ములు బాదుకుంటూ పెడ బొబ్బలు పెట్టుకుంటూ ఇసకని పిడికిళ్ళతో ఎత్తి ఎగజిమ్మి కిందికి పోసుకుంటూ కొట్టుకునే భీకర సంగ్రామాన్ని ఆశ్చర్యంగా మిక్కిలి శ్రద్ధతోనూ చూసి ‘తనకి’ ఆ రహస్య సమాచారాన్ని అందించడానికి కొన్ని ఊహల్నే ఊహల మీద వేగులుగా పంపిస్తాడు. ‘ఊఁ! బుద్ధి కలిగి మసులుకోండి! అక్కడ జరిగే ప్రతీదీ … చీమ చిటుక్కుమన్నా ఏ వొక్కటీ వొదలకుండా అన్నీ ఎప్పటికప్పుడు నాకు చేరవెయ్యాలి! ఏమరిచారో….తలలు తెగుతాయి! జాగ్రత్త! అహ్హహ్హహ్హా!!’ అని ఆ గూఢ చారుల్ని ఆజ్ఞాపించి వెనక్కి చారబడి చూస్తూ. అప్పుడప్పుడు రెల్లి వీధి బష్టాపులో కూర్చోనుండగానో ఇమిగ్రేషన్‌ చెక్‌ దగ్గరతను తన మొహాన్నీ పాస్‌ప్త్లోరో ఫొటోనీ మార్చి మార్చి చూసేటప్పుడో హటాత్తుగా ఆ యుద్ధ వీరులూ వాళ్ళ గుర్రాలూ ఫిరంగులూ కత్తులూ కటార్లూ వేగులూ వాళ్ళ కేకలూ నవ్వులూ అందరూ ఎక్కడికో మాయం అయిపోతారు. అప్పుడు ఇసకే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఉన్నట్టే ఉండి ఆ ఇసక కిందనుండే ఎక్కడ్నుంచో కత్తులూ డాళ్ళూ దులుపుకుంటూ వస్తారని మళ్ళీ చిన్న చిరు సవ్వళ్ళు మొదలవుతాయనీ కనిపెట్టుకుని కూర్చోవాలి. చూసుకోకపోతే ఆ చిన్న చిరు సవ్వళ్ళే మంచి తియ్యని మాటలుగా మాటల కోటల్లోంచి కొన్ని మర్యాదలుగా తియ్యని మాటల మర్యాదలే సఖ్యంగా కొన్ని చేతలుగా అవి అలాగ చట్‌ మంటే పట్‌ మని చిరు అలకలుగానూ అలకలు జట్టీలు జట్టీలు జబర్దస్తీలు జబర్దస్తీలు వీధి భాగోతాలు భాగోతాలు చూస్తుండగానే పోరాటాలు పోరాటాలు యుద్ధాలూ అయి యుద్ధాలే భీకర సంగ్రామాల్లోకి దిగుతాయి కళ్ళెదుటే ఒక్క క్షణం లోనే ….సుమా జాగర్త! చెప్తునాను భాస్కరా ఇదీగోటి. *