గెలుపు

“అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. కంప్యూటర్లన్నీ మన ఆఫీసు సర్వర్‌తో కనెక్టయ్యాయి” చెప్పాడు శ్రీవాత్సవ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు మెహర్‌బాబాతో.

ఇరవైయేళ్ళుగా అమెరికాలో కంప్యూటర్‌ రంగంలో వివిధ స్థాయిల్లో పని చేసి, కొన్నాళ్ళు స్వంతంగా ఒక వైర్‌లెస్‌ టెక్నాలజీ కంపెనీని నడిపి, ఏడాది క్రితమే స్వదేశానికి తిరిగొచ్చాడు శ్రీవాత్సవ. సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని, డాలర్లలో జీతాన్ని వొదిలేసి ఇక్కడికెందుకొచ్చారని ఎవరైనా అడిగితే…జన్మభూమిపై మమకారంతో దేశసేవ చేయడానికి వొచ్చానని చెబుతాడు. దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రం అమెరికాలో కంప్యూటర్ల జోరు తగ్గి, ఇండియాలో అవకాశాలు పెరగడంతో…ఇంకాస్త సంపాదించుకోవడానికి తిరిగొచ్చాడు తప్పితే జన్మభూమీ, దేశసేవా ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు.

ప్రస్తుతం ఇద్దరూ మెహర్‌బాబా పర్సనల్‌ గదిలో రహస్యంగా సమావేశమయ్యారు.

“ఒక్క సారన్నా అన్ని టెస్టులూ చేశారా”అడిగాడు మెహర్‌బాబా.

“టెస్టులన్నీ అయ్యాయి. ఎవ్రీ థింగ్‌ ఈజ్‌ ఆల్‌రైట్‌. మీరేమీ వర్రీ కావద్దు. మీకిచ్చిన ఇన్స్ర్టక్షన్లు మీరు ఫాలో అయితే చాలు”

టేబుల్‌ మీది లాప్‌ టాప్‌ కంప్యూటర్‌ని చూస్తూ “మంచిది. మనమనుకున్నట్లు పనంతా కాగానే మిగిలిన డబ్బు మీ ఖాతాలోకి జమౌతుంది. కాస్త హడావిడి తగ్గాక మళ్ళీ కలుసుకుందాం” అన్నాడు మెహర్‌బాబా గోడ గడియారం వంక చూస్తూ.

రాత్రి పదిన్నరైంది.

“కాబోయే ముఖ్యమంత్రికి ముందస్తు అభినందనలు…”చేయి చాచాడు శ్రీవాత్సవ.

“నేను ముఖ్యమంత్రినౌతానా?!”అడిగాడు మెహర్‌, చెయ్యందించకుండానే.

పార్టీ గెలిచినా తనకు ముఖ్యమంత్రి పదవి దొరుకుతుందో లేదోనన్న సంశయం మెహర్‌ను ఇంకా పీడిస్తూనే ఉంది.

రాష్ట్రంలో సరైన నాయకుడు లేక, పార్టీ చుక్కాని లేని నావలా కొట్టుకు పోతున్న సమయంలో …హైకమాండు మెహర్‌బాబాను పార్టీ నాయకుడిగా నియమించింది. ఇరవై ఒకటో శతాబ్దంలో…అన్నీ ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ యంత్రాలతో జరిగే ఎన్నికలను ఎదుర్కోవడానికి మెహర్‌బాబా కంప్యూటర్ల వాడకాన్ని బాగా పెంచాడు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గపు కేంద్రాలలోని పార్టీ ఆఫీసుల్లో అత్యాధునిక కంప్యూటర్లను అమర్చి వాటన్నింటినీ రాజధాని నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించాడు. నియోజకవర్గంలోని వోటర్ల గురించీ, వాళ్ళలో వర్గాలగురించి, వర్గాల ప్రధాన సమస్యల గురించీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా, ఒక్కొక్క నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లోని పార్టీ కార్యాలయాల్లోనూ కంప్యూటర్లు పెట్టి, వాటిని నియోజకవర్గపు ప్రధాన కంప్యూటర్‌తో కనెక్ట్‌ చేశాడు.

ఈ వ్యవహారం పార్టీలో చాలా మందికి నచ్చలేదు. కంప్యూటర్లు కొనడానికి, వాటి ఆఫీసుల నిర్వహణకు పార్టీ నిధులన్నీ తగలేయకుండా…ప్రస్తుత ప్రభుత్వపు పని తీరు మీద మెజారిటీ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతని కాష్‌ చేసుకోవడానికి, సంప్రదాయకంగా ఎన్నికల్లో పాల్గొంటే మేలని, ఇది ప్రయోగాలకు సమయం కాదని పార్టీలో ఇతర నాయకులు చెప్పి చూసారు. వాళ్ళ ఉద్దేశ్యంలో సంప్రదాయకంగా అంటే…వోటర్లకు మందు పోసో, డబ్బిచ్చో, దౌర్జన్యం చేసో ఓట్లు సంపాదించడం…వీలైన చోట్ల శక్తి కొద్దీ రిగ్గింగులకు ఏర్పాట్లు చేసుకోవడం!

మెహర్‌ వింటేగా?! డబ్బిచ్చి ఓట్లు కొనడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమనీ, అసలే మద్యపాన నిషేధం మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచుకుని ఓటర్లకు మందు పోయించడం తగదని గూండాలతో రిగ్గింగ్‌ చేయించి గెలిచే గెలుపు గెలుపు కాదనీ…ప్రజాభిమానంతోనే పీఠం ఎక్కాలనీ ప్రకటించాడు. ఆ ప్రకటన మెహర్‌బాబా సొంత వర్గంతో సహా, మిగిలిన నేతలకూ రుచించలేదు. అయినా అప్పటికి చేసేదేమీ లేక…ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు ” సంప్రదాయకం” గా ఎన్నికల్లో పాల్గొనడానికి పథకాలు రచించుకున్నారు. ఏ పథకం ఎలాంటి ఫలితాలనిస్తుందో మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది!

“మీరూ, మీ పార్టీ గెలుస్తుందని పందెం…ఎంతకైనా నేను రెడీ” నవ్వాడు శ్రీవాత్సవ, చాచిన చేతిని వెనక్కి తీసుకుంటూ.

మెహర్‌బాబా కూడా నవ్వి, ఇక బయటకు వెళదామన్నట్లు గది తలుపులు తెరిచాడు.

అంత రాత్రయినా గది బయటంతా కోలాహలంగా ఉంది. ఎన్నికల్లో నిలబడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉంది. ఒకట్రెండు ఎక్సిట్‌ పోల్స్‌లో ఈ సారి ప్రతిపక్ష పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలడంతో, అందరూ మెహర్‌బాబా ఇంటి దగ్గర చేరారు. ఎన్నికలు అయిపోయి కూడా వారమయ్యే సరికి…అలసట తీర్చుకున్న కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా రేపు వెలువడబోయే ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారు.

శ్రీవాత్సవకు వీడ్కోలు చెప్పి, పార్టీ నాయకులతో మాటల్లో పడ్డాడు మెహర్‌. ఎక్కడెక్కడ పార్టీ గెలుస్తుంది, మొత్తం ఎన్ని సీట్లు రావొచ్చు, ఎక్కడెక్కడ నువ్వా నేనా అన్నంత పోటీ ఉంది… ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నారంతా.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

మెహర్‌ వాళ్ళింట్లోనుంచి బయటకొచ్చిన శ్రీవాత్సవ, సరాసరి తన ఆఫీసుకు వెళ్ళాడు. అలర్ట్‌గా ఉన్న సెక్యూరిటీ గార్డులను విష్‌ చేసి, తన ఛాంబర్‌ వైపు నడిచాడు.

ఆఫీసులో ఎవరూ లేరు. సన్నగా వినిపించే ఏ.సీ. చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్న ఆఫీసే మరో కొన్ని గంటల్లో, ఒక అద్భుతానికి తెర తీయబోతోందంటే ఎవ్వరూ నమ్మరు.

శ్రీవాత్సవ తన కంప్యూటర్‌ ముందు కూర్చుని, ఇంటెర్నెట్‌లో తన బేంకు అకౌంట్‌ చూసుకున్నాడు. ఇప్పుడున్న మొత్తానికి రేపు అందబోయే డబ్బును కలిపితే ఎంతవుతుందో, కాలిక్యులేటర్‌లో లెక్కలేసుకున్నాడు. రూపాయలను డాలర్లలోకి మార్చి చూసుకుని, సంతృప్తిగా కుర్చీలో వెనక్కి చేరగిలపడి, కళ్ళు మూసుకున్నాడు.

నిమిషం తర్వాత దిగ్గున లేచి…ఎలక్షన్‌ ఫలితాల మీద పందేలు స్వీకరించే వెబ్‌ సైటుకు వెళ్ళాడు.

మారు పేరు మీద ఒక అకౌంటు తెరిచి, ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్‌లో గెలుస్తుందని తను ఇరవై ఏళ్ళుగా అమెరికాలో కూడబెట్టిన డబ్బంతా పందెంకాశాడు. అంత పెద్ద మొత్తంలో పందెం వొచ్చినప్పుడు, ఆ పందేనికి సరిపడా వ్యతిరేకంగా ఎవరైనా పందెం కాస్తేనే… ఆ సైటు వాళ్ళు ఇతడి పందేన్ని స్వీకరిస్తారు. తర్వాత ఒక ధృవీకరణ ఈమెయిల్‌ పంపి, వెంటనే శ్రీవాత్సవ బేంకు అకౌంటు నుంచి డబ్బును పందెం నిర్వహకులు తమ అకౌంటుకు బదిలీ చేసుకుంటారు. ఎలక్షన్‌ ఫలితాలు వెల్లడయ్యాక, పందెం గెలిచిన వాళ్ళ అకౌంట్లలోకి గెలిచిన మొత్తాన్ని జమ చేస్తారు, పందెం సైటు వాళ్ళు. సైటు వాళ్ళు గెలిచిన వాళ్ళకొచ్చే దానిలో నుంచీ కొంత పర్సెంటేజ్‌ సర్వీస్‌ చార్జ్‌గా వసూలు చేస్తారు.

చాలా పెద్ద మొత్తంలో పందెం కాయడంతో వెంటనే కన్ఫర్మేషన్‌ రాదని తెలుసు. అయినా ఈమెయిల్‌ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

సరిగ్గా అదే సమయంలో శ్రీవాత్సవ కంటే చాలా ఎక్కువ మొత్తంలో మరో వ్యక్తి పందెం కాశాడు రాష్ట్రంలో అధికార పార్టీ గెలుస్తుందని…ఆ గెలవడం కూడా మూడింట రెండొంతుల మెజారిటీతోనని.

పందెం మొత్తాన్ని చూసి సైటు నిర్వాహకులకు ఆశ్చర్యపోయారు. పందెం కాసిందెవరో గానీ గెలిస్తే మాత్రం…కనీవినీ ఎరుగని జాక్‌పాట్‌ కొట్టినట్లేననుకున్నారు. సర్వేలన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో…అధికార పార్టీ గెలుస్తుందని కాసిన ప్రతి రూపాయికి, ఆ పార్టీ గెలిస్తే పన్నెండు రూపాయలొస్తుంది.

వెంటనే వాళ్ళకు బాగా తెలిసిన పెద్ద కస్టమర్లకు ఫోను చేసి…ఆసక్తి ఉంటే పందెం కాసుకోవొచ్చని చెప్పారు.

ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ యంత్రాల్లో…చిప్పులలో నిక్షిప్తమైన నేతల భవితవ్యాలు, సాయుధ పోలీసుల కాపలా మధ్య కౌంటింగ్‌ కేంద్రాల్లో బద్ధకంగా నిద్రిస్తున్నాయి.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

రెండేళ్ళ క్రితం రాష్ట్రమంతా ఎలక్ట్రానిక్‌ యంత్రాలతోనే పోలింగ్‌ జరగొచ్చని వినగానే శ్రీవాత్సవకు ఒక చిన్న ఆలోచన వచ్చింది.

ఒక తెలుగు సంఘం వార్షికోత్సవంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళిన మెహర్‌బాబాను కలిసి తన ఆలోచన చెప్పాడు.ఇద్దరూ కలిసి ఆ పనిలో ఉండే సాధక బాధకాల గురించి చర్చించారు. మూడు నెలలపాటు అన్ని కోణాల్లోంచీ ఆలోచించారు.

ఆలోచనలకు రూపమివ్వడానికి మెహర్‌ తగినంత ఆర్థిక, రాజకీయ సహాయం చేస్తానన్నాడు. ఫలితాలు అనుకున్న విధంగా వొస్తే, చాలా పెద్ద మొత్తాన్ని శ్రీవాత్సవకు ఇస్తానన్నాడు.

అమెరికాలో కంపెనీని అమ్మేసి, ఇండియా వొచ్చేశాడు శ్రీవాత్సవ.

వోటింగ్‌ పరికరాలు తయారు చేసే కంపెనీలో ఒకరిద్దరు పైస్థాయి అధికారులకు, ఇంజనీరులకు పెద్ద మొత్తం ఆశగా చూపించి, తమ వైపుకు తిప్పుకున్నారు. తాము చేస్తుంది మరెవరికీ తెలిసే అవకాశం లేదని నమ్మించారు. కంపెనీలో పని చేసేవాళ్ళు, తాము మరో జన్మనెత్తినా చూడలేనంత డబ్బు ఎదురుగా కనిపించడంతో వాళ్ళూ పెద్దగా బెట్టు చేయలేదు.

వోటింగ్‌ యంత్రాల్లో శ్రీవాత్సవ సూచించిన ఒక చిన్న మార్పు చేయడానికి ఆ విధంగా తొలి అంకం పూర్తయింది.

సాంకేతికంగా ఎలా చేయాలో తెలియడం ఒక ఎత్తు. దానిని పక్కాగా, పధకం ప్రకారం రహస్యంగా అమలు పరచడం మరో ఎత్తు.

వోటింగ్‌ యంత్రాల పరిశోధన మరియు వికాసం, తయారయ్యే ఫేక్టరీలు, నాణ్యత నిర్థారించే విభాగాలలో పని చేసే సిబ్బంది వివరాలు సంపాదించారు.

అందులో ఎవరు ఎలాంటి వారు, ఎవరు దేనికి లొంగుతారు…ఎవరు అస్సలు దేనికీ లొంగరు…లాంటి సమాచారం సేకరించారు. లొంగే వాళ్ళనే సంప్రదించారు. లొంగరనుకున్న వాళ్ళ జోలికి అస్సలు పోలేదు.

ఈ పనుల్లో ఒక వేళ పట్టుబడినా, డబ్బుంటే తప్పించుకునేందుకు సవాలక్ష మార్గాలుంటాయని ఆ ఉద్యోగులకు అధికారులకూ బాగా తెలుసు. అందుకే అడిగిందే ఆలస్యమన్నట్లు, వీళ్ళు చెప్పిన పనులు చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.

అయినా ఇరవై ఒకటో శతాబ్దంలో డబ్బుతో సాధించలేనిదేముంది, అదీ మన దేశంలో!

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

ఉన్న సర్క్యూట్‌కు అదనంగా ఒక వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిటర్‌ రిసీవర్‌ చిప్పును, ఆ చిప్పును మెమొరీకి అనుసంధానించే మార్పులను చేసినందుకు అంత పెద్దమొత్తాన్ని ఇస్తామన్నారు. ఈ మార్పులతో ఎవరికీ హాని తలపెట్టమనీ, ఖచ్చితమైన ఎలక్షన్‌ సర్వే ప్రకటించి ఒక పేపరు సర్క్యులేషన్‌ పెంచడమే తమ ఉద్దేశ్యమని వివరించారు. ఒప్పందం ప్రకారం మాకివ్వాల్సిన డబ్బు మాకిస్తే, నువ్వా మార్పుల్ని ఎలా ఉపయోగించుకున్నా వియ్‌ డోంట్‌ కేర్‌ అనుకున్నారు ఆ కంపెనీలో వీళ్ళ తరఫున పని చేస్తామన్న వాళ్ళు.

క్వాలిటీ కంట్రోల్‌ విభాగం కళ్ళు కప్పడానికి, రెండు మెషిన్లను టెస్టింగ్‌ కోసం బయటకు తేవడానికి మరికొంత మొత్తం ఖర్చైంది.

ప్రతి నియోజకవర్గంలోనూ, ఓట్ల లెక్కింపు జరిగే సెంటర్లకు కిలోమీటరు లోపు దూరంలో ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబడ్డ కంప్యూటర్లనుంచి ప్రసారమయ్యే కొన్ని నిర్దిష్టమైన ఆఙ్ఞలు…వోటింగ్‌ యంత్రాలను చేరి, వివిధ పార్టీలకు లభించిన ఓట్ల వివరాలను కంప్యూటరుకు పంపుతుంది. పార్టీ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఓట్ల వివరాలను రాష్ట్ర రాజధానిలో శ్రీవాత్సవ ఆఫీసులోని ఫార్చూన్‌ సర్వర్‌కు చేర వేస్తుంది.

ఇదంతా అర్థరాత్రి పన్నెండు గంటలకు మొదలౌతుంది. ఫార్చూన్‌ సర్వర్‌కు చేరిన ఓట్ల వివరాలను శ్రీవాత్సవ కేవలం చూడగలడు. మెహర్‌బాబా అయితే వివరాలను చూడగలడు, తనకు నచ్చినట్లు ఓట్ల సంఖ్యలను మార్చగలడు(రేద్‌వ్రితె అచ్చెస్స్‌. ఒక పార్టీ ఓట్ల సంఖ్యకు కొన్ని ఓట్లు కలపడం అదే సంఖ్యలో మరో పార్టీ ఓట్లను తగ్గించడం…లెక్కించే ఓట్లు పోలైన ఓట్ల సంఖ్యకు సరిపోయేలా చూడ్డం అయ్యాక(నిజానికి ఇదంతా మెహర్‌బాబా కంప్యూటర్‌లో ఉన్న ఒక ప్రోగ్రాం చేస్తుంది)…ఒక చిన్న బటన్‌తో సమాచారాన్ని కంప్యూటర్‌ నుంచి ప్రసారం చేస్తే ఆ సమాచారం నియోజకవర్గపు కేంద్రాల్లోని నిర్దిష్టమైన కంప్యూటర్‌ను చేరి…అక్కడినుంచీ వోటింగ్‌ యంత్రాలకు ప్రసారం చేయబడుతుంది. వోటింగ్‌ యంత్రాల్లోని వైర్‌లెస్‌ రిసీవర్లు ఆ సమాచారాన్ని అందుకుని, మెమొరీలో అంతకు ముందున్న ఓట్ల సంఖ్యలను తుడిపి వేసి…కొత్త అంకెలను వ్రాస్తాయి.

కంప్యూటర్‌ నుంచీ వోటింగ్‌ యంత్రాలకూ, అక్కణ్ణుంచీ మళ్ళీ కంప్యూటర్‌కు, కంప్యూటర్ల నుంచీ ఫార్చూన్‌ సర్వర్‌కు, అక్కణ్ణుంచీ…ఈ గొడవంతా లేకుండా, ఏకంగా వోటింగ్‌ యంత్రాల్లో ఉండే ప్రోగ్రాములోనే మనక్కావల్సిన మార్పులు చేసుకుంటే సరిపోతుందికదా అనీ ఆలోచించారు. కానీ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైనా కోర్టుకు వెడితే, కోర్టు ఆ ప్రోగ్రామును పరీక్షింప జేస్తే …మొదటికే మోసం! అందుకే ఆ మార్గాన్ని వొదిలేశారు.

అయితే…ఎంతా పకడ్బందీగా వున్నా…వోట్ల వివరాలు ముందస్తుగా శ్రీవాత్సవకు కూడా తెలియడం రాజకీయ నాయకుడు మెహర్‌కు ఇష్టం లేదు.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

అదలా ఉంచితే …మెహర్‌బాబా తనకు కావలసిన వాళ్ళను, ఇష్టమొచ్చినంత మెజారిటీతో గెలిపించగలడు. ఒకరకంగా…తన పార్టీని పార్టీలోని తన విధేయ వర్గాన్ని గెలిపించుకుని, తనే రాష్ట్రాధినేత కావొచ్చు. ఒక్కసారి రాష్ట్రం కళ్ళేలు చేతిలోకొస్తే డబ్బెంత సేపు?! కాస్త పెట్టుబడి ఎక్కువైనా లాభసాటి వ్యాపారం!

కానీ, ఎన్నాళ్ళు తను ముఖ్యమంత్రిగా ఉండగలడు? ఎంత తన వర్గమే గెలిచినా… అసమ్మతినేతలు అగ్గి పెట్టకుండా ఉంటారా? ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టకుండా ఉంటారా? ఈ పదవులు, అధికారాలు చాలా తాత్కాలికం…అలా అనుకుంటే జీవితంకూడా.

ఎక్కడ జీవితాన్ని మొదలెట్టి ఎక్కడ తేలాడు? ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, డిగ్రీ చదివే రోజుల్లో ఒక అతివాద పార్టీ వైపు ఆకర్షితుడై, కొంత కాలమయ్యేక ఆ పార్టీలో ఇమడలేక ఇప్పుడున్న పార్టీలో చేరాడు. క్రొత్తల్లో నీతిగా పూర్తిగా మడిగట్టుకు కూర్చున్నా…రానురాను సమకాలీన రాజకీయ నాయకుల దారిలో నడవక తప్పలేదు. నీతి, నిజాయితీ, ప్రజలకు సేవ చేసే స్వభావంతో బాటు…రాజకీయాల్లో డబ్బుకు అపారమైన విలువుందన్న వాస్తవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక, మిగిలిన ప్రజా నాయకులంత విచ్చలవిడిగా కాకున్నా తనూ బాగానే సంపాదించాడు. అయినా మెహర్‌కు జనాల్లో మంచి పేరే ఉంది. డబ్బులు తిన్నా పనులు చేసిపెడతాడనీ… మిగిలిన వాళ్ళతో పోలిస్తే కాస్త బెటరనీ. ఒకట్రెండు తెలివైన నిర్ణయాలతో అతిపిన్న వయసులోనే మంత్రి పదవులు సంపాదించుకున్నాడు. స్వతహాగా తెలివిగలవాడు కావడంతో, ఏ విషయాన్నైనా తొందరగా ఆకలింపు చేసుకో గలడు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక రంగాల్లో ఒస్తున్న మార్పులతో సహా!ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా, తన ఉనికి ప్రజలకు, పార్టీలకూ తెలిసేలా జాగ్రత్త పడుతూ, అధిష్టానవర్గం అభిమానం పొందాడు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా…పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చే బాధ్యత భుజాల మీదికి ఎత్తుకున్నాడు.

ఇప్పటి రోజుల్లో అయిదేళ్ళు పాలించాక ప్రతిపక్షాల సత్తాతో పని లేకుండానే ఎన్నికల పోరాటంలో అధికార పార్టీలు ఓటమిని చూస్తున్నాయి. అలా చూస్తే మెహర్‌బాబా వాళ్ళ పార్టీ ఎన్నికల్లో గెలవాలి. కానీ పార్టీ అడుగు స్థాయి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కొరవడటం, నాయకుల్లో ముఠాలు, కీచులాటలు, అధికారానికి ఇన్నాళ్ళూ దూరంగా ఉండడంతో పదవుల దాహాన్ని దాచిపెట్టుకోలేక…నాలుకలు చాచడం…ఇవన్నీ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అంశాలు. ఇన్ని లుకలుకలున్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మనమే గెలుస్తామంటున్నారు స్వంత పార్టీ వాళ్ళు.

ఎన్నికల ఫలితాలపై కాసే పందేల్లో సైతం అధికార పార్టీ ఓడుతుందన్న భావమే వ్యక్తమౌతోంది అధికార పార్టీ గెలిస్తే రూపాయికి పన్నెండు రూపాయిలిస్తుంటే…ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందంటే రూపాయికి రూపాయే ఇస్తామనడంతో.

విశ్రాంతి తీసుకునే వంకతో తనగదిలోకి వచ్చిన మెహర్‌బాబా, వాచీ చూసుకున్నాడు. పన్నెండు కావడానికి ఇంకా అయిదు నిమిషాలుంది.

సెల్‌ఫోన్‌ తీసుకుని గబగబా కొన్ని నంబర్లు నొక్కాడు. అవతల వైపు ఫోనెత్తగానే “గుడ్‌మార్నింగ్‌… గుడ్‌మార్నింగ్‌” అని, తర్వాత ఒక నిమిషం పాటు మాట్లాడి…ఫోనును ఆఫ్‌ చేశాడు.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

పన్నెండవుతూండగా ఉన్నట్లుండి, శ్రీవాత్సవ కంప్యూటర్‌ ఫ్రీజయింది. కీబోర్డ్‌ మీద చేతులతో బాదినా ఉపయోగం కనిపించలేదు.

శ్రీవాత్సవకేమి చేయాలో పాలు పోలేదు. వెంటనే మెయింటెనెన్సు వాళ్ళ దగ్గరకు పరుగెత్తాడు. వాళ్ళప్పటికే కంప్యూటర్లను చెక్‌ చేస్తున్నారు.

కొన్ని సర్వర్లను క్రొత్త రకం వైరస్‌ అటాక్‌ చేసిందనీ, దాన్ని క్లీన్‌ చేసే పనిలో భాగంగా నెట్వర్కును డౌన్‌ చేశామనీ చెప్పారు.

“ఫార్చూన్‌ సర్వర్‌ స్టేటస్‌ ఏమిటి?” అడిగాడు శ్రీవాత్సవ.

“అదికూడా డౌనే”చెప్పారు మెయింటెనెన్స్‌ వాళ్ళు.

“దాని బేకప్‌ సర్వర్‌?”అడిగాడు.

“సారీ సార్‌ అదీ డౌనే” చెప్పారు.

“షిట్‌…”అంటూ ఆవేశంతో చేతిలో వున్న సెల్‌ఫోన్‌ను గోడకేసి బలంగా విసిరేశాడు. అది ముక్కలు ముక్కలైంది.

పని ఆపేసి, తన వంక చూస్తున్న టెక్నీషియన్లతో “ఎంత సేపట్లో systems back ఔతాయి” అరుస్తున్నట్లు అడిగాడు, తనను తాను కంట్రొల్‌ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ.

“నాలుగైదు గంటలు పట్టొచ్చు”చెప్పాడు ఒక టెక్నీషియన్‌

“అంత టైమా? ట్రై హార్డ్‌. అంత డౌన్‌ టైమ్‌ కష్టం” అని హడావిడిగా, మెహర్‌ను కాంటాక్ట్‌ చేయడానికి ఫోను కోసం, ప్రక్క రూములో కెళ్ళాడు శ్రీవాత్సవ.

ఎన్ని సార్లు ప్రయత్నించినా అవతల ఫోను ఎవ్వరూ ఎత్తడం లేదు.

అతని మనసు కీడు శంకించింది. గబగబా బయటకొచ్చి కారు స్టార్ట్‌ చేశాడు.

కంప్యూటర్లను బాగు చేస్తున్న టెక్నీషియన్‌ తన సెల్‌ఫోనందుకున్నాడు.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

సరిగ్గా అదే సమయంలో, మెహర్‌బాబా తన గదిలో ఒక బ్రీఫ్‌కేస్‌ లోంచి లాప్‌టాప్‌ కంప్యూటర్‌ను, ఒక సెల్‌ఫోనును బయటకు తీశాడు.

తన కోసం ఎవరొచ్చినా లోపలకు అనుమతించ వద్దని, ఫోనులు కూడా తీసుకోనని సిబ్బందికి ఫోను చేసి చెప్పాడు.

గోడ గడియారం పన్నెండు కొట్టింది.

కంప్యూటర్‌ ఆన్‌ చేసి, ఇంటర్నెట్‌ మోడెమ్‌కు సెల్‌ఫోను కనెక్ట్‌ చేశాడు మెహర్‌.

్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌్‌

ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.

అందరి జోస్యాలను తల్లక్రిందులు చేస్తూ అధికార పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వొచ్చింది. ఆ విజయం అధికార పార్టీ వాళ్ళకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతిపక్షంలో మెహర్‌బాబా లాంటి అతి కొద్ది మంది మినహా, హేమాహేమీలనుకున్న వాళ్ళంతా ఓడిపోయారు.

పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మెహర్‌ తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండుకు పంపాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు, తానిక రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు!

మెహర్‌బాబా నివాసం చాలా బోసిగా ఉంది. ఏదో కొద్ది మంది అనుయాయులతో కూర్చుని ఓటమికి దారితీసిన కారణాల గురించి మాట్లాడుకుంటూండగా…మెహర్‌ పర్సనల్‌ సెక్రెటరీ వొచ్చి.. .శ్రీవాత్సవ నుంచీ ఫోను అని, కార్డ్‌ లెస్‌ ఫోను అందించాడు.

“ఆఖరు నిమిషంలో అలా జరగడం నిజంగా ఘోరం. నా ముఖం మీకు చూపించలేక ఇలా ఫోను చేస్తున్నా”

“అన్నీ మన చేతుల్లో ఉంటే ఇంకేం?! మనకు చేతనైనంత మనం చేస్తాం. చివరి నిమిషంలో జరిగినదాంట్లో నీ పొరపాటేమీ లేదుగా…అందుకే, మనమనుకున్నట్లు నీకు రావల్సింది వొస్తుంది. నువ్వేమీ బాధపడకు. మళ్ళీ ఎన్నికలొస్తాయిగా”అని, గొంతు తగ్గించి, “అసలేమైంది?”అడిగాడు మెహర్‌.
పనికాకపోయినా ఒప్పందాన్ని మరవకుండా డబ్బిస్తున్నందుకు, మెహర్‌బాబా మీది గౌరవం కొండంత పెరిగింది శ్రీవాత్సవకు.

“చాలా థాంక్స్‌…ఏదో “గుడ్‌మార్నింగ్‌” వైరసట…మా ఆఫీసులో అన్ని కంప్యూటర్లనీ అటాక్‌ చేసింది. అన్ని హార్డ్‌ డిస్కులను ఎరేజ్‌ చేసింది”చెప్పాడు బాధగా.

“అలాగా…పేరు గమ్మత్తుగా ఉందే” అని “అన్నట్లు…రాత్రి చాలా సార్లు నీ సెల్‌కు కాల్‌ చేశా. నువ్వా గొడవలో బిజీగా ఉన్నట్లున్నావ్‌…మళ్ళీ మాట్లాడతా” అంటూ, ఫోను పెట్టేశాడు మెహర్‌. తర్వాత రెండు నిమిషాల పాటు “గుడ్‌మార్నింగ్‌…గుడ్‌మార్నింగ్‌”అనుకుంటూ పడీ పడీ నవ్వాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నా.

ముఖ్యమంత్రి పీఠమెక్కి రోజూ అసమ్మతితో నానా చావు చచ్చేకంటే…ఫలితాల మీద పందెం కాసి ఒక్క రాత్రిలో వందల కోట్లు సంపాదించుకోవడం మంచి నిర్ణయమేగా!

( ఈ కథ కేవలం కల్పితం. కొన్నాళ్ళ క్రితం మిత్రుడు శివచరణ్‌ తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు, ఎలక్షన్ల ప్రస్తావన వచ్చింది. అప్పుడొచ్చిన ఊహకు రూపమే ఈ కథ. రచయిత)