కొత్త సంపాదకుని తొలిమాట

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!

మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక పోయాం. ఇకముందు అలాటి అవాంతరాలు కలగకుండా జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నాం.

ఈ సంచిక ముఖచిత్రానికి చక్కని ఫోటోను పంపిన శ్రీ గొర్తి బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు.

అమెరికా తెలుగువారికి చిరపరిచితులు, సాహితీవేత్తలు,బహుళశాస్త్రవిశారదులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు ఇకనుంచి ఈ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం. ఈ బాధ్యతను వారు అత్యంత ప్రతిభావంతంగా నిర్వహిస్తారనేది నిర్వివాదాంశం. వారి మార్గదర్శనంతో “ఈమాట” ఇంకా సరికొత్త అందాలను సంతరించుకుని క్రమం తప్పకుండా మీకు అందుతుందని మా విశ్వాసం.

రచయిత్రు(త)లు తమ రచనలను ఇప్పటివరకు పంపే విధంగానే submissions@eemaata.comకి పంపించండి. దాన్లో ఏమీ మార్పు ఉండబోదు.

గత ఐదున్నర ఏళ్ళుగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పాఠకులకు, రచయితలకు , నాతో పాటు ఈ శ్రమలో పాలుపంచుకున్న సహసంపాదకులకు నా కృతజ్ఞతలు.
కె. వి. ఎస్‌. రామారావు

కొత్త సంపాదకుని తొలిమాట

ఐదు వసంతాలు ఈమాట పత్రికని అద్భుతంగా నడిపిన రామారావు, “కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా ఈమాట నడిపితే బాగుండును,” అని అనంగానే, తగుదునమ్మా అనుకుంటూ నేను ముందుకి దూకాను. ఎప్పుడో ఎక్కడో విన్నాను, దేవతలు తొందరపడి ఏ పనికీ దిగరని, రాక్షసులు సాహసించి ప్రతిపనికీ నిర్భయంగా, దూకుడుగా దిగుతారనీ. కాస్తో కూస్తో ఆ రాక్షస అంశ నాలో ఉండి ఉండాలి.

కానీ ఒక్క పాత భయం. చిన్నప్పుడు ఏలూరులో రెండు సంవత్సరాలు ఒక రాజకీయ వారపత్రిక నడిపాం. ఆ రెండేళ్ళూ పూర్తి అయ్యేటప్పటికి ఏ రాజకీయ పార్టీ లోనూ ఒక్కడంటే ఒక్కడుకూడా కనీసం పలకరించే స్నేహితుడిగానైనా మిగల్లేదు. మూడు దశాబ్దాలక్రితం, అట్లాంటాలో వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో నెలవారీ పత్రిక వచ్చేది. అందులో రాసిన స్నేహితులతో సాహిత్య పరంగా నాకు చాలా పేచీలు వచ్చిన మాట వాస్తవం. సుమారు రెండున్నర దశాబ్దాలక్రితం చికాగోలో తెలుగు సంస్థకి ఒక మాసపత్రిక రెండేళ్ళు నడపడం జరిగింది. ఇప్పటికీ కొంతమందికి నామీద కోపం తగ్గలేదు.

“ఈమాట” పరంగా ఆ భయం ఉండక్కరలేదు. అనుభవజ్ఞులు, సమర్థవంతులు అయిన సంపాదక వర్గం వారి అండ, సహకారం, ముఖ్యంగా అదుపు ఉంటుంది. అంతేకాదు. రామారావు విశ్రాంతి తీసుకుంటున్నాడేకాని విరమించటల్లేదనే భరోసా ఉంది. మింజుమలై, చక్కని అమెరికా తెలుగు రచయితల మద్దతు ఉంది. అదీ నాకున్న ధైర్యం. అదేదో సినిమాలో రాక్షసుడు కోరుకుంటాడు, వెయ్యి ఏనుగులు కావాలని. అయ్యబాబోయి అని అనంగానే, చిన్న కోరికగా కనీసం కోటి కోడిగుడ్డులు కావాలంటాడు. అంతపెద్ద కోరికలు నాకు లేవు. “ఈమాట” తరఫున నాకున్నవి చాలా బుల్లి బుల్లి కోరికలే.

ప్రతీ రెండునెలలకీ కనీసం అరడజను ప్రవాసాంధ్రుల ప్రవాసానుభవాలు గుచ్చి ఎత్తి ముచ్చటించే కథలు, రెండో మూడో మెదడుకి పని పెట్టే విమర్శాత్మక వ్యాసాలు, కాస్త పాత మరికాస్త కొత్తల కలయికలతో కథలూ, కవితలు ముఖ్యంగా కొత్త రచయితలనుంచి సరికొత్త రచనలూ కావాలి. తెలుగులో నిష్పాక్షిక సాహిత్య విమర్శ లేకుండా పోతున్నదని వినికిడి. ఆ లోటు తీర్చడానికి తెలుగు డయాస్పోరా రచయితలు ఈమాట ద్వారా ముందుకొస్తే బాగుంటుందని నా ఆశ. అందుకు మీఅందరి సహకారం కోరుతున్నాను.

ఆఖరిగా మరోమాట. పదివేలమందికి పైగా చదువుతున్న ఈమాట లో మీమాట రాయండి. మీకు నచ్చిన రచనలగురించి ఎందుకు నచ్చాయో రాయండి. నచ్చనివి, ఎందుకు నచ్చలేదో, ఏ మార్పులు చేస్తే ఆ రచనలు బాగుండేవో రాయండి. రచయితలని ఉత్సాహ పరచండి. మీమాట ఈమాటకి ఎంతో అవసరం.