భూషణ్‌ “సముద్రం”

“సముద్రం” పేరుతో ఈ సంవత్సరం జనవరిలో తమ్మినేని యదుకుల భూషణ్‌ ప్రచురించిన కథా సంకలనంలో ఏడు కథలున్నాయి. మొదటి కథ “ఒంటరి“. ఉద్యోగాన్వేషణలోపడి ప్రేమించిన అమ్మాయిని నిర్లక్షంచేసి, ఆమెకు వివాహం అయిన తర్వాత ఒంటరి అయిపోయిన రవికి సినిమా తారగా ప్రసిద్ధి చెంది, ఎంతో మంది నడుమ ఉంటున్నా ఒంటరితనం అనుభవిస్తున్న సింధుతో పరిచయం అవుతుంది. అతను తనమీద ఎలాంటి ఆసక్తి కనపరచకపోయినా అందరిలాగా తనను సినిమా తారగా కాకుండా ఒక మామూలు తోటి మనిషిగా మాత్రమే చూస్తున్న రవి అంటే ఆమెకు ఇష్టం కలుగుతుంది. ఇద్దరి ఒంటరితనం అంతం అవుతుంది.

“ప్రయాణం” లో వేణు, హేమలు కాలేజి విద్యార్ధులు. “నీవు నా ప్రాణం, నీవు నాకు కావాలి,” అని వేణు ఒక్కసారైనా అంటాడేమో అని నాలుగు సంవత్సరాలు ఎదురుచూసిన హేమ అతని దగ్గరనుంచి ఆమాటలు రాకపోవటంతో అతన్ని వదిలేస్తుంది. భరోసాలేని ప్రయాణం నేను చేయలేను అంటుంది. కానీ, తండ్రి చనిపోయి ఆమె ఒంటరి కావటం, ఇద్దరూ మళ్ళా కలవటం జరుగుతుంది.

“యాత్ర” కథలో అమెరికాలో నివసిస్తున్న ఒక యువకుడు ఇండియా వెళ్ళినప్పుడు కాష్మీర్‌లో ఉంటున్న స్నేహితుణ్ణి చూడటానికి పోవటం, అతని సహాయంతో అమర్నాథ్‌యాత్రకు బయలుదేరటం జరుగుతుంది. యాత్రలో చిన్ననాటి స్నేహితుడు నరహరి గుర్తొస్తాడు. నరహరి ఆరోజుల్లో మంచి విద్యార్ధి, సాహసి, నిశ్చలమైన వాడు. అకస్మాత్తుగా యాత్రీకులమీద టెర్రరిస్టులు కాల్పులు జరుపుతారు. ఒక అ:జాతవ్యక్తి టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి వాళ్ళను చంపేస్తాడు. అతనెవరూ? నరహరి!

“సముద్రం” ఉత్తమపురుషలో చెప్పిన కథ. అతనికి సుజీతో స్నేహం. సివిల్‌ సర్వీస్‌లో సెలెక్ట్‌కానందువల్ల విచారంతో ఆమెను నిర్లక్షం చేస్తాడు. అవని అనే పదేళ్ళ అమ్మాయికి దగ్గిరవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అతను అండమాన్‌లో ఉద్యోగం చేస్తుండగా, మళ్ళా అవని కనిపిస్తుంది. ఈసారి స్త్రీపురుషులుగా దగ్గిరవుతారు.

“మార్పు” కూడా ఉత్తమపురుషలో మొదలైన కథ. అతను ప్రత్యేకమైన స్వభావం కలవాడు. ఆటలంటే ఇష్టం. జంతువులంటే ఇష్టం. పక్షుల అరుపులంటే ఇష్టం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ మీద ఇష్టం లేదు. పైపై ఆకర్షణలకు ప్రేమ అనే ముసుగు తొడగటం ఇష్టం లేదు. తనమీద తనకున్న అదుపును కోల్పోకపోవటం అతని ఆదర్శం. జలజ ప్రయత్నించింది కాని అతనికి దగ్గిరకాలేకపోయింది. ఉద్యోగరీత్యా సింగపూర్‌, థాయ్‌లాండ్‌, కంబోడియా, మలేశియా వెళ్తుంటాడు అతను. థాయ్‌లాండ్‌ అమ్మాయి సుయ్‌మెయ్‌ సింగపూర్‌లో కలుస్తుంది. ఆమెతో పరిచయం పెరుగుతుంది. ఉత్తమపురుష లో ఇంతవరకూ సాగిన కథ ఇక్కడ ఒక మలుపు తిరుగుతుంది. ఇక్కడనుంచీ కథ అతని తండ్రి దృక్కోణం నుంచి ఉత్తమపురుషలోనే సాగుతుంది. తండ్రికి కొడుకు మీద ఉన్న అభిప్రాయాలకూ, కొడుక్కి స్వయంగా ఉన్న అభిప్రాయాలకు పెద్ద తేడా కనిపించదు. కాని సుయ్‌మెయ్‌తో పరిచయం అయింతర్వాత ఇంటికొచ్చిన కొడుకులో మార్పు కనిపెడుతుంది తల్లి. ఆ మార్పేంటో తండ్రికీ తెలియదు, చదివేవారికీ తెలియదు.

“పొలి” సర్వ సాక్షి ద్రుక్కోణంలో రచయిత చెప్తున్నట్లు మొదలయిన కథ. రాయలసీమలో ఒక ప్రాంతపు మాండలికంలో రాసిన కథ. అశిత్తూ అనే అతను బాల అనే పిల్లవాడికి వాళ్ళ తాత జాలప్పకూ ఆవూరిలో మరో రైతు కాటమయ్యకూ మధ్య పెరిగిన విరోధం గురించి చెప్తుంటాడు. ఆ విరోధంలో కాటమయ్య మనుషులు జాలప్పను చంపుతారు. జాలప్ప కొడుకుల్లో ఒకడు కాటమయ్య మనుషులను చంపి జైలుకు పోతాడు. అంత వీరోచిత కుటుంబం నుంచి వచ్చినవాడు కావటం వల్ల కాబోలు, బాల పెరిగి పెద్దవాడై భారతసేనలో చేరి కార్గిల్‌ యుద్ధంలో భీకరంగా పోరాడుతాడు.గాయపడతాడు. కథలో రెండవభాగం బాల భార్య ప్రమీల దృష్టికోణంలో ఉత్తమపురుషలో సాగుతుంది. ఈ మార్పుకి కారణం ఏమిటో తెలియదు. కథ చివరివాక్యం మాత్రం రచయిత చెప్తున్నట్లు కనిపిస్తుంది.

“భిక్షువు” కథలో భర్తతో అస్సాంలో ఉంటున్న పూర్ణకు “కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ” శ్లోకం విన్నప్పుడు కాలేజీ రోజులు గుర్తొస్తాయి.నృత్య రూపకంలో “మాతాన్నపూర్ణేశ్వరీ” అంటూ అతను తన పాదాలను మృదువుగా స్పృశించాడు. తను తూలి పడిపోయింది. అతను విశ్వం. ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కోతి తనచేతిలోని బుట్టను లాక్కుపోయినప్పుడు తను చేష్టలుడిగి భయపడిపోయింది. ఒక బలమైన హస్తం తనను పక్కకులాగి కాపాడింది. విశ్వం. మద్రాసులో ఉండగా ఒకరోజు దేవాలయానికెళ్ళి దారితప్పిన తనకు మళ్ళీ కనిపించాడు విశ్వం. ఒకసారి ఏదో పరిక్షకని తిరువనంతపురం వెళ్తే అక్కడ గడ్డంతో విశ్వం. కొన్నాళ్ళ తర్వాత అస్సాంలో ఉంటున్న పూర్ణ ఇంటికి “కృపావలంబనకరి” అంటూ ఒక భిక్షువు వస్తాడు. భిక్ష వెయ్యబోతున్న పూర్ణ భిక్షువును గుర్తిస్తుంది. విశ్వం.

రచయిత కవిత్వం రాసినవాడు కావటం వల్లేమో కథలన్నిటిలోనూ భాషవాడుకలో పొదుపు కనిపిస్తుంది. సన్నివేశానికి తగిన వాతావరణాన్ని చాలా సులభంగా కొద్ది మాటల్లోనే కల్పించగల నేర్పు ఈ కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. కాని అనవసరమైన నేపథ్యచిత్రణకూడా కొన్ని కథల్లో కనిపిస్తుంది. తనకు తెలిసిన ఇతరదేశాల, ప్రాంతాల గురించి పాఠకుడికి చెప్పాలనే కుతూహలం కథకు అవసరం లేకపోయినా కనిపిస్తుంది.

భూషణ్‌ కథల్లో ముఖ్యమైన వస్తువు స్త్రీపురుష సంబంధం. ఒక యువకుడు ఉంటాడు. మిత భాషి. తన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమెకు ఇష్టం; నిన్నుప్రేమిస్తున్నాను అని చెప్పనవసరం లేకుండానే ఆమె తనను అర్థం చేసుకుంటుంది అనుకుంటుంటాడు. కాని అలా జరగదు. ఆమె దూరం అవుతుంది. అతని ప్రయత్నం లేకుండానే మరోస్త్రీకి దగ్గిరవుతాడు; లేక మొదటి స్త్రీ తిరిగి అతనికి దగ్గిరవుతుంది. ఇంతకంటే లోతుగా ఈ సంబంధాన్ని పరిశీలించటం ఈ కథల్లో కనిపించదు.

రచయిత దృష్టికోణాల వాడుకతో ప్రయోగాలు చేస్తున్నాడా? లేక కథ ఎలా చెప్పాలి, ఏ పాత్ర ద్వారా చెప్తే పాఠకుడి నుంచి తగిన ప్రతిస్పందన వస్తుంది, అని నిర్ణయించలేకపోతున్నాడా? అనే సందేహం కలుగుతుంది. “మార్పు” కథలోనూ, “పొలి” కథలోనూ రెండు మూడు దృక్కోణాల మార్పిడి కనిపిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏంటో అర్థంకాదు. కథ ఎలా చెప్పాలి అన్న విషయం గురించి రచయిత ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది.

తెలుగు కథల్లో నవలల్లో విపరీతంగా కనిపించే వ్యాఖ్యానాలు భూషణ్‌ కథల్లో ఎక్కడా కనిపించవు. ఇది చాలా ప్రశంశనీయమైన విషయం. “మార్పు” కథలోని యువకునిలాగా, తనమీద తనకున్న అదుపును కోల్పోకపోవటం భూషణ్‌ గారి ఆదర్శం అనిపిస్తుంది.

మొత్తం మీద ఈ సంకలనంలోని కథలన్నీ సులభంగా చదివించగల కథలే.

ప్రతులకు “Bhushan, 14 Ashley Ct, Somerset, NJ 08873” కి రాయండి.
e-mail: thammineni@lycos.com