ఇస్మాయిల్‌ కవితా సంస్మరణ

ఇస్మాయిల్‌ గారు పోయారని వినంగానే, “కీర్తిశేషుడైన కవి కాలసాగర తీరాన కాస్సేపు పచార్లు చేసి గులకరాయొకటి గిరవాటేసి తిరిగి వెళ్ళిపోయాడు,” అన్న కవిత పెదాలపై ఆడింది. అది గులక రాయి కాదు. మేలిమి వజ్రం. జాగర్త పడక పోతే, అది మన గాజు అనుభూతులని నిలువునా కోసెయ్యగలదు. ఏరుకొని భద్రంగా దాచిపెట్టుకోవాలి.

“పికాసో గీసిందికన్నా చెరిపింది ఎక్కువే” కావచ్చు, కానీ ఇస్మాయిల్‌ గారు గీసిన ప్రతి చిన్న చిన్న మాటలగీతా ఒక మరుపురాని “గీతం” అయ్యింది. తెల్లకాగితం మీద ఒక అడ్డగీతా ఒకనిలువుగీతా గీసి నదినీ ఆకాశాన్నీ మనకిచ్చారు. ఏకాకి బెస్తవాడి గెడ తో ఆకాశాన్ని నదిపెట్టి భాగించి విశ్వమంతా శేషంగా మిగిల్చారు, మనకోసం. ఎర్రటి పగడాల్లాంటి చిన్నచిన్న పదాలు దొంతరలుగా పేర్చి పెద్దపెద్దభావాల దండలు గుచ్చి ఇవ్వడం ఇస్మాయిల్‌ గారి కొక్కరికే చేతనవును. చిలకలు వాలిన చెట్టు లోతైన కావ్యం అని ఆయన చెప్పేవరకూ మాకు తెలీదు.

రోజూ చూసే సాధారణవిషయాలు, అందరికీ కలిగే సాధారణ అనుభవాలూ సమగ్రమైన కవితావస్తువులని మనకు  పూసగుచ్చినట్టు చూపించి ఋజువు చేసింది ఇస్మాయిల్‌ గారే. మాటలపొదుపు ఎంత అవసరమో చెలంగారు చెప్పారు. ఇస్మాయిల్‌ గారు ఒక్కరే ఆ పొదుపులో ఉన్న ఆనందాన్నీ దానితో వచ్చే అనుభూతినీ అందరికీ పంచిపెట్టారు. అందుకే కాబోలు, ఆయన  రాసిన ప్రతి కవితనీ బోలెడుసార్లు చదవాలనిపిస్తుంది. గొంతెత్తి బిగ్గరగా చదవాలనిపిస్తుంది. అలా చదివినప్పుడల్లా ఆ అనుభూతిలో ఏదో చెప్పలేని కొత్తదనం కనిపిస్తుంది. ఆయన గీసిన ప్రతి పద్యం నాకు ఒక చిన్న కథ. చాప్లిన్‌ సంగతేమోకానీ, ఏ వయసు వాడికి ఏ మందివ్వాలో క్షుణ్ణంగా తెలిసిన విదురుడు ఇస్మాయిల్‌

కీచురాళ్ళ చప్పుళ్ళతో కొంపంతా నింపేసి, అదే కవిత్వం అనే భ్రమలో పడి గిలగిల కొట్టుకుంటున్న జాతికి, అసలు కవిత్వపు తొలిసంజ నారింజ ఒలిచి తెలియెండ తొనలను పంచి పెట్టిన కవి ఇస్మాయిల్‌ గారు.

రెప్పల్లా ఆకాశాన్ని కప్పి నింగినీ నేలనీ చేరువకు తెచ్చే  చెట్లంటే మీకు ఎంత అభిమానమో మాకు తెలుసు. వరసగా రోడ్లపక్కన నిలువుగా ఎంతో ఎత్తుగా పెరిగిన  చెట్లు కొట్టేసి వెడల్పుగా బల్లపరుపుగా “అభివృద్ధి” కాంక్రీటు పరుస్తున్న వాళ్ళకి ప్యారిస్‌ లో పచ్చటి చెస్ట్‌ నట్‌ చెట్ల కథ ఎలా  అర్థం అవుతుంది? చెట్ల సాయం లేకండా నింగీ నేలా చేరువకు రావన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?

ఇస్మాయిల్‌ గారి సైకిలు ఆయన్ని తీసికెడుతోందో ఆయనే దాన్ని తీసికెడుతున్నారో అన్న అనుమానం ఆయనకి! కానీ ఆయన కవితలు మమ్మల్ని ఆశల అవతలి ఒడ్డుకి తీసుకోపోతున్నాయని అనడంలో అనుమానం లేదు నాకు. ఇస్మాయిల్‌ గారు మనకి తన మాటల మూటలతో పంచి ఇచ్చిన వెలుగునీడల స్వరాలు, విన్‌ సెన్ట్‌ వాన్‌ గో చెవి ప్రపంచానికిచ్చిన శ్రుతిశుద్ధంగా పాడే వెలుగునీడల స్వరాలకన్నా, ఎంతో ప్రియమైనవి.  ఆ స్వరాలు మేమందరం అనవరతం పాడు కుంటాం. ఎక్కడో ఉపనిషత్కథల్లో రెండుపిట్టల కథ కన్నా, అనంతపురంలో రెండుగాడిదల కవితలో చెప్పిన నవ్య నీతి ఎలా మరిచిపోగలం?

వంద వాయిద్యాలతో వికసించిన బ్యాండుమేళంలా అకస్మాత్తుగా చివురించిన చెట్టుని కిటికీ దగ్గిర కూచొని ఆనందించడం నేర్పారు ఇస్మాయిల్‌ గారు. అంతకన్నా ఎక్కువ ఎవ్వరూ ఇవ్వలేరు తెలుగు వారికి.  ఆయన దగ్గిర పుచ్చేసుకున్న ఆ గుప్పెడు నక్షత్రాలనీ చంద్రుడిలా ఖర్చు పెట్టేయకుండా, జాగ్రత్తగా జేబులో దాచుకోవాలి, మన ప్రయాణం పూర్తి అయ్యేవరకూ! ఆయనతో కలిసి గోదావరి దాటి కోటిపల్లి తీర్థం చూడాలని ఎవరికి ఉండదు? అది ఇక సాధ్యం కాదు. ఆయన  పంచిపెట్టిన చల్లటి అనుభూతి  గొంతు దిగుతోంటే ఎంతో హాయి. అంతా ఒక్కసారే ఆ చల్లటి అనుభూతిని తాగాలనిపిస్తుంది కానీ, కడుప్పట్టదు.

మాటల ధ్వనుల అంచులు దాటి పలకరిస్తాయి ఇస్మాయిల్‌ గారి పద్యాలు. అందుకే కాబోలు, ఆయన కవితలు ఏ భాషలో చదివినా స్వచ్ఛంగా ఆభాషలో రాసిన కవితల్లాగే వినిపిస్తాయి. చూడండి, ఈ కవిత (1).
I know what should be out
and what should be in.
But then
What’s this window doing here?

మచ్చుకి మరొకటి. (2)

The poet digs deep for the poem
it’s buried under tons of mud
tons of mind
it’s buried in so deep
it’ll take days and nights
to pull the coffin out

It will live
if there’s a little breath left
may be

But every time he digs up
the body that comes out of it alive
is himself.

నాకు Spanish, French  రాదే అన్న బాధ లేదు. తెలుగు రాకపోయినా పరవాలేదులే, అనిపిస్తుంది ఈ ఇంగ్లీషు అనువాద కవితలు చదివిన తరువాత.

ఏ అకాడమీలు ఇస్మాయిల్‌ గారికి బహుమతులిచ్చి అందలాలెక్కించలేదే అని బాధపడే భక్తులకి ఒక మాట. గాంధీ కి నోబెల్‌ బహుమతి రాలేదని వగచే వాళ్ళు ఇప్పటికీ వినిపిస్తుంటారు. వాళ్ళకి తెలియదు, గాంధీ ఆకాశం అంత ఎ్తౖతెన చెట్టు, అని. అంతెత్తు ఎదగలేని నోబెల్‌ బహుమతి ఆముదం చెట్టు. ఎకాడమీలు కూడా ఆ బాపతే.

గత శతాబ్దంలో తెలుగు కవులు పాండవుల్లా అయిదుగురే. విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్‌ , ఇస్మాయిల్‌ .  సహదేవుడికి భవిష్యత్తు చెప్పగల ప్రజ్ఞ వున్నదనీ, ఆ మాయలమారి కృష్ణుడి శాపం కారణంగా భారతం ఘోరాలు చూస్తూ కిమ్మనకండా కూర్చున్నాడని కథ చెప్పుతారు. అదెంత నిజమో తెలియదు గానీ, ఇస్మాయిల్‌ గారు మాత్రం భవిష్యత్తులో కవిత్వం ఎల్లావూండాలో రాసిమరీ చూపించారు.  అందుకు తెలుగు జాతి ఆయనకి ఋణపడి ఉంటుంది.

(1), (2) From Hibiscus on the lake, Twentieth Century Telugu Poetyry from India
Edited and Translated by Velcheru Narayana Rao, Published by The University of Wisconsin Press, Madison, Wisconsin USA (2003)