నెమ్మదిగా నాట్యం

ఆనందంగా ఆడే పిల్లలను
ఏనాడైనా చూశావా?
తపతపమని నేలను తాకే వాన
ఎప్పుడైనా ఆ చప్పుడు విన్నావా?
గిరికీల సీతాకోకచిలుకను
సరదాగా అనుసరించావా?
మునిగిపోయే సూర్యుణ్ణి
కనురెప్పవేయక గమనించావా?

కొంత నిదానం మేలు
అంత వేగం నర్తించకు
సమయం సరిపోదు
సంగీతం నిలువదు

ప్రతిరోజూ ఉరుకులు
పరుగులు పెడతావా?
ఎలా వున్నావని అడిగితే
సమాధానం వినిపిస్తుందా?

పొద్దుగడిచాక
నిద్దురకు ముందు
తలలో వందపనులు
గిరగిర తిరిగితే ..

కొంత నిదానం మేలు
అంత వేగం నర్తించకు
సమయం సరిపోదు
సంగీతం నిలువదు

రేపు చేదామని బాబుకు
ఎపుడైనా మాటిచ్చావా?
పని తొందరలో పడి
వాని బాధ మరిచావా?

పరిచయం పాతబడనీకు
పలకరింపుకు సమయం లేక
స్నేహాన్ని పాతిపెట్టకు

కొంత నిదానం మేలు
అంత వేగం నర్తించకు
సమయం సరిపోదు
సంగీతం నిలువదు

చేరవలసిన చోటువైపు
వేగంగా పరిగెడితే
సగం సరదా మాయం

త్వరవిచారాల్లో
దినమంతా గడిపితే
అది తెరవకుండానే
వదిలేసిన బహుమానం

జీవితం కాదు పందెం
నెమ్మదిగా కానీ
గానమాగక ముందే
విను సంగీతాన్ని ..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...