సత్యం

ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్యమయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్‌లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు. దానికితోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్‌ గొడవ.

ఇంట్లో అడుగుపెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసుకుని ఉన్నట్లు తెలిసిపోయింది. రణగొణధ్వనులు చేసే టీవీ కట్టేసి ఉంది. పుస్తకం ముందేసుకుని కళ్ళు తుడుచుకుంటూ కూచుని ఉన్నాడు బాబు. పాప బిక్కచిక్కిన మొహంతో వాడివేపే చూస్తూ ఉంది ఆడటం మానేసి.

“ఏమిటీ ఏమయింది?” ఆమెని అడిగాడు దగ్గరకొచ్చి కాళ్ళకు చుట్టుకున్న పాపను ఎత్తుకుని ముద్దాడుతూనే.

“పోయినవారం వాడి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ రావలసింది, ఇంకా రాలేదు. ఏదిరా అంటే వాడి టీచర్‌ ఇవ్వలేదంటాడు.”

“ఇవ్వలేదేమోలే! అప్పుడప్పుడూ ఆలస్యమవుతుంది కదా!”

“ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టనిపిస్తుంది!”

“మర్చిపోయాడేమో వాడి బ్యాగ్‌లో వెతక్కపోయావా?”

“వెతికాను. లేదు!”

“నేనేమీ అబధ్ధం చెప్పటం లేదు.” వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు.

“నువ్వు ఏడవటం ఆపు ముందు. పోనీ సోమవారం వాడి టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా!”

“వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు. మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా? అయినా సోమవారం దాకా ఎందుకు. ఇప్పుడే వాడి నోటి తోటే నిజం చెప్పించాలి.”

“వాడు అట్లా అబధ్ధమెందుకాడుతాడు? బెనిఫిట్‌ ఆఫ్‌ డవుట్‌ ఇవ్వచ్చనిపిస్తూంది నాకయితే!” ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినపడకుండా.

“ఏమో ఏం తెలుసు? మనం నమ్మేం కనక అన్నీ నిజాలే. అయినా వాడి సంగతి నాకు తెలుసు. మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి, లేకపోతే నాకు వదిలేయండి.”

ఎర్రటి కళ్ళూ, పసిబుగ్గల మీద కన్నీటి చారికలూ, మధ్య మధ్య చొక్కా చేతులతో తుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబధ్ధమాడుతున్నట్టు అనిపించడం లేదు. అట్లాగని ఆమెకి నచ్చచెప్పనూ లేడు. పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఓ వొప్పందం. వాడు రక్షించమన్నట్టు తనవేపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్‌. అయినా తల్లినుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్దిచెప్పుకుంటూ పాపను తీసుకుని బెడ్‌రూమ్‌లోకి నడిచాడు.

మామూలుగా ప్రోగ్రెస్‌రిపోర్ట్‌ వచ్చినరోజు గొడవ వేరేగా ఉండేది. వాడి ఖర్మకాలి అన్నిట్లోకీ వాడికి సైన్స్‌లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడూ. ఇక వాడిని కూచోబెట్టి ముందు కోపంగానూ, చివరికి అనునయంగానూ వాడికి నూరిపోసేది సైన్సులో తొంభయి అయిదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో. తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్‌. రాత్రిళ్ళు వాడి దగ్గరే కూచుని కదలకుండా, కదలనీయకుండా చదివించేది.

చాలాసార్లు చెప్పాడామెకి. వాడినట్లా భయపెట్టటం వల్లా, దండించటం వల్లా ఉపయోగమేమీ ఉండదనీ. వాడికి తక్కువ మార్కులు వచ్చినప్పుడువాడికే పాఠం అర్థం కాలేదో, ఏ జవాబులు రాయటంలో తప్పులు చేశాడో కనుక్కుని వాడికి సాయం చేయాలనీ.

పాపను కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూచోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పేమీ లేదు. వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది .

“ముందా ఏడుపు ఆపి హోమ్‌వర్క్‌ చేయి!” వాడిని కసిరాడు. వాడు బదులేమీ చెప్పలేదు.

“ఇంతకీ వాడు తిన్నాడా?” ఆమెతోపాటు తింటూ అడిగాడు. “తిన్నాడు” పొడిగా చెప్పింది అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు. అతనూ మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు. ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరకొచ్చి కూచున్నాడు.

“ఏరా నీకు నాన్నా పులి కథ చెప్పాను గుర్తుందా?”

వాడు తల నిలువుగా వూగించాడు ఎత్తి చూడకుండానే.

“నువ్వు ఒకసారి అబధ్ధం చెప్పావనుకో ఇక నీ మాట ఎవరూ నమ్మరు ఆ కథలోలాగా!”

“నేను నిజమే చెబుతున్నా. అయినా మీరు నమ్మటం లేదు నన్ను!” ఏడుపు కాస్త ఎక్కువ చేసి అంటున్నాడు.

“ముందు ఆ ఏడుపు ఆపు! నిన్నేమీ తిట్టలేదూ తన్నలేదూ ఇప్పుడు. మమ్మీ ఎటూ మండే మీ టీచర్‌తో మాట్లాడుతుంది. నిజం ఎటూ తెలిసిపోతుంది. నువ్విప్పుడు చెప్పేది అబధ్ధమని తెలిసిందనుకో.. ఇక ఎప్పుడయినా నువ్వు చెప్పేది మేమెట్లా నమ్ముతాము? నువ్వు చెప్పేదేదీ మేం నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నీకు?” వాడు చెబుతున్నది నిజమే అయితే బాగుంటుందనిపిస్తుందతనికి. ఇద్దరి మధ్య సంబంధంలో నమ్మకం పోవటంకంటే దారుణమయినదేముంటుంది?

“నేను అబధ్ధమేమీ ఆడటం లేదు!”

అతనికి ఒక పక్క జాలేస్తూంది. తమ పదేళ్ళ కొడుకు ఇంత పట్టుతో అబధ్ధం చెప్పగలడా? ఒక మూల సందేహం.. అనవసరంగా వేధిస్తున్నారా తామిద్దరూ వాణ్ణి? వాడు నిజమే చెపుతున్న పక్షంలో వాడు క్షమిస్తాడా ఇక తమని?

ఆమె వచ్చి అందుకుంది. “అది ఇంకో అబధ్ధం. ఒక అబధ్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబధ్ధం ఆడుతూనే ఉండాలి. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇంటికి తేకపోవటం ఒక తప్పు. ఇవ్వలేదని అబధ్ధం రెండో తప్పు. అబధ్ధమాడలేదని చెప్పటం మూడో తప్పు. నీకు ఒక తప్పుకయితే ఒక పనిష్మెంటే కదా? ఇన్ని తప్పులు చేసి మరికాసిని తన్నులు తినడం హాయిగా ఉంటుందా నీకు?”

మరీ పోలీస్‌స్టేషన్‌ లో నేరస్థుడిని ఇంటరాగేట్‌ చేస్తున్నట్టనిపించి పక్కకి వెళ్ళాడు అతను.

“సరే, నిన్నేమీ అనను. తిట్లూ లేవు, దెబ్బలూ లేవు. ఏ పనిష్మెంటూ లేదు ఇప్పటికిప్పుడు నిజం చెప్తే. మళ్ళీ మండే మీ టీచర్ని కనుక్కున్నాక నేనేం చేస్తానో నాకే తెలియదు.” వాడి వంకే చూస్తూ నెమ్మదిగా చెప్పింది.

ఏం సమాధానం లేదు.

“ఏం చేయనందికదరా ఇప్పటికయినా నిజం చెప్పు!”

వెక్కటం ఆగింది. “అది.. దార్లో పోయింది..”

“పోయిందా.. నిజం చెప్పు. ఏం చేయనన్నాగా! నాకు మొత్తం నిజం కావాలి!”

“పడేశాను..దార్లో”

“ఎందుకు?”

ఏం మాట్లాడలేదు.

“ఎందులోనన్నా తక్కువ మార్కులు వచ్చాయా?”

“సైన్సులో” తల దించుకునే చెపుతున్నాడు.

“ఎన్ని వచ్చాయి?”

“డెభ్భయి రెండు”

బాబు చెంప ఛెళ్‌ మంది. ఒక క్షణం బిత్తరపోయి ఏడుపు ఆపేశాడు. మరుక్షణం బిగ్గరగా ఏడుపు అందుకున్నాడు. చేయి పట్టి గుంజి వీపు మీద రెండు దెబ్బలు చరిచింది. ఈలోపల అతను తేరుకుని ఆమెని ఆపాడు. వాడి ఏడుపు చూసి పాప కూడా ఏడుపు అందుకుంది.

“వెధవ! గాడిద! అంత అబధ్ధమాడతావా? ఎక్కడ నేర్చావివన్నీ? అప్పట్నుంచీ అడుగుతుంటే నోటమ్మట నిజం రాదా? ఇంత అబధ్ధాలకోరువు ఎట్లా అయ్యావురా?” అరుస్తూ ఆవేశంతో రొప్పుతుందామె.

అతనికి నమ్మ బుధ్ధి కాలేదు. ఏదో భార్య చెపుతుందని సందేహించాడు తప్ప, ఆమెదే పొరబాటని తెలిస్తే ఆమెను చీవాట్లు పెట్టటానికి సిధ్ధమయే ఉన్నాడు. ఎంతో బుధ్ధిమంతుడనీ, అమాయకుడనీ తాము అనుకునే కొడుకు ఇంత ఇదిగా అబధ్ధమెట్లా ఆడగలిగాడు? బాధా, అంతలోనే కోపమూ..

“ఛీ! నీకు బుధ్ధి లేదురా! అంత ఇదిగా నేనడిగినప్పుడయినా నిజం చెప్పొచ్చుగదా? ఇక నిన్ను జన్మలో నమ్మగలమా?” అంతకంటే ఏం తిట్టాలో కూడా తెలియలేదతనికి.

వాళ్ళమ్మే ఇంకో రెండు తగిలించింది. అతడూ ఈసారి అడ్డు వెళ్ళలేదు. వాడు ఏడుపు ఇంకా పెద్దది చేశాడు. “ముందా ఏడుపు ఆపు! ఆపుతావా.. ఆ ఏడుపు ఆపుతావా లేదా?” అంటూ ఇంకొకటి వేసింది. “అసలు సైన్సులో డెభ్భయి రెండు రావడమేమిట్రా?” అని ఇంకొకటీ.

వాడు ఏడుస్తూనే “కొట్టనన్నావు.. ఏం చేయనన్నావు..” అంటున్నాడు పెద్దగా. అప్పటికే బుగ్గమీద నాలుగు వేళ్ళు పొంగాయి.

“కొట్టక ముద్దు పెట్టుకుంటారేం మరి నువు చేసిన నిర్వాకానికి?”

“అబధ్ధమాడావు..నువ్వూ అబధ్ధమాడావు..” ఏడుపూ మాటలూ కలగలిశాయి.

“మామూలుగా అడిగితే చెప్పావా నువ్వు? ఇంకా నోరెత్తావంటే మండిపోతుంది నాకు. పో, నీ గదిలోకి పో!” అరిచిందామె.

“నేను పడుకోబెడతాలే” అంటూ ఏడుస్తున్న పాపని ఆమెకి అందించి వాణ్ణి లాక్కెళ్ళాడు.

వాడి పక్కనే పడుకుని వాడు ఏడుపు తగ్గాక మొదలు పెట్టాడు. “అసలు నువ్వేం చేశావో అర్థమయిందా నీకు? అబధ్ధమెందుకాడావు? అబధ్ధాలాడకూడదని ఎన్నిసార్లు చెప్పాము? అబధ్ధమాడితే కళ్ళు పోతాయని చెప్పలేదూ?”

వాడు కొంచెం తేరుకున్నాడు. “అదేం నిజం కాదు. నాకు కళ్ళేం పోలేదు.”

నవ్వొచ్చినా పైకి నవ్వ లేదు. “ఇంత తెలివయినవాడివి ఆ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఎప్పటిలా ఇంటికి తీసుకుని వస్తే ఈ రాధ్ధాంతమంతా ఉండేది కాదు కదా!”

“మార్కులు తక్కువ వచ్చాయని అమ్మ కొడుతుందని భయమేసింది”

“ఇప్పుడు మాత్రమేమయింది? అసలు ఎక్కడ నేర్చావు ఈ అబధ్ధాలాడటం? స్కూల్లో పాడుపిల్ల స్నేహాలవీ చేస్తున్నావా?”

ఏం మాట్లాడలేదు.

“అసలు అమ్మానాన్నల దగ్గర అబధ్ధం చెప్పొచ్చా? నీ మంచికోరే కదా మేం తిట్టినా కొట్టినా!”

“మీరూ నాతో అబధ్ధం చెప్పారు కదా?”

“మేమా? ఎప్పుడురా?”

“అప్పుడు నా బర్త్‌డేకి స్పైడర్‌మాన్‌ గేం కొనిపెడతానని ప్రామిస్‌ చేసి కొనివ్వలేదు.”

“అన్ని డబ్బులు పోసి అది కొనటం దండగని చెపితే నువ్వు వినవుగదా మరి?”

“అయినా అబధ్ధమేగా! మమ్మీ ఏమో నాకు స్కూల్లో ఛెస్‌లో థర్డ్‌ ప్రయిజు వస్తే ఫస్ట్‌ వచ్చానని అందరికీ చెప్పింది.”

అతనేం మాట్లాడలేకపోయాడు.

“మొన్నేమో ఆ అంకుల్‌ ఫోన్‌ చేస్తే మీరు ఇంట్లో ఉన్నా లేరని చెప్పమంది మమ్మీ. అదీ అబధ్ధమేగా!”

అదృష్టవశాత్తూ వాళ్ళమ్మ వచ్చింది “నేను పడుకోబెడతాలే వీణ్ణి” అంటూ.

బాబుని నిద్రపుచ్చి వచ్చి పడుకుంటూ అంది “వీడిట్లా తయారయాడేమిటి? పెద్ద అబధ్ధాలకోరవుతాడేమోనని భయంగా ఉంది. మన పెంపకంలో లోపమంటారా?”

“అంతప్పుడు నువ్వేమీ అబధ్ధాలు ఆడలేదా?”

“ఆడే ఉంటాను. మా అమ్మ ఏమనేది కాదుగానీ మా నాన్న చావబాదేవాడు.”

“నాకయితే గిల్టీగా ఉంది. మనం తప్పు చేస్తూ, వాణ్ణి అదే తప్పు చేయొద్దని ఎట్లా చెప్పగలం, దండించగలం? ఎక్కడో చివుక్కుమంటూ ఉంటుంది మనకు నైతికంగా ఆ హక్కు ఉందా అని!”

“అదేమిటి మనమేమన్నా అబధ్ధాలాడుతున్నామా ఏమిటి ఇప్పుడు?”

“మనకి మనమాడే అబధ్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి. ఎందుకూ, వాణ్ణి ఇందాక తన్ననని చెప్పి నమ్మించి నిజం చెప్పాక తన్నావా లేదా?”

“అది వాడి మంచికే కదా! వాడి వ్యక్తిత్వానికి సంబంధించి భవిష్యత్తులో వాడికి దీనివల్ల జరిగేది మేలే కదా! మనమాడే అబధ్ధాలు ఎవరికీ కీడు చేయనంతవరకూ తప్పేముందందులో?”

“అబధ్ధమన్న తర్వాత ఏదైనా అబధ్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”

“ప్రాణాపాయస్థితిలో ఆడే అబధ్ధమూ, ఇంకొకరిని మోసంచేసి దోచుకునే అబధ్ధమూ ఒకటేనా?”

“రెంటికీ మధ్య గీత ఎవరు గీస్తారు ఇవి మంచి అబధ్ధాలూ, ఇవి చెడ్డ అబధ్ధాలూ అని. నువు రెజ్యూమ్‌లో లేని ఎక్స్‌పీరియన్స్‌ పెట్టి ఉద్యోగం సంపాయించావు. దానిమూలాన న్యాయంగా ఇంకెవరికో రావలసిన ఉద్యోగం రాలేదు. ఇప్పుడది మంచి అబధ్ధమేనా?”

“అంటే మీరు చెప్పేదేమిటి? వాడికి అబధ్ధాలాడొద్దని చెప్పటం తప్పంటారా? ఇక తల్లిదండ్రులంతా పిల్లలికి మంచిచెడ్డలు నేర్పడం మానేసి వాళ్ళ మానానికి వాళ్ళని వొదిలేయాలా? వెనకటికి ఆ దొంగ ఎవడో తల్లి చెవి కొరికి తోటకూరనాడే తన్నకపోతివికదమ్మా అన్న కథ గుర్తు లేదా?”

“వాడెదురుగా మనం అబధ్ధాలాడుతూ ఉంటాము. వాడికి అబధ్ధాలాడకూడదు అని చెబుతుంటాం. వాడేం గ్రహిస్తాడు దీన్నుంచి? వాడికి మనమేమీ మంచి అబధ్ధాలాడొచ్చు, చెడ్డ అబధ్ధాలాడకూడదు అని చెప్పం కదా? మంచీచెడులు నలుపూతెలుపులన్నంత తేలిగ్గా విడమరిచి చెప్పేవేనా?”

“నాకసలే వాణ్ణి కొట్టినందుకు తిక్కగా ఉంది. ఈవాదనలన్నీ మొదలుపెట్టకండిప్పుడు” అంటూ అటు తిరిగి పడుకుంది.

తమతో అబద్ధం చెప్పినందుకు కోపమొచ్చి కొట్టిందా లేక వాడు ఇక అబధ్ధాలాడకుండా బెదిరించడానికి కొట్టిందా?

“నాకనిపించిందేమిటంటే వాడు అబధ్ధాలాడాడన్న దానికంటే మనతో అబధ్ధం చెప్పాడన్న సంగతి మనని ఎక్కువ బాధిస్తుందని!”

ఆమెనించి బదులు లేదు.

* * *

మరుసటిరోజు ఉదయం బాబు చెల్లితో ఆటల్లో మునిగిపోయాడు. రాత్రి జరిగింది వాడికి ఏమీ గుర్తుకూడా ఉన్నటు లేదు.

వాళ్ళ కొడుకుని తీసుకుని ఆమె తమ్ముడు వచ్చాడు “పిల్లల్ని జూకి తీసుకు వెళతానక్కా!” అంటూ. పిల్లలిద్దరూ మామ చేతిలోనుంచి చాక్లెట్లు తీసుకుని అంతా మళ్ళీ ఆటల్లో పడ్డారు.

“జూ లేదు పాడూ లేదు పాపని తీసుకెళ్ళు. వాడు రాడులే!”

” అదేమిటి? వొంట్లో బాగా లేదా ఏమిటి? బాగనే ఆడుతున్నాడుగా?”

“వాడికి పనిష్మెంట్‌లే!” అతడు చెప్పాడు.

“ఎందుకు ఏం చేశాడేమిటి? వీడు అల్లరిపనులు చేసే రకం కాదుగా!” వాళ్ళబ్బాయయితే అల్లరీ మొండీ.

“నిన్న రాత్రి వాడికి పడ్డయిలే! మార్కులు తక్కువ వచ్చినయ్యని ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూపించకుండా పారేసి వచ్చాడు.” ఆమె చెప్పింది.

“ఆ మాత్రానికి కొట్టాలా? ఆ లెక్కన మావాడికి రోజూ బడితె పూజ చెయ్యాల్సిందే!” నవ్వాడు.

“అసలు స్కూల్లో రిపోర్టే ఇవ్వలేదని మళ్ళీ మాతోటి అబధ్ధాలు. ఇప్పుడు అబధ్ధాలతో మొదలవుతుంది, రేపు దొంగతనాలదాకా వస్తుంది. రాత్రంతా ఒకటే దిగులు..” తమ్ముడికి కాఫీ ఇస్తూ చెప్పిందామె.

“అంత సీను లేదులే అక్కా!” తీసి పారేశాడు తమ్ముడు. “అదేదో సినిమాలో చూపించలా, అంతా నిజమే చెప్పాలంటే కుదిరేపనికాదు. ఆ హరిశ్చంద్రుడి కథ చెప్పి పిల్లల్ని ఎన్నాళ్ళు మభ్యపెడతాం?”

“చాల్లే నువ్వు పిల్లలకి ఇదే నేర్పు!” కసురుకుంది.

“నన్నడిగితే అబధ్ధాలాడారని కాదు, సరిగ్గా అబధ్ధమాడలేకపోతున్నారని దిగులు పడాలిప్పుడు. ఈ స్కూళ్ళలో ఆర్ట్‌ ఆఫ్‌ లయింగ్‌ అని కోర్సు మొదలుపెడితే బావుండనిపిస్తుంది. పిల్లలు ఆ మాత్రం స్ట్రీట్‌స్మార్ట్‌గా ఉండకపోతే రేపు ఎట్లా బతుకుతారు?”

భార్యాభర్తలిద్దరూ మాట్లాడలేకపోయారు.

“రేయ్‌ పదండ్రా బట్టలు మార్చుకుని! జూకి వెళదాం!” పిల్లల్ని కేకేసి చెప్పాడు. “రాత్రికి రండక్కా అక్కడే డిన్నర్‌ చేద్దాము!” అంటూ లేచాడు.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...