కవిత్వం లో “నేను”

బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే వశిష్టులవారి ఆశ్రమానికి వెళ్ళి, తలుపు తడతాడు. లోపల్నించి “ఎవరదీ ?” అన్న ప్రశ్న వినిపిస్తుంది. “నేనే గురువర్యా !” అంటాడు రాముడు. “నేనంటే?” మళ్ళీ ప్రశ్న. “అది తెలుసుకుందామనే వచ్చాను!” అంటాడు రాముడు. ఆతరవాత, ఆయన అసలు ప్రశ్నకి సమాధానం దొరికిందో లేదో తెలియదుగానీ, “నే నెవరు?” అన్నది అనాదిగా మనిషిని వేధిస్తున్న ఒక తాత్విక ప్రశ్న. ఐతే, అంత లోతుగా తాత్విక చర్చ చెయ్యటం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. కేవలం కవిత్వానికి సంబంధించినంత వరకు కవులు ఈ నేననేదాన్నెలా ఉపయోగించుకున్నారో పరిశీలించటంవరకే ఇది పరిమితం.

ఇందులో ప్రధానంగా మూడు ధోరణుల గురించి మనం చెప్పుకోవచ్చు. మొదటిది చాలా సరళమైన పద్ధతి. అంటే, కవి తనను గురించి చెప్తూ, ఉత్తమ పురుషలో మాట్లాడటం. ఇక్కడ ” నేనంటే నేనే ” !

ఆలోచనలతో ప్రాంగణమంతా
అందంగా అలుకుతాను.
ఉత్సాహంతో ఊహల తోరణాలు కడతాను.
ఎవరెవరు వస్తారా అని
ఎంతగానో ఎదురు చూస్తాను
నా ఆరాటమేగాని,
నేనెవర్నీ లోపలికి ఆహ్వానించలేను.

(అనావిష్కృతం )

ఇందులో కవి వ్యక్తిగతమైన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడని మనకు అర్థమౌతుంది. అలాగే, పాఠకుణ్ణి ఉద్దేశించి నువ్వని రాయటం కూడా సరళమైన పద్ధతే.”ఏ దేశమేగినా ఎందు కాలిడినా / పొగడరా నీతల్లి భూమిభారతిని”. కవిత చదివే ప్రతి పాఠకుడికీ ఈ నువ్వనేది వర్తిస్తుంది.

రెండో పద్ధతి ఒక వ్యక్తిని  గురించి  ఉత్తమ పురుషలో మాట్లాడటం. కవి ఎవరిలా మాట్లాడుతున్నాడనేది శీర్షికలోగాని మరెక్కడైనా గాని మనకు స్పష్టంగా సూచింపబడుతుంది. కొన్ని సార్లు శీర్షికలో స్వగతమనో మోనో లాగ్‌ అనో ఉంటుంది. అలా లేకపోయినా, పద్యంలో చెప్పబడిన దాన్నిబట్టి ఎవరనేది మనం తేలిగ్గా ఊహించవచ్చు. ఉదాహరణకి, శివారెడ్డి “కమలకుమారి స్వగతం” అనే కవితను చెప్పుకోవచ్చు. “నా పసితనం మీద నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్ళాడు ” అని మొదలై, సుదీర్ఘంగా సాగే ఈకవితలో, వంచింపబడిన ఒక అభాగిని మాటలు మనం వింటాం.

ఇటువంటి పద్యాల్లో వస్తువు వ్యక్తులే కానక్కర్లేదు. ఒక భౌతికమైన వస్తువు కూడా కావచ్చు. ఇస్మాయిల్‌ గారు “సీసా” అని ఒక పద్యం రాసారు. ఇందులో సీసాయే మాట్లాడుతుంది :

విషానికి విషపు రంగు
విస్కీకి విస్కీ రంగు
తాలుస్తానని
నేనంటే నీకు లోకువ.

నాలోంచి కనిపించేది
నీ ఆకాశమే ననుకుంటున్నావు.
అసలు నా ఆకాశమే వేరు.
నా నోటి దగ్గర చెవి పెట్టి చూడు :

నాలో నిరంతరం రేగే
గాలిదుమారాల్ని వింటావు.

ఇటీవల మన యదుకుల భూషణ్‌  నీడ, సోఫా, లాంపు, తలుపు మొదలైన అనేక వస్తువుల గురించి రాసిన ఇటువంటి కవితలు కొన్ని “ఈమాట”లొనే ప్రచురింపబడ్డాయి.

ఇక మూడో పద్ధతిలో కవి వ్యక్తిగతం కాదని మనకు తెలుస్తూనే ఉన్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడనే దానికి ఇంత స్పష్టమైన సూచన ఉండదు. ఇందులో రెండు రకాలు. మొదటిది ఒక సార్వజనీనమైన అర్థంలో నేను అని వాడటం. ఉదాహరణకి వంశీ కృష్ణ రాసిన ఈ కవిత చూడండి :

నిన్న రాత్రి మృత్యువు నా కలలోకి తొంగి చూసి
రేపు ఉదయం తలుపు తట్టనా అంది.

అమాయకమైన నా భార్య మొహం
తన నునులేత ఒంటిపై నా వదలని మోహం
గుర్తుకొచ్చాయి..?

పసితనాన్ని ఒదలని మా అమ్మాయి
ఒకానొక అవ్యక్త ప్రేయసి కనుదోయి
ఆరడి పెట్టాయి..?

మృత్యువు వంక తిరిగి
యింత తొందరగానా .. అన్నాను.
తను నవ్వేసి వెళ్ళిపోయింది.

ఓ యాభై ఏళ్ళ తర్వాత ….
మృత్యువు ముందు
దీనంగా ….. హీనంగా …..
కరుణించమని వేడుతూ .. నేను.

(ఫస్ట్‌ లవ్‌ )

ఇందులో ” నేను ” ఎవరైనా కావచ్చు. అంటే, కవితోబాటు ప్రతి మనిషికీ అది వర్తిస్తుంది.

రెండవ రకం దీనికంటె కొంత క్లిష్టమైనది. ఇందులో కవి ఎవరినో ఉద్దేశించినట్టు కనబడుతుంది గాని, అది ఎవరనేది స్పష్టంగా తెలియదు. ఇటువంటి వాటికి కొంత వ్యాఖ్యానం అవసరమౌతుంది. వ్యాఖ్యానాల్లో భేదాలుండవచ్చు కూడా. ఉదాహరణకి శ్రీ శ్రీ “జయభేరి” పద్యంలో ఈ వాక్యాలు తీసుకుందాం.

నేనొకణ్ణే నిలిచిపోతే
చండ్ర గాడ్పులు, వానమబ్బులు
మంచుసోనలు భూమిమీద
భుగ్నమౌతాయి.

నింగినుంచి తొంగి చూసే
రంగురంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు కక్కుకుంటూ
పేలిపోతాయి.

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లి
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది .

ఇందులో నేనంటే ఎవరు? దీనికి పూర్తి సమాధానం పద్యంలో లేదు. అది కొంతవరకు చదివేవారిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో నేనంటే ప్రపంచ కార్మికుడని, నింగినుంచి తొంగిచూసే చుక్కలు పెట్టుబడిదారులని ఒక విమర్శకుడు వ్యాఖ్యానించారు. ఐతే, వేరే ఎవరైనా ఇది తమగురించే రాయబడిందని అనుకుంటే మనం చెయ్యగలిగిందేమీలేదు. వివిధ వర్గాల్‌ుతరాలు దీనిని రకరకాలుగా అన్వయించుకోవచ్చు. అటువంటి వెసులుబాటు ఈ పద్యంలో ఉంది.

కవి తన వస్తువు గురించి మూడు పురుషల్లో దేనినైనా తీసుకుని మాట్లాడవచ్చు. వివిధ సందర్భాల్లో వాటి ప్రభావం వేరు వేరుగా ఉంటుంది. ఒక పద్యంలో మూడు అంశాలుంటాయనుకుందాం. అవి కవి, పాఠకుడు , వస్తువు. కవి ఏ పురుషలో మాట్లాడుతున్నాడనేదాన్ని బట్టి ఈ అంశాల మధ్య అనుబంధం మారుతూ ఉంటుంది. ప్రధమ పురుషలో మాట్లాడుతున్నాడంటే, తాను పాఠకునితో కలసి వస్తువుని పరిశీలిస్తున్నట్టు. లేదా తనకళ్ళతో వస్తువుని పాఠకునికి చూపిస్తున్నట్టు. ఇక్కడ కవి, పాఠకుడు ఒకవైపు, వస్తువు మరొకవైపు ఉన్నట్టు మనం భావించవచ్చు. ఈ పద్ధతిలో ఆబ్జెక్టివిటీ ఎక్కువ. అంటే, వివిధ కోణాల నుంచి వస్తువుని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో, కవి వస్తువుతో తాను సంభాషిస్తున్నట్టు రాయటం కూడా కద్దు. ఇటువంటి పద్యాల్లో నువ్వు అంటే, కవి ఉద్దేశిస్తున్నది వస్తువునిగాని, పాఠకుణ్ణి కాదు. లేదా పాఠకుడు తనను తాను వస్తువుగా ఊహించుకుని ఈ పద్యం చదువుకోవచ్చు. ఇక్కడ, పాఠకుడు, వస్తువు ఒక వైపు, కవి మరొక వైపు ఉన్నట్టు మనం భావించుకోవచ్చు.

మరి కొన్నిసార్లు కవి వస్తువుతో మమేకమై మాట్లాడతాడు. అప్పుడు ఆబ్జెక్టివిటీకి అంత అవకాశంఉండదు. కాని, వస్తువుపట్ల కవికున్న సానుభూతి తీవ్రత ఇందులో వ్యక్తమౌతుంది. కొన్ని సందర్భాల్లో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ కవి, వస్తువు ఒకవైపు, పాఠకుడు మరొకవైపు ఉన్నట్టు మనం భావించవచ్చు.

ఒక విధంగా ఆలోచిస్తే, వస్తువు యొక్క దైన్యాన్ని చూపించి, దానిపై పాఠకునికి సానుభూతి కలిగించే ప్రయత్నంలో ఉన్నప్పుడు, కవి ఆ వస్తువును మూడవ వ్యక్తిగా ఆవిష్కరిస్తాడు. అదే వస్తువులో ఉన్న అహంభావాన్ని, ఒక రకమైన ధిక్కారాన్ని ప్రదర్శించాలన్నప్పుడు, తానే వస్తువైనట్టు మాట్లాడతాడు. ఉదాహరణకి, “వేశ్య” అనే శీర్షికతో అలిసెట్టి ప్రభాకర్‌ కవిత ఒకటిఉంది. ” తాను శవమై/ మరొకరికి వశమై, తాను పుండై/ మరొకరికి పండై, తాను ఎడారై / ఎందరికో ఒయాసిస్సై ” వంటి వాక్యాలతో ఈ కవిత సాగుతుంది. (ఇది కవిత పూర్తి పాఠం కాదు.) ఈ వాక్యాల్నిబట్టి, ఇందులో వేశ్య జీవితంలో ఉన్న దైన్యాన్ని, అసహాయతను కవి చూపిస్తున్నాడని మనకర్థమౌతుంది. ఇదే వస్తువు గురించి, ఘంటసాల నిర్మల రాసిన ఎ కాల్‌ గర్స్ల్‌  మోనో లాగ్‌ అనే కవితలో వాక్యాలు ఇంతకంటే భిన్నంగా ఉంటాయి :

తీరని కోర్కెల తీవ్రదాహానికి
కౌగిలి చలివేంద్రాన్ని మంజూరు చేసిన దాన్ని
పావలానించీ పదివేల వరకైనా
కరకు కాసుల్ని కామంతో తూచగల దాన్ని
కాలాన్ని మౌనంగా తుంచగలదాన్ని

కాంక్షల సర్పపరిష్వంగాల నుంచి
అన్నమనే అమృతాన్ని ఆహ్వానిస్తున్నదాన్ని
వికృత మనస్తత్వాల పంకిలానికి ఆనందపరిమళం పంచుతున్నదాన్ని
నగ్నత్వాన్ని నిత్యావసరంతో పంచుతూన్నదాన్ని

వీటిలో ఒక అహంభావం, పురుష సమాజంపై ప్రకటిస్తున్న ధిక్కారం వ్యక్తమౌతున్నాయి. ఈ రకమైన భావం ప్రకటించటానికి, కవిత ఉత్తమ పురుషలో సాగటం బాగా దోహదపడింది. ఇస్మాయిల్‌ సీసా పద్యంలో కూడ ఒక రకమైన అహంభావం కనిపిస్తుంది.

మొత్తానికి, ఇప్పటివరకు మనం చర్చించిన దాన్నిబట్టి, ఉత్తమ పురుషలో మాట్లాడినప్పుడల్లా, కవి తనగురించే మాట్లాడుతున్నాడా అంటే, లేదని చెప్పవలసివస్తుంది. ఇదే ప్రశ్నను తిరగేసి కూడా అడగవచ్చు. అంటే, కవి తన గురించి చెప్పవలసి వచ్చినప్పుడల్లా, ఉత్తమపురుషలోనే మాట్లాడుతున్నాడా? బహుశ దీనికికూడా లేదనే సమాధానం చెప్పుకోవాలేమో. కారణమేదైనా కావచ్చు కాని, కవి తానని చెప్పకుండా తనగురించి మాట్లాడటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. తన వస్తువుకి ఒక అహంభావాన్నివ్వటానికి ఆ మూడోవ్యక్తి తానే అయి ఎలా మాట్లాడతాడో, అదే విధంగా తన అహంభావం నుంచి దూరం కావటానికి తనను తాను రెండవ వ్యక్తి గానో, మూడవ వ్యక్తిగానో చూపించి మాట్లాడవచ్చు. తత్వాల వంటివి దీనికి మంచి ఉదాహరణ. వీటిలో, పాడుతున్న వ్యక్తి తన గురించి పాడుతున్నా, “మనసా ” అనో, “చిలకా” అనో పాడతాడు. మరొక ఉదాహరణగా రమణజీవి పద్యాలు తీసుకోవచ్చు. వీటిలో అనేక చోట్ల కవి “నువ్వు” అని రాస్తాడు. కాని, వీటిలో కనిపించే ఆత్మానుశీలనా ధోరణిని గమనిస్తే, కవి పాఠకునికంటె ఎక్కువగా, తనతోనే మాట్లాడుతున్నాడేమోననిపిస్తుంది

ఓ సాటి మనిషి కోసం
పక్షుల దారులన్నీ వెదుకుతావ్‌
నదిగా మారి లోకమంతా
తిరుగుతావ్‌
సముద్రపు అలని అలనీ
అడుగుతావ్‌
సాటి మనిషి జాడ కోసం

నీ చొక్కా ఎడమజేబులో
గుట్టలు గుట్టలుగా పడివున్న
మనుషులు
నిన్ను చూసి నవ్వుతుంటారు

(సాటి మనుషులు)

అందరిలాగే కవిలో కూడా అనేక బలహీనతలు, లోపాలు ఉండవచ్చు. ఐతే, వాటి కతీతంగా అతడు ఈ సృజనాత్మక క్రియను చెయ్యగలుగుతాడు. ఒకోసారి తన కవితల ద్వారా తనను తాను ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. (“పదే పదే తమ అంతరంగాల్ని కడుక్కునే కదా, కవులు పద్యాలు సృష్టిస్తున్నది”) ఈ క్రమంలో కూడా అతను తనను తాను దూరంనుంచి పరిశీలన చేసుకోవచ్చు.

చివరిగా ఒక కవితలో నేను అనే పాత్రలో కవే ఉన్నా, కవితలో ఈ పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి అనేక స్థాయీ భేదాలుంటాయి. ఆయా సందర్భాల్ని బట్టి కవి తన అహాన్ని కుదించటమో, విస్తరించటమో చేస్తాడు. ముఖ్యంగా ప్రకృతి వైభవం లేదా ప్రకృతి వైపరీత్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, కవి తన వస్తువును విస్తృతంగా ఆవిష్కరించి, తానొక మూల ఒదిగి ఉంటాడు. ఆకెళ్ళ రవిప్రకాష్‌ రాసిన “ఉదయాన్నే నగరం” అనే కవిత తీసుకుందాం.

చెట్ల కొమ్మల కింద రాత్రంతా
ముడుచుకు పడుకున్న పక్షులన్నీ
ఉదయాన్నే ఆకాశం రహదారి మీద
గుంపులుగా ఊరేగుతాయి.

ఇలా మొదలైన ఈ కవితలో చివరివరకూ కవి ప్రస్తావన ఉండదు. ముగింపులో మాత్రం ఈ వాక్యాలుంటాయి

ఒక కప్పు కాఫీ తాగుతూ
వార్తల్ని చప్పరిస్తాను.
ఒక అందమైన ఉదయాన్ని భద్రంగా
నాకప్పగించి వెళిపోయిన వాళ్ళందరికీ
మళ్ళీ  ధన్యవాదాలు చెప్పుకుంటాను.

ఈ కవితలో కవి పాత్ర పరిమితం. ఐతే, కొన్ని సందర్భాల్లో, కవి తన అభిప్రాయాలను, వాటిపట్ల తనకున్న నిబద్ధతనూ చాటుకోవటానికి ప్రాధాన్యత నిచ్చినప్పుడు, పద్యమంతా తానై విస్తరిస్తాడు. అప్పుడప్పుడు కవులు కేవలం నిరసనతో ఆగిపోకుండా, ఫలానా దాన్ని నేను నిషేధిస్తున్నానని, లేదా బహిష్కరిస్తున్నానని కూడా రాస్తుంటారు. ఇటువంటి చర్యలు చేపట్టే అధికారాలేవీ వాస్తవానికి కవికి లేకపోయినా, తన నమ్మకాలవల్ల ఏర్పడిన నైతిక బలంతో అతనీ మాటలంటాడు. ఇక్కడ అతని అహానికున్న విస్తృతిని మనం చూడవచ్చు.

కవిత్వ సృజనలో భాగంగా, కవి తనను అనేక రూపాలలో చూసుకోవటమో, తాను అనేక రూపాలలో కనబడటమో చేస్తాడు. ఇటీవల  ప్రచురించిన తన  కవితా సంకలనానికి వంశీ కృష్ణ “కొన్ని నేనులు” అని పేరుపెట్టాడు. కవిత్వంలో కవి పాత్రను సూచించటానికి ఇంతకంటె మంచి అభివ్యక్తి మనకు దొరకదు.