తానా కథల పోటీలు, బహుమతి పొందిన కథలు: ఒక చిన్న పరిశీలన

1

తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలనే ప్రయత్నమే తానా కథల పోటీ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం[1]. పోటీల నిర్వహణతో ఉత్తమ సాహిత్య సృష్ఠి జరుగుతుందా అన్న సందేహాన్ని ప్రక్కన పెడితే, తానా ఆశయం అభినందనీయం! సక్రమంగా నెరవేరితే తెలుగు సాహిత్యానికి, తద్వారా సమాజానికి కాస్తోకూస్తో మేలు జరుగుతుంది.

గత పోటీలలో మాదిరిగానే ఈసారి కూడా పాతిక వేల రూపాయల బహుమతికై ఆశించిన ప్రమాణాలకు ఏ కధానికా చేరుకోలేదంటూ, మూడు కథలకు మొదటి బహుమతి, మరో మూడు కథలకు ద్వితీయ బహుమతి ప్రకటించడం జరిగింది. అనగా, పాఠకులకూ, సాహితీపిపాసులకూ ఒక్క కథకు బదులు చదవడానికి ఆరు కథలు దొరికాయి!

కథలు చదవనంత వరకు ఈ వార్త కాస్త ఆనందదాయకంగా అనిపిస్తుంది.

స్థూలంగా మాండలికంలో కంటతడిపెట్టించే కరవు కష్టాల ఫార్ములాలో కొన్ని, ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రస్తావన(కథకు సంబంధమున్నా లేకున్నా) చొప్పించిన కథలు కొన్ని, బరువైన సందేశాలను పాఠకుని నెత్తిన విసురుగా వేసే కథ ఒకటి, పాత్రల గడబిడ వాదాలతో … అయోమయానికి గురిచేసే విపరీత పోకడలున్న కథ మరొకటి.

మంచి కోటు కుట్టించుకోవడం కోసం కొన్న నాణ్యమైన బట్ట నైపుణ్యంలేని టైలర్‌ చేతిలో పడి అస్తవ్యస్తంగా తయారైనట్లు, ఎంపిక చేసుకున్న వస్తువులు బాగున్నా, వస్తువులను కథలుగా మార్చడంలో రచయిత(త్రు)లు కృతకృత్యులు కాలేకపోయారనిపిస్తుంది.

గెలుపొందిన కథల్లో కథా ప్రక్రియకు సంబంధించిన ఏ ఒక్క అంశానికీ పూర్తి న్యాయం జరిగినట్లు అనిపించదు. చెప్పదలచుకున్న విషయానికి సహకరించే పాత్రలను సృష్టించకపోవడం, సరైన సన్నివేశాలను ఎన్నుకోక పోవడం, కథకు బలాన్నిచ్చే సంక్షిప్తతను విస్మరించడం … వెరసి కథా శిల్పం కళావిహీనంగా మారడం ఎంతో నిరాశపరిచిన అంశం.

2

బహుమతి పొందిన కథలపై ఒక చిన్న పరిశీలన

మిత్తవ : ఇంట్లో ఇత్తు లేక, కల్లంలో గింజ లేక, బావుల్లో నీళ్ళ చుక్క లేక బతుకును, ఇల్లొదిలిపోయిన భర్తను వెతుక్కుంటూ పిల్లలతో బయల్దేరి, పుట్టింటికి చేరుతుంది గోయిందమ్మ. అక్కడి పరిస్థితులూ అంతంత మాత్రంగానే వుంటాయి. కన్నవాళ్ళ ఇంట్లో కూడా భారమయ్యానని తెలుసుకుని బిడ్డలని చంపి, తనను తాను చంపుకుంటుంది గోయిందమ్మ!

కరవు నేపథ్యంతో సాగే ఈ కథకు ఆత్మ గోయిందమ్మ. ఎంచుకున్న సన్నివేశాలు, సృష్ఠించిన పాత్రలూ కథ ఆత్మను ఆవిష్కరించడానికి ఉపయోగపడినట్లు కనిపించవు.

ఇతివృత్తంలో కొత్తదనం కనిపించదు. కరవు వల్ల జరిగిన, జరుగుతున్న ఆత్మహత్యల గురించి, హత్యలకు ఆత్మహత్యలకు కారణమయ్యే దారిద్య్రం మీద ఇప్పటికి చాలా కథలే వచ్చాయి.

ఒంటిగా ఏటికి ఎదురీదే స్వభావం, ఒంటి చేత్తో సంసారాన్ని లాగే తత్వ్తం గోయిందమ్మ పాత్ర గురించి కథ సాగేటప్పుడు తెలిసే అంశాలు. అలాంటి ధైర్యస్తురాలు పెనిమిటి పరారైనా, కన్నవాళ్ళ ఇంట్లో చోటు కరవైనా ఇంకో మార్గం గురించి అన్వేషిస్తుందేతప్ప కన్న బిడ్డలను హత్య చేయడం, ఆత్మహత్య చేసుకోవడం పాత్ర స్వభావానికి తగినట్లు అనిపించదు. “పరిస్థితులు ఆమెనలా తయారు చేసాయి; ఆమెకు హత్యలు చేయడం, ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే మిగిలిన మార్గాలు” అన్న ముగింపు వల్ల ప్రయోజనమూ బోధపడదు. బుజ్జిగాడు, మాలక్షుమ్మల చావులు కథకు ఏ మాత్రం ఉపయోగపడినట్లు కనిపించవు.

కరవు నుంచీ, కష్టాల నుంచీ బయటపడేందుకు ఉపకరించే ఆలోచనలను ప్రేరేపించేదిగా ఉంటే కథకు కాస్త కొత్తదనం, బలం చేకూరేవి. కథలో అక్కడక్కడా కథ చెబుతోంది గోయిందమ్మో, కథకుడో అర్థం కాదు.కథలో నచ్చిన అంశం కధనమంతటా కనిపించి, వినిపించే కరవు!

హాలాహలం: ఆత్మహత్య చేసుకున్న దయాకర్‌ను చూడ్డానికి వెళ్ళిన హేమ, శవం చుట్టూ చేరిన వాళ్ళ మాటల ద్వారా దయాకర్‌ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుని, ఎప్పటికైనా పరిస్థితి మారబోదా అనుకుంటుంది.

అతివిపులీకరణ + మాండలికం+కష్టాలు+కన్నీళ్ళు(+ ఆత్మహత్య ) = బహుమతి … అన్న ఫార్ములాలో వండిన మరో కథ ఇది.

ఈనాటి రైతుల దుస్థితికి కేవలం ప్రకృతే కారణం కాదు, ప్రభుత్వం కూడా కారణమని చెప్పడానికి ప్రయత్నించిన ఈ కథ, ఇప్పటి పత్రికల్లో రైతుల ఆత్మహత్యల గురించి వచ్చిన, వస్తూన్న వార్తా కథనాల స్థాయిని దాటకపోవడం ప్రధాన లోపం. కథలో తారసపడే ఏ ఒక్క పాత్రలోనూ జీవం ఉండదు. అన్ని సమస్యలూ రైతును ఆత్మహత్య వైపు తీసుకువెళుతున్నాయి, సమస్యల్లోంచి బయట పడే మార్గమే లేదు అని చెప్పే కథల కంటే చుట్టూ జరుగుతున్న మార్పులను లోతుగా అధ్యయనం చేసి, మార్పులకు తగ్గట్టు మారాల్సిన రైతుల ఆలోచనల గురించి కథలు రావాల్సిన తరుణమిది.

తెలిసీ తెలియని మాండలికాన్ని కథలో చొప్పించి ఎన్ని చిత్రహింసలకు గురి చేయవచ్చో తెలిపే కథ. ఉదాహరణకు పెద్దమ్మ పాత్ర తన పాఠం అప్పచెప్పేటప్పుడు “మధ్యాహ్నం”, “రిక్షా” అన్న పదాలను బాగానే పలుకుతుంది కానీ మిగిలిన వాక్యాన్ని మాండలికంలో చెబుతుంది(బహుమతి ఫార్ములా తప్పిపోతుందని) …”కంప్యూటర్లు”, “సైబర్‌ కేఫులు” అనగలిగిన పాత్ర, గభాలున మాండలికంలోకి గొంతు మారుస్తుంది. ఇంకో చోట “…సూర్యుడు పడమటి కొండల్లోకి దిగబాకుతుండాడు” అనే వాక్యం కనిపిస్తుంది. ..ఇంకా ఇలాంటివి ఈ రచనలో ఎన్నో తారసపడతాయి.

సమస్యను సమస్యగా, సన్నివేశాన్ని సన్నివేశంగా యథాతధంగా చిత్రించడం కథ అవుతుందా? కథ అయితే అది ఎంత వరకు పాఠకుల చైతన్య పరిథిని విస్త్తృతం చేస్తుంది? కథ ఒక మార్మిక కళా ప్రక్రియ అన్న విషయాన్ని విస్మరించినపుడు, ఇలాంటి రచనలు కథలుగా చెలామణి అవుతాయి. బహుమతులూ పొందుతాయి!

కథకు అన్ని విధాలా సరిగ్గా సరిపోయే పేరు పెట్టడమొక్కటే ఈ కథలో నాకు బాగా నచ్చిన అంశం! ఇది పాఠకులకు నిజంగా “హాలాహలమే”!!

నందిని : ప్రారంభం ఉత్సాహంగా ఉండి పోనుపోను విసుగ్గా సాగే ఈ కథ,పూర్తిగా చదివాక ఆలోచిస్తే, కాస్త అయోమయానికి కూడా గురి చేస్తుంది. ఆర్ధిక స్వాతంత్య్రం వుంటే, స్త్రీలు పెళ్ళి కాకుండా నచ్చిన వాడితో “సావాసం” చెయ్యొచ్చు అన్న అంశం మీద చాలా కథలే వచ్చాయి.

ప్రధాన పాత్ర నందిని, తన స్నేహితురాలు మాధవి తో జరిపే మొదటి సంభాషణలో అప్పటి వరకు పెళ్ళి గురించి ఆలోచించలేదంటూనే, పెళ్ళి తంతు అన్యాయంగా తోస్తోందని, పెళ్ళి కోసం మరీ ఇంత రాజీ పడాలా అని, పెళ్ళి చేసుకోకుండా బ్రతకడమే సుఖం లాగుంది అని అంటుంది. తర్వాత అమెరికా వెళ్ళిపోయి బోలెడంత డబ్బు సంపాదించి, తన కొలీగ్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ కాపురం చేస్తూ, తన ఇష్టపూర్తిగా తల్లి అవుతుంది, పెళ్ళి చేసుకోకుండా. ఇంకా ఆవిడ ఉద్దేశ్యంలో పెళ్ళంటే జీవితాన్నీ, శరీరాన్నీ, ఆలోచనల్నీ ఎవరిష్టం కోసమో ఆడించడం. ఇలాంటి అభిప్రాయం ఈమెకు కలగడానికి కారణాలు కథలో కనిపించవు. అలాగే కూతురు తన మంచేదో తను చూసుకోగలదన్న తండ్రి, కథ చివరకొచ్చే సరికి ఎందుకంతలా మారాడో కారణం కనిపించదు. ఇక మార్క్‌ ఈవిడ వెంట ఎందుకు పడతాడో, ఈమెలో అతడిని అంతగా ఆకర్షించినదేమిటో(భయం, దిగులు కనిపించని కళ్ళా?) తెలియదు. అవకాశం వున్న వాళ్ళు ఎవరికి తోచినట్లు వాళ్ళు బతకాలి అంటుంది. అంతా చెప్పాక, కొన్ని పేజీలకు విస్తరించిన సంభాషణల తర్వాత, “…ఈ డెలివరీ నించి బయటపడదాం. ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళం కమిట్‌ అవగలం, మనకి ఒకళ్ళ తోడు ఒకళ్ళకి జీవితాంతం అవసరం అని నమ్మకం కలిగితే అప్పుడు చూద్దాం” అని తెగేసి చెప్పిన నందిని, క్లైమాక్స్‌ కోసమన్నట్లు పెళ్ళి చేసుకోవడానికి మనసు మార్చుకుంటుంది…హాస్పిటల్లోనే.

పెద్ద పెద్ద సంభాషణలు, వాదనలో గజిబిజితనం, వ్యాసంలా సాగే కథనం, పాత్ర చిత్రణలో లోపాలు పాఠకులను నిరాశ పరుస్తాయి. సంక్షిప్తత పాటిస్తే కథకు బలం చేకూరేది.

మాండలికం జోలికి వెళ్ళక పోవడం ఊరట కలిగించింది. బహుమతి పొందిన కథలలో కాస్త మెరుగ్గా కనిపించింది ఇదొక్కటే కథ!

అతడు నేను: కోరి పెళ్ళి చేసుకుని, భార్య అభిరుచులను హేళన చేసి, భార్యను బానిసగా చూసే భర్త; పెళ్ళిలో లాంఛనాలైనా జరిపించలేదని చీదరగా చూసే అత్త మంచాన పడ్డప్పుడు సంస్కారం గల కథానాయిక విశాల హృదయంతో సేవలు చేయడం, ఈ కథ ఇతివృత్తం.

ఈ కథ ద్వారా చెప్ప దలచుకున్న సందేశం గొప్పది!

సందేశాన్ని కళాత్మకమైన ఆకృతిగా ఆవిష్కరించేదే సాహిత్యం. కథ ఒక బలమైన సాహితీ ప్రక్రియ. పాఠకులను కదిలించగలిగినప్పుడే సాహిత్య ప్రయోజనం సిద్ధిస్తుంది.

అయితే ఈ కథలో ఏ ఒక్క పాత్రా మనసును తాకదు. కథ చెప్పిన ముఖ్య పాత్ర మీద సానుభూతి గానీ, గౌరవం కానీ కలుగవు. పైపెచ్చు ఆ పాత్ర చేసుకునే ఆత్మస్తుతి మీద చిరాకు కలుగుతుంది.

ఒక గోడులాగా నిర్లిప్తంగా సాగే కథనం, కథకు పెద్దగా ఉపయోగపడని విసుగెత్తించే వర్ణనలు, సంబంధంలేని ఇతర సమస్యల ప్రస్తావన మంచి కథగా రూపుదాల్చాల్సిన ఇతివృత్తాన్ని ఒక సాధారణ కథ స్థాయికి దిగ జార్చాయి.

చివరలో “తర్వాత మాట్లాడబోయే విషయానికి నాందిగా పొంతనలేని ఇంకేదో విషయం మాట్లాడే” ఒక స్నేహితురాలి పాత్రను లాక్కు రావడం, కథలో ఇరికించిన సంబంధం లేని విషయాలను బలపరచడానికేనేమో!

చలివేంద్రం : ప్రపంచీకరణ, కరవు, పోలీసులు, నక్సలైట్లు…అన్నింటిని స్పృశించిన కథ. కథలో తీక్షణత లోపించడానికి ప్రధాన కారణం అదే. మనసును కదిలించే సంఘటనలు, కథను నాలుగు రోజులు గుర్తుంచుకునేలా చేసే పాత్రలు కరవైన కథ ఇది.

కాకపోతే, వ్యాసంగా సాగదు. గుదిగుచ్చిన వార్తా సంపుటి అసలే కాదు.

ప్రపంచీకరణ వల్ల కులవృత్తులకు ఆదరణ లోపించడం గురించి(చివరి సన్నివేశాల వరకు కథలో ప్రధానాంశం ఇదేననిపిస్తుంది) ఇదివరకు చాలా కథలు వచ్చాయి. ఆ కథల్లో ఈ అంశాన్ని చాలా సూటిగాను, విస్తృతంగాను, ప్రతిభావంతంగాను చిత్రించడం జరిగింది. పోలీసుల మైత్రీ మంత్రంలో నిజాయితీ లేదనీ, ఏ నేరమూ చెయ్యని “కుమ్మరెంకన్న”లు చట్టానికి బయట శిక్షింప బడుతున్నారని చెప్పడానికే ఈ కథ (ముగింపు ఆ దిశగా సాగింది కాబట్టి) అయితే, కథ ప్రధమార్థంలోని కుమ్మరి జీవితానికి సంబంధించిన విషయాలు అంతగా విపులీకరించి చెప్పవలసిన అవసరం వుందా అనిపిస్తుంది. ముగింపు కూడా ఆకట్టుకునేదిగా లేదు. ఐతే, బహుమతి కథల ఊసర్క్షేత్రంలో ఈ కథ కూడ మరో ఆముదపుచెట్టు.

కథలో ఉపయోగించిన భాష బాగుంది. కథ సమగ్రరూపాన్ని చూపించే ప్రారంభ వాక్యాలు బాగున్నాయి, ముగింపుకు చేరేసరికి తేలిపోయిన కథ.

ఆ ఇల్లు మూత వడ్డది: బహుమతి సూత్రాన్ని వంటబట్టించుకుని తయారు చేసిన కథ.

అంచలంచెలుగా ఒక పేద రైతు జీవితాన్ని, భవితవ్యాన్ని పథకం ప్రకారం ఆక్రమించుకున్న సేటు వ్యాపార దృక్పధం గురించిన కథ ఇది.

కథలో ఒక్కో సన్నివేశాన్ని చదువుతూ పోతుంటే, సేటు కుట్ర వల్లనే రైతు నిస్సహాయ స్థితిలోకి నెట్టబడినట్లు అనిపించదు. పరారైన రైతు కుటుంబంపై అంతులేని జాలి, అందుకు కారకుడిగా కనిపించే సేటు మీద అలవిగాని అసహ్యమూ కలుగవు. అందుకు ప్రధాన కారణం కథలో అనుభూతి సంపద కొరవడడం.

ఈ కథ ద్వారా సాధించదలచుకున్న క్రొత్త ప్రయోజనమేమిటో అర్థం కాదు(బహుమతి సంపాదించుకోవడం తప్ప)!.

విసుగెత్తించే కథనం, జీవంలేని పాత్రలు, అతివిశదీకరణం ఈ కథలో కొన్ని బలహీనతలు.

నచ్చిన అంశమేమైనా ఉందా అని తరచి తరచి ఆలోచిస్తే నేలమీద, నిప్పు మీద, నీళ్ళ మీద సేటు సాధించిన ఆధిపత్యాన్ని చూపించే క్రమం ఒకటి గుర్తొస్తోంది.

3

ఎన్నికైన కథలన్నింటిలోనూ మంచి వాతావరణ చిత్రణ, చక్కగా చదివించే గుణం వున్నట్లు అభిప్రాయపడిన [2] న్యాయ నిర్ణేతలతో ఎంత మంది పాఠకులు ఏకీభవిస్తారో చూడాలి.

దాదాపు అన్ని కథల్లోనూ సంక్షిప్తత లోపించడం, అతివిపులీకరణ, కథకు ఏ మాత్రమూ సంబంధమున్నట్లు కనిపించని కొన్ని పాత్రలూ, సన్నివేశాలు, సంభాషణలు…కనిపించిన ప్రతి విషయాన్ని స్పృశించాలన్న తపనతో చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పలేకపోవడం(తీక్షణత కోల్పోవడం), కథా శిల్పం మీద సరైన అవగాహన లేక పోవడం లోపాలు. ఇన్ని లోపాలున్న ఈ కథలే, పోటీకి వచ్చిన అన్ని కథల్లోనూ తానా “ప్రమాణా”లకు సరిపోవడం “విచారించాల్సి”న విషయం.

ఈ పోటీలలో నెగ్గిన కథల్లో కనిపించే అతివిపులీకరణకు బహుశా గత పోటీలలో బహుమతిపొందిన “అస్తిత్వానికి అటూ ఇటూ”,”జీవితానికి ఎన్ని రంగులో”, “1998”(కథ పేరు) కథలు, సంక్షిప్తత లోపించడానికి, ఎక్కువ కథల్లో గ్లోబలైజేషన్‌ను స్పృశించడానికి, (అవసరమున్నా లేకున్నా), “పుస్తకంలో అలా ఉంది, టీవీలో ఇలా అంటున్నారు” లాంటి పోకడలకు “టైటానిక్‌”, “జీవితానికి ఎన్ని రంగులో”, “1998”(కథ పేరు) కథలు, కొన్ని కథల్లో (తెలిసీ తెలియని)మాండలికాన్ని చొప్పించడానికి “నీడ” కథ ప్రేరణలు కావొచ్చు.

ఒక్క కథలో తప్పించి, మిగిలిన అన్ని కథల్లోనూ ఎక్కువ మోతాదులోకనిపించే కష్టాలు, కన్నీళ్ళకు, బహుశా 2001 పోటీలో బహుమతి పొందిన కథలే ప్రేరణ కావొచ్చు! గతంలో గెలుపొందిన కథల గుణగణాలను పరిశీలించి, వాటి ప్రాతిపదిగ్గా ఈ కథల నిర్మాణం జరిగిందేమో నన్న అనుమానం కలుగుతోంది పరీక్షలకు తయారవుతున్నప్పుడు పాత ప్రశ్నాపత్రాలు చూసుకుని తయారు కావడం సహజమే (చాలామంది విషయంలో)! 2001 లో పోటీ నవలల పరిశీలకులు [1] అన్నట్లు, ఇది ఆందోళన కలిగించే విషయం. ఇక ముందు జరగబోయే పోటీలకు ఎలాంటి కథలు సిద్ధమౌతాయో?!

తానా ప్రచురణల కమిటీ, కథాసాహితి(హైదరాబాద్‌)(2001, 2003), స్వాతి వార /మాస పత్రికల (1999) సహకారంతోనూ నిర్వహించిన కథల పోటీలకు 1999 లో దాదాపు 700 కథలు [3], 2001 లో 486 కథలు [1], 2003 లో 396 [2] కథలు పోటికి వచ్చాయి. కథల సంఖ్య రానురాను తగ్గి పోవడానికి కారణం ఈ పోటీలపై రచయిత(త్రు)లకు ఉత్సాహం తగ్గిపోవడమా, అసలు కథలు వ్రాసేవాళ్ళే తగ్గిపోవడమా? కారణమేదైనా ఇది మంచి పరిణామం కాదు.

అలాగే పోటీలకు వచ్చిన కథల్లో ఆశించిన ప్రమాణాలకు ఏ కథా చేరుకోక పోవడమూ, ఎన్నో వడపోతల్లో మిగిలి బహుమతి చేజిక్కించుకున్నవి “బలహీనమైన కథలు” [2] కావడం ఏ రకంగానూ శుభ సూచిక కాదు.

4

బలహీనమైన కథలకు బహుమతులివ్వడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అని ఆలోచించినపుడు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు చెప్పిన ఈ క్రింది వాక్యాలు గుర్తొచ్చాయి[4].

“పదిమంది అభిమానులు కలిసి ఎంత చిన్న రచయిత కయినా ఒక పెద్ద సన్మానం చేసి, తమ పలుకుబడితో పత్రికల్లో పది ప్రశంసా వాక్యాలు రాయిస్తే, ఆ చిన్న రచయిత మరునాటికే పెద్ద రచయిత అయిపోతాడు. ఆ పదిమందీ సాహిత్య అకాడమీ సభ్యులో, సభ్యుల ఆప్తులో అయితే, ఇక ఆ రచయిత కీర్తి పగటి దీపాలే పట్టించుకుంటుంది. ఆ పగటి దీపాలను ప్రజలు ఒక వేడుకగా చూస్తారుఎవరికీ అపకారం తలపెట్టని పెండ్లి ఊరేగింపును చూసినట్టు. అపకారం యెక్కడుందంటే, ఉత్తమ సాహిత్య సృష్టికి ప్రేరణ యివ్వగల విచక్షణాయుత ప్రజాభిప్రాయాన్ని హతమార్చడంలో ఉంది. పదిమంది భజనపరుల సాయంతో కీర్తి కాంతను చెరపట్టి తెచ్చుకోగల సాహిత్య రాజ్యంలో ఉత్తమ సాహిత్య సృష్టికి తగిన ప్రేరణా, ప్రోత్సాహమూ, ప్రతిఫలమూ లభించవు”.” విమర్శ (సంపాదకీయం); సంవేదన, జూలై, 1968

బహుమతి పొందిన కథలన్న “ముద్ర” లేకుంటే పేజీలు తిప్పే ఆసక్తిని కూడా చంపేయగల శక్తి ఈ కథల్లో చాలా వాటికి వుంది.

క్రొత్త రచయిత(త్రు)లకు, ఇప్పుడిప్పుడే చెయ్యి తిప్పుతున్న రచయిత(త్రు)లకు కథలు వ్రాసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోవడానికి ఈ కథలు ఉపయోగపడొచ్చు!

శ్రీ వేల్చేరు గారు “ఇప్పటి సంగతి” వ్యాసంలో చెప్పినట్లు “కథకులే కథల బాగోగులను నిర్ణయించగలరు” అని విశ్వసిస్తూ, కథకులు కూడా ఈ కథల గురించి చర్చిస్తే బాగుంటుందనుకుంటున్నాను.

ఈ కథల పైన ఇంకా ఫలవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.

సూచిక

  1. తానా 2003 సమీక్షా పత్రం (“ఈమాట” ఈ సంచికలో)
  2. తానా 1999 తెలుగు పలుకు (తానా కాన్ఫరెన్స్‌ జ్ఞాపనపత్రిక 1999, కథల పోటీ పై సమీక్షా పత్రం )
  3. సారస్వత వివేచన, రాచమల్లు రామచంద్రారెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
  4. ఇప్పటి సంగతి