కవిత్వంలో అనూహ్యత

చిన్నప్పుడు ఒక సరదా ఉండేది. సినిమా పాటల్లో ఎక్కడైనా ఒక లైన్లో “సన్నిధి” అనే పదం వస్తే, వెంటనే తరువాతి లైన్లో “పెన్నిధి” అని వస్తుందని ముందుగానే ఊహించే వాళ్ళం. ఎప్పుడూ అలాగే జరుగుతుంది కాబట్టి చాలా ఆనందం కలిగేది. తరువాత తరువాత ఇదే టెక్నిక్‌  చరణంశరణం, అధరంమధురం,అందంబంధం వంటి చోట్ల కూడా ఉపయోగపడుతుందని తెలిసింది.

ఇది చాలా సాధారణమైన ఉదాహరణ అనుకోండి. అయితే ఒక్క విషయం గుర్తించటానికి దీనిని ఉపయోగించవచ్చు. కవిత్వ పఠనంలో పాఠకుడిది క్రియాశీలక పాత్ర.ఒక కవిత ఎంతవరకు ఫలవంతమౌతుందనేది, పాఠకుని ఊహలపై అది కలిగించే ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పాఠకుని ఊహకు సంబంధించినంతవరకు, ఒక కవిత రెండు రకాలుగా అతనికి ఆశ్చర్యం లేదా ఆనందం కలిగిస్తుంది. ఒకటి, అతని ఊహల్ని, ఆలోచనల్ని సరిగ్గా ప్రతిబింబించటం వలన, రెండు అతను ఊహించలేని విషయాన్ని చెప్పటం వలన.

మనకందరికీ సామాన్యమైన కొన్ని అనుభవాలుంటాయి. ఉదాహరణకి, ఇల్లు మారటం, ఊరు మారటం, స్నేహితుల నుంచి ఎడబాటు, దాంపత్యం, పిల్లల్ని ప్రేమించటం వగైరా. ఈ అంశాలమీద అనేకమంది కవితలు రాసారు కూడా. ఈ అనుభవాలు ఒక సామాన్య పాఠకునికి ఎదురైనప్పుడు అతనికి కొన్ని ఆలోచనలు, అనుభూతులు కలగటం సహజం. వీటిపై రాసిన కవితలలో ఈ సామాన్య పాఠకుని అనుభూతులను సరిగ్గా ప్రతిబింబించిన కవిత ఎక్కువ ఆదరణ పొందుతుంది. కవి తన అంతరంగాన్ని అంత బాగా ఎలా కనుగొన్నాడన్న ఆశ్చర్యం, తనలాగే ఆలోచించేవారు అనేకమంది ఉంటారని తెలుసుకోవటంవల్ల ఏర్పడే ఆనందం పాఠకునికి కలుగుతాయి.

పాఠకుడు ఏరకంగానూ ఊహించలేని విషయాన్ని చెప్పటంద్వారా కూడా కవిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, రమణ జీవి రాసిన “మత్స్యావతారం” అనే కవితను తీసుకుందాం .

చేపకోసం
గాలం వేసి వొడ్డున కూచున్నా
ఎర కదిలే సమయానికి
నా కళ్ళని ఎవరో మూసారు
వెనక్కి తిరిగి చూస్తే
చేప !

ఇందులో చెప్పిన సంఘటన సంభావ్యతను గురించిన ఆలోచన పక్కనబెడితే, ఇటువంటి ఊహ కలగటమే ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఊహలో ఉన్న కొత్తదనం పాఠకున్ని ఉత్తేజపరచి, వివిధ కోణాలనుంచి దానిని పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ విధం గా పాఠకునిలో ఆశ్చర్యం రేకెత్తించటానికి కవి అనేక రకాలైన టెక్నిక్సు వాడతాడు. అందులో ఒకటి సాధారణ పదచిత్రాన్ని తల్లక్రిందులు చెయ్యటం . ఉదాహరణకి ఒక ప్రముఖ మెక్సికన్‌ కవి రాసిన ” Black Stone ” అనే ఈ కవిత చూడండి :

This black stone
is a piece of the night
that time has made palpable
so that man
might carry darkness in his hand

రాత్రి ఒక నల్లని రాయిలా ఉందనిచెప్పినా అది కవిత్వం అవుతుంది; మన ఊహల కందుతుంది. కాని, ఒక చిన్న నల్ల రాయిని చేతిలో యిమిడిపోయే రాత్రి శకలం లా ఉన్నదని చెప్పటం ద్వారా కవి గొప్ప సంభ్రమాన్ని కలిగిస్తున్నాడు. ఈ రకమైన ప్రయోగం అన్ని పదచిత్రాల విషయంలోనూ అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి, మబ్బులు ఏనుగుల్లా ఉన్నాయన్నా,ఏనుగులు మబ్బుల్లా ఉన్నాయన్నా దాదాపు ఒకరకమైన స్పందనే మనకు కలుగుతుంది. ఇక్కడ పదచిత్రాన్ని తల్లక్రిందులు చెయ్యటం వలన వచ్చిన ప్రత్యేక ప్రభావమేదీ లేదు. ఎంతో సమర్దవంతుడైన కవి మాత్రమే ఈ ప్రయోగానికి సరిపోయే పదచిత్రాల్ని గుర్తించి ఉపయోగించ గలుగుతాడు..

మరొక టెక్నిక్‌ ఒక పదాన్ని వ్యతిరేకార్థంలో వాడటం. అంటే ఒక మంచి అర్థం వచ్చే పదాన్ని చెడ్డగాను, చెడు అర్థం వచ్చే పదాన్ని మంచిగాను వాడటం. హాస్య ప్రసంగాలలో కూడా ఇటువంటివి చోటుచేసుకొంటాయి.(అందువల్లనేనేమో గొప్ప కవులు చాలామంది హాస్యప్రసంగాలకు కూడా ప్రసిద్ధులవటం.) ఉదాహరణకి, “సంపూర్ణ మానవుడు” అనే పదం మీద శ్రీ శ్రీ ఒక పద్యంలో చేసిన చమత్కారం చూడండి :

సంపాదకుడంటే నా
కింపారెడు భక్తి గలదు ఎందుకనంటే
సంపూర్ణ మానవుడతడు
చింపాంజీ కంటె నయము సిరి సిరి మువ్వా!

ముందు రెండు పాదాల్లో కలిగించిన మంచి అర్థం వల్ల చివరిపాదంలో స్ఫురింపచేసిన వ్యతిరేకార్థం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇంత సమర్థవంతంగా కాకపోయినా, ఇటువంటి ప్రయోగాలు ఇతర కవులు చేసిన సందర్భాలనేకం మనకు దొరుకుతాయి.

పాఠకుణ్ణి ఆశ్చర్యపరచే క్రమంలో కవులు చేసే మరో ప్రయత్నం కొత్త పదచిత్రాలను సృష్టించటం. సాధారణంగా, ఒక పోలిక వాడినప్పుడు, అందులో పోల్చబడ్డ రెండు వస్తువులు మనకు పరిచితమైనవే అయి ఉండవచ్చు. ముఖం చంద్రబింబంలా ఉందనో, కళ్ళు చేపల్లా ఉన్నయనో అంటే వీటిలో పోల్చబడే రెండు వస్తువులు ప్రకృతిలో ఉన్నవే.ఎటొచ్చీ వాటిమధ్య ఒక సామ్యాన్ని చూడటమే కవి చేస్తున్న పని. అలాకాకుండా, కొన్ని సందర్భాల్లో పోల్చబడే రెండు వస్తువుల్లో ఒకదానిని కవే సృష్టించటం జరుగుతుంది. ఉదాహరణకు

ఇప్పుడు ప్రతి చెట్టు
అజ్ఞాతవీరులు తనదగ్గర దాచిన ఆయుధాల్ని
తానే ధరించినిలచిన
జమ్మిచెట్టులా ఉంటుంది

అని అన్నాడనుకోండి. ఇటువంటి జెమ్మిచెట్టు ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కవి కల్పితం. ఒక్క పోలికనే కాకుండా, పోలికకు కావలసిన సాధనాన్ని కూడా కవే సమకూర్చుకోవటంవలన, ఇది కొత్తగా అనిపిస్తుంది.కొన్నిసార్లు ఒక పోలికగా కాకుండా, కొత్త పదబంధాల్ని కనుక్కోవటం ద్వారాకూడా కవులు మన ఊహల్ని విస్తరింపజేస్తారు. “నోరు లేని మృత్యువు ” (ఎమ్‌ఎస్‌నాయుడు ), “కలల్ని అరచేతులకి పెట్టుకున్న ఆడపిల్లలు” (శివారెడ్డి) వంటివి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పాఠకుడి ఊహల్ని విస్తరింపజేసే క్రమంలో భాగంగా కవులు అప్పుడప్పుడు ఫాంటసీని ఆశ్రయించటం కూడా మనం చూస్తాము. అమృతం కురిసిన రాత్రి దీనికి మంచి ఉదాహరణ. అర్థ రాత్రి వేళ ఆకాశంలో అప్సరసలు కనిపించటం, వారు తనని జీవితాన్ని ప్రేమించినవాడు జీవించటం తెలిసినవాడుగా గుర్తించటం, అమృతం కురిపించటం, తను దాన్ని దోసిళ్ళతో తాగి దుఃఖాన్ని, చావుని జయించటం ఇవన్నీ ఒక వింతైన కాల్పనిక వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. కవి తన భావాన్ని అనేక రకాలుగా సంకేతించవచ్చు. ఒక కాల్పనిక కధాంశంగా చెప్పటంకూడా అందులో ఒకటి.

ఇదే సందర్భంలో తిలక్‌ కవిత మరొకదాన్ని కూడా చెప్పుకోవచ్చు. “నిన్న రాత్రి” అన్న ఈ కవితలో దేవుడు తన మంచంపై కూర్చుని దీనంగా తనకేసి చూసి కన్నులు దించుకున్నాడని మొదలు పెడతాడు. నిజానికి ఆధునిక కవిత్వంలో భవవంతుని ప్రస్తావన గురించి ఎవరన్నా ఒక పరిశోధనా వ్యాసం రాయవచ్చు. పారలౌకిక చింతనతో కాకుండా, సామాజిక పరమైన మానవ వైఫల్యాన్ని వర్ణించటానికి ఆలంబనగా దేవుడనే భావాన్ని ఆధునిక కవులనేకమంది వాడుకున్నారు. వాటిలో కొన్నింటిలో దేవుడు నిస్సహాయునిగా, బాధితునిగా ఉంటాడు.పైచెప్పిన కవిత కూడా దాదాపు అదే ధోరణిలో సాగుతుంది. ఈ కవిత క్రింది విధంగా ముగుస్తుంది :

దేవుని చెక్కిళ్ళమీద దీనంగా జారే కన్నీటిని
దీప కాంతిలో చూసి, చటుక్కున జాలితో లేచి
కౌగలించి, ఊరడించి
కన్నీటిని తుడిచి
వెళ్ళిరమ్మని వీధి చివరిదాకా సాగనంపి వచ్చాను.
నాకు తెలుసు, నాకు తెలుసు
మానవుడే దానవుడై తిరగబడినప్పుడు
పాపం పెద్దవాడు కన్న కడుపు ఏం చేస్తాడని !

మరికొన్ని కవితల్లో అదే మానవ వైఫల్యాన్ని, అల్పత్వాన్ని వ్యంగ్యంగా సూచించటానిక్కూడా దేవుడనే భావనను ఉపయోగించుకోవటం జరిగింది. రమణ జీవి “రెండు పిలుపులు” అన్న ఈ కవితను చూడండి :

రెండు ఫోన్‌ కాల్స్‌ వస్తాయి
సాయంత్రం అయిదు గంటలకి

వొకటి క్లయింట్‌ నించి
వొకటి దేవుడి నించి

చాలాసేపు ఆలోచిస్తాను

దేవుడు ఆదీ అంతమూ లేనివాడు
క్లయింట్‌ పోతే మళ్ళీ రాడు

క్లయింట్‌ దగ్గరికే వెళ్తే
హార్టెటాక్‌ తో చచ్చిపోయివుంటాడు

దేవుడు ఇక ఎప్పుడూ
జీవితంలో ఫోన్‌ చెయ్యడు
ఫోన్‌ నంబరూ ఇవ్వడు.

చివరిగా, అనూహ్యతతో నిమిత్తంలేకుండా, ఒక పద్యాన్ని ముందే పాఠకునికి పట్టి యిచ్చే కొన్ని కవిత్వాంశాలను పరిశీలిద్దాం.అంటే, మొదట్లో చెప్పినట్టు, అరిగిపోయిన అంత్యప్రాసల్లాంటి వన్నమాట. వాటిలో ఒకటి పురాణ ప్రతీకల్ని వాడటం అందులోనూ ముఖ్యంగా అవే ప్రతీకల్ని అదే అర్థంతో తిరిగి వాడటం. ఒక కవిత వస్తువునిబట్టే, మనం ఈ ప్రతీకల్ని ఊహించవచ్చు. ఉదాహరణకి, దళితులకి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పేటప్పుడు ఏకలవ్యుడు, శంబూకుడు వంటివారు , స్త్రీల గురించి మాట్లాడే టప్పుడు సీత, ద్రౌపది వంటి పాత్రలు, దెబ్బతిన్న ఒక పక్షినిగురించి చెబుతున్నప్పుడు వాల్మీకి, గౌతముడు వంటివారు వెంటనే గుర్తుకు వస్తారు. వాటినే కవి ఉపయోగించినప్పుడు ఆ కవిత పాఠకునిలో ప్రత్యేకమైన స్పందన కలిగించదు. అందుకని కొత్తవైన, అరుదైన ప్రతీకల్ని ఎంచుకొని వాడితే బాగుంటుంది. లేదా, పాత ప్రతీకల్ని సాంప్రదాయమైన అర్థంలో కాకుండా, వేరే అర్థంలో వాడి ఒప్పించగలిగినా కొత్తగా ఉంటుంది.

అలాగే కొందరు కవులకి ఒక నిర్మాణ వ్యూహం ఉంటుంది.అటువంటి కవుల కవితలు కొన్ని చదివాక, వారి వ్యూహం అర్థమైతే, ఇక కవిత మొదలుపెట్టగానే అది ఏరకంగా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. ఉదాహరణకి కొందరు కవులు ఒకే అంశాన్ని ఒకో షసథలథ లో ఒకో ప్రతీకద్వారా చెప్తారు. మరికొందరు పద్య నిర్మాణంలో దాదాపు ఒక mathematical formula  కి కుదించగలిగినంత క్రమాన్ని పాటిస్తారు. శిఖామణి, సతీష్‌ చందర్‌ పద్యాలు కొన్నింటిలో ఇటువంటి నిర్మాణ వ్యూహాల్ని గమనించవచ్చు.

పాఠకుని ఊహకు పదునుపెట్టటంలో విఫలమయ్యే మరొక అంశం “అలవాటుగా” రాసే కవిత్వం. కొంత కాలం కవిత్వం రాసాక, కొంతమంది కవుల్లో ఒక routineness  ఏర్పడటం మనం గమనించవచ్చు. వస్తువు ఎంపికలోగాని, దాన్ని నిర్వహించటంలో గాని, ప్రతీకల ఎంపికలోగాని ఒక అలవాటు ధోరణిగా పద్యం రాసారని, కవిత్వ సృష్టికి కావలసిన ఒక తపన వాటిలో లోపించిందని పాఠకునికి ఇట్టే అర్థమైపోతుంది. చిత్రమేమంటే, ఇటువంటి కవితల్లో మనం తప్పుపట్టగలిగే అంశమేదీ ఉండదు. అలాగని కవిత్వమూ ఉండదు. అరసికులకి కవిత్వం వినిపించటం ఎంత నేరమో, అలవాటుగా కవిత్వం రాయటం కూడా అంతే నేరం.

కవిత్వం ఒక సృజనాత్మక ప్రక్రియ. అప్పటివరకు లేనిదేదో అందులో సృష్టింపబడాలి. పాఠకుడి ఊహల్ని నూతన తీరాలకు విస్తరింపజెయ్యాలి. అప్పుడే అది నవ నవోన్మేషంగా ఉంటుంది.