అమ్మాయిని అమెరికా ఇస్తున్నాం

హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్‌ పరిస్థితి.

అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై ఏళ్ళ వయసు దాకా పెరిగిన ఊరే. ఐతే అనేక కారణాల వల్ల (ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డం వాటిలో ముఖ్యమైంది కావొచ్చు) గత పదేళ్ళుగా అతనిక్కడికి రాలేదు. ఇప్పుడు వచ్చి చూస్తోంటే అంతా కొత్తగా, తనెప్పుడూ చూడనిదిగా అనిపిస్తోంది. బజార్లో అటూ ఇటూ లేచిన కొత్తకొత్త మేడలు. రోడ్డు మీద తనని కొంత వింతగా చూస్తున్న అపరిచిత ముఖాలు. ఎక్కడన్నా ఒకరు తనకేసి అనుమానంగా చూస్తున్న అనుమానం. వడివడిగా నడుచుకుంటూ ఇల్లు చేరాడు.

తన వాళ్ళని చూట్టం తోటే అతనికి కలిగిన మొదటి ఆలోచన వీళ్ళంతా ఎంతగా మారిపోయారా అనేది. మనుషుల్లో మార్పు కన్పిస్తోంది. పరిసరాల్లో మార్పు కన్పిస్తోంది. వస్తువుల్లో మార్పు కన్పిస్తోంది. ప్రవర్తనల్లో మార్పు కన్పిస్తోంది.

ఒకవేళ మారింది వాళ్ళు కాదేమో, తనేనేమో అని ఒక క్షణం అతనికి అనిపించకపోలేదు. కాని అది నిజమని అతనికి అనిపించలేదు.

సాయంత్రం ఎప్పటిలాగా (అంటే ఇరవై ఏళ్ళ క్రితం ‘ఎప్పటిలాగా’) ఊరి బయటికి షికారుకి బయల్దేరాడు. తన వీధంతా కూడ మారిపోయింది. అదివరకు పెంకుటిళ్ళు కొన్ని ఇప్పుడు డాబాలుగా పైకి ఎదిగాయి. ఒకటి రెండు డాబాలు వెలిసిపోయి, మాసిపోయి, కూలటానికి సిద్ధంగా వున్నాయి. ఒక మిద్దె ఇల్లు గుడిసెగా ముడుక్కుంది. ఇరవై ఏళ్ళ తర్వాత వీళ్ళ వీళ్ళ ఆర్థికస్థితులు ఇలా వుంటాయని ఎవరైనా ఊహించగలిగారో చెప్పటం చాలా కష్టం. తన చిన్నప్పుడు ధనవంతులుగా వున్నవాళ్ళు ఇప్పుడు చితికిపోవటం, అప్పుడు ఏమీ లేనివాళ్ళు ఇప్పుడు ధనవంతులు కావటం కొంత వింతగా అనిపించినా, మొత్తం మీద వీధిలో లేనివాళ్ళ కంటే వున్న వాళ్ళే ఎక్కువగా వున్నందుకు అనుకోకుండానే ఆనందించాడతను.

బయట అరుగుల మీద కూర్చుని వున్న వయసు పైబడుతున్న వాళ్ళు కొందరు అతన్ని పలకరించారు. కొత్తకోడళ్ళు అతన్ని ఎరగని వాళ్ళు ఎవరా అన్నట్టు చూశారతని వంక. తనతో స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు పలకరింపుగా నవ్వారు.

వీధి మలుపు తిరుగుతోంటే “బాలయ్యా, బాలయ్యా!” అని ఎవరో పిలిచినట్టు అనిపించింది అతనికి. ఆ పిలుపు అలవాటు తప్పి ఎంతో కాలం ఐనందువల్ల ముందు అది తన గురించే అని గ్రహించలేదతను. తిరిగి చూసేటప్పటికి శేషమ్మ కనిపించింది. ఆమె పెద్దకొడుకు సుబ్బారావు తనకి రెండేళ్ళు సీనియర్‌ హైస్కూల్లో, తర్వాత కాలేజిలో కూడ. ఐనా ఇద్దరూ మిత్రులుగా వుండేవాళ్ళు. పదేళ్ళ నాడు వచ్చినప్పుడు వాళ్ళంతా విజయవాడకి వెళ్ళిపోయారని, సుబ్బారావు అక్కడే ఏదో వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. అంచేత అతనితో గాని, వాళ్ళ వాళ్ళతో గాని అప్పుడు మాట్లాడ్డం కుదర్లేదు.

“ఏవండీ, ఎలా వున్నారు?” అని పలకరించాడు గోపాల్‌ ఆమెని.

తన చిన్నప్పుడు చాలా అందంగా వుండేదామె (అని అందరూ చెప్పుకునే వాళ్ళు). ఇప్పుడు ఆ సౌందర్యావశేషాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాని వయసుతో పాటు ఆమెకీ వాటి మీద పెద్ద ధ్యాస వున్నట్టు లేదు. జారిపోతున్న పైటని తాపీగా సవరించుకుంటూ ఎదురుగా వున్న అరుగు మీద చతికిలపడి, “ఇటు వచ్చి కూర్చో బాలయ్యా” అందామె. వెళ్ళి కూర్చున్నాడు గోపాల్‌.

“సుబ్బారావు ఎక్కడ వుంటున్నాడిప్పుడు?” అనడిగాడు.

“విజయవాడలో. నీకు తెలీదా? అవున్లే, మేం వూరొదిలేసి పోయాక మా గురించి ఇక్కడందరూ మర్చిపోయారు. నువ్వేమో పోయి అమెరికాలో కూర్చున్నావాయె! అది సరే గాని, అక్కడ నెలకే పది లక్షల దాక ఇస్తారంట గదా, ఈ ఇరవై ఏళ్ళకి గాను పది కోట్లన్నా వెనకేశావా?”

బెరుగ్గా అటు ఇటూ కదిలాడు బాలగోపాల్‌. ఏం చెప్పాలో తోచలేదు. స్టాక్‌ మార్కెట్లో పోయిన లక్ష డాలర్లూ, ఉంటుందో ఊడుతుందో తెలీకుండా ఊగులాడుతున్న ఉద్యోగం గుర్తొచ్చాయి తప్ప గత ఇరవై ఏళ్ళుగా తను సంపాయించి వెనకేసిందేమిటో అతనికేం తెలీలేదు. ఐతే, ఆ విషయాలు చెప్తే తనని అర్థం చేసుకోకపోగా విపరీతంగా అపార్థం కూడ చేసుకుంటారని అతనికి అనుభవం మీద తెలిసొచ్చింది.

“ఎంత చెట్టుకి అంత గాలి కదా! వస్తాయన్న మాట నిజమే గాని ఖర్చులు కూడ అలాగే వుంటాయి కదా? ఏదో జీవితం హాయిగానే గడిచిపోతుందిలే!” అన్నాడు కప్పదాటు వేస్తూ.

“నువ్వెప్పుడూ ఇంతే బాలయ్యా! నీ గురించి చెప్పుకోవు. నాకు చిన్నప్పట్నుంచీ నీ సంగతి తెలిసిందేగా! ఐతే, ఊర్లో అందరూ అనుకుంటున్నార్లే, రొండు కోట్లు పెట్టి ఇల్లు కొన్నావంటగా! చేతులో కనీసం ఇంకా అంతన్నా ఉండదూ? ఏమైనా, నీతోటి చదువుకున్నందుకు మావాడూ, వాడితో చదువుకున్న నువ్వూ ఇద్దరూ మంచి స్థితిగతుల్లో వున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా వుందయ్యా.”

ఈ విషయాన్నుంచి దారి మళ్ళించకపోతే ప్రమాదం అని గ్రహించి చటుక్కున “ఐతే సుబ్బారావు బాగా సంపాయించాడన్న మాట!” అన్నాడు.

“ఏదో ఆ ఏడుకొండల స్వామి దయా, మీలాటోళ్ళ నోటిచలవ! బాగానే సంపాయించాడు. నాలుగు కోట్లని తన నోటితో తనే నాతో అన్నాడు గాని ఐదారన్నా వుంటాయని నా నమ్మకం. మొదట్నుంచీ వాడు అంతే నీకు తెలుసుగా! మహా జాగ్రత్త మనిషిలే! ఏ లోకంలో ఉన్నాడో వాళ్ళ నాన ఈ పిల్లల్ని నా మీద ఒదిలేసి పోయాడు. ఏం చేశానో, ఇంత పెద్ద సంసారాన్ని ఒక్కదాన్ని ఎట్లా ఈదానో చూసిన వాళ్ళకి తెలుసు, పైనున్న ఆ భగవంతుడికి తెలుసు. మొత్తం మీద పిల్లగాడు ప్రయోజకుడయ్యాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. అందరూ బాగానే లక్షణంగా వున్నారు. ఇక నా బాధ్యతలు తీరిపోయినయ్‌. ఏదో కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నా,” కళ్ళొత్తుకుంటూ చెప్పిందామె.

నిజమే, అనుకున్నాడు గోపాల్‌. ఆమె బాగానే కష్టపడింది. పైగా భర్త చనిపోయేటప్పటికి మంచి వయసులో కూడ వుందేమో ఆమె గురించి అప్పట్లో చిలవలు పలవలు చెప్పుకునేవాళ్ళు కూడ. అవి భరిస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ, పొలాలు చూసుకుంటూ జాగ్రత్తగా లాక్కొచ్చింది.

“సుబ్బారావు ఏం వ్యాపారం చేస్తున్నాడు?” అడిగాడు.

“ఒకటనేవుంది నాయనా? ఏవేవో చేస్తుంటాడు. రాజకీయ నాయకుల్తో తిరుగుతుంటాడు, మాట్టాడినప్పుడల్లా కొత్త వ్యాపారం చేస్తున్నాడంటాడు. నేను పట్టించుకోవటం మానేశా. తన సంగతులు తను చక్కబెట్టుకునే సమర్థుడయ్యాడు, నాకదే చాలు!” గాల్లోకి చేతులు జోడిస్తూ చెప్పిందామె.

“అవును బాలయ్యా, ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలు?” అడిగింది హఠాత్తుగా.

“ఇద్దరు. ఇద్దరూ అబ్బాయిలే!” అన్నాడతను.

“అదృష్టవంతుడివయ్యా. మా సుబ్బారావుకి పెద్దబిడ్డ అమ్మాయి కదా! దానికి మొన్ననే పెళ్ళి కూడ కుదిరింది. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు కాని ఇవాళో రేపో అంటున్నారు. అనుకోకుండా సమయానికే వచ్చావు నువ్వు” అందావిడ ఆనందంగా. గోపాల్‌కి ఆశ్చర్యం వేసింది అంత పెద్ద పిల్లలున్నారా సుబ్బారావుకి? తన పిల్లలు ఇద్దరూ ఇంకా ఎలెమెంటరీ స్కూల్లోనే వున్నారు!

“సుబ్బారావుకి అంత పెద్ద పిల్లలున్నారని నాకు తెలీదే!” అన్నాడు.

“పెద్దపిల్లకి మొన్ననే పదిహేడు వెళ్ళి పజ్జెనిమిది వచ్చింది బాలయ్యా! ఐతే మంచి సంబంధం, మనల్ని వెదుక్కుంటూ వచ్చింది.”

“అలానా! అబ్బాయేం చేస్తున్నాడు?”

“ఏం చేసేదేంది బాలయ్యా! అమ్మాయిని అమెరికా ఇస్తున్నామయ్యా!”

“ఓహో అలానా! అక్కడ ఎక్కడుంటాడో అతను?”

“నాకేం తెలుసునయ్యా? ఏదో పేరు చెప్పారు గాని నాకు నోరే తిరగలేదు. ఏదన్నా గాని, అమ్మాయి హాయిగా వుండబోతుంది. నా దిగులు తీరింది. దూరాభారమని ఒకటే బెంగ గాని ఏం చేద్దాం చెప్పు? పైగా నీలాటి వాళ్ళు మనూరోళ్ళే ఒక ఇరవై మంది దాకా అక్కడ వున్నారు గదా! పిల్ల సంగతి కాస్త కనిపెట్టి వుండరూ?”

“అవున్లే, అవున్లే” గబగబా అన్నాడు గోపాల్‌ ఆ ఇరవై మందిలో ఎవరినీ కలవటం కాని కనీసం ఫోన్లో మాట్లాట్టం కాని ఇంతవరకు జరగలేదని గుర్తొచ్చి.