చీకటి పరచుకున్న ఆకాశంలో….

ఎప్పుడో కరగి పోయిందనుకున్న కల మళ్ళా
ఇప్పుడు తిరిగి వచ్చింది, వస్తూ
వస్తూ అప్పటి అద్దాన్ని కూడా తెచ్చింది, తెస్తూ
గుండె గోడలకి అతికించింది, ఎప్పటి మాట
చెవులు కనపడకుండా పెరిగిన జుట్టూ
వచ్చీ రాని మీసం క్రింద మెరిసీ మెరియని చిరునవ్వు
గుండె మనసు వొకటిగా ఉన్న రోజులవి
కలలు ఆవేశం తప్ప వ్యధలు నిర్లిప్తతలు లేని రోజులవి
వానా, నదీ, వంశధారా, ఇసుకా, సముద్రం,
మనసూ, గుండే
కలసి మెలసి, వెలిగి నలిగి
విచ్చుకున్న అనుక్షణికం

ఎన్ని వసంతాలు గడచి పోయాయో, ఎన్ని తుఫానులు నడిచి పోయాయో
గుండె మనసు విడిపోయి, ఆవేశాలు అనుభవాలై చనిపోయి
కప్పుకున్న పలుచని పొగమంచు తెర పగిలిపోయి
ఎర్రటి సూర్యుడు కళ్ళలో రగిలిపోయి, దోసిట్లోనించి
జారిపోయిన నిన్నటి రోజుల కోసం వెతుక్కుంటే
నా తలలో మెరిసే నెరసిన వెంట్రుకల్లా,
చీకటి పరచుకున్న ఆకాశం లో
ఎన్ని జ్ఞాపకాల నక్షత్రాలు!