విశ్వకవిత: పాల్‌ సెలాన్‌

పాల్‌ సెలాన్‌(Paul Celan) జర్మన్‌యూదు.కష్టాలు పడ్డాడు.నాజీలు కడతేర్చారు కన్నవాళ్ళని. కాన్సంట్రేషన్‌కాంపుల్లో మగ్గి ఫ్రాన్స్‌చేరుకొన్నాడు.అక్కడ ఒక విదుషీమణిని పెళ్ళిచేసుకొన్నాడు.ఆమె కడదాకా,అంటే తను నీట మునిగి చనిపోయేదాకా కనిపెట్టుకొని వుంది కంటిపాపలా.దుఃఖాన్ని, అభావాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అందరూ భావిస్తారు. ఇతనివి ఉద్విగ్నభావాలు.అందరికీ అందడు.తల్లి మరణం కదిలించింది.మళ్ళీ మనిషి కాలేక పోయాడు.అభావ (hermetic) కవిత్వచ్ఛాయలు కనిపిస్తాయి. అష్టభాషా ప్రవీణుడు.పలుభాషల నుండి మంచినీళ్ళప్రాయంగా అనువాదాలు చేశాడు.

యుద్ధానంతర కవుల్లో మేటిగా పేరు పొందాడు.గ్రంధచౌర్యఆరోపణను ఎదుర్కొన్నాడు.అది అసత్యమని తేలడానికి అట్టే కాలపట్టలేదు .జర్మనీ సాహిత్య వాతావరణంలో ఇమడలేకపోయాడు.యావజ్జీవితనాజీల దురాగతాలను తీవ్రంగా అసహ్యహించుకొన్నాడు.నాజీలను సమర్థిస్తూ ఎవరు మాట్లాడినా భరించలేకపోయేవాడు.సత్యవాది.. అంగుళమంగుళం మానవ దైన్యాన్ని,క్రౌర్యాన్ని చవిచూసినవాడు.దుర్గమం ,దుర్గ్రాహ్యమైన కవిత్వాన్ని వదిలాడు ప్రపంచమీదికి;కొరుకుడు పడడు అంతతేలికగా;భాషాపరమైన, తాత్వికపరమైన లోతులెన్నో చూపుతాడు.పరమ గహనం ,ఐనా శ్రేష్ఠం ఈతని సంక్లిష్ట కవిత్వం.

మృత్యుమేళ (Todesfuge)

ఆంగ్లానువాదం జాన్‌ ఫెల్‌స్టినెర్‌ (John Felstiner)

నల్లని పాలు తెల్లారి మేము తాగుతాం సాయంత్రం
మేము తాగుతామధ్యాహ్నం..ఉదయం మేము తాగుతారాత్రి
మేము తాగుతామేము తాగుతాం

మేము తవ్వుతాఒక సమాధి గాలిలో సేదదీర ఇరుకు లేదందులో
ఒకడు ఆ ఇంట ఉన్నవాడు నాగులతో ఆడతాడు వాడు లిఖిస్తాడు
వాడు లిఖిస్తాడు జర్మనీ పై పెనుచీకటి కమ్మి నీ బంగరు నీలాల మార్గరెటా
వాడు లిఖిస్తాడు ఇంటి బయటికి వెడలి తళుకుమనే తారలు
ఈలవేస్తాడు తన జాగిలాలను చెంతచేరమని
ఈలవేస్తాడు తన యూదులను బారులు తీరమని
మట్టిలో సమాధి తవ్వమని
మమ్మాజ్ఞాపిస్తాడు నాట్యానికి వాయించమని

నల్లని పాలు తెల్లారి మేము నిను తాగుతాం రాత్రి
మేము నిను తాగుతాం ఉదయం మేము తాగుతాం నిను సాయంత్రం
మేము తాగుతామేము తాగుతాం

ఒకడు ఆ ఇంట ఉన్నవాడు నాగులతో ఆడతాడు వాడు లిఖిస్తాడు
లిఖిస్తాడు వాడు జర్మనీ పై పెనుచీకటి కమ్మి నీ బంగరు నీలాల మార్గరెటా
నీ భస్మ కేశాల షులామిత్‌ మేము తవ్వుతాఒక సమాధి గాలిలో
సేదదీర నీకు ఇరుకు లేదందులో

అతడు గద్దిస్తాడు లోతుగా తవ్వండి మీరు మంది జాస్తి
కొదమా మీరు పాడండి ఆడండి
బెల్టుమీది ఇనుపచువ్వని లాగి ఝలిపిస్తూ అతని కన్నులు నీలంగా
దించండి పలుగులు లోతుగా మీరు మంది జాస్తి
కొదమా మీరు వాయించండి నాట్యానికి

నల్లని పాలు తెల్లారి మేము నిను తాగుతాం రాత్రి
మేము నిను తాగుతాం మధ్యాహ్నం ఉదయం మేము తాగుతాం నిను సాయంత్రం
మేము తాగుతామేము తాగుతాం

ఒకడు ఆ ఇంటనున్నవాడు నీ బంగరు నీలాల మార్గరెటా
నీ భస్మకేశాల షులామిత్‌ వాడు నాగులతో ఆడతాడు
వాడు గద్దిస్తాడు పాడమని తీయగా చావుమేళం ఈ మరణ గురువు జర్మను
వాడు గద్దిస్తాడు తీగలు తెంపమని మీరందరూ దట్టంగా పొగలా ఆకాశానికి లేస్తారని
అప్పుడు మీకు మేఘాల్లో సమాధి అచట సేదదీర మీకు ఇరుకు లేదని

నల్లని పాలు తెల్లారి మేము నిను తాగుతాం రాత్రి
మేము నిను తాగుతాం మధ్యాహ్నం ఈ మరణ గురువు జర్మను
మేము నిను తాగుతాం సాయంత్రం ఉదయం మేము తాగుతాం మేము తాగుతాం
ఈ మరణ గురువు జర్మను అతని కన్ను ఇంద్రనీలం
చాకచక్యంతో కొడతాడు గుండుపెట్టికొడతాడు
ఒకడు ఆ ఇంట ఉన్నవాడు నీ బంగరు నీలాల మార్గరెటా
వాడి జాగిలాలను మా మీదికి ఉసిగొలిపి గాలిలో సమాధినొసగి
ఆడతాడు తన నాగులతో పగటికలతో ఈ మరణ గురువు జర్మను

నీ బంగరు నీలాల మార్గరెటా *
నీ భస్మ కేశాల షులామిత్‌ **

* గొథే రచించిన Faust: A Tragedy లో కావ్యనాయిక మార్గరెటా సౌందర్యానికి ,స్త్రీత్వానికి ప్రతీక.Faust వలచి దక్కించుకోలేక పోతాడు.
** షులామిత్‌ (Shulamith) judaism కు చెందిన Song of Songs లోని అందాలరాణి, యూదు మార్మిక సంప్రదాయం లో పునరాగమనాన్ని సూచిస్తుంది.

కవిత నేపథ్యం: నాజీలు యూదులను చంపడానికి ముందు వారితో పాడించేవారు. క్రూరమైన వినోదం లో మునిగితేలేవారు.జర్మన్‌లో కవిత పేరు Todesfuge. fuge కు నానార్థాలు ఉన్నాయి.మృత్యువు ,సంగీతాల కలగాపులగాన్నిసూచిస్తుంది సెలాన్‌కవిత. యుద్ధ బీభత్సాన్ని చిత్రించిన పికాసో “గుయిర్నికా”కు ధీటు రాగల సృష్టి Todesfuge అని విమర్శకులు భావిస్తారు.చాలా భాషల్లోకి లెక్కలేనన్ని అనువాదాలు వచ్చాయి.చాలా సంక్లిష్టమైన కవిత.శబ్ద గుణాలతో అలరారు తుంటుంది.surrealism ప్రభావం కనిపిస్తుంది.ఈ కవిత లో మహాకవి పాల్‌సెలాన్‌ punctuation సంపూర్ణంగా త్యజించడం విశేషం.

ఉపయుక్త గ్రంధాలు, వెబ్ సైట్లు:

  1. Paul Celan : Poet, Survivor, Jew- John Felstiner Yale Universtity Press,ISBN 0-300-08922-82
  2. .Selected Poems and Prose of Paul Celan- John Felstiner WW.Norton,NewYork, ISBN 0-393-32224-6
  3. పాల్ సెలాన్ చదివిన Todesfuge కవిత, జాన్‌ ఫెల్‌స్టినెర్‌ తో సంభాషణ.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...