జాతకం

రాత్రంతా నిద్రపోలేదు సత్యానంద్‌.
సినిమా విడుదల అంటే మాటలా?
ఎన్ని పన్లు! ఎంతమందితో ఫోన్లు!!
ఎందరికి పురమాయింపులు! ఎందరికి బుకాయింపులు!! ఇంకెందరికి బుజ్జగింపులు!!!

పెళ్ళివారిల్లులా వుంది ఆఫీసు రణగొణధ్వనుల్తో, వచ్చే పోయే వాళ్ళతో, వచ్చి “పుచ్చుకునే” వాళ్ళతో, పోతూ పట్టుకుపోయే వాళ్ళతో, రాని వాళ్ళ ఫోనుల్తో, వస్తాం అనేవాళ్ళ హోరుతో
పిచ్చెత్తుతోందా అనిపించింది అదంతా భరిస్తూ, ఎలాగోలా డబ్బాలు చేరవలసిన వాళ్ళందరికీ పంపటం పూర్తిచేసే సరికి.
కొంచెం నడుం వాలుద్దామంటే సందు లేదు. వాల్చినా ఆ గోలలో నిద్రపట్టే వీల్లేదు.
ఆఫీసులో ఓ మూల కుర్చీలోనే కూర్చుని నిద్రపోదామని ప్రయత్నించాడు.
పీడకలలు తప్ప నిద్రరాలేదు. అప్పులవాళ్ళే గాని అందమైన వాళ్ళెవరూ కల్లోకి రావటం లేదు.

తెల్లవారింది.
హిందీ గాయకుడి గొంతులో తెలుగు పాటల్లా కీచుకీచుమంటున్నాయి పిట్టలు.
తన శత్రువు సిన్మా ఫ్లాప్‌ అయినప్పుడు నిర్మాత మొహంలా వెలిగిపోతూ వచ్చాడు సూర్యుడు.
కొత్త తెలుగు సిన్మా పాటల్లాటి రణగొణధ్వనుల్తో వీధులు నిండిపోతున్నాయి.
వాటిలో మాటల్లాగే వీధుల్లో ధ్వనులకీ అర్థాలు అగమ్యంగా వున్నాయి.

“న్యూ ట్రెండ్స్‌ ప్రొడక్షన్స్‌” ఆఫీస్‌ పక్కనే వున్న చిన్న హోటల్‌కి ఇలాటప్పుడే అసలైన బిజినెస్‌. వాళ్ళు కూడ రాత్రినుంచి రకరకాల పదార్ధాలు సరఫరా చేస్తూ వీలైనప్పుడల్లా నిద్రకి జోగుతున్నారు.
ఐనా సరే, సత్యానంద్‌ బృందం మొహమాటపడకుండా ఎవరిక్కావల్సినవి వాళ్ళు చేయించుకుని, చేయించటం వీలుకాకపోతే వాళ్ళే చేసుకుని, ఆరగిస్తున్నారు.

మధ్యాన్నానికి పరిస్థితి ఎలావుండబోతోందో ఎవరికీ తెలీదు కదా! దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం బుద్ధిమంతుల లక్షణం!
అందునా సినిమా బుద్ధిమంతులు వీర”బుడ్డిమంతులు” కదా! కడుపులో పట్టినవి పట్టగా పట్టనివాటిని దగ్గర్లో వున్న చుట్టాల ఇళ్లలోనో స్నేహితుల దగ్గర్నో సొంతానికి వాడుకోకుండా ఒట్లేయించుకుని పెట్టివస్తున్నారు.

సత్యానంద్‌ ఎలాగో కాలకృత్యాలు ముగించి వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు.
ఇంకా తమ డబ్బు పూర్తిగా చేతికి అందనివాళ్ళూ, “ఎందుకైనా మంచిది, ఒకవేళ ఈసినిమా ఆడి మళ్ళీ మరోటి తీసే అఘాయిత్యానికి ఒడిగడితే ఇప్పుడు మంచితనం చూపించినందుకు అప్పుడేదన్నా దారి చూపించే అవకాశం ఉంది” అని ముందుచూపు చూసే మూర్ఖులు కొందరు, అప్పటిదాకా అతని ఉప్పు తిన్న విశ్వాసం కొంతైనా నటిద్దామని ఆరాటపడుతున్న వర్ధమాన నటీనటులు కొందరు ఇదీ అక్కడ కొలువుదీరిన సభ.

సెక్రెటరీ శంకర్రావు వైపు సాలోచనగా చూశారు సత్యానంద్‌ గారు.
ఇప్పటికి ఇరవైమంది నిర్మాతలకి ఎవరికి వారికే తల్లో నాలిగ్గా మెలిగిన శంకర్రావుకి ఇలాటి చూపుల అర్థాలే కాదు, అంతరార్థాలు, అంతరాంతర అర్థాలు కూడ కరతలామలకాలే!
అంచేత, వెంటనే తన గంభీరస్వరంతో, “మన సత్యానంద్‌ గారి సిన్మా కనీసం పదిహేను సెంటరుల్లో వందరోజులు ఆడుద్దని బల్లగుద్ది చెవుతా” అని గుద్దటానికి బల్లకోసం చుట్టూ చూశాడు.

వెంటనే అందుకున్నాడు మహేష్‌ (అసలు పేరు ఏదో చాలా పొడవుపాటిదే అయుంటుంది కాని అతని అసలు పేరే కాదు పనేమిటో, అప్పుడు అక్కడ ఎందుకున్నాడో కూడా ఎవరికీ తెలీదు). ఐతే అతనికి దగ్గర్లోనే ఓ బల్ల కూడ ఉన్నందువల్ల దాన్ని గుద్ది మరీ చెప్పే అవకాశం అతనికి కలిగినందుకు శంకర్రావుకి కొంత ఈర్య్ష కలక్కపోలేదు.
“వందరోజులు ఏవిటి సార్‌! సిల్వర్‌జూబిలీ అంటే నమ్మండి” అన్నాడతను, ఆ బల్లకి పొరపాటున ఏమైనా ప్రాణావశేషాల్లాటివి వుంటే వాటిని దాన్నుంచి వేరుచేసే పనిలో నిమగ్నుడై పోతూ. అతనికి శంకర్రావు లాటి గంభీరమైన స్వరం లేకపోవటమే కాదు, అతను మాట్లాడితే ఎదురుగా లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడింది ఓ పదహారేళ్ళ అమ్మాయేనని పందెం కట్టటానికి ఏ మాత్రం వెనకాడరు. అంచేత, ఎందుకనో ఆ “బాల” వాక్కు శుభసూచకంగా అనిపించింది సత్యానంద్‌కి.

దానికి తోడు, ఇవన్నీ తనూ అచ్చం అలాగే అనుకుంటున్నాడు సత్యానంద్‌. ఐతే పైకి మాత్రం మొహమాటంగా, “ఏదో పది సెంటర్లలో యాభైరోజులు ఆడితే మన డబ్బు మనకొస్తదయ్యా. అంతకంటే నాక్కావాల్సింది లేదు” అన్నాడు చేతిలో అప్పుడే ఖాళీ ఐన గ్లాసుని ముందుకి నెడుతూ. వినమ్రతని వీధివీధంతా ఒలకబోస్తూ శంకర్రావు దాన్ని మళ్ళీ మరో రంగు ద్రవంతో నింపటం క్షణంలో జరిగిపోయింది.
“అలా అనకండి సార్‌! కేవలం యాభై రోజులే ఆడితే మన హీరో గారి  పరువు ఏం కావాలి? ఆయనకిది ప్రిస్టేజి పిక్చరు కూడా!!” అన్నాడు మహేష్‌ ఆదుర్దాగా.
“ఆ హీరోకి ప్రిస్టేజి పిక్చరు కాందేది? పోయిన మూడేళ్ళలో ఒక్కటంటే ఒక్కటి యాభైరోజులు కూడా ఆడిన పాపాన పోలేదు కదా!” అని ఎవరో సణుక్కున్నా ఎవరూ ఆ మాటల్ని వాళ్ళ బుర్రల్లో రికార్డ్‌ చెయ్యలేదు.
“కాని ఈ మధ్య అతనివి ఏ పిక్చర్లూ ఆడలేదు గదయ్యా?” అన్నారు సత్యానంద్‌, ఆ విషయం ఇప్పుడే తెలుసుకున్నట్టు.
“భలేవారు సార్‌! ఆయన దశ గిరగిరా తిరిగిందని, ఇంక ఆయన ఏ సెట్‌ మీద కాలెడితే ఆ సిన్మా నూర్రోజులు ఆడాల్సిందేనని మన జోతిష్యుడు గారు మాంఛి మందుమీద ఉన్నప్పుడు కూడా చెప్పాకనే గదా ఆయన్ని మీరు హీరోగా తీసుకుంది!” ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శంకర్రావు.
“నిజమేననుకో! ఐతే, మన జోతిష్యుడు గారిక్కూడా ఈమధ్య గ్రహాలు సరిగ్గా మాటవినటం లేదనీ, ఆయన చెప్పినట్టుగా సిన్మాలు హిట్టు కావటం లేదని కొంతమంది గుసగుసగా ఓ మందుపార్టీలో చెప్పుకుంటుంటే ఈమధ్య విన్నానే!” అన్నాడు సత్యానంద్‌ తన “సంశయగ్రస్తుడి” పాత్రని విపరీతంగా పోషిస్తూ.

దాంతో ఇంకా మందుప్రసాదం పుచ్చుకోని వాళ్ళు కొందరు తికమకలో పడ్డారు ఔననాలో కాదనాలో అర్థం కాక.
మందు పూర్తిగా ఎక్కని కొందరు మాత్రం “నిజమే” అన్నట్టు తలలూగిస్తూ అంతలోనే మిగిలిన వాళ్ళ చూపులు తమ మీద పడుతున్నట్టు గ్రహించి గబగబా ఇంకొంచెం తీర్థం పుచ్చుకునే పన్లో పడ్డారు తలూపింది “మందు ఇంకొంచెం వడ్డించమనే అర్థంలో” అని ఎవరన్నా మంచిగా అపార్థం చేసుకోవటానికి అవకాశం కలిగిస్తూ.

“అవన్నీ ఎందుకు సార్‌? మన హీరోయిన్‌ని చూసి యూత్‌ అంతా సిన్మా హాళ్ళ చుట్టూనే తిరుగుతారంటే నమ్మండి! బాలివుడ్‌ వాళ్లని తలదన్నేట్టు ఏకంగా అమిరికానించే వచ్చింది గదా మనమ్మాయి! ఎంత గొప్ప పిల్ల సార్‌! మన పిచ్చర్లో పన్జేసిన ఆర్నెల్లలో గూడా ఒక్క ముక్క తెలుగు వంటబట్టలేదు, తను మాట్టాడింది ఒకటంటే ఒకముక్క మనెవరికీ అర్థవయి చావలేదు! ఐనా ఆలీవుడ్డులో యాక్ట్‌ చెయ్యాల్సిన పిల్ల కద్సార్‌! ఆ అమ్మాయి చేతులో రేకలు చూసి మన జోతిష్యుడు గారు మూర్చబోతే ఆయన్ని లేపటానికి ఫుల్లు బాటిల్‌ వాడ్కా వల్ల గాని కాలేదు గదా! ఇక ఆ అమ్మాయి జాతకం చూసి ఆయన ఒకటే గుండెలు బాదుకోవటం ప్రెపంచంలో వున్న అదురుష్టం అంతా ఈ జాతకంలోనే ఇట్టా గుట్టలు పడుంటే ఇంక మిగతా జనం గతేందిరా బగవంతుడా, అని! అట్టాంటి హీరోయిన్‌ని పెట్టాక ఇంకా మన పిచ్చరుకి డోకా ఏందండీ?”

అని శంకర్రావు కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి ఆగేసరికి అతనికి మళ్ళీ ఛాన్సివ్వకుండా అందుకున్నాడు మహేష్‌
“ఇక మన డైరెక్టరు గారంటారా ఈ మజ్జనొచ్చిన హాలీవుడ్‌ సిన్మాలన్నిట్నీ ఆపోసన పట్టి, హిందీ పిచ్చర్లని తల్లకిందులుగా వొంటబట్టిచ్చుకుని, తమిల యూత్‌ పిచ్చర్లని బాసరాకపోయినా పదేపదే చూసి, ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని రకాల సీన్లు కొట్టుకొచ్చి మన పిచ్చర్‌ తయారుచేశాడో కదా! దీని ముందు “ఇడియట్‌” బలాదూర్‌, “చిత్రం” లెక్కాపత్రం కాదు, “జయం” విషయం చెప్పనే అక్కర్లేదు, “సంతోషా”నికి దుఃఖవే, “నువ్వు నాకు నచ్చావ్‌” ఎవరికీ నచ్చనే నచ్చదు, “ఇంద్ర” ఏవన్నా అట్టట్టా నిలబడాలేమోగాని మనకి పోటీ మరోటి లేదు సార్‌. మన డైరెక్టరేం తక్కువదిన్నాడా? వాటన్నిట్నీ కలగలిపి ఒండేసి, ఒడబోసి, గుజ్జు తీసి తీసింది కదూ మన పిచ్చరంటే! ఆడకపోవటానికి దానికెన్ని గుండెలు?” అని గర్జించాడు మళ్ళీ బల్ల పనిపడుతూ.

“అవున్సార్‌! “ఇడియట్‌”లో హీరో హీరోయిన్ని ప్రేమించి అది కూడ ప్రేమించేట్టు చేసుకోటానికి చేసిన చిలిపి చిలిపి పన్లకి యీల్లేసీ ఏసీ నోళ్ళు పుళ్ళు పడి హాస్పటళ్ళ చుట్టూ ఇంకా తిరుగుతున్నారు కదా కాలేజి కుర్రోళ్ళు! ఇంక మన సిన్మా చూస్తే పాపం ఏవైపోతారో అని నాకు చాలా బెంగగా వుంది సార్‌!! అందుట్లో హీరో హీరోయిన్‌ పడగ్గదిలోకి దూరి దాని మీద ఎక్కి కూచుని కత్తి చూపించి నన్ను ప్రేమించకపోతే ప్రాణం తీస్తా అని చిలిపిగా బెదిరిస్తే మందాన్లో హీరో హీరోయిన్ని ఏకంగా రేప్‌ కూడ చేసేస్తాడు కదా ఎంత ఒరిజినల్‌ ఐడియా సార్‌! ఇదివరకు హీరోయిన్లు ప్రేమించకపోతే కోపంతో విలన్లు రేప్‌ చెయ్యబోతే హీరోలు వచ్చి చితకబాదే వాళ్ళు. మన పిచ్చర్లో హీరోయిన్‌ ప్రేమించటం లేదని ఆ పిల్ల మీద ప్రేమ కొద్దీ అది ఇంకెవణ్ణీ ప్రేమించకుండా తనే దాన్ని రేప్‌ చేస్తాడు హీరో. ఆ లాజిక్కి మన కుర్రకారుకి పిచ్చెక్కిపోద్దంటే నమ్మండి. అంతటితో ఆక్కుండా మన హీరో అడ్డం వచ్చిన ఆ పిల్ల తల్లిదండ్రుల్ని ఉతికిపారేసి, ఇంకా మాట్టాడితే ముందుగా ఆ పిల్ల తల్లిని రేప్‌ చేసి ఆ తర్వాతే హీరోయిన్ని చేస్తానని కూడ నవ్వుతూ బెదిరిస్తాడు కదా!
పాపం మన డైరెక్టరు గారు ఎన్నాళ్ళపాటు నిద్రాహారాల్లేకుండా కేవలం మందుతోటే గడిపి ఇలాటి బ్రమ్మాండమైన బ్రైయిన్‌ వేవ్‌ సంపాయించారో! ఆ ఒక్క సీను చాలు మన సిన్మా వందరోజులు ఆడటానికి” అని తన ఆర్య్గుమెంట్‌ని పూర్తిగా పూర్తి చేసి అప్పుడే పక్క హోటల్‌ వాళ్ళు తెచ్చిన మసాలదోసెని ఓ పట్టుపట్టటానికి పూనుకున్నాడతను.

“సార్‌! ఆ సీన్‌ ఇప్పటికి వందసార్లే చూశాం సార్‌! ఇంకా ఒక్కసారి చూస్తాం, పెట్టండి సార్‌!” అని ప్రాధేయపడ్డారు వర్ధమాననటులు కొందరు కెమేరా ఎదురుగా లేనందువల్ల అద్భుతంగా నటించేస్తూ.
“వద్దు వద్దు! సిన్మా ఫస్ట్‌ షో అయ్యేవరకు దాన్ని మనం తాక్కూడదని ఆర్డరేశారు మన జ్యోతిష్యుడు గారు!” అన్నారు సత్యానంద్‌ వాళ్ళని మందలిస్తూ.

ఐతే, ఏమాటకామాటే చెప్పుకోవాలి సత్యానంద్‌కి అప్పటికి కొంత ధైర్యం చిక్కింది.
నిజమే, వీళ్లన్నట్టు తన పిక్చర్లో హీరో, హీరోయిన్ల దగ్గర్నుంచి చివరికి ఆఫీస్‌ బాయ్‌ల వరకు అందరి జాతకాలు జాగ్రత్తగా చూపించాకనే వాళ్లని తీసుకోవటం జరిగింది. డైరెక్టర్‌ జాతకంలో లగ్నాధిపతిని శుక్రుడు వక్రదృష్టితో చూస్తున్నట్టు అనుమానంగా వుందని జ్యోతిష్యుడు చెప్పటమే ఆలస్యం నవగ్రహశాంతీ, ప్రత్యేకించి శుక్రుడికి హోమం, ఎందుకైనా మంచిదని శనికీ రాహుకేతువులకీ కూడా ప్రత్యేకశాంతులూ జరిపించి, అవి చేసిన పురోహితులందరూ ముక్తకంఠంతో శుక్రుడు ప్రసన్నుడయ్యాడని ఒప్పుకున్నాకే ముహూర్తం షాట్‌ తియ్యనిచ్చాడు తను. ఇంతమంది ఇంత గొప్ప జాతకులు కలిసి తీసిన సిన్మా ఫ్లాప్‌ కావటానికి వీల్లేదుగాక వీల్లేదు!

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సత్యానంద్‌.
అప్పటిదాకా పుచ్చుకున్న తీర్థం అంతా హఠాత్తుగా ఆవిరైపోయింది.

హన్నన్నా! ఎంతపని జరిగిపోయింది!!
జ్యోతిష్యుడు ముందుగానే హెచ్చరించాడు రిలీజ్‌ రోజు ఫస్ట్‌షో రిజల్ట్‌ తెలిసేవరకు “ఫ్లాప్‌” అన్న మాట మన ఆఫీసులో ఎక్కడా వినపడకూడదని!
ప్రత్యేకించి తనకు చెప్పాడు అలాటి ఆలోచన కూడా తన మనసులోకి రానివ్వకూడదని!!
అలా వస్తే ఇక ఈ సిన్మా హిట్‌ చేయించే పూచీ తనది ఏమాత్రం కాదని మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పాడు కూడ.
ఏది జరక్కూడదో అదే జరిగిపోయింది! ఇప్పుడెలా?

హడావుడిగా లోపలికి పరిగెత్తాడు సత్యానంద్‌. అదృష్టవశాత్తూ ముందుచూపుతో ఇలాటి ఆలోచన ఒకవేళ వస్తే దానికి ప్రాయశ్చిత్తంగా లక్షసార్లు పునశ్చరణ చెయ్యాల్సిన మంత్రాన్ని బాత్‌రూమ్‌ గోడ మీద చాక్‌పీస్‌తో రాసివెళ్ళాడు జ్యోతిష్యుడు!

ఐతే బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన సత్యానంద్‌ గుండె గుభేల్‌ మంది ఆ మంత్రం ఎక్కడా కనపడటం లేదు!
స్నానం చేసేప్పుడు తడిసి కారిపోయిందో లేకపోతే గోడ రంగులో చాక్‌ రంగు కలిసిపోయిందో ఏమైతేనేం, మంత్రం మాయమయ్యింది!

కంగారుగా జ్యోతిష్యుడి సెల్‌ ఫోన్‌కి ఫోన్‌ చేశాడు. రింగ్‌ ఔతోందే తప్ప ఎవరూ తియ్యటం లేదు.
అప్పుడు గుర్తొచ్చింది ఈ పిక్చర్‌ సక్సెస్‌ కావటానికి ప్రత్యేకంగా జపం చేస్తూ ఎవరికీ కనపడకుండా ఎక్కడో కూర్చునివుంటానని, ఎవరూ డిస్టర్బ్‌ చెయ్యకుండా సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేస్తాననీ ఆయన చెప్పిన మాట!
ఎలా? ఇప్పుడెలా?
తెలిసిన వాళ్ళందరికీ ఫోన్‌ చేశాడు సత్యానంద్‌. ఎవరూ తెలియదన్నారు.

ఎవరినన్నా జ్యోతిష్యుడి ఇంటికి పంపుదామని బయటికి వచ్చి చూసేసరికి
ఆఫీసంతా నిర్మానుష్యంగా వుంది.
ఒక్కరంటే ఒక్కరు కనిపించలేదు.
అందరూ అంత హఠాత్తుగా ఎలా మాయమయ్యారో అర్థం కాలేదు అతనికి. ఒకవేళ తను నిద్రపోతూ కలలో వున్నానా అని అనుమానం వచ్చింది ఒక్క క్షణం. గిల్లుకుని చూసుకున్నాడు. నొప్పిగానే వుంది. ఎందుకైనా మంచిదని బల్లని ఓ తన్ను తన్నాడు.
అప్పటిదాకా మహేష్‌ మర్దనలని ఓపికతో భరించి “కుట్టకయున్న వృశ్చికము కుమ్మరిపుర్వని యందురే కదా!” అని అనుకున్నదో ఏమో కాని అది సత్యానంద్‌ మీద ఏమీ దయచూపించలేదు దాంతో అతని చిటికెనవేలు అర్జంటుగా ఎర్రమిరపకాయ పచ్చడి వేషం వేసుకుంది. అబ్బా అని కుర్చీలో కూలబడ్డాడు. కలకాదని ఖచ్చితంగా తేలినట్టే.

అంత బాధలోనూ అతనికి అంతుపట్టనిది ఏమైంది వీళ్ళందరికీ? అనేది.
అదేదో “వెనిల్లా స్కై” సిన్మాలోలా కాలేదు కదా!
హఠాత్తుగా ఫోన్‌ మోగింది. తీశాడు.
ఒక వికటాట్టహాసం! “తిక్క కుదిరిందా?” అన్న అరుపు. మళ్ళీ విలన్‌ నవ్వు. ఈసారి నాలుగైదు గొంతులు. నిశ్శబ్దం.

చకచకా “సినీ బెహేవియరల్‌ డిక్షనరీ ” తీసి చూశాడు దాని అర్థం ఏవిటా అని.
అతని గుండె వెయ్యి వయొలిన్ల బేక్‌గ్రౌండ్‌తో ఏడుప్పాట పాడే తమిళగాయకుడిలా బోరుమంది
తన పిక్చర్‌ ఫ్లాప్‌ అయింది!
తనకొచ్చిన దౌర్భాగ్యపు “ఫ్లాప్‌” ఆలోచన నిజంగానే నిజమై కూచుంది!

కాని, ఇంతమంది గొప్ప జాతకుల జాతకబలం ఏమైపోయింది?
పీక్కుందామని ఎంత ప్రయత్నించినా జుట్టు దొరక్క, “ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా?..” అంటూ ఆవేశంగా పాట అందుకున్నాడు ఎప్పుడో కాలేజి రోజుల్లో పాడుకున్నది హఠాత్తుగా గుర్తొచ్చి ప్రేమనగర్‌లో “ఎవరికోసం ఎవరికోసం” పాటలో నాగేశ్వర్రావులా వూగిపోతూ.

అంతలోనే ఎదురుగా ఎవరో వున్నారనిపించి ఠక్కుమని ఆపేసి చూశాడటు.
శంకర్రావు!
అతని చేతిలో ఓ కాగితాల కట్ట.

“ఈ జాతకుడి పాదం భస్మాసురహస్తమే! ఏదీ కలిసిరాదు” చదివాడతను ప్రశాంతంగా.
“ఎవరిది? ఎవరిదా జాతకం? నాకు ఇన్నాళ్ళూ ఎందుకు కనపడలేదు?” గర్జించాడు సత్యానంద్‌.

ఓ చిరునవ్వు నవ్వాడు శంకర్రావు, పాతసిన్మాల్లో స్వామీజీ వేషంలో చిత్తూరు నాగయ్యలా.
“మీదే సార్‌!” అన్నాడు మెల్లగా. అతని కంఠంలో ఒకరకమైన తృప్తీ, కొంటెదనమూ, ధిక్కారమూ ధ్వనించాయి సత్యానంద్‌కి.
తనున్న సీన్లో మరొకడికి మంచి డయలాగ్‌ ఉంటే మండిపడే హీరోలా ఉగ్రుడయ్యాడు సత్యానంద్‌.
“ఎన్ని గుండెల్రా నీకు నా జాతకమే బాగులేదనటానికి? డొక్క చీరేస్తా!” అంటూ విరుచుకుపడ్డాడు. “నా జాతకమే సరిగ్గా చూసుకోకుండా ఇంత పనికి దిగాననా నీ ఉద్దేశ్యం? అంత వెధవలాగా కనపడుతున్నానా?”

“నామీద కోప్పడితే ఏమీ ఉపయోగం లేదండి సత్యానంద్‌ గారూ! మీరు నెత్తిన పెట్టుకుని పూజించే జోతిషుడు గారు ఇప్పుడే మనిషి చేత పంపించారిది. ఎప్పుడో దీన్ని రాసి దగ్గర వుంచుకున్నారంట. మీకు అప్పుడే చెప్పటానికి మనసొప్పక మీకు నచ్చేరకంగా అప్పుడు రాసి ఇచ్చారంట గాని మళ్ళీ తమ విద్యకి ద్రోహం చేసినట్టు ఔతుందని అసలైన జాతకం కూడా రాసి తమ దగ్గరే పెట్టుకుని దాన్ని బయటికి తీసే అవసరం రాకూడదని వెయ్యి దేవుళ్లకి పూజలు చేస్తున్నారంట. కాకపోతే తమ జాతకం ఎంత పనికిమాలిందంటే అన్ని పూజలూ కూడ మీ పిక్చర్‌ ఫ్లాప్‌ కాకుండా ఆపుచెయిలేక పోయినయ్యంట. ఆయన మీకు చెప్పమన్న మాట చెప్పాను. ఫేడవుట్‌ ఔతానింక”
“ఆగు” అరిచాడు సత్యానంద్‌ సీమ సిన్మాలో విలన్లా.
“ఇన్నాళ్ళూ ఎప్పుడూ ఇంత స్పష్టంగా మాట్లాడలేదు నువ్వు. అసలు ఎవర్నువ్వు?” అనడిగాడతన్ని.
“అదంతా ఓ పెద్ద ఫ్లాష్‌బేక్‌. నాలుగైదు రీళ్ళన్నా పడ్తుంది. ఒక్క డైలాగులో చెప్పాలంటే ఇదివరకు ఓ బ్రహ్మాండమైన స్మాష్‌హిట్‌ పిక్చరూ దానివెంటనే అంతకంటే పెద్ద వీరఫ్లాప్‌ పిక్చరూ తీసి దాంతో మూతపడ్డ ఓ ప్రొడక్షన్‌ కంపెనీ నాదే!” అంటూ చూస్తూండగానే లాంగ్‌ షాట్‌లోకి అక్కణ్ణుంచి ఫేడౌట్‌ లోకి వెళ్ళిపోయాడు శంకర్రావు. అతని జేబులో తన అసలు జాతకం తళతళలాడుతోంది!

ఇక్కడ తన కొత్త జాతకం వంక తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడు సత్యానంద్‌.
ఎదురుగా రకరకాల క్షుద్రగ్రహాలు అప్పులవాళ్ళ వేషాల్లో ఎంటర్‌ ఔతున్నాయి.

రివర్స్‌ ఫ్రేంలో జ్యోతిష్యుడు మరో కొత్త నిర్మాతతో మందు మీద కూర్చుని వున్నాడు.
మరో గ్లాసుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు శంకర్రావు ఆ జ్యోతిష్యుడికి స్వయాన అన్న!