ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! జనవరి 1, 2003

ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని ముందుముందు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం, రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఐతే ఆంధ్రులకు అతి ప్రియతమమైన సినీసంగీతం కొంత ఈ సంచికలో అందిస్తున్నాం. ఇప్పటి పాటలు దొరికే స్థలాలు ఇంటర్నెట్‌ మీద చాలానే ఉన్నాయి కనుక మేము చాలా పాత పాటలతో ప్రారంభిస్తున్నాం. చిత్తూరు నాగయ్య , శాంతకుమారి , బాలసరస్వతీదేవి లాటి వారి గాత్రమాధుర్యాన్ని, అప్పటి సంగీతధోరణుల్ని ఆనందించగలిగే వారికి, కనీసం అవెలా వుంటాయో అన్న కుతూహలం వున్నవారికి ఇవి ఆమోదయోగ్యాలవుతాయని భావిస్తున్నాం. ఈసంచికలోనే శ్రీశ్రీతో ఆకాశవాణి చేసిన బాతాఖానీని వినిపిస్తున్నాం . రాబోయే సంచికల్లో అరవైలు, డెబ్భైలు, ఎనభైల మొదల్లో వచ్చిన పాటలు, కొన్ని శ్రవ్య కావ్యాలు, మీ ముందుంచటానికి సిద్ధం చేస్తున్నాం.

ఇక రచనల విషయంలో ఈ సంచికలోనూ “ఈమాట” నుంచి మీరు ఆశించే స్థాయి కథలు, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాం. కనకప్రసాద్‌ కవిత “శ్రోతలు కోరని పాట” తెలుగు కవిత్వంలో ఒక కొత్త మార్గం. ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తాం. భాస్కర్‌ నాటిక “బిగ్‌ బక్స్‌ ” వినోదాత్మకమే కాకుండా ఇక్కడ ప్రదర్శించటానికి సరైన నాటికలు దొరకని లోటును కొంతవరకు తీరుస్తుందని భావిస్తున్నాం.