జయప్రభశబ్ద కవిత్వం

కవిత్వం శబ్దమయమే కదా.. మరి శబ్ద కవిత్వం అనడంలో ఔచిత్యమేముంది? అని కాస్త చదువుకున్న పాఠకుడు ఆక్షేపించవచ్చు.కవిత్వం శబ్దమయమే కాదు,నిశ్శబ్దమయం కూడా.నిశ్శబ్దాన్ని పసిగట్టలేని వారికి కవిత్వం కేవలం శబ్దస్వరూపంగా గోచరించవచ్చు.ఏనాడో శతాబ్దాల కిందట కవిత్వంలో నిశ్శబ్దాన్ని గౌరవించిన తూ ఫూ ,లీ పో లాంటి చైనా కవులు,బషో,ఇస్సా,బుసన్‌లాంటి జపనీస్‌కవులు నేటికి మన దృష్టిపథం నుండి కనుమరుగు కాలేదు.అనువాదాల్లో సైతం చెడని వారి కవిత్వ గాఢతకు ప్రపంచం విస్తుపోయింది.ఉజ్వలమైన ఈ అనువాదాల వల్ల ఆంగ్ల కవిత్వం చాలా లాభ పడింది.ఈ తూర్పు కవిత్వాల అనువాదాలతో ఎంతో పేరు పొందిన ఎజ్రాపౌండ్‌నూతన కవిత్వ ప్రవక్త గా అవతరించాడు.అతని ఆలోచనలను గౌరవించి ఆ దారిలో ఎందరో ఆంగ్ల, అమెరికన్‌కవులు నడిచారు.ఆంగ్లం విశ్వవ్యాప్తభాష కావడం మూలాన,ఈ నిశ్శబ్ద కవిత్వం..చిన్న తుంపరలా మొదలై,తుదకు వర్షమై..ఇంద్రధనూవర్ణాలతో అందరినీ ఆకర్షించిందిఅతి సహజంగా!

భాషను కవిత్వవాహకంగా మాత్రమే వాడుకోవడంలో నిశ్శబ్దకవులు ఎంతో శ్రద్ధ చూపుతారు.కవిత్వధర్మాలేవో వారి ఎముకల్లో ఇంకి ఉండటం చేత వారు ఎక్కువ మాట్లాడరు.”కొండ అద్దమందు కొంచమై ఉండదా” అన్నట్టు ఎంత గొప్ప జీవిత సత్యాన్నైనా తగుమాటల్లో చెప్పి,కొంత మౌనానికి,ధ్యానానికి ఆస్కారమిస్తూ పక్కకు తప్పుకొంటారు.భాష అంటే వీరికి గిట్టదా? అన్న అనుమానం పొడసూపవచ్చు అంతగా తెలియని చదువరికి.భాషా సౌందర్యాన్ని దర్శించి అక్కడితో ఆగిపోకుండా,దానికంటె ఉన్నతమైన లక్ష్యం వైపు సాగిపోవడం వల్ల అలవడ్డ సరళత ఇది.సూర్యుని కిరణాలు సోకిన మేర ప్రకృతి అంగుళమంగుళం పులకించినట్టు.. ఈ సారళ్యస్పర్శతో ఉజ్వలమై ప్రకాశించింది కవిత్వం!

తెలుగు కవుల్లో,విమర్శకుల్లో ఈ ఎరుక కవిత్వంలో నిశ్శబ్దం అవసరమన్న సూక్ష్మావగాహన ఎవరికైనా ఉందా?నార్ల లాంటి పాత్రికేయుడు కవిత్వాన్ని,పాండిత్యాన్ని వేరు చేసే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం గొలిపే విషయం.ఇస్మాయిల్‌గారి కవిత్వ మానిఫెస్టో అనదగ్గ “కవిత్వంలో నిశ్శబ్దం” అన్నపుస్తకంలో ఈ తరహా కవిత్వానికి కొన్ని బలమైన తాత్విక ప్రాతిపదికలు ఏర్పరచడం అందరూ ఎరిగిందే.కాని వాటి విలువను ఎవరైన గుర్తించారా ? అన్నది అసలు ప్రశ్న!!

విప్లవాలు,వీరంగాలు డీలా పడ్డాయి,ఎన్ని రోజులని ఊరకే నినదిస్తూ కూచుంటారు,విసుగు పుట్టదూ,సహజంగా అదే జరిగింది.ఈ నేపథ్యంలో ఎనభైల్లో గొంతువిప్పిన చాలా మంది కవుల్లాగే జయప్రభ కూడా కవిత్వంలో నిశ్శబ్ద ప్రసక్తిని గుర్తించినట్టు తోచదు.స్త్రీ వాద సంరంభంలో శరీరధర్మాలన్నీకవిత్వాలై కూర్చున్నాయి. “చీరకు, కవిత్వానికి భేదం గుర్తించలేని” విమర్శకమ్మన్యుల పుణ్యమా అని,వీధిగొడవ స్థాయికి దిగింది ఈ కవిత్వం.జపనీస్‌యుద్ధవిద్యల్లో ఒక నానుడి ఉంది.తన లోపాలు,ప్రత్యర్థి లోపాలు తెలుసుకోలేని వాడు పదే పదే ఓడతాడు.మన తెలుగు కవులు ఈ కోవకే చెందుతారు.తమ లోపాలు తెలుసు కోరు;భాష పరిమితులు ఎరగరు.ఫలతః పాఠకుణ్ణి కలవరపెట్టే కొండవీటి చాంతాడు కవిత్వాలు;ఎంత చేదినా ఒక్క గుక్క నీరు ఉండదు,దాహం తీరదు.భాష దగ్గరే ఆగిన వాడు శబ్దకవి.ఆగిచూసుకోవడం అలవాటు లేదు.పరిగెత్తి పాలు తాగడమే. భాషను దాటిన వాడు నిశ్శబ్ద కవి.. నిలబడి నీళ్ళుతాగే నింపాది తరహా.భాష పరిమితులను గుర్తించడం లేదంటే ఆ మేరకు విచక్షణ లోపించినట్టే. విచక్షణ లేని కవి విలక్షణ కవిత్వం సృష్టించిన దాఖలాలు విశ్వసాహిత్యంలో లేవు.విచక్షణలేని వాడి కవిత్వం ,పిచ్చివాడి చేతిలోని రాయి రెండూ ఒకటే.
కాబట్టే భావనా ప్రపంచంలో ఇంత రక్తపాతం!

పదాల బలహీనత గూర్చి వాపోయిన ఆధునిక కవి బైరాగి.ఐనా అతని మార్గం శబ్ద మార్గమే.అంతటా ఆవరించివున్న అస్తిత్వవేదనను అందుకొని కృతార్థుడైనా,అతని కవిత్వంలో నిశ్శబ్ద ప్రసక్తి లేదు.తన కవిత్వంలోకి అతను నిశ్శబ్దాన్ని ప్రవేశ పెట్టలేదు.అది అలా ఉండనిస్తే

భాషా విచక్షణ కొరవడినవాడు పద్య గద్యాల విభజన రేఖను పరిగణించడు కాబట్టే కవితా ప్రపంచంలో ఇంత అయోమయం.మసి పూసి మారేడు కాయ చేసినట్టు,వ్యాసం కాదగ్గవిషయాన్ని కవిత్వం చేయాలన్న వృధా ప్రయాస.ఇన్ని జంజాటాలతో సతమతమవుతుంటే సుతీ మతీ లేని వాదాలు.(నాది చూడు మధ్యలో బుడంకాయ తొక్కు అని ఇటీవలి postmoderns,language poets! )వాటికి విచ్చుకత్తులతో కాపు గాసే వీరభటులు;పుష్కరాని కోసారి ఇలాంటి వాదాలచెత్త పుష్కలంగా జమపడి,దాని అడుగున కవిత్వం భీతిగా బిక్కు బిక్కుమంటూ తల్లడిల్ల వలసిందే.

పూస గుచ్చినట్టు చెప్పడం,వివరణా బాహుళ్యం,వచనంలో రాణిస్తాయేమో గాని కవిత్వానికి మేలుచేయవు.సమగ్రంగా చెప్పబూనడం వ్యాసకర్త లక్షణం. కవికి వన్నె తెచ్చే గుణం కాదది.వచనం మీద,తర్కం మీద అపనమ్మకమే మనిషిని కవిత్వం చెంత చేర్చింది.వ్యావహారిక బుద్ధికి సత్యం అందని మాని పండు అన్న ఎరుకే కవిత్వాన్ని అగ్రస్థానంలో నిలిపింది.ఇంతటి విశిష్ట ప్రక్రియలో,వెనుకటి గుణం మానని కవిగణాలు బుద్ధికి పట్టం గట్టే వాదాల రొంపిలో మొలకంటా దిగబడుతూనే ఉన్నాయి.అంతలావు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్టు పదునెక్కిన కవి మనసు ఎంతటి భావాన్నైనా నిశితంగా ఛేదిస్తుంది.పాడిన పాటే పాడటం కవి చేయలేని పని.వాడి అన్వేషణ..గమ్యం..నవ్యత!

అశ్వ పరీక్ష కన్నా రత్న పరీక్ష కష్టమన్నారు మన ప్రాచీనులు.కారణం గుర్రాల్లాగా ఎక్కడపడితే అక్కడ కనిపించవు రత్నాలు.వాటిని దొరికించుకోవడం దుర్లభం,కావున విలువ కట్టడం దుష్కరం.రత్న పరీక్ష కన్నా కవిత్వ పరీక్ష మరింత కష్టం.ఏ దేశంలోనైనా ఈ ధాతువు బహు సకృతు.చుక్క రాలి పడ్డట్టు.. అకస్మాత్తుగా తారస పడుతుంటారు కవులు,అంతే వేగంతో అదృశ్యమవుతుంటారు కూడా.

భూగర్భంలో మగ్గి,మసలి దీర్ఘ నిరీక్షణ అనంతరం చేతిలో పడి మెరిసే వజ్రానికి,కవిత్వానికి అట్టే భేదం లేదు.అనుభవజ్ఞుడే ఇన్ని రాళ్ళ మధ్య దాని పోలిక పట్టగలడు.మిడి మిడి జ్ఞానం గలవాడు రంగురాళ్ళనే రత్నాలుగా భ్రమిస్తాడు,భ్రమింప చేస్తాడు.ఒక్కసారి మెరుగులు దిద్దుకొన్న వజ్రం పగటికాంతితో బయటపడిందా దాని అనేక తలాలు ప్రతిఫలించే కాంతిని చూసి ముగ్ధులు కాని వారు అరుదు.మామూలు గద్యం కాలినడకన వెళుతుంటే బొటనవేలికి తగిలే రాయిలాంటిది.హృదయగర్భంలో మగ్గి,మసలి ఘనీభవించిన భావాన్ని కఠోర పరిశ్రమతో బయటికి తీసి,సాన బెట్టి,దాని మిరుమిట్లకు కనులు బైర్లు కమ్మి,మూర్ఛిల్లి,నిదానంగా తేరుకొని అనాసక్త ప్రపంచం ముందు..కవి దాన్ని వేయిరెట్లు అనాసక్తితో ప్రదర్శిస్తాడు.వజ్ర కాఠిన్యం లాంటిదే కవిత్వ కాఠిన్యం. అన్ని తలాలను ..అన్ని కోణాలను సర్వసమగ్రంగా ,నిశ్చల ఏకాగ్రతతో పరిశీలిస్తే గాని వజ్ర తత్వం బోధ పడదు.రాయిని పరిశీలించడానికి ఇంత శోధన అవసరం లేదు. ఆ పరిశీలనలో గొప్ప కుతూహలం , ఆనందం కూడా ఉండవు.కారణం అవి ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు తగులుతూ ఉండటమే.పోతే రాయివచనం,గద్యం;వజ్రంకవిత్వం,పద్యం !!

కవిత్వ పరిశీలనలో విస్మరించకూడని అంశాలు;సదరు రచన కవిత్వమా ?కాదా? ఐతే,గీతే ఎంత స్థూలం..లేదా ఎంత సూక్ష్మం..భూమి అడుగుపొరల్లో దీర్ఘ ఘనీ భవనానికి(condensation) లోను కావడం వల్ల వజ్రానికి విశిష్టాకృతి,పారదర్శకత సిద్ధించినట్టు సదరు కవితలో ఆకట్టుకొనే కాంతిగుణాలేవి?చుట్టూ ఉన్న లోకాన్ని,క్షణం క్షణం మారే కాంతిని అది ప్రతిఫలించ గలుగుతోందా ? కొంపదీసి మనం వజ్రంగా భావిస్తున్నది అరకు లోయలో దొరికే అణాకాణీ రంగురాయా? భ్రమావరణంలో బయటపడలేనంత బలహీనత ఆవరించలేదు కదా??

ఇంత చర్చ ఎందుకు చేయవలసి వచ్చిందంటే ..కవిత్వం కేవలం శబ్దమయం అన్న భావన ప్రబలి ఉండటం వల్ల.కొండ మీదికి ఎక్కాకే ఊరు సరిగా కనిపించినట్టు నిశ్శబ్ద శిఖరాన్ని అధిరోహించాకే అవలీలగా శబ్ద జగత్తు ఆనవాలు పట్టగలము.జయప్రభశబ్ద కవిత్వాన్ని సమీక్షంచడానికి తగిన ప్రాతిపదిక,మానసికరంగం సిద్ధమైనట్టే.ఇంతవరకూ శబ్దకవులను నిశ్శబ్ద కవులను వేరుపరుస్తూ ఏకరువు పెట్టిన దుర్లక్షణాలన్నీ ఇబ్బడిముబ్బడిగా జయప్రభ కవిత్వంలో కనిపిస్తాయి. వజ్రసదృశ కవిత్వ సౌష్టవాన్ని,ఆకృతిని సిద్ధించుకోలేక పొలమారిన సందర్భాలు కోకొల్లలు.భాషా విచక్షణ కొరవడిన కారణంగా అర్థం గొడ్డుబోయిన సమయాలు లేకపోలేదు.దీర్ఘకాల ఘనీభవనం లేని కారణంగా భూమి పైపొరల్లో పెచ్చులుగా రాలిపడే రంగురాళ్ళలా కవితలు అనేకం పాఠకుడి ముందు కాంతివిహీనంగా నిలుస్తాయి.

ప్రేమలో ,కవిత్వంలో భాషకు రెక్కలు మొలుస్తాయి.ప్రియురాలితో ఎవడూ ఉపన్యసించడు.పారదర్శకమైన ప్రియురాలి చూపును ఉపేక్షించడు. ప్రతి పదానికి విలువ ఉందన్న సత్యాన్ని మరువడు.అతి కష్టంతో,వినయంతో సకలభావాలకు లోనవుతూ ఆ ఒత్తిడితో,రాపిడితో పడినలిగిన పదాలను నక్షత్రాలుగా ఊహాకాశానికి అతికిస్తాడు. వెంటనే ఆ పదాలు మెరవడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు…ఇంత ప్రేమ..నీ కవిత్వంలో, నీ భాషలో ఉందా? సున్నితమైన మనసులో జనించే ప్రేమ నీలో ఉంటే నీ కవిత్వంలోకి నిశ్శబ్దం ప్రవేశిస్తుందిఅనవసర శబ్దాలను చీకట్లో కలుపుతూ..భాషకు చరమ రూపం అదే.సాదా కర్బనం యుగాల వత్తిడిలో వజ్రాకృతి దాల్చడం అంటే అదే. వేమన వాడి రాగి బంగారమవునన్నా అదే !

శబ్ద కవిత్వమంతా అకవిత్వమా ? ఖచ్చితంగా కాదనే సమాధానం దాన్ని మించిన కవిత్వానికి కళ్ళు తెరిపించే ఒక ప్రయత్నమే ఇదంతా !

స్త్రీలకు ప్రకృతి పరంగా సహజంగా ఎన్నో గుణాలు సంక్రమించాయి.ప్రకృతిలో,పిల్లలతో అలవోకగా మమేకమైపోవడం,చిన్నవయసులోనే విపరీత మైన భాషా పాటవాన్ని కలిగిఉండటం,ఎంపికలో మంచి విచక్షణ సున్నితత్వం,ఎదుటివారి భావాలను ఇట్టే పసిగట్టడం;మగవాడికి ఇవేవీ అబ్బలేదు.ఇలాంటి విషయాల్లో చాలా మొద్దుగా కనిపిస్తాడు.ఇవన్నీ నిదానంగా పాదు గొల్పుకొని వృద్ధిచేసుకొంటాడు.తమాషా ఏమంటే తనకు సహజమైన ఆదిమ వేటగాడి లక్షణం స్థలకాలాదుల ఊహాకల్పనకు ఇవి తోడై గొప్ప కవిత్వం పుట్టుకొస్తుంది.ఊహాకల్పనను స్త్రీలు నేర్వవలసి ఉంటుంది.వారికి అది సహజంగా అబ్బేది కాదు.ఈ లోపమే కవయిత్రుల కవితలు కొంచెం ఎక్కువ దీర్ఘంగా తయారు కావడానికి కారణమేమో అనిపిస్తుంది.కొరడా ఝలిపించినట్టు క్లుప్తంగా రాసే కవయిత్రులు అన్నా అఖ్మతోవా,కొంత వరకు మాయా ఏంజెలౌ,విస్వావా జింబొస్కా తప్ప ఎవరూ కనిపించడం లేదు.కవిత్వానికి మూలభూతమైన ఉద్వేగాలను అనుభవించే తీరు కూడా దీనికి కొంచెం కారణమా?ఇవన్నీ చర్చనీయం.

అమెరికన్‌కవిత్వంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఎడ్నా మిల్లే తో పోల్చవచ్చు జయప్రభను.మోహానికి శబ్దాకృతి ఇవ్వడంలో వీరు ఎంతో ఎత్తుకు ఎదిగారు. భాషతోటే వీరి పని.ఆవల ఏముందో గ్రహించగల ఓపిక,తీరిక వీరికి లేవు.ఎందరికో ఎడ్నా మిల్లే ఇష్టురాలు.ఆమె కవిత్వంలోని లయను ఎందరో విమర్శకులు గుర్తుపెట్టుకొన్నారు.ఐతే ఆధునికులు ఆమెను పెద్దగా చదవరు.చాలా ముందుకు వచ్చేశామనుకొంటారు,కానీ అప్పుడప్పుడు ఎడ్నా మిల్లే కవితా సౌధం మీది వింత వెలుతురు వారిని ఆకర్షిస్తూనే ఉంది.శబ్ద జలపాతాలలో ఉక్కిరి బిక్కిరి కావాలనుకొన్న వారు అక్కడ చేరుతూనే ఉన్నారు. ఎడ్నా మిల్లే కన్నా ఎక్కువ ఎన్న దగింది మన కవిత్వ ప్రభ!

జయప్రభ కవిత్వ విమర్శ,పరిశీలన
రెండు దశాబ్దాలుగా కవిత్వసేద్యం వెలిగిస్తున్న జయప్రభ..కవిత్వం పేరిట వట్టి మాటల ఊబిలో కూరుకుపోతే,బొడ్డూడని కవుల గురించి చెప్పుకోవడానికి ఏముంది?? ఈ వైపరీత్యం తెలుగుకవులకే ఎందుకు దాపురించినట్టు??కవితా నిర్మాణం,భాషా దృష్టి,ప్రతిభాలేశం ఏవీ కనిపించవు వీరి కవితల్లో.దీనికి కారణం ఆత్మ వ్యామోహమా (narcissism)?ఏ రంగంలోనైనా ఇది అక్కరకు వస్తుందేమోగాని సాహిత్యంలో ..అందునా కవిత్వంలో కాదు.ఆత్మ వ్యామోహితుడు ప్రకృతితో, పరిసరాలతో తాదాత్మ్యాన్ని సాధించలేడు.కాళ్ళులేని వాడు నడవలేనట్టే,కళ్ళులేని వాడు చూడలేనట్టే,తన్ను తాను మరచి తాదాత్మ్యం చెందనివాడు కవికాలేడు.మన కవులకు ప్రక్రియా భేదాల పరిజ్ఞానం బహుసకృతు లేదా శూన్యం.లేదంటే వారు కరపత్రాల సరుకుని,దినపత్రికల మోతను కవిత్వంగా ఎలా చలామణీ చేస్తారు? ఎలుగెత్తి అరవడమే రాగం,ఎగిరిదూకడమే నాట్యం!కళకు కావలసిన క్రమశిక్షణ ఏ కోశానా లేదు మన కవివృషభాలకు..ఏ చేలోపడితే ఆ చేలో అడ్డంగా మేయడమే..అది గుణమా,దోషమా అన్న ఎరుక,ఇంగితం లేవు.సంగీతము,నాట్యమూ,శిల్పమూ,చిత్రలేఖనముఎన్నో ఏళ్ళు అభ్యసించి గట్టి సాధన చేస్తేనే గాని ఆయా రంగాల్లో ఎవరినీ మెప్పించలేము.మరి అలాంటిది లలితకళలకు తలమానికమైన కవిత్వంలో నూతన సృష్టి చేయడానికి ఎంతటి పరిశీలన,భాషాశోధన,రస హృదయం అవసరమవుతాయి??ఎవరూ ఏమీ గుర్తు పట్టినట్టు లేరు.అందుకే ఏ “ప్రముఖ” కవి పుస్తకాన్ని నాలుగు పుటలు తిరగేసినా మనకు అడుగడుగునా ఎదురయేవి స్ఖాలిత్యాలు,భేషజాలు..కవిత్వం తప్ప మనకందులో ఇతరేతరాలు అన్నీ కనిపిస్తాయి.ఫలానా సంఘటనకు స్పందన అనో ,సదరు దురాగతానికి నిరసన అనో, మరొకరి మీద పగ అనో ద్వేషం అనో..తెలుగు కవికి ఎంతసేపూ పక్కచూపే కానీ, లోచూపు బొత్తిగా లేదన్నమాట.ఈ పాపంలో విమర్శకుల పాలు తక్కువేమీ కాదు.ఉమాకాంతులు,రాళ్ళపల్లి,రా.రా లాంటి ఉద్దండులు గతించాక విమర్శ వృక్షం కాసినవన్నీ కుక్కమూతి పిందెలే.కావున నంగిచేష్టలు నత్తి మాటలే విమర్శగా చలామణీ కావడంలో పెద్ద ఆశ్చర్యమేముంది?”ఇది జీవద్భాష..ఇది సత్కవిత్వం ” అని మీమాంసించే నాథుడే లేకుండా పోయాడు.విమర్శలో “ఇది నా దృష్టి..ఇది నా మార్గంఅధ కవిత్వానుశాసనం” అని వాక్రుచ్చే కవిత్వ వైయాకరణుడే కనపడడు.

ఇక జయప్రభ కవిత్వాన్ని పారజూస్తే…

“యుద్ధోన్ముఖంగా”(1986),ఎండు ఎనభైల్లో వచ్చిన సంకలనం..ఆ దుర్లక్షణాలన్నీ “వీకంబోవక” దర్శనమిస్తాయి.” పోరాటం,అరుణోదయం సాయుధ ఉగాది” కొన్ని కవితల పేర్లు మచ్చుకు,కొంత సున్నిత హృదయుడు ఠారుకొని చావడానికి ఇవి చాలు.నినాద ప్రియత్వం,ఆవేశ ప్రదర్శన,మిమిక్రీ..ఇత్యాదులు తప్ప ఇన్ని గొడవల మధ్య నాకు కవిత్వం అన్న పదార్థం సంతలో తప్పిపోయి మేకలా ఎంత వెదికినా కనిపించలేదు;ఇసుక తోలగానే ఇల్లు కట్టినట్టు కాదు.మాటలు పోగుచేయడమే కవిత్వం కానేరదు.ఇందులో కవిత్వానికి అవసరమైన దీర్ఘ నిరీక్షణా లేదు..తీవ్ర ఘనీభవనం లేదు మాటలు కోటలు దాటడమే తప్ప కవిత్వాన్ని సృజించిన పాపాన పోలేదు. “శ్రీ శైలం లోయలో” ఆరుపేజీల మేరా విస్తరించిన “వచన” కవితలో కవయిత్రి సొంతగొంతు వినిపిస్తుంది ముందు ముందు ప్రేమానుభవాలు అందించబోతోంది అన్న దానికి సూచనగా..ఐతే ఉదహరించ వలసిన స్థాయికి చెందిన కవితలు ఇందులో లేకపోవడం .. చింతనీయం !

” వామనుడి మూడో పాదం “(1988),పేరు చూడగానే కవయిత్రికి పురాణప్రతీకలంటే విపరీతమైన మోజు అని తెలిసిపోతుంది.ముందు ముందు అది ఎలా వికటించిందో అర్థం చేసుకోవడానికి ఈమాత్రం ప్రస్తావన చాలు.ఇందులో మొత్తం 36 కవితలు.వజ్రంలా గట్టిపడి..కొనదేలిన కవిత మచ్చుకు కనిపించదు.పఠాభి లాంటి వారు ఎంపికచేసిన “చూపులు,పైట తగలెయ్యాలి,స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ” కవితల్లో కూడా వాచ్యగుణం కవిత్వాన్ని పూర్తిగా కృంగదీసింది. పూస గుచ్చినట్లు చెప్పడం,వివరణా బాహుళ్యం వచనంలో రాణిస్తాయేమో గాని కవిత్వానికి మేలు చేయవు .ఇక్కడ జరిగిందదే..పాఠకుల అవగాహనాశక్తిని తక్కువ అంచనా వేసి వారి ఊహకు ఏమీ వదలకపోవడం..ప్రధానలోపం..”పైట తగలెయ్యాలి” అన్న కవితను విశ్లేషిద్దాం..

నీ కనుల ముందు కనిపిస్తున్నది పైట,కనిపించనిది దాన్ని కల్పించిన సమాజం లేదా వ్యవస్థ.కనిపించే వస్తువు మూర్తం(concrete);కనిపించని వస్తువు అమూర్తం (abstract).కాబట్టి వ్యవస్థను తూర్పారబట్టడానికి చేతుల్లో ఉన్న సాధనం పైట.ఇంకొక విషయం,ఒక వస్తువు తాలూకు పదజాలంతో మరొక వస్తువు గూర్చి చెప్పడమే శిల్పం (technique).కళ్ళకు కనిపించే పైట తాలూకు పదాలతో ,కనిపించని వ్యవస్థను విమర్శించాలి.పైట తన స్వేచ్ఛను ఎలా కొల్లగొడుతుందో చెబుతూ,దాని పట్ల కోపాన్ని,అనిష్టాన్ని వాచ్యంగా వెల్లడించ వచ్చు,అంతేకాని పైట వాడకానికి కారణమైన వ్యవస్థను మాత్రం వాచ్యంగా దూషించరాదు,కారణం అది వ్యంగ్యంగా వెల్లడి కావలసిన అంశం. పైట మీది వ్యతిరేకత వ్యవస్థ మీది వ్యతిరేకతగా వ్యక్తం కావాలి.అంతేగాని ఎక్కడా కనిపించని సమాజం లేదా వ్యవస్థ మీద Don Quixote లా కత్తులు
దూస్తే లాభం లేదు.అది శిల్ప పరిజ్ఞానంలో ఓనామాలు తెలియని వారు చేయవలసిన పని.

పైట గురించి అభిప్రాయాలు వెల్లడించడానికి ఇది సందర్భం కాదు,దానికి విడిగా అలనాటి శాతవాహన పట్టణం పైఠాన్‌లో బయల్దేరిన వస్త్ర నాగరికతలో భాగంగా పైట(పైఠాన్‌నుండి పుట్టినది,కాబట్టి పైట),ఏలుబడిలో వున్న అన్ని ప్రాంతాలను ఎలా ఆకట్టుకొందో , అవసరమైన ప్రాకృతాధారాలతో ఒక వ్యాసం లిఖించవచ్చు.

పైటని తగలెయ్యాలి

పైట కొంగును చూస్తే
నా కెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది !
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది !

నన్ను
నిటారుగా నిలవనివ్వక
పైట

నా గుండెలపై తన అంచుల చేతులాన్చి
నన్ను వంగదీయాలని చూస్తుంది
నాకు అలవాటులేని
సిగ్గుని మప్పుతుంది
ఏదో కంగారు పిట్టలా
నా చుట్టూ తిప్పుతుంది.

నువ్వు ఆడదానివంటూ
హిప్నటైజ్‌చేస్తుంది
నేనూ మనిషినన్న భావాన్ని
నా చేత మరిపిస్తుంది

నా చేతులతో
రెండు భుజాలనీ చుట్టి
ఈవిడ మహాపతివ్రత సుమా
అంటూ రెప రెప లాడుతుంది

కాదంటూ అరవాలనుకుంటాను
కానీ గొంతు పెగలదు
దాని ముందు నేనెప్పుడూ
ఓడిపోతూనే ఉన్నట్లుంటుంది

పైట
ఊబిలా నన్ను గుంజేస్తూ ఉంటుంది

పైట
సుడిగాలిలా నన్ను తోసేస్తూ ఉంటుంది

నా మీద
తరాల నుంచీ మోపిన
అపనింద పైట

నన్ను అబలని చేసిన
పితృ స్వామ్యపు అదృశ్యహస్తం పైట

దోపిడీ సంస్కృతి
నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి
దాని పైన కప్పిన తెల్లదుప్పటీ పైట

నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి

“పైటకొంగుని చూస్తే / నాకెందుకో / పాతివ్రత్యం గుర్తొస్తుంది” అని మంచి వ్యంగ్యంతో మొదలై,పైట / ఊబిలా నన్ను గుంజేస్తూఉంటుంది, పైట / సుడిగాలిలా నన్ను తోసేస్తూ ఉంటుంది” అన్నవాక్యం దాకా సమర్థంగా నడిచి

” నా మీద
తరాలనించి మోపిన
అపనింద పైట
నన్ను అబలను చేసిన
పితృస్వామ్యపు అదృశ్యహస్తం పైట
దోపిడి సంస్కృతి
నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి
దానిపైన కప్పిన తెల్లదుప్పటి పైట ” అని వాచ్యంగా తేలిపోతుంది.

ఈనగాచి నక్కల పాలు చేయడం అంటే ఇదే.. understatement లోని అందాన్ని,anti climax లోని లోతునీ తెలిసిన ఎవరూ మంచి ఎత్తుగడను ఇలా కొల్లగొట్టుకోరు. ఈ వాచాలత(talkiness) ఐదుపుస్తకాల్లో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తుంది.కవి అన్నవాడు కంసాలిలా సున్నితపుత్రాసులో తూకంవేసుకొని మాటలను బహు జాగ్రత్తగా, బంగారంలా వాడుకోవాలి.అంతేగాని,బొగ్గుల్లా చల్లేసుకోకూడదు..

మాంసం తిన్నంత మాత్రాన పేగులు మెడలో వేసుకొని తిరగాలా ?పితృస్వామ్యపు భావజాలానికి వ్యతిరేకంగా వ్రాసినంత మాత్రాన ఆ భావాన్ని వాచ్యం చేయవలసిన పని లేదు.ఇదో పెద్ద శిల్పదోషం..

ఈ సంకలనంలోదే మరొక్క కవిత

స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ
స్పర్శ ప్రవహించిన ప్రాంతమంతా
అణువులన్నీ అర విచ్చుకొంటాయి
నెమ్మది నెమ్మదిగా
ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి.
మాఘమాసపు చలిలో కూడా
కవోష్ణ కేంద్రాలౌతాయి.
స్పర్శ ప్రవహించిన మేర
జీవనదీ జలాలౌతాయి
ఒక్కోసారి
నీ స్పర్శలో
నాకు మాత్రమే తెలిసే
సంకేతాలుంటాయి
ఏ యుగాల నాటివో తెలియని
లిపి సముదాయాలుంటాయి
స్పర్శ
నిశ్శబ్దంలో మోగిన నాదంలా ఉంటుంది
శూన్య నిశీధిన వ్యాపించిన
చుక్కల సమూహంలా ఉంటుంది
అడవిపూల వాసనలో తేలివచ్చే
గుర్తు తెలియని పక్షి పాటలా ఉంటుంది
స్పర్శతో నిండిన శరీరం
అలల రాగాలు ఆలపించే సముద్రంలా ఉంటుంది
స్పర్శ ప్రాణమై నాలో కదిలేవేళ
ఎప్పుడూ నేను ఒంటరిగానే ఉంటాను
నాలో నేనై
సమూహంలో నేనై
సమస్త విశ్వమూ నేనై
స్పర్శానురాగాన్ని ఆలపిస్తూంటాను
రాత్రిలో కూడా
నీ పెదవులానిన ప్రాంతమంతా
తూర్పులా ఉదయిస్తుంది
నీ కొనగోరు తగిలిన శరీరం
తీగలా కంపిస్తుంది
నేను అలా నిన్ను పిలుస్తూ ఉంటాను
స్పర్శానురాగాన్ని ఆలపిస్తూంటాను
అయినా
ఎందుకో మరి
నీ స్పర్శలో దీపించే నేను
నా స్పర్శలో జ్వలించే నీవు
ఎప్పుడూ దూరంగానే ఉంటాము
పృథ్వీ ఆకాశాలమై !

స్పర్శ గురించిన వివరణ,వ్యాఖ్యానం,ప్రియస్పర్శా శ్రేష్ఠత,అలా ఉంటుంది,ఇలా ఉంటుంది అని నానా పోలికలు.చివరి పద్యాల్లో అసలు విషయం.మొదటి నాలుగుపద్యాల్లో చాలా భాగం లేక పోయినా అర్థస్ఫురణకు వచ్చిన చిక్కేమీలేదు.కవిత్వమంటే లంబాడా నృత్యంలా కాస్త ఘనంగా ఉండాలన్న తత్తఘ్ఘానం తలకెక్కడం వల్ల గాబోలు ..ఇంత అవస్థ.కవిత్వానికి ఒక రూపు,నిర్మాణం ఉంటాయన్న స్పృహ లేకపోవడం,పాఠకుల యుక్తిని తక్కువ అంచనా వేయడం ప్రధాన లోపాలు.చైనీస్‌జపనీస్‌కవయిత్రుల నుండి మనవారు క్లుప్తతా పాఠాలను నేర్వవలసినదే..లేదంటే మన పాలిట అపర భిషక్కులై కూచుంటారు. ఇదే కవితను క్లుప్తతా ప్రమాణాలను పాటించే( జపనీస్‌చైనీస్‌కవితా సంప్రదాయాలను వంటబట్టించున్న )కవి రాయ వలసివస్తే ? వివరణలు,వ్యాఖ్యలు ఉండవు, విసుగు తెప్పించే పోలికలు, వర్ణనా ఉండవు..అమూర్త భావనా ఉండదు.భాష ఇంత వదులుగా కూడా ఉండదు.

శస్త్రధారి అర్జునుడికి కొట్టవలసిన పక్షికన్ను మాత్రమే దర్శనమిస్తే,ఇతర కురుపాండవులకు చెట్టూ,పక్షి సమస్తమూ అగుపించాయి.అర్జునుడిలా ఒక్క ఉదుటున ఆలోచనకు తావీయకుండా కొట్టడం కవి అన్నవాడు చేయదగిన పని.లేదంటే నీవు చేసే అలజడికి పిట్ట పారిపోతుంది,నీకు దక్కవలసినది దక్కదు!!కవిత్వం ఆపాతమధురం కాదు,ఆలోచనామృతమే,పాఠకుడు మళ్ళీ మళ్ళీ తరచి తరచి చదివి లోతు లెరగాలంటే,కవిత ఇతరేతరాల ప్రమేయం లేకుండా క్లుప్తంగా ఉండటం ముఖ్యం.. కాబట్టి మొదటి నాలుగు పద్యాలు అందులో కనిపించవు,కేవలం చివరి రెండు.ఒక ఘట్టం ..ఒక..దృశ్యం..మిగిలిన గొడవంతా పాఠకుడికే వదిలేయడం..వాడి ఊహ పారిన మేర వాడు కవితను అనుభవిస్తాడు.అరటిపండు వలచి పెట్టే ధోరణి ఏ రంగంలోను పనికి రాదు.మొత్తం కవితంతా ఇంతే..రెండు పద్యాలే..

(అప్పుడు కవిత ఇలా ఉంటుంది.)

రాత్రిలో కూడా
నీ పెదవులానిన ప్రాంతమంతా
తూర్పులా ఉదయిస్తుంది
నీ కొనగోరు తగిలిన శరీరం
తీగలా కంపిస్తుంది
నేను అలా నిన్ను పిలుస్తూ ఉంటాను
స్పర్శానురాగాన్ని ఆలపిస్తూంటాను
అయినా
ఎందుకో మరి
నీ స్పర్శలో దీపించే నేను
నా స్పర్శలో జ్వలించే నీవు
ఎప్పుడూ దూరంగానే ఉంటాము
పృథ్వీ ఆకాశాలమై !

ఈ సంకలనంలో, చెట్టుగుండెలో కొంగలు,స్త్రీవాద స్వరాన్ని వినిపించే చూపులు ఏ కత్తిరింపులు(pruning)అవసరం లేని కవితలు.మైదానంలోకి వెళ్ళమంటాను, ఇసుకలో పారేసుకున్న ఉంగరం,తొలకరిలో ఒకరాత్రి,అనుభవం ఎంత ప్రాచీనం,ఎప్పుడూ ఒంటరిగా,చాలా కత్తిరించ వలసిన కవితలు.ఉదాహరణకు ఒక విశ్లేషణ..

మైదానంలోకి వెళ్ళమంటాను

ఎవరైనా నన్నడిగితే
ఒక్కసారి
మైదానంలోకి వెళ్ళమంటాను
చిన్న చిన్న రాళ్ళగుట్టల్లో
జ్ఞాపకాల నిధులని
పదిలపరచుకోమంటాను
మట్టిరోడ్ల పక్కనే
పొదల్లోని ఆకులు
పలికే రాగాలని
ఒకసారైనా వినమంటాను
అవును
ఒక్కసారైనా,
ఒకే ఒక్కసారైనా
మబ్బుల నీడలు పరుచుకొన్న
మైదానంలో నిలిచి
స్వేచ్ఛగా పెదవులని
పెనవేసుకో మంటాను
ఏవో మాట్లాడే కళ్ళకి
పెదవులతో
మౌనాన్ని నేర్పమంటాను
ఎన్నివేల విద్యున్మాలికలని
నరాలు ధరించగలవో
ప్రయత్నించి చూడమంటాను
ఎందుకంటే
ఎప్పుడైనా అన్పిస్తుందేమో
ఇక బతకలేనని
పోరాడలేనని
కానీ
సముద్రం లాంటి జీవితం లాగే
పోరాటమూ అవిశ్రాంతమే
ఒంటరిగా
జీవితాన్ని ఈదటానికి
మనిషికి నమ్మకం కావాలి
ప్రేమ కావాలి
జ్ఞాపకాలు కావాలి
మట్టిలో రేణువుగా మారేటందుకు
మళ్ళీ మొలకెత్తేటందుకు
ఏ మనిషికైనా
మైదానాలు కావాలి !

మైదానం లోకి వెళ్ళమని మొదటి ఐదు పద్యాల్లో బలంగాను,ప్రియంగాను చెప్పిధర్మతత్వజ్ఞుని స్వరంతో “ఎందుకంటే” అని మొదలుపెట్టి,ఇంతలో మళ్ళీ “కానీ” అని కప్పదాట్లు కొట్టి..ఏమి కావాలో ఏకరువు పెట్టడం !చివరగా పొలమారిన మార్క్సిస్ట్‌గొంతుకతో “ఏ మనిషికైనా మైదానం కావాలి” అని ముక్తాయింపు.జయప్రభ కవిత్వంలో చిక్కంతా ఇక్కడే ఉంది.”మైదానంలోకి వెళ్ళమంటాను” అన్న తర్వాత మొదటి నాలుగు పద్యాలైనా ఉండాలి,నీవు భావాన్ని పదచిత్రాలతో(imagery) పేర్చదలచుకొంటే.(అప్పుడు కవిత ఇలా ఉంటుంది.)

మైదానంలోకి వెళ్ళమంటాను
ఎవరైనా నన్నడిగితే
ఒక్కసారి
మైదానంలోకి వెళ్ళమంటాను
చిన్న చిన్న రాళ్ళగుట్టల్లో
జ్ఞాపకాల నిధులని
పదిలపరచుకోమంటాను
మట్టిరోడ్ల పక్కనే
పొదల్లోని ఆకులు
పలికే రాగాలని
ఒకసారైనా వినమంటాను
అవును
ఒక్కసారైనా,
ఒకే ఒక్కసారైనా
మబ్బుల నీడలు పరుచుకొన్న
మైదానంలో నిలిచి
స్వేచ్ఛగా పెదవులని
పెనవేసుకో మంటాను
ఏవో మాట్లాడే కళ్ళకి
పెదవులతో
మౌనాన్ని నేర్పమంటాను
ఎన్నివేల విద్యున్మాలికలని
నరాలు ధరించగలవో
ప్రయత్నించి చూడమంటాను

లేదా చివరి నాలుగు పద్యాలైనా ఉండాలి నీవు భావాన్ని సాదావాక్యాలతో (statement) పేల్చ దలచుకొంటే.అప్పుడు కవిత ఇలా ఉంటుంది..

ఎవరైనా నన్నడిగితే
ఒక్కసారి
మైదానంలోకి వెళ్ళమంటాను

ఎందుకంటే
ఎప్పుడైనా అన్పిస్తుందేమో
ఇక బతకలేనని
పోరాడలేనని
కానీ
సముద్రం లాంటి జీవితం లాగే
పోరాటమూ అవిశ్రాంతమే
ఒంటరిగా
జీవితాన్ని ఈదటానికి
మనిషికి నమ్మకం కావాలి
ప్రేమ కావాలి
జ్ఞాపకాలు కావాలి
మట్టిలో రేణువుగా మారేటందుకు
మళ్ళీ మొలకెత్తేతందుకు
ఏ మనిషికైనా
మైదానాలు కావాలి !

అంతేగాని,ఒకే కవితలో రెండూ పొసగవు. figurative language కి, statement కి తేడా తెలియని confusion అంటే ఇదే మరి.పైన పేర్కొన్నకవితల్లో ఇవే తరహా చిక్కులే !!”చిత్ర గ్రీవుడా రా ,చిట్లిన గాజుల మౌనం,ఆ ఒక్కనిమిషం” అన్న కవితలు ఎన్నదగినవే.కానీ శాబ్దికత(verbosity) వల్ల డీలా పడినవి.ఇలా ఒక 36 కవితల్లో కవిత్వం గీటురాయి మీద నిలువగలిగినవి..ఒకటి రెండే అని తేలడం మన తెలుగులో కవితా నిర్మాణ ఉపజ్ఞ కు నిదర్శనం!!

ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది??
ఇందులో ఒక నలభై కవితలు,కవయిత్రి అమెరికాలో ఉన్నప్పుడు రాసినవి.ఇందులో చక్కటి కవితలు ఒక నాలుగుమోహాలకీ ప్రవాహాలకీ వేగం లేదు,చెట్లన్నీయోగనిద్ర నీడలనుండి తప్పుకొంటాను,ఉమా నీ పుట్టినరోజు.వీటన్నిటిలో చలించే పాదరసంలాంటి మనసు గతులను పట్టుకోవడంలో మంచి నేర్పు కనిపిస్తుంది.సబ్బు నురగల్లా దృశ్యానికి మబ్బులు అడ్డుపడితే,మిసిసిపీ ఓడరేవు,కల,పార్టీ,మకరముఖం,ఆ అమ్మాయి,సాయంత్రంనేను ఏడు కవితల్లో మంచి వాతావరణ కల్పన కనిపిస్తుంది. “నేను కూడా బయటికి పోగలిగితే,గాజు నేల మీద దొర్లిపోయిన పగడాన్ని”గడుసుదేరిన స్త్రీవాద స్వరాన్ని వినిపిస్తాయి.ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది, నువ్వు నిజంగా సౌమిత్రివి,నేను ఈ నాటి దాన్ని,శరీరమంటే సరాగాలనుకొంటారు,వంగిన నల్లరేగడి భూమి అదే క్రమంలో అధికంగా కత్తిరింపు అవసరమైన కవితలు. ఇవికాక మిగిలిన ఇరవై కవితలు మోతబరువు.మనకు కొంతం జనరల్‌నాలెడ్జి,జర్నలిజం పట్లఆసక్తిని పెంచుతాయి;అంతేగాని కవిత్వ గుణాలకోసం ఎన్న దగినవి కావు. నాకు చూడగా జయప్రభ కవిత్వంలో ప్రధాన లోపం వాచాలత(talkiness)చెప్పేదేదో బలంగా చెప్పాలన్నఆత్రుతతో శిల్పాన్ని విస్మరించడం..ఒక విశ్లేషణ..

ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?

సరిహద్దులు గీసుకొన్నవి
మనుష్యుల స్వార్థాలు కాని
దూకే సెలయేళ్ళు కావు
అడవులూ,జలపాతాలు కావు
ఇక్కడకురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగలిగిన వాళ్ళుంటే రండి
భూమి విశ్వరూపాన్ని
ముక్కలు చెక్కలు చేస్తున్నవి
మతాలు మంత్రాంగాలూను
నిజంగా సరిహద్దులు చెరిపేయగలిగితే
ప్రపంచానికి
నేలా నీరు గాలీ అందరివీ గానీ
ఏడు ఖండాలుగా విడిపోయిలేవు..

“సరిహద్దులు గీసుకొన్నవి దూకే సెలయేళ్ళు గావు ,అడవులూ జలపాతాలు గావు”అని చెప్పడం figurative language లో భాగం.”మనుష్యుల స్వార్థాలు కాని”అన్న వాక్యం(statement) ఇక్కడ పొసగదు.మన ముందున్నవి రెండు..మనిషి,ప్రకృతి.ప్రకృతిని కీర్తిస్తే చాలు,సూచనప్రాయంగా మనిషి అల్పత్వాన్ని చెప్పినట్టే.అలాగే మనిషి అల్పత్వాన్ని ఆనవాలుపడితే ,ప్రకృతి అనంతత్వాన్ని గౌరవించినట్టే.”ఇక్కడ కురిసే వర్షం ఎక్కడి మేఘానిది గుర్తించగలిగే వాళ్ళుంటే రండి” ఇదేదో మూర్తంగా (concrete) వుంది అని మురిసిపోతుంటే”భూమి విశ్వరూపాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నవి మతాలు మంత్రాంగాలూనూ” అన్న లాయర్‌గొంతు.

చిత్రకారుడు ఏదైనా వస్తువుని ఒక కోణంలో చూస్తూ ఒక చిత్రాన్ని గీస్తాడు.ఒక కోణంలో నచ్చక పోతే ఇంకొక కోణం.ఒకే వస్తువుని వివిధకోణాల్లో దర్శించి వివిధచిత్రాలు గీస్తున్నాడు.ఫోటోగ్రఫీ ఐనా అంతే.అభిప్రాయాలను,అమూర్త భావాలను (థదషసషథధస బనపథష)తొలగించి వీలైనంత కళ్ళకు కట్టినట్లుగా అంటే మూర్తంగా (concrete) రాయడం కవి అభ్యసించవలసిన విద్య.ఇది అలవడక పోవడం వల్ల కలగా పులగంగా ,మూర్తామూర్తాలను (concrte-abstract) కలిపిరాయడం శిల్ప పరమైన పెద్ద దోషం.జయప్రభ కవిత్వమంతటా వ్యక్తమయే ప్రధాన శిల్పదోషమిదే.

పైన పేర్కొన్న వాక్యాలను తొలగించి చదివితే..అదే కవిత..

సరిహద్దులు గీసుకొన్నవి
దూకే సెలయేళ్ళు కావు
అడవులూ,జలపాతాలు కావు
ఇక్కడకురిసే వర్షం
ఎక్కడి మేఘం మోసిందో
గుర్తించగలిగిన వాళ్ళుంటే రండి
నిజంగా సరిహద్దులు చెరిపేయగలిగితే
నేలా నీరు గాలీ అందరివీ గానీ
ఏడు ఖండాలుగా విడిపోయిలేవు..

జయప్రభ మంచికవితల్లో కనిపించే శిల్పం గురించి ఒక్కమాట.సరితూకం గల పదాలను ఎంచుకొని మంచి లయను సాధించడంలో గొప్ప నేర్పు కనిపిస్తుంది.

ఉమా నీ పుట్టినరోజు
మంచురాత్రీ..మల్లెమొగ్గా
మొగలిరేకు..మందార పువ్వు
జలపాతం..చంద్రకాంతం
వెండి ఎండా..వెన్నెల వాకా
సాగరతీరం..చందనగంధం
ఉషస్సంధ్యా..తొలకరి జల్లూ
ఉమా! నీ పుట్టినరోజు!

స్త్రీల పాటల్లో,జానపద గీతాల్లో ఇటువంటి లయనే గమనించ వచ్చు.ఈ శిల్పంలో ప్రమాదం లేక పోలేదు,శబ్దం దగ్గరే పాతుకు పోయి కవిత్వం లో నిశ్శబ్దాన్ని గుర్తించలేక పోవడం.పదాల పోహళింపే కవిత్వం కాదు కదాఏ భాషలోనైనా..

యశోధరా వగపెందుకే

ఎడ్నా మిల్లే తో పొలుస్తూ “మోహానికి శబ్దాకృతి ఇవ్వడంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు” అన్న నా వాక్యానికి బలం చేకూరుస్తూ..ఆణి ముత్యాల్లాంటి కవితలు ఐదు.

జీవితంలో ఏదో జరగబోతుందన్న ఆశని..

“అష్టదళ పద్మంగాగో అమృతంగాగో
సంధ్యాకాశంలాగో వింధ్యాశిఖరంలాగో
సజల నయనం లాగో సాప్తపదీనంలాగో
జీవితం మారుతుందని ఎదురుచూడటం ఒకందుకే
ఒక మనోహర దృశ్యానికి
ఒక సంచిదానందానికి…” (సంచిదానందానికి)

జయప్రభ కవితల్లో రాత్రికి గొప్ప స్థానం ఉంది,ఆశ్చర్యం లేదు భావుకత్వానికి మూలం రాత్రి!!

“..ఏవో అతి పురాతన ఆత్మలని ఆవాహన చేస్తే
అవి లక్షల మిణుగురుపురుగులై వచ్చి
వృక్ష శాఖల్లో దూరి ప్రతి రెమ్మ చివరా
తళుకు తళుకు తళుకున మెరిసిన
భయద సౌందర్యమో?….” (బహుళ చతుర్దశిరాత్రి)

అతి సున్నితమైన ప్రేమానుభవం

“..ధ్వజస్తంభపు చిరుగంటలో
నీ చిరునవ్వులూ కలిసి
నా చెవుల్లో లీలగా వినిపిస్తాయి..” (గుండెలో పొగమంచు)

జలపాత స్నానపు హోరు వినిపించే కవిత..

“..కోమలం కాదు
మలయ పవన రాగం కాదు
హాయి కాదు ఆహ్లాదం కాదు
అయినా ఆనందమే.. ” (జలపాతస్నానం)

ఇన్ని మోహాల మధ్య దిగులు సహజమే

“..తెరచాటు మోహంలా
దిగులు
ఎ్తౖతెన రెండుకొండల నడుమ
వింధ్యాటవీ శాఖల్లో
నీలకాంతిలా దిగులు..” (నీలకాంతిలా దిగులు)

అలాంటప్పుడు వేసవి పగళ్ళే నయం!!
“ప్రజ్వరిల్లిన పొద్దుతిరుగుడు పూవు
నీ దిక్కుగా తిరిగి తిరిగి
ప్రాణం వసివాడుతుంది” (ఈ వేసవి పగళ్ళే నయం కదా)
(కవితల పూర్తిపాఠం,లఘుటిప్పణి అనుబంధంలో చూడగలరు )

feminist గొంతుతో రాసిన అంతా అంతే,అమ్మమ్మ స్వగతం,యశోధరా వగపెందుకే,ఫరవాలేదనిపిస్తాయి.”నాన్నలెందుకు రారు?” ఆవేశాల కుమ్మరింతలో క్లుప్తత హుళక్కి.వలసపోనని పక్షి వాగ్దానం చేయదు కదా,బొత్తిగా లేడికూనలమై పోయి,మంచి కవితలైనా ముగింపు శిల్పం కొరవడింది.విశ్లేషణలోకి వెళితే

వలసపోనని పక్షి వాగ్దానం చెయ్యదు కదా?

ఎక్కడో ఆకాశంలో అల్లంత ఎత్తున
కన్పిస్తూ కనుమరుగౌతూ
పక్షి ప్రదక్షిణలు చేస్తుంది
సంధ్య వేళ
ఒక్కరూ అయిపోయి
నది మధ్యలో రెల్లుదుబ్బూ
ఆకురాలిన చెట్టూ కలిసి తాళలేక
పక్షి కోసం పాడతాయి
అలా ఎగిరిపోతే మళ్ళా
వసంతం దాకా రాదేమోనని వాటిబాధ
వలసపోనని పక్షి వాగ్దానం చెయ్యదు కదా!

ఎత్తుకి ఇంకా ఎత్తుకి పోతుంది
నేనే ఎగరగలనని పెద్ద బడాయి దానికి
ఏం చేద్దాం చెప్మా ? ఎంత పిలిచినా రాదు..!!
గూట్లో జాంపండు మగ్గిపోతోంది
గూట్లో పక్షికూన ముడుచుకుంటోంది

ఒసేయ్‌
ఆ గడుగ్గాయి పడుచుపిల్లని గాలిపడగ నెగరెయ్‌మను
రివ్వు రివ్వున పైకి పోయి
దాని రెక్క పుచ్చుకు చక్కా వస్తుంది!

ఆకాశంలోని చిన్నగా కనిపిస్తూ ఎగిరే పక్షి,ఎండు పరిసరాలు,చెట్లు,ఆహా చిత్రకారుని ప్రజ్ఞ కనిపిస్తుంది కదా కవయిత్రిలో అని ఒక్క క్షణం ఆనందం,అంతే.. వడగాలి వీచినట్టు ఇబ్బంది..వెంటనే అలవాటైన వాచాలత!!. వలసపోనని పక్షి వాగ్దానం చేయదు కదా..!(11వ లైను )అన్న వాక్యంతోటి కవిత ముగిసి పోయింది చాలామంది అజ్ఞానులకు కానీ కవయిత్రికి కాదు,కాబట్టి ఆ పక్షి మనసులోని రహస్యాలు,దాన్ని క్రిందికి తీసుకు వచ్చే అద్భుతమైన గాలిపట్నం టెక్నాలజీ లను ఏకరవు పెడుతూ మరో 10 పంక్తులు వృధా (పక్షి శాస్త్రజ్ఞుడు,డా.ఆలీ,చచ్చి ఎక్కడున్నాడో పాపం,మహానుభావుడు బ్రతికి ఉంటే ఎంత ఆనంద పడేవాడు,రవి గాంచనిచో కవి గాంచును కదా).

దీర్ఘ నిరీక్షణ,తీవ్ర ఘనీభవనం కవిత్వానికి ప్రాణం అని మన కవులకు అర్థమయిన రోజురాయగానే అచ్చొత్తించే ప్రలోభం,ప్రతి ఊరకుక్క అరుపుకు స్పందించే బలహీనత వదులుకొని మృత్యువును,కాలాన్ని హేళన చేసే కవితా ఖండాలు సృష్టించగలరు.లేదా రాను రాను రాజగుర్రం గాడిదైనట్లు,అందం,పొందికా లేని అర్భకరాతలు వెలయిస్తూనే ఉంటారు.

ఇలా 42 కవితల్లో ఎన్నదగినవి ఒక్క పది!మిగిలిన వన్నీ షరా మాములే కేవల శబ్దాలు కవిత్వంగా చలామణీ కాలేవు. క్లుప్తతకు మారుపేరు అనదగ్గ పోలిష్‌కవయిత్రి అన్నా..స్విర్జిన్స్కా

first to create his/her style
second to destroy his/her style
the second is more difficult

మొదలు,నీ కంటూ ఒక శైలి నిర్మించుకోవాలి,రెండు దాన్ని ధ్వంసం చేయాలి రెండవది చాలా కష్టం…శైలి ఉందనడానికి నిదర్శనం తిరుగులేని క్లుప్తత.
ఒక దశలో కవి తన శైలిని పాతిపెట్టి,దాన్నుండి మొలకెత్తే ఇంకో శైలిని పసిబాలుడిలా తిలకిస్తాడు..మన ప్రముఖ కవుల్లో చాలామందిలాగే జయప్రభ
ఇంకా మొదటి శైలి లోనే రాటు తేలవలసి వుంది.

చివరిగా చింతల నెమలి(1997) ఇందులో 88 కవితలు.మోహోద్వేగ కవితలు ఒక ఐదు. పూలదారుల పార్థివాకృతి,ఆందోళనా భ్రమర గీతం,ఈ కోరిక,వెన్న
చిలికినంత వడిగా,మళ్ళీ ఇది కొత్త చిత్రమే.ముందు ప్రస్తావించిన కవితల స్థాయిలో ఉన్నది “పూలదారుల పార్థివాకృతి ” మాత్రమే.

“పట్టుబట్టీ పైరుగట్టున
నిత్యమల్లీ నీడచాటున
పూలదారుల పార్థివాకృతి
పొంచినదెవరో”

మిగిలిన కవితలు వాచాలత(talkiness)కారణంగా అంత ఉజ్వలంగా లేవు.ఈ పుస్తకంలో గమనించ దగ్గ మార్పు,పాత రోజుల స్త్రీల పాటలు,రోకలి,దంపుళ్ళపాటలకు సాటిరాగల ఐదు లయబద్దమైన గీతికలుశివుడి నెరజాణ,పాపాయి జోల నవధాన్య సీమ,నువ్వెగిరి వచ్చిన ఉద్యానపు ఊరేమిటి?,గాలి గుర్రము జూలు పట్టుకొని .మొదటి నాలుగు గానయోగ్యం గాన,మును ముందు పిల్లల పాఠ్యపుస్తకాల్లో చేర్చినా ఆశ్చర్యం లేదు.ఈ లయబద్దతే జయప్రభను ఎడ్నా మిల్లే(పులిట్జర్‌పురస్కారం పొందిన మొదటి కవయిత్రి)సరసన నిలబెట్టేది.

“..పొగమంచు తొలిఝాము
చలిమంట వాకిలి
పొదరింట నిదురించు
నెలవంక జాబిలి..” (పాపాయి జోల)

“తెలిసీ తెలియని చిట్టడవుల్లో” టీనేజి అమ్మాయిల మనసును తెలిపే కవిత.వ్యక్తి చిత్రణ (portraits) గురించి చెప్పి తీరాలి.కుంతిని మొదలుకొని,తస్లీమా దాకా ఒక పదిమంది portraits.ఎందుటా రాణించలేదు.కారణం శిల్పదోషం..వాంగో portrait లో తననే చిత్రించినా,లేదా తన postman ను చిత్రించినా, కేవలం అక్కడితో ఆగిపోలేదు;వ్యక్తి పరిధిని దాటిన చిత్రాలవి.జయప్రభ చిత్రించినవేవీ ఈ రకమైన స్వేచ్ఛను పొందలేక పోయాయి.కాబట్టి ఉట్టి వచనాల్లా మిగిలి పోయాయి,కవిత్వం కాలేదు.మానవ స్వభావపు లోతులెరిగి తనలో ఇతరులను ఇతరులలో తనను దర్శించగలవాడే portraits గీయగలడు,మాధ్యమం ఏదైనా సరేచిత్రకళో,కవిత్వమో..

స్త్రీ వాద కవితలు ఒక పది..ఈ వాదాల బరువును దించుకోవలసిన ప్రబలావసరాన్నినొక్కి చెబుతాయి.అర్థం గొడ్డుబోయిన అనేక సందర్భాలలో ! పురాణ/కావ్య/చారిత్రక
ప్రతీకలను విపరీతంగా వాడేసుకొని నీరసించిన సంకలనం ఇది.చిన్న కొడుకు మీద రాసిన కవితలో కూడా,పండిత రాయల అంశ,కౌటిల్యుడి కూన కనిపించడం
హాస్యాస్పదం .
నానా ఇతిహాస స్త్రీ పాత్రల విలాపాలను స్త్రీ వాద దృక్పథంతో తవ్విపోయడం వల్ల కవిత్వానికి కలిగే ఉపకారం లేదు.వాద స్థాపనకు ఉపయోగ పడే అంశాలు కవిత్వాభివ్యక్తిని వికలం చేస్తాయి.దాదాపు ఒక 30 కవితలు ప్రస్తావనార్హాలు కూడా కావు.అవన్నీ ఉట్టి మాటల పోగులు,శబ్ద పంజరాలు. పాప నిద్రలేవడం,ఆ పసి చిలకే వాలక పోతే,ఎంత పాతది ఈ శీతగాలి, తేరు వెళ్ళిపోయింది,ఆవిడ ఆలోచనల్లోకి లాంటి కవితలు ఒక 1015 కు మించవు. కవయిత్రికి ఇష్టమైన కుకవి,కువిమర్శక నిందలతో మనకు పనిలేదు.అవి కవిత్వానికి మేలు చేసేవి కాదు.ఇంకో విశేషం.. పరిశీలించిన (దాదాపు) 250 కవితల్లో పది పన్నెండు వాక్యాలతో ముగిసిన చెప్పుకోదగ్గ కవిత ఏదీలేక పోవడం.”అల్పాక్షరముల అనంతార్థ రచన” తిరగబడిందన్న మాట.

“ఒక కవి వాడే విశేషణాలు పట్టిస్తాయి వాడి పనివాడితనాన్ని ” అన్నాడో మహాకవి.కాబట్టి విశేషణాల విషయంలో చాలా జాగ్రత్త వహించమని హెచ్చరిస్తాడు మరోసారి. ఉమాకాంతుల వారు భావకవుల “మంజుల,మంగళ” విశేషణాల వాడుకను ఎద్దేవా చేస్తూ, వారి కావ్యాల్లో అరిగిపోయిన పద ప్రయోగాలను తీవ్రంగా అధిక్షేపించాడు. పురాణ/కావ్య/చారిత్రక సమయాల్లో చిక్కుబడకుండా విశాలమైన ప్రకృతి నుండి,ఉజ్వలమైన జీవితం నుండి ఎన్నో విషయాలు గ్రహించాలి కవి. భాషను శుభ్రం చేయడం కవి అదృశ్య బాధ్యతల్లో ఒకటి.కవిప్రయోగాలు పలుకుబడులలో కలిసి పోవడం పరిపాటి.ఒకప్పటి వేమన,ఇప్పటి శ్రీ.శ్రీ ల ప్రయోగాలు ఎన్ని ప్రజల వాడుకలో పడుగుపేకలా కలిసిపోయాయో గమనించవచ్చు.ఇక్కడే కవిత్వం సకల ప్రక్రియలతో భేదిస్తుంది.వచనం,జర్నలిజం కవిత్వం నుండి ఎంతో గ్రహిస్తాయి.కవిత్వమే వచన స్థాయికి,జర్నలిజం బాణీకి దిగజార కూడదనేది అందుకే..”తెల్ల వాళ్ళ స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి,యంతసేపు జాగ్రఫీ,గీగ్రఫీ హడలేసి చెబుతారు ” అంటాడు గిరీశం కరటక శాస్త్రులతో పద్యానికి ప్రతి పదార్థం చెప్పలేని వెంకటేశాన్ని వెనుకేసుకొస్తూ.మన కవులది వెంకటేశం మార్గమే,దొరల చదువే..పద్యాల మీద ఖాతరీ లేదు,యంతసేపు ఇజం గిజం హడలేసి చెప్పడమే.దీని వల్ల పూడ్చుకోలేని నష్టం జరిగింది కవిత్వానికి కంటికి చెవికి ఇంపైన అలవాటు పదప్రయోగాలు గుప్పించడం,పులుముడు విశేషణాలతో ఊపిరి ఆడకుండాచేయడం !!భాషకూ,భావానికీ,ఆ రెంటికీ కవిత్వానికి గల సంబంధాన్ని గూర్చిన అవగాహన కవిత్వ తత్వానికి,భాషాతత్వానికి సంబంధించినది.అది మన కవివరాహాలు పడిదొర్లే నానా వాదపంకాల్లో దొరికేది కాదు.మిగుల శ్రమించి ప్రోది చేసుకోవలసిన పన్నీరు లాంటిది.అందుకే ఏనాడో మన యోగి వేమన అననే అన్నాడు”పంది పన్నీరు మెచ్చునా ,బురద మెచ్చునా !!”తథ్యము సుమతీ!

జయప్రభ కవిత్వం లో పదే పదే పునరావృతమై,ఏ అర్థబోధ చేయక పాఠకున్ని డస్సిపోయేలా చేసే విశేషణాలు,పదబంధాలు మచ్చుకు కొన్ని.
విమల,అనంత,అనేక,భీకర,అరుణారుణ,నిశిరాత్రులు,ఆపాతమధురము,చింతాక్రాంతము,చిన్మయానందము,బాహుబంధాలు,మౌక్తిక హారాలు,
ముగ్ధ మోహన రూపము,దుర్గంధ పంకిలము,నిర్జీవ అలంకరణ,జీవన బీభత్స చిత్రాలు,కఠోర సత్యాలు,క్షతగాత్ర శరీరం,ఆచంద్ర తారార్కం అజ్ఞాన తిమిరం..
ఇలా ..అలవాటుమీద,కొన్నిపాతకవుల ప్రయోగాలు ముక్కున గరచుకొని వాటినే గుప్పిస్తూ ఉండటం.దీన్నే భేషజం అంటారు.పాత రోజుల్లో కొందరు భిషక్కులు(doctors)రోగి నాడీపరీక్ష చేసి,ఆయుర్వేద గ్రంథాల్లోనివి తమ నాలుకమీద ఉన్నవి,సంబంధంలేనివి,తమ అవగాహనలోనికి రానివి..వల్లించేవారట.అదే భేషజమంటే..రోగికి ఆ దేవభాష అర్థం కాదు,కాబట్టి తప్పకుండా అది గొప్ప విషయమే అయివుంటుంది అని నమ్మిక.గిడుగు రామ్మూర్తి పంతులు అప్పటి భాషా భిషక్కులను ఆక్షేపించాడు ఇలాంటి విషయాల్లోనే.ఇప్పుడు మన కవిత్వభిషక్కులను తప్పు పట్టవలసి వస్తోంది.భూమి గుండ్రంగానే ఉంది!

ఇకపోతే వికటించిన పురాణ ప్రతీకలు.ప్రతీకలు మంచివే..కరివేపాకు మంచిదే..కానీ చారుకు రుచినివ్వడానికే దాన్ని వాడతాము.అంతవరకే దాని పాత్ర.ఒక వేళ అది లేకపోయినా చారుకు వచ్చిన నష్టం లేదు.కరివేపాకే చారు అనుకునేంత పైత్యప్రకోపం..హానికారకం.21వ శతాబ్దంలో ఒక ఆధునిక(?)కవయిత్రి హరిదాసులా రాయడం..వింతలేని ఆవులింతుందా??

ప్రజాపతులు

ఆవిడ దాస్య విముక్తికి
గరుత్మంతుడైతే తప్ప అమృతం తేలేడు
అండవిచ్ఛేదనం చేసిందని
పైగా అనూరుడి శాపం
ఇంతకీ ఉచ్చైశ్రవం తోక నల్లనిదా ? తెల్లనిదా?
యుగయుగాల సందేహం

అయినా..ఏ గెలుపైనా
వినతా కద్రువులది కాదు
సంగ్రామం కోసం తన్నుకు చావమని
పాముల్నీ గద్దల్నీ పుట్టించిన
కశ్యప ప్రజా “పతుల”ది!!

కవిత్వమంటే “మద్వయం,భద్వయం,బ్రత్రయం,వచతుష్టయం,అనాపాద్ల్లిం కూస్కాని పురాణాని పృథక్‌పృథక్‌.”అని వల్లించి పాఠకులని ఝడిపించి జ్వరం తెప్పించడం కాదు..కొసవెర్రి కాకపోతే.. చివర feminist వ్యాఖ్యానాలు ..ప్రజాపతులలో పతుల మీద చమత్కారం.. తెలుగు కవిత్వ స్వాస్య్థం మీద అనుమానాలు రావడం లో పెద్ద ఆశ్చర్యం లేదు.”ఇంతకీ ఉచ్చైశ్రవం తోక నల్లనిదా ? తెల్లనిదా?” ఏదైనా వచ్చిన నష్టం లేదు,దానికి అసలు తోక లేక పోయినా పాఠకుడికి కొంచెం బాధ తప్పును.గుర్రపు తోక ” యుగయుగాల సందేహం “ఎన్నటికీ కానేరదు,ఆధునిక జీవితంలో అలవికాని అస్తిత్వ సమస్యలు ఎన్నో ఉన్నాయి.పురాణాలు వాటిని వ్యాఖ్యానించగల వారి చేతుల్లో ప్రాణం పోసుకుంటాయి.కవులు కాళ్ళు,చేతులు కడిగేసుకోగల మైదానాలు కావవి.అంత ఉత్సాహం ఉంటే Electronic journal of vedic studies లేదా హార్వర్డ్‌ సంస్కృత గ్రంథాలు చదువుకోవచ్చును..ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః !!!

పద్యకవిత్వానికి రోజులు చెల్లాయి అన్న విషయం మీద వ్యాసం రాయవచ్చు కవిత కాదు.పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంఒకర్ని తిట్టవలసి వచ్చినా, అభిప్రాయాలు వ్యక్తం చేయవలసివచ్చినా,తాత్విక చర్చలకు,వాదాలకు..అన్నిటికీ కవిత్వమే! మన కవులెవరూ ఆధునికులు కారు అని చెప్పడానికి ఇదొక్కటి చాలు.ప్రక్రియా భేదం తెలియని వారి కవిత్వావగాహన ఏ మాత్రం? వస్తువు ఎంపికలో తప్పటడుగులు వేసే మన కవుల స్థాయి ఏ పాటిది? విజ్ఞాన సంపాదనకు encyclopedia లు ఉన్నాయి, రోజువారీ కథనాలకు వార్తా పత్రికలు లెక్కలేనన్ని.వీటిని ఆశించి ఎవడూ కవి చెంత చేరడు.దగ్ధం చేసే అనుభవాలను అక్షరబద్ధం చేయడం కవిధర్మం.”తోటకూరకునైన దుగ్గలాకుకునైన,తాలుతప్పలకైన తవుడుకైన కవిత్వము చెప్పు గాడిదలారా” అని వేమన అననే అన్నాడు.కావున లేనిపోని భేషజాలకు పోకుండా నానా వాదాలను కవిత్వేతరాలను చెత్తకుప్పలో పడవేసి,దీర్ఘ నిరీక్షణతో తీవ్ర ఘనీభవనంతో కవిత్వం రాయడం కవిశబ్ద వాచ్యుడు చేయదగిన పని.

పుస్తకారంభంలో “చెప్పవలసిన నాలుగు మాటల్లో” కవయిత్రి ” నా తాత్విక దృక్పథం కూడా చాలా మార్పులకు లోనయింది,నా కవిత్వ వ్యక్తీకరణలోనూ ఆ పరిఛాయ ప్రసరించింది.రూప పరంగాను,వస్తుపరంగాను ఆ వైవిధ్యం మీరు ఈ చింతల నెమలి లో చూడొచ్చు”నా సందేహం అసలు మన కవులకు ఒక తాత్విక దృక్పథం వుందా? ఏదో కాస్త ఫాషనబుల్‌గా ఉందామని దాని గురించి మాట్లాడుతున్నారా?వీరు దేన్ని తత్వంగా భావిస్తున్నారు?తత్వం వస్తురూపాలను ఎలా ప్రభావితం చేస్తుందో వీరికి తెలుసా? ఈ సందర్భం లో ఒక మాట చెప్పుకోవాలి,శాస్త్రవేత్త పాస్కల్‌తన స్నేహితునికి ఉత్తరం రాస్తూ,”అట్టే సమయం లేదు,లేదంటే ఇంకా క్లుప్తంగా రాసే వాడిని” అని నొచ్చుకొన్నాడట. అది తత్వం తెలిసిన వాడి ఆలోచనా ధోరణి.

రూప పరంగా,వస్తుపరంగా,శిల్పపరంగా ఇన్ని తప్పులు చేస్తున్న వారి తాత్విక దృక్పథాన్ని ఊహించడం పెద్ద కష్టం కాదు.తాత్విక దృక్పథం ఉన్నవాడి రచనలో
ప్రస్ఫుటమయ్యేది క్లుప్తత.వ్యాసంగా తయారయ్యే విషయాన్ని కవిత్వంగా మార్చాలనే వృధా ప్రయాస పడే కవిగణాలకు తాత్విక దృక్పథం ఉండటం కలలో మాట.

స్పష్టత,క్లుప్తత,ఖచ్చితత్వంఇవి తర్కాన్ని తద్వ్దారా తత్వాన్ని పరిపాలిస్తాయి.కవిత్వపరంగా వీటిని సాధించడం ఎలా?? జపనీస్‌ / చైనీస్‌ కవులను పరిశీలిస్తే
ఈ విషయం తేట తెల్లమవుతుంది.ఏది మూర్తము(concrete), ఏది అమూర్తము (abstract)అన్న విషయంలో స్పష్టత ఉంది.క్లుప్తత కోసం వారు మౌనాన్ని ఆశ్రయించారు. కారణం వారికి శబ్దపరిమితులు తెలుసు.శబ్దాలతో ఎంత చెప్పినా,చెప్పనిది మిగిలి పోతూనే ఉంటుంది.కావున అనుభవాలను అనుభవాలుగా ఏ అరమరికలు లేకుండా ఖచ్చితంగా వ్యక్తం చేశారు.వాటికి అభిప్రాయాలను,ఆలోచనలను,వాదాలను,నినాదాలను జోడించలేదు.వారికి తత్వ ప్రజ్ఞ ఉంది కనుకనే తమ అనుభవాలనుక్లుప్తంగా, స్పష్టంగా,కచ్చితంగాఏ ప్రలోభాలకూ లోనుకాకుండా వ్యక్తం చేశారు.మనవారికి ఇవన్నీ తెలుసనుకోను.జయప్రభ దీనికి మినహాయింపు కాదు.కారణం పరిశీలించిన ఆమె కవితల్లో పది శాతం కూడా కవిత్వం కాకపోవడమే!!

జయప్రభ కవిత్వం స్పర్శానురాగం
కేవలం దోష నిరూపణ విమర్శ కాదు,గుణ నిర్ధారణ కూడా అందులో భాగమే.నాణేనికి రెండో పార్శ్వం తెలియనిదే దాని విలువను అంచనా కట్టలేము,అందునా కవిత్వం లాంటి అరుదైన గుప్తుల కాలం లాంటి నాణేన్ని.

మోహానికి శబ్దాకృతినివ్వడంలో వీరు ఎంతో ఎత్తుకు ఎదిగారు.ఎడ్నా మిల్లే తన జీవితకాలంలో గొప్ప సంచలనం సృష్టించిందని ఆమెతో పోల్చడం తప్ప,పోలిక వల్ల పెద్ద ఒరిగేదేమీ ఉండదు.తెలుగు ను italian of east అన్నట్టే ఉంటుంది రెండూ అజంత భాషలే అయినా,ఇటాలియన్‌కవిత్వాల్లో అంత్యప్రాసే అధికం.తెలుగులాగా
సంస్కృతం లాగా అది అంత సౌష్టవమైన సంగీత భాష కాదు.కావున తెలుగు తెలుగే, ఇటాలియన్‌ ఇటాలియనే.అలాగే జయప్రభ ఎడ్నా మిల్లే కన్నా మిన్నగా ఎన్నదగినది.

కవిత్వంలో వ్యక్తం కావలసినవి మోహాలు,ఉద్వేగాలు,అనుభవాలే.వాదాల బురద వాటినంటదు.ఆలోచనల ఎండుగడ్డి,అభిప్రాయాల ముళ్ళకంపను వీడి మనసు రహస్య ఉద్యానవనంలో అడుగుపెడుతుంది.జలపాతాలు,మహావృక్షాలు,దివారాత్రాలు,సూర్య తాపం,చంద్ర జ్యోత్స్నా, లతలు,ఆకులు,పరిమళ పుష్పాలతో నిండిన భూగోళం అరచేతిలో అమరి స్వీయానుభవం విశ్వానుభవంగా పరివర్తనచెందే రసమయ ఘడియలవి.

ఇంకో చిక్కు ప్రశ్న.ప్రియురాలి భావాలు ప్రియుడు ఆమె మాటల ద్వారానే తెలుసుకొంటాడు.చూపులు,శరీరం ఇందులో సహకరించినా మాటలు మనిషి ప్రేమలో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తాయి.ప్రియురాలు తన ఎదుట లేనప్పుడు ప్రియుడు ఆ మాటలనే తలచుకొని ఆనందిస్తాడు..ఇక్కడే చిక్కు ప్రశ్న తలెత్తుతుంది.ప్రియుడు ప్రేమలో పడింది ప్రేయసితోనా లేదా మాటలతోనా?? మాటలు లేనిది ప్రియురాలి జ్ఞాపకాలే లేవు..ప్రేయసికి,భాషకు అభేదం ఉంది అని తెలుసుకుంటాడు కవి..ప్రేయసీ ప్రియులు నశించినా మాటలు అదేప్రేమను వెదజల్లుతుంటాయి.భాషా మూలాలు ఉద్వేగాల్లో ఉన్నాయి కాబట్టే మన ప్రాచీనులు శృంగారానికి రసాధిపత్యాన్ని కట్టబెట్టారు.కాబట్టి విశ్వసాహిత్యంలో ఏ భాషలోనైనా ప్రేమ కవిత్వానికి గురుతర స్థానం ఉంది.

జయప్రభ మోహకవిత్వాన్ని పొగడవలసి వచ్చినపుడు రిల్కే కవిత్వంలోని మూడు జర్మన్‌ పదాలు అక్కరకొస్తాయి ” Ruhmen, das ists ” (వినుతించడమే అసలంతా)!! ప్రేమలోశరీరాలు మామూలు అర్థాన్ని కోల్పోయినట్లేనిత్యమూ వాడే పదాలు కూడా నూతన అర్థాన్ని సంతరించుకొంటాయి.అందుకే అవి..

“కోమలం కాదు
మలయపవన రాగం కాదు
హాయికాదు ఆహ్లాదమూ కాదు
అయినా ఆనందమే!”

అంతేకాదు..అది అద్వైతస్థితి..సకలసృష్టి నీలో ఉంది,సృష్టిలో నీవున్నావు..అందుకే.

“నేను నీరై..నీరు నేనై ప్రవహించడం విశ్వమోహనం
విశ్వమోహనం ! అది ఖడ్గచాలనం !
జలపాత స్నానం ! జలపాత స్నానం!”

ఇదొక గొప్ప భావగీతం..(అజంతా బ్రతికి ఉన్నరోజుల్లో ఎంపిక చేసిన కవిత ఇది)

గుండెలో పొగమంచు, జలపాతస్నానం లాంటి భావగీతం(lyric) కాదు.ఇందులో ప్రేమ అతి సున్నితంగా వ్యక్తమయింది.కథల్లో కనిపించే గొప్ప వాతావరణ కల్పన తుదకంటా కనిపిస్తుంది. కవయిత్రి దేన్నీ వదల లేదు..

ధ్వజస్తంభపు చిరుగంటలూ
నీ చిరునవ్వులూ కలిసి
నా చెవుల్లో లీలగా ధ్వనిస్తాయి

అన్నిటికీ అర్థం ఉంది ప్రేమలో. ఏదీ వదిలివేయదగింది కాదు కవిత్వంలోలాగే.. బహుళ చతుర్దశి రాత్రిలో ,walter de la mare పేరు పొందిన listeners కవితలా
వాతావరణం,భావప్రవృతి(lyrical temperament) సమపాళ్ళలో కనిపిస్తాయి.walter కవితలో ఉన్నది కేవలం భయద సౌందర్యమే..మోహం,ఉద్వేగ తీవ్రతా లేవు.. అంతే కాదు భాష వచనబంధాలనుండి విముక్తమై..

“వింతగా ఆకాశం చుక్కల బరువుని ఓపలేక
ఒకింతగా నేలపైకి వొరిగిన దృశ్యమో?”

“మన కళ్ళలో
చేతి కొనవేళ్ళలో
మాట పెగలని ఉద్రేకమో ? శాంతమో ?”

ఉద్రేకమూ శాంతమూ కలగలసి ద్వంద్వాతీతమై

“తలపై కెత్తి చూస్తే చీకట్లో
రెండు పనసచెట్ల కొమ్మలు ఒరుసుకుంటూ
గాఢంగా పెనవేసుకుపోయున్నాయ్‌

నా నుదిటిమీది వానబొట్టు నీ పెదవిలోకి జారింది!
మోహనంగా నీ నవ్వొక్కటి మైకంలో సాగింది!”

మనసు,పరిసరాలు మమేకమై పోయిన కౌగిలి, సమాగమం లోపల వెలుపల ఏకం చేసే తీవ్ర మోహలిపి జయప్రభ స్వంతం.. ఇటువంటి ప్రవాహ శైలి లో సిద్ధహస్తుడు.. Edgar Alan Poe ! మరచిపోకూడని విషయం ఇది బహుళ చతుర్దశి రాత్రి..

నీలకాంతిలా దిగులు,ఈ కవితలో కూడా గొప్ప తాదాత్మ్యం ,మోహోద్వేగాలు ఋతువర్ణాలు కలిసిపోయి ఏవో విచిత్ర లోకాలు…

“అయినా అదేమిటో
హత్తుకునే ఎదురురొమ్ముల మధ్య
హాయిగా చైత్ర వైశాఖాలు!
ఆశ్చర్యం
అరణ్యాల్లోంచి సముద్రాల్లోకి
అలా ఉంటుందేమిటో దారి
ఏవో విచిత్ర లోకాలు…”

అంతే కాదు జీవననిఘంటువు తెరిచే సాహసం కూడా ..

“నిఘంటువులో అర్థాలు అర్థాలు కావు
జీవన వేదాలకు భాష్యాలు లేవు ”

చివరికి సర్వాన్ని ఏకం చేసే సమ్మోహలిపి

“పవనమై
కౌగలించుకో నన్ను గాఢంగా గాఢంగా
చిగురాకు మధ్యంగా!”

సంచిదానందానికి ,

ఇది భాష కాదు మోహమే..ఇది మోహం కాదు భాషే.. “గాఢాలింగనం లాగే పరిచుంబనంలాగే జీవితం కూడా విభ్రమమే !” అంటూ ఈ కవిత ఎక్కడా ఆగదు..ఈ మనోవేగమే..భాషకు స్వేచ్ఛని ప్రసాదించేది .. నిత్యజీవితంలో ఉత్సవకోలాహలాన్ని నింపేది.ఈ మోహరేఖా గణితంలో ఆలోచనలు,అనుభవాలు పరస్పరం ఖండించుకోవు.. వృత్తంలో వృత్తంలా అవలీలగా అణుగుతాయి.

కవితల పూర్తిపాఠం

జలపాత స్నానం

కోమలం కాదు
మలయపవన రాగం కాదు
హాయికాదు ఆహ్లాదమూ కాదు
అయినా ఆనందమే!
శతృవుతో ముఖాముఖీ తలపడినట్టు
మెరుపునీ మేరువునీ
ఉరుమునీ ఉద్రేకాన్ని కౌగిటనదిమినట్టు
మేఘమై గర్జించినట్టు
మంచు యువకుడిని మోహించినట్టు
భూమిలా కంపించినట్టు
నీటివాలుని సవాలు చేసినట్టు అది ఖడ్గచాలనం
జలపాత స్నానం
ఉచ్ఛ్వాస నిశ్వాసా ల మధ్య
యౌవనోద్రేకం జలపాత స్నానం
కష్టించి పనిచెయ్యడం జలపాత స్నానం

కొండలమధ్య
సూర్యుణ్ణి సైతం బంధించగల అడవుల మధ్య
గుహాముఖాన చీకటిలో చందమామ జలపాతం !
కానీ కోమలం కాదు
మలయపవన రాగం కాదు
హాయికాదు ఆహ్లాదమూ కాదు
అయినా ఆనందమే!
శీతగాలి సన్నగా శరీరాన్ని వణికిస్తూంటే
పైటని బిగదీసి చుట్టి
అమాంతం రెండు చేతులూ చాచి
ప్రియుని మెడచుట్టూ వేసినట్టు
ఆగని నీటి వరదలో కలిసి
నేను నీరై..నీరు నేనై ప్రవహించడం విశ్వమోహనం
విశ్వమోహనం ! అది ఖడ్గచాలనం !
జలపాత స్నానం ! జలపాత స్నానం!

గుండెలో పొగమంచు

దీప స్తంభాలు
నిటారుగా నిలబడ్డ సైనికుల్లా
ఆకాశంలోకి చొచ్చుకు పోతుంటాయి

విరిగిన విగ్రహాల మధ్య
శిథిల గోపురాల మధ్య
పలచగా పరుచుకొన్న వెన్నెలతో
పాముచర్మంలా మెరుస్తూన్న
నాచుపట్టిన నాపరాళ్ళ మధ్య
గర్భగుడిలోంచి గాలిలోకి వ్యాపించే
పంచామృతాల పచ్చకర్పూరాల వాసనల మధ్య
దిగులుగా ఉన్న చంద్రుడిని చూస్తూ
దిగులుగా ఉన్న మనం!

సముద్రపొడ్డున కెరటాల వెంట తీసిన పరుగులు
చిన్నతనాన్ని తిరిగి రప్పించుకొని
ఇసకలో ఆడిన ఆటలు
రొప్పుతూ ఎక్కలేక ఎక్కిన గుట్టలు
అలిసి కూలబడి
కలిసి తాగిన కొబ్బరినీళ్ళూ
ఇప్పటికీ గుర్తొస్తూంటాయి
విడిపోయేముందు
నా నుదుటి మీద నువ్వుపెట్టిన ముద్దులా
కన్నీటి తెరల మధ్య మన నవ్వులా
రైలుకూతలో విడదీయక తప్పని చేతివేళ్ళమధ్య
చిక్కుపడ్డ జ్ఞాపకాల్లా
నువ్వెప్పుడూ నాతో ఉంటావు

తలతిప్పి ఒక్క సారైనా
వెనక్కి తిరిగి చూడాలనుకొంటాను
నా బంధనాల్లోంచి తలబయటపెట్టేసరికి
నెలలు సంవత్సరాలైపోతాయి

ధ్వజస్తంభపు చిరుగంటలూ
నీ చిరునవ్వులూ కలిసి
నా చెవుల్లో లీలగా ధ్వనిస్తాయి

నా ఇష్టాలతో ప్రమేయం లేని కాలం
తనతో లాక్కు పోతూ ఉంటుంది
నాకు పరిచయం లేని తీరాలకి!

గుండ్రంగా వెలిగే చంద్రుడిని చూసినప్పుడల్లా
కరక్కాయ నమిలిన తీపి
పొగమంచులా గుండెలో కమ్ముతుంది!

మళ్ళీ మామూలే
కలతలు కలలు మోసుకుంటూ పరుగు
ఎప్పుడో
ఏ రాత్రి నిద్రలోనో
విరిగిన కెరటంలా
సరుగుడు చెట్లవెనక సముద్రపు హోరులా
ఎ్తౖతెన గోపురం మీంచి ఎగిరే జెండాలా
రెపరెపలాడే కోరికలు నాలో
అస్పష్టంగా మిగిలిపోతాయి!
అస్పష్టంగా..!!

బహుళ చతుర్దశి రాత్రి!

తుఫాను రేగిన పడమటి కనుమల్లో
కాటుక చీకటి బహుళ చతుర్దశి రాత్రి!

వేల పోకచెట్లు గాలితో చేసిన యుద్ధమో? అది
ధాత్రి మీద భూతనృత్యమో?
ఏవో అతిపురాతన ఆత్మలని ఆవాహన చేస్తే
అవి లక్షల మిణుగురులై వచ్చి
వృక్షశాఖల్లో దూరి ప్రతిరెమ్మ చివరా
తళుక్కు తళుక్కు తళుక్కున మెరిసిన
భయద సౌందర్యమో?
వింతగా ఆకాశం చుక్కల బరువుని ఓపలేక
ఒకింతగా నేలపైకి వొరిగిన దృశ్యమో?
పంటకాలువ దాటుతూ దొర్లిపడబోయినప్పుడు
నన్నాపుతూ వెనకనించి పావురాయి రెక్కల్లే ఐదువేళ్ళు
భుజాన వాలిన స్నేహమో ? మోహమో ?
మంత్రముగ్ధ బహుళచతుర్దశి రాత్రిలో
మన కళ్ళలో
చేతి కొనవేళ్ళలో
మాట పెగలని ఉద్రేకమో ? శాంతమో ?

విలయ వేగాన కురిసిన వానలాగే
కృష్ణవేణి కోనలాగే
నట్టనడి అడివిలో ఆ భయవిభ్రమ రాత్రి !
చేలగట్లమీద కొబ్బరిమొవ్వులోంచి గుడ్లగూబకూత
రాళ్ళని రాపాడుతున్న కీచురాయి పాట
మన చుట్టూ వలయంగా నర్తించిన
కామినీ గణ తాండవం!
ఉరుమూ మెరుపూ హోరుగాలీ వాద్యసహకారంతో
పొలికేక వేసిన కోయదాని కంచుకంఠం
ఆ బహుళ చతుర్దశి రాత్రి

ప్రళయఘోషలో
ఎప్పుడు కలుసుకున్నాయో
మన అరచేతులు రెండూ !
తలపై కెత్తి చూస్తే చీకట్లో
రెండు పనసచెట్ల కొమ్మలు ఒరుసుకుంటూ
గాఢంగా పెనవేసుకుపోయున్నాయ్‌

నా నుదిటిమీది వానబొట్టు నీ పెదవిలోకి జారింది!
మోహనంగా నీ నవ్వొక్కటి మైకంలో సాగింది!
ఎప్పటికీ తెల్లవారనట్టు
ఎంత సుదీర్ఘమైనదా రాత్రి!
చుక్కల్ని లెక్క పెడుతూ
లెక్క మరిచిపోయి ఫక్కున
చెప్పలేని ఉత్సాహంతో క్షణాల్ని గడిపేసిన
పడుచుదనంతో అందంగా తాచులాంటిదారాత్రి!
కనురెప్పల బరువుతో తొలివేకువదాకా
ఆ బహుళ చతుర్దశి రాత్రి!

నీలకాంతిలా దిగులు

అలా
సిద్ధించని యోగంలా
తెరచాటు మోహంలా
దిగులు!
ఎ్తౖతెన రెండుకొండల నడుమ
వింధ్యాటవీ శాఖల్లో
నీలకాంతిలా
దిగులు !
రాసినవన్నీ చెరిపేసి
చూసినవన్నీ తుడిపేసి
ఏ బొమ్మా మిగలని
నల్లబల్ల దిగులు!

అయినా అదేమిటో
హత్తుకునే ఎదురురొమ్ముల మధ్య
హాయిగా చైత్ర వైశాఖాలు!
ఆశ్చర్యం
అరణ్యాల్లోంచి సముద్రాల్లోకి
అలా ఉంటుందేమిటో దారి
ఏవో విచిత్ర లోకాలు
కల్లోల స్వప్నాలు
కలగలిసిన శబ్దచిత్రం రాత్రి!

తంత్రీనాదంలో తప్ప సుఖమెక్కడ?
ఇప్పటికీ..
రెండు శరీరాలా చేతనావర్తమే ఆశ!
పచ్చిక బయళ్ళంత విశాలం దేహం!

కానీ..
సారం కలిస్తే రూపం నప్పదు
రూపం నప్పితే సారం మిగలదు
రూపసారాలు కలవని ధృవాలా?

నిఘంటువులో అర్థాలు అర్థాలు కావు
జీవన వేదాలకు భాష్యాలు లేవు

ఆలోచనల పొరలకింద
ఇంకా అనంతానంత రహస్యాలే!
ముడివిప్పని దారాలే!

విభ్రాంతిగా పగళ్ళు వెళ్ళిపోతాయి
వేదనోద్వేగాల రాత్రుళ్ళు మిగిలిపోతాయి
అనుకోకుండా తెప్ప పగిలిపోతుందేమోనని
చెప్పలేని దిగులు
దుఃఖం దాటేస్తే
శిఖరారోహణం చేస్తే
అక్కడంతా వెన్నెలే !
ఈ లోగా
ఈ కాసారం దాటాలి
ఈ విలయం ఆపాలి
నిరంతర ధ్వనితరంగమే శాంతి!
పవనమై
కౌగలించుకో నన్ను గాఢంగా గాఢంగా
చిగురాకు మధ్యంగా!
నీ చిదానంద రూపం
శివోహం శివోహం!

సంచిదానందానికి

అష్టదళ పద్మంలాగో అమృతంలాగో
సంధ్యాకాశంలాగో వింధ్యాశిఖరంలాగో
సజలనయనంలాగో సాప్తపదీనంలాగో
జీవితం మారుతుందని ఎదురుచూడటం ఒకందుకే
ఒక మనోహర దృశ్యానికి!
ఒక సంచిదానందానికి!

ఇష్టమొక సాంద్రపరాగంలా కమ్మినపుడు
క్షణకాలం ఉధృతమోహాన్ని అదిమిపట్టి
విమల లాలిత్యంలో స్పర్శను బంధించుకోవడమూ ప్రేమే!
కాదనను కానీ..
ఇది ఇంతే ఇక్కడే ఆగాలని
పెదవులని శాసించడం వైకల్పం!

రాళ్ళమధ్య విరిగిపడిన కెరటం కాదు శరీరం
తేరుకొనీ తిరిగి మొదలై
ముందుకో వెనక్కో ప్రవహించడానికి!
అక్షరాలకో అంకెలకో వర్తించే
సంధిసూత్రమో..రేఖాగణితమో కాదు జీవితం
కాలవ్యవధిలో నిగ్గు తేల్చేయడానికి!
ఒక రక్తంలోంచి మరో రక్తంలోకి పాకే నమ్మకమే జీవితం!

సముద్రం కాళ్ళకింద చక్కిలిగిలి పెట్టినపుడు
అనుకోకుండా దగ్గరైన పాదాలలాగే
అలలధాటికి వొరిగి పోకుండా
ఒకరి చేతుల్లో ఒకరుగా ఇమిడి పోయిన
అరచేతుల వలతాళ్ళలాగే

పిచ్చి గులకరాళ్ళ కోసమో శంఖాలకోసమో
ఒక్కసారే వొంగి తలలు ఢీకొట్టుకోవటంలాగే
గాఢాలింగనం లాగే పరిచుంబనంలాగే
జీవితం కూడా విభ్రమమే !

ఎవరెంత వ్యాఖ్యానించినా
ఎన్ని వేదాంతాలు వల్లించినా..నిమంత్రించినా
అది షరతులకీ..సిద్ధాంతాలకీ
రాజశాసనాలకి
మెడమీది కత్తికి జడవదు !

పూలదారుల పార్థివాకృతి

నగ్నదేహము నీలవారిధి
ఉరకలెత్తిన తరగలై మది
జంటనావల సంబరాలకు
తీర్థమైనాది !

చూడుమా పగడంపు ప్రమిదలు
చూడుమా నయనంపు జ్యోతులు
పట్టపగలే వింతలేని
ఆవులింతుందా ?

నిలువుటద్దము లాంటివాడు
నెమలి కంఠపు ఛాయవాడు
గరుకు మీసము గరిమతో
సరిగమలు మీటాడా ?

పట్టుబట్టీ పైరుగట్టున
నిత్యమల్లీ నీడచాటున
పూలదారుల పార్థివాకృతి
పొంచినది ఎవరో ?

పెదవులానిన ముద్రలాయెను
చేయి వేస్తే సెగలు రేగెను
పచ్చలా పతకానికోడిన
భానుడెవడమ్మా ?!

తలుపురెక్కల వెనక గాలీ
జానపదులా పాటపాడీ
సొమ్మిసిల్లిన సోయగాలను
జోల పుచ్చింది !

పాపాయి జోల

పంటమడి గట్టున
పారిజాతపు వాన
గోరింట గుబురులో
కోరిపట్టిన తేనె

పూచి కాచిన సెనగ
పొన్న పున్నాగ
మరుమల్లె చామంతి
మనసైన బంతి

రాత్రి కొన కొమ్మపై
నక్షత్ర మాలిక
ఊయెలా డోలిక
పసి గోరువంక

చిలికి తీసిన వెన్న
మావిళ్ళ గున్న
చిన్నారి పాపాయి
జాజుల్ల దిన్నె

పొగమంచు తొలిఝాము
చలిమంట వాకిలి
పొదరింట నిదురించు
నెలవంక జాబిలి

అన్నిటా మిన్నగా
ఆటలుప్పొంగ
అమ్మవడి చేరింది
ఆకాశ గంగ

రచనలో ఉపకరించిన పుస్తకాలు
జయప్రభ కవిత్వం

1.యుద్ధోన్ముఖంగా
2.వామనుడి మూడో పాదం
3.ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది
4.యశోధరా వగపెందుకే
5.చింతల నెమలి

Chinese,Japanese Literature

1.The Selected Poems of Tu Fu
2.The Selected Poems of Li Po
3.Women Poets of China
4.Women Poets of Japan
5.The Essential Haiku

Zen Books

1.An Introduction to Zen Buddhism – D.T.Suzuki
2.The Zen Way To Martial Arts -T.Deshimaru

Edna Millay

1.Edna St.Vincent Millay Collected Lyrics
2.The Atlantic Monthly-(Articles on Edna)
3.Newyork Review of Books-(On Edna)

Others

1.Postwar Polish Poetry -Czeslaw Milosz
2.The Narrow Road to North -Basho
3.కవిత్వం లో నిశ్శబ్దం ఇస్మాయిల్‌
4.ఆంధ్ర భిషక్కుల భాషా భేషజం గిడుగు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...