దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో

మా. కానీ ఈ మార్పు పరిణామక్రమబద్ధం కాదా? వీటిని కాపాడుకోవాలంటే ఏంచేయాలి?

ఎమె. భాష ఒక జీవ సంఘటన. It’s a biological event! మానవుడి పరిణామ క్రమంలో భాష ఒక ప్రధానమైన మైలు రాయి. జంతుజాలపు పరిణామక్రమాన్ని అర్ధం చేసుకోవడం జీవశాస్త్ర రీత్యా ఎంత ముఖ్యమో, భాషలలో వచ్చే మార్పు కూడా మనకు అంతే ముఖ్యం. భాషకు మార్పు సహజం. సాంఘిక జీవనం వల్ల భాషలు మార్పు చెందుతాయి. ద్రవిడ భాషలపై సంస్కృతపు ప్రాబల్యం ఇలాంటిదే. కానీ మనం ఆ మార్పులన్నింటినీ పరిశోధించి పొందుపర్చుకోవాలి. భారత దేశంలో ప్రతీ భాషపై ఇతర భాషల ప్రభావం ఉంది. అనేక భాషలున్న దేశంకదా! ఉదాహరణకి తోడా తెగ వారు సంత కెళ్ళి నప్పుడు తమిళం, బడగా ఇత్యాది భాషలు మాట్లాడవలసి వచ్చేది. ఇందువల్లే అనుకుంటాను. “an Indian who atleast not a bilingual is dysfunctional!” అని ఆంత్రొపాలజిస్టులలో ఒక వాడుక ఉంది (..పెద్దగా నవ్వేరు) ఇది ఒక రకంగా నిజమే కదా! చాలామంది భారతీయులు రెండుకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలరు. కొంతమంది 10, 12 భాషల దాకా!

ఇక వీటి సంరక్షణ అంటారా! ఈ భాషల్ని విశ్లేషించి, కాలానుగుణ్యంగా జరిగిన మార్పులన్నీ ఇవి అంతరించక ముందే ఒక నిర్దిష్ట క్రమానుసారంగా గ్రంథస్తం చేయాలి. అభివృద్ధి చెందిన సంస్కృతులు తొందరగా అంతరించవు. కానీ బడుగు ప్రజల సంస్కృతి ఆర్ధిక, సాంఘిక కారణాలవల్ల చాలా త్వరగా ఉనికి కోల్పోతుంది. సంస్కృతం ఇంకా బ్రతికి ఉండటానికి కారణం జన బాహుళ్యానికి అది ఇంకా కావలసి రావడమే. వాటికన్‌ ఎప్పుడైతే దైవ ప్రార్ధన వాడుక భాషలో చేయవచ్చని చెప్పిందో యూరోపులో లాటిన్‌ అప్పుడే అంతరించింది. హిందువులు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. “The culture of India is not the culture of west. What gets lost is different in these two worlds” గత శతాబ్దంలో ఈ భాషల రక్షణకై చాలా కృషి జరిగింది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, నర్మదా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ఇంకా అనేక భాషలు ఈనాటికీ పరిశోధింప బడలేదు.

మ. ఈనాటి యువతరానికి భాషాశాస్త్రం గురించీ దాని ముఖ్యత గురించీ ఎలా నచ్చచెప్పాలి? నచ్చచెప్పాలని ఎందుకన్నానంటే విజ్ఞానాన్ని కూడా ఆర్ధిక దృష్టితోనే బేరీజు వేయడం నేటి ఆనవాయతీ అయ్యింది కదా!

ఎమె. ధనార్జనే ముఖ్యం అనుకుంటే ఇవేవీ ముఖ్యం కాదు. కానీ, మనిషి అతని మేధ పనిచేసే తీరును అర్ధం చేసుకుంటే గానీ సంపూర్ణమైన ప్రగతి రాదు. అది జ్ఞాన సముపార్జన వల్లే సాధ్యం. మానవుడు కేవలం ఆహారం కోసమే తన శ్రమనంతా వినియోగించి, దానితోనే సంతృప్తి చెందడం అన్న దశను దాటి అనేక సహస్రాబ్దాలయ్యంది. సంస్కృతీ నాగరికతల పుట్టుకా, పెరుగుదలా ఎప్పుడైనా దైహిక అవసరాల స్థాయికి పై మెట్టులోనే సాధ్యమౌతాయి. మానవజాతిలో ఇలా జరగడం చాలా ముఖ్యమైన సంఘటన. హిందూ నాగరికత ఇలానే ఆలోచించివుండాలి. ఎందుకంటే, వారి వర్ణ వ్యవస్థలో, హిందూ బ్రాహ్మణుల కర్తవ్యం అదే కదా! విజ్ఞానాన్ని సముపార్జించడమూ, ముందు తరాలకి అందజేస్తూ సంస్కృతిని పరిరక్షించడమూనూ!

మా. భారత దేశం ఒక బహుళభాషా ప్రాంతం కదా. ఇది ఈ దేశపు ఏకత్వంపై ఎటువంటి ప్రభావాన్ని కలిగివుంది? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

ఎమె. (నవ్వి) నేను మొదట్లో అలానే అనుకున్నాను. కానీ చాలా కొద్ది కాలంలోనే నా అభిప్రాయం మార్చుకున్నాను. భారత దేశం అంతటా అంతర్లీనంగా ఒక ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం భాషల హద్దుల్ని దాటి ఉంది. అందుకనే భారత దేశం అఖండంగా ఉండగల్గింది. ఇక్కడ భారతదేశం అంటే ప్రధానంగా హిందూ సాంస్కృతిక వ్యవస్థాపక ప్రాంతం, నైసర్గిక సరిహద్దుల మధ్యనున్న దేశమని కాదు. ఉదాహరణకి “ప్రతిధ్వన్య ధాతువు (Echo-Word Motif)” అనేక భారతీయ భాషల్లో కనిపిస్తుంది. దీనివల్ల ఏం తెలుస్తోంది? భాషలు వేరైనా భారతీయత ఒక్కటే అని. ఇది ఎలా అంటే, ఒకే మనిషి వేరు వేరు దుస్తుల్లో ప్రత్యక్షం అయినట్లన్నమాట. ఈ ధాతువుకి ఉదాహరణలుగా తెలుగులో పులీ గిలీ, గుర్రం గిర్రం, కన్నడంలో కుదురే గిదురే, తమిళంలో తన్నీర్‌ కన్నీర్‌ , మొదలైనవి చెప్పచ్చు. ఇలాంటి శబ్ద ప్రయోగాలు కేవలం వాడుక భాషలోనే అని గమనించాలి. వీటికి నిఘంటువుల్లో, వ్యాకరణ గ్రంధాల్లో చోటు లేదు.

ఈ కథ వినండి! ఒక నరమాంసం రుచిమరిగిన పులి ఒక గ్రామ సరిహద్దులోకి వచ్చింది. ఒక గ్రామస్తుడు పొదల్లో చప్పుడు విని పులి అని గ్రహించి తోటి వాడితో “చీకటి పడింతర్వాత జాగ్రత్త. పొదల్లో పులీ గిలీ ఉంటే ప్రమాదం” అన్నాడు. ఆ రెండవవాడు తెలివైన వాడు. విషయం గ్రహించి..” ఆ! పులి ఏముంది లెద్దూ! గిలి అంటేనే నాకు భయం” అన్నాడు. అది విన్న పులి, వాడిని నిలేసి గిలి ఎక్కడుంటుందో చూపించమంది, గిలిని చంపేసి తన పరాక్రమం చూపించుకోడానికి కాబోలు. అప్పుడా గ్రామస్తుడు ఆ పులిని, గిలిని వెతుక్కుంటూ పొమ్మని గ్రామానికి దూరంగా కొండకోనల్లోకి పంపించి దాని బారి నుంచి గ్రామాన్ని రక్షించాడు.

ఇలాంటి కథలు చిన్న చిన్న మార్పులూ చేర్పులతో అన్ని దక్షిణ భారతీయ భాషలవారూ చెప్పుకొనే జానపదాలు. అయితే, చాలా కథలూ ఇలాగే పద చమత్కారం మీద ఆధారపడ్డవి.

మా. మీ అమూల్య గ్రంథం ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (D.E.D)’ గురించి చెప్పండి.

ఎమె. 1938లో నేను అమెరికా తిరిగి వచ్చేటప్పటికి నా దగ్గర మూడేళ్ళ కృషి ఫలితంగా అపారమైన సమాచారం ప్రోగయ్యింది. అప్పటికే కీ. శే. బర్రో ఆక్స్ఫర్డ్‌ నుంచి భారతీయ భాషలపై కొన్ని వ్యాసాలు ప్రచురించి ఉన్నారు. ఆ కాలంలో పరిశోధకులు అందరూ ఎవరికివారే వారికి కావలిసిన శబ్దవ్యుత్పత్తులు సమకూర్చుకునేవారు. ఇందుకోసం చాలా సమయం వెచ్చించాల్సొచ్చేది. అందువల్ల నేనూ, బర్రో పరస్పర సహకారాలతో అప్పటిదాకా లభ్యమైన అన్ని వ్యుత్పత్తులనూ క్రోడీకరించి ఒక గ్రంధంగా వెలుపర్చాము. మొదటి ప్రచురణ అలా 1961లో వెలుగు చూసింది.

ఆ తరువాత బర్రో, కీ.శే. సుధీభూషన్‌ భట్టాచార్యతో కలిసి చాలా కృషి చేశారు. వారు అడవుల్లోకి వెళ్ళి వారాల తరబడి కాలి నడకన తిరుగుతూ అనేక భాషల శబ్దాల్నీ, వాటి వ్యుత్పత్తుల్నీ సేకరించి రెండవ ప్రచురణలో పొందుపరచారు. ఈ ప్రచురణలు ఇప్పుడు దొరకటం లేదనుకుంటాను.

మా. మీ ప్రియ శిష్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మీ అడుగుజాడల్లోనే ‘మాండలిక వృత్తి పదకోశం’ అనే గ్రంథాన్ని, ఎంతో ప్రయోజనకరంగా రూపొందించారు. వారికి మీతో ఎలా పరిచయం?

ఎమె. కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని నన్ను కోరారు. నాకు భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు, మరి అతనేమో తెలుగులో ఉద్దండుడు. అలా మా జంట సరిగ్గా కలిసింది. చాల మంచి పరిశోధనలు చేశాం మేమిద్దరమూ కలిసి. అతను, చాలా మంచి మనిషి. గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడూ, పరిపాలనాదక్షుడు కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు, నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు. నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ, మక్కువానూ. నా ప్రియ శిష్యుడిచ్చింది కదా! (గర్వంగా అ పట్టాని చూపించారు. అది, వారు ఎక్కువ సమయం గడిపే ముందుగదిలో కొట్టవచ్చినట్లుగా కనబడేటట్టు అలంకరించారు)

ఇది గొప్ప కాకతాళీయమేమో! ఆక్స్ఫర్డ్‌ లో నా స్నేహితుడు కే.వీ. గోపాలస్వామి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజి్స్ట్రారు గా ఉన్నప్పుడూ కృష్ణమూర్తి అతని శిష్యుడూ ఆపై మితృడునూ. ఆ తరువాత కృష్ణమూర్తి నా శిష్యుడూ స్నేహితుడూ అయినాడు.

మా. యువశాస్త్రజ్ఞులకి మీరిచ్చే సందేశం ఏమిటి?

ఎమె. శ్రమ యేవం జయతే! కష్టించి పని చేయమని చెబుతాను. ఏదీ సులభంగా రాదు. ఏ శాస్త్ర పరిశోధన అయినా చాల కష్టంతో కూడిన పని. గొప్ప ఫలితాలు రావాలీ అంటే చిత్తశుద్ధీ, అకుంఠిత దీక్షా, శ్రమా అవసరం. ఇంతకు మించి ఏం చెప్పగలను!?

మా. ఆఖరుగా, భారతదేశం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

ఎమె. “Ex Oriente Lux”! కాంతి తూరుపు నుండి వస్తుంది. భాషాశాస్త్రంలో వెలుగు భారతదేశంనుంచి వచ్చింది. పాశ్చాత్య ప్రపంచ నాగరికతలన్నీ చీకటిలో ఉన్నప్పుడే భారతీయులు భాషకు శబ్దప్రమాణాల్ని నిర్ణయించి ఎంతో ముందంజ వేశారు. భాషాశాస్త్రానికి ఎనలేని మేలు చేశారు. పాణిని వ్యాకరణం చదివారా? ఒక వాక్యాన్ని ఎలా వ్రాయాలీ అనేకాక ఎలా ఉచ్చరించాలీ అనేది కూడ బోధిస్తుంది. అందువల్లనే ఇన్ని శతసహస్రాబ్దాల తరువాత కూడా సంస్కృత ఉచ్చారణలో మార్పు లేదు. గ్రీక్‌ లాటిన్లు ఈ విషయంలో చాలా వెనుకబడినవి. మిగతా భాషల గురించి ఇక చెప్పనవసరమే లేదు. 1955లో అమెరికన్‌ ఓరియెంటల్‌ సొసైటీ కి ఇచ్చిన ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ విపులంగా చర్చించాను.

వ్యక్తిగతంగా నా భారతదేశానుభవం ఒక మరపురాని సంఘటన. అది ఒక అద్భుతమైన వరం. నేను అక్కడ ఉన్నప్పుడు, తమిళనాడూ ఒరిస్సాలలోని దేవాలయాలూ, తాజ్‌ మహల్‌ దర్శించాను. కలకత్తా, కాశీ, బొంబాయి నగరాలు తిరిగాను. బడగా తెగ వారు మంటలతో చేసే వీధి గారడీలనుంచి మొదలుకొని అనేక వింతలూ చూశాను. వంగ దేశీయుల చేపల కూరలూ , దాక్షిణాత్యుల పిండివంటకాలు, చాలా కారమైన కూరలూ, పచ్చళ్ళూ తిన్నాను. ప్రతి అనుభవం ఒక మరపురాని అనుభూతి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయ సంస్కృతీ జీవనది లో మునకలేసి తడిసిపోయాను. ఒక అలౌకికమైన ఆనందం నాకు ఆ అనుభవస్రవంతిలో లభించింది. ఈ అనుభవాలన్నీ భారతీయ సంస్కృతి అన్న వర్ణ చిత్రంలో మిళితమైన రంగుల్లాంటివి.

గత శతాబ్దంలో భారతీయ భాషాశాస్త్రం చాలా వృద్ధి చెందింది. అందుకు నా చిన్నపాటి కృషి కొంత దోహదం చేసినట్టు అనిపిస్తే, అది నాకు చాలా గర్వ కారణం.

అంతతో ఆయన దగ్గిర శెలవు తీసుకున్నాను. సాదరంగా వీధివాకిలి దాకా వచ్చి వీడ్కోలు పలికారు. నేను కనుమరుగయ్యేదాకా చేయి ఊపుతూ అలాగే నిలబడ్డారాయన. భారతదేశ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, కాలగర్భంలో కలిసిపోతున్న మన భాషాసంస్కృతిని రక్షించుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తుచేసి, మన సంస్కృతీ పురోగమనానికి ఎంతో మేలు చేసిన ఆ మహామనీషికి శతకోటి నీరాజనాలర్పిస్తూ వెనుదిరిగాను.