విన్నకోట రవిశంకర్‌ “వేసవి వాన”

అనుభవాల్ని, అంతరంగ మధనాల్ని అందంగా అర్ధమయే రీతిలో అందించటం అందరికీ సాధ్యమయే పనికాదు. కుండీలో మర్రిచెట్టు తరువాత పదేళ్ళకుపైగా తనకుతానే విధించుకున్న కవిత్వవాసం నుండి బయటపడి వేసవి వానగా రవిశంకర్‌ అవతరించటం ఆహ్లాదాన్ని కలగజేస్తోంది.

ప్రకృతి,పిల్లలు,అనుభవాలు విశ్వరహస్యాల్ని తెలుసుకోవటానికి వాహకాలు. వర్గీకరించటం కాదుగాని, స్థూలంగా వేసవి వానలో కనిపించేవి చాలావరకు ఇవే. ఇందులో కవితలు దారితప్పిన మన ఙ్ఞాపకాల్ని సజీవంగా ఒడ్డుకి చేరుస్తాయి.

సుఖానంతరం వయస్సు కోరుకునే అనుభవం అంత సునాయాసంగా అందంగా చెప్పటం రవిశంకర్‌కే సాధ్యమయింది.
పూలరుతువు, మూడుపూవులు, ఒక ఎడారి పువ్వు, వసంత సమరం ప్రకృతితో తాదాత్మ్యాన్ని, నేర్చుకునే పాఠాల్ని తెలియజేస్తాయి.

తొందరగా ఇంటికి చేరుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆ ఆకర్షణ వెనక ఆరాటం గృహోన్ముఖం. బహుశా నైట్‌డ్యూటీ మీద వచ్చిన మొదటి  తెలుగు కవిత నైట్‌అవుట్‌. అలాగే విమానయానం మీద ఉడాన్‌ కూడా. బాధ, ఒంటరితనం, ఉద్వేగాలు, వయస్సు, జన్మ వత్తాంతం, వ్యక్తిగతమే కావచ్చు. వాటిని అందరివిగా చేయటంలో రవిశంకర్‌ ప్రఙ్ఞ  అడుగడుగునా కనిపిస్తుంది.

ఏ కవికైనా తాను, కవిత్వం వేధిస్తూనే ఉంటాయి. వాటినుండి బయటపడ్డవే  పద్యం కోసం,కవి మనసు, కవి రూపం, కవిత్వం.

అక్కడక్కడ శిల్పంలో మార్పు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుంది. అయినా ఆనందంగా వాన చినుకుల్లో ముద్దైపోవటం నిజంగానే ఎంతో బాగుంది. చదివి, దాచుకోదగ్గ మంచి కవిత్వం రవిశంకర్‌ వాన చినుకు.