చెట్టు క్రింద కాకులు

అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు.

అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ బావి గిలక ప్రక్కన కూర్చుని అదే పనిగా అరుస్తున్న కాకి వైపు కోపంగా ఓ చూపు చూసి, “…ఎంత బ్రహ్మాండంగా జరిగిందనుకున్నారు? ఎన్ని బళ్ళూ, ఎంత మంది జనం… చెప్పడానికి నా నోరు చాలడం లేదనుకో” అని అలుపుతీర్చుకోవడానికి ఆగారు.

“అబ్బా… అంత బాగా జరిగిందా? ఇంతకీ ప్రభలెన్నొచ్చాయి? ఎంత పెద్దవొచ్చాయి?” అడిగారు సుబ్బరాజు గారు. ఆశ్చర్య ప్రకటన కోసం తెరుచుకున్న పెంచలయ్య గారి నోరు, తెరుచుకున్నట్లే ఉంది.

అప్పాపురం నుంచి హిందూపురం వెళ్ళే దారిలో, దారికి కాస్త ఎడంగా ఒక శివాలయం ఉంది. దాని ప్రక్కనే ఒక పాడుబడ్డ చేద బావి ఉంది. బావికి పాతిక ముప్పై అడుగుల్లో ఒక పెద్ద మర్రి చెట్టుంది. చెట్టు చుట్టూ కట్టిన అరుగు మీద కూర్చొని ఉన్నారందరు.

“అక్కడికే వస్తున్నా, నేను లెక్క పెట్టలేదు కానీ చాలానే వచ్చాయన్నారు. ఎంత పెద్ద ప్రభలో… దేదీప్యమానమైన లైటింగులు… అబ్బో అల్లాంటి ప్రభల్ని ఇంత వరకు ఎవరూ కట్టి వుండరు, ఇకముందు కట్టలేరు,” అంటూ తన్మయత్వంతో అర్థనిమీలిత నేత్రులయ్యారు రెడ్డి గారు.

నిన్నా మొన్నా హిందూపురంలో జరిగిన తిరనాళ్ళకు వెళ్ళొచ్చిన రెడ్డి గారు, అదే అరుగు మీద కూర్చున్న మిగిలిన వాళ్ళకు తిరనాళ్ళ సంబరాల గురించి చెబుతున్నారు. మంచి మాటకారి, మాట్లాడాలన్న తపన ఎక్కువగా కలవాడూ కూడా కావడంతో, ఏ విషయాన్నైనా సరే ఆసక్తికరంగా చెప్పగలరు. అలాగని మాట్లాడాలి అన్న ఏకైక ధ్యేయంతో అవాకులు చవాకులు పేలి అందరి బుర్రలు తినరు.

వింటున్న నారాయణ గారు, తిరనాళ్ళ వరకూ పోన్లే అని సరిపెట్టుకున్నారు గానీ, ప్రభల విషయానికొచ్చేసరికి వారి మనసు చివుక్కుమంది. ఇక రెడ్డి గారి పోకడలకు అడ్డు పడక తప్పదనిపించింది.

అనిపించిందే తడవుగా “అయ్యా రెడ్డి గారు, మీరు వేయి నాలుకల ఆదిశేషుడిలా అతిశయోక్తులు వల్లించడం ఏమీ బాగోలేదు. అలాంటి తిర్నాల ఎన్నడూ జరగలేదంటే నాకేమాత్రమూ ఇబ్బంది లేదు. కానీ ప్రభల విషయంలో మాత్రం మీరు మరీ గోరంతల్ని కొండంతలు చేస్తున్నారు” అన్నారు నారాయణ గారు మహదావేశంతో.

నారాయణ గారు కూడా మాటకారే. అన్ని విషయాల్లోనూ తమకు అపారమైన జ్ఞానం కలదనీ, తమ జ్ఞాన కాంతుల్ని చుట్టూ ఉన్న పామర జనుల అజ్ఞానాంధకారం పై ప్రసరించాలనీ, అలా ప్రసరించి లోకాన్ని ఉద్ధరించాలనీ వారి తపన! దాంతో అన్ని విషయాల్లోనూ తల దూర్చి, చుట్టూ ఉన్న వాళ్ళకు తలనొప్పి కలిగిస్తుంటారు. కొంత మంది “పోన్లెద్దూ, పెద్దాయన! ఊ కొడితే పోలా,” అనుకుంటారు. మరి కొందరు, “ఇంత వయసొచ్చినా, అన్నిట్లోకి తగుదునమ్మా అని వేళ్ళు, కాళ్ళు పెట్టి లాక్కోలేక పీక్కోలేకా సతమతమవడమెందుకు… అందరినీ సతాయించడమెందుకూ…” అని చాటుగా అనుకుంటూ ఉంటారు.

“ఆ ప్రభల్ని చూస్తే మీరలా అనరు నారాయణ గారు. ఎంతెత్తు వనుకున్నారు? చుక్కల్ని తాకినట్లనిపిస్తే…’నభూతో నభవిష్యతి’ అంటారు చూడండి అలా” అంటున్న రెడ్డి గారి మాటల్ని, మధ్యలో తుంచేస్తూ…

“మళ్ళీ అదే కూ…” అతి కష్టమ్మీద తమాయించుకుని “…మాట! ఇంతకు ముందు ఎవరూ కట్టలేదని, ఇకముందు ఎవరూ కట్టలేరని మీరెలా చెప్పగలరు?” వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ అన్నారు నారాయణ గారు.

వాళ్ళలో కొందరు నారాయణ గారంతగా కోప్పడ్డానికి గల కారణాలు గురించి ఆలోచించసాగారు. కొందరైతే గొడవ ముదిరి పాకాన పడితే, రుచికరమైన వినోదం దొరుకుతుందేమోనని, సౌకర్యంగా సర్దుకుని కూర్చున్నారు.

నారాయణ గారి కళ్ళు కాస్త ఎర్రబడ్డాయి. చేతులు చిన్నగా కంపిస్తున్నాయి.కంఠం పిసరంత వణుకుతోంది.

“అరుగు దగ్గరనుంచీ, ఇంటికెళ్ళే లోపు ఏమౌతుందో తెలీదు కానీ, ఇకముందు అలాంటి ప్రభలు ఎవరూ కట్టలేరని ఎలా చెప్పగలరూ?” దీర్ఘం తీశారు అనంతయ్య గారు, తన ప్రక్కన కొన్ని క్షణాల ముందు పడ్డ కాకి రెట్ట గురించి తను ఊహించలేక పోవడాన్ని గుర్తు చేసుకొని, వేదాంత ధోరణిలో.

అలా అన్న వెంటనే నాలుక కరుచుకున్నారు. చేత్తో నొసటి మీద గట్టిగా చరుచుకున్నారు. కానీ అప్పటికే, జరగాల్సింది జరిగి పోయింది.

అదే అరుగుమీద, చెట్టుకు వెనుక వైపు కూర్చున్న భక్త బృందం చెవుల్లోకి అనంతయ్య గారి వేదాంత పూరితమైన మాటలు ప్రవహించాయి.

అప్పటి వరకు రాత్రి దర్శనమిచ్చిన దేవుడి గురించి ఒకరు, ఉదయాన్నే నిద్ర లేపి రెండు ఆపిల్‌ పళ్ళు చేతిలో పెట్టి దీవెనలందించిన దేవత గురించి మరొకరు చెబుతుంటే, నేనేమీ తక్కువ తినలేదంటూ ఇంకొకరు రాత్రి లఘుశంకకు తాను లేచినప్పుడు, దేవుడు తన భక్తిని మెచ్చి ఒసంగిన రెక్కలతో ఆకాశానికెగిరి, చంద్ర లోకంలో రెండు ఘడియలు విహరించి వచ్చిన అనుభవాన్ని మిగిలిన వారితో పంచుకుంటున్నారు. ఎవరికి వారు, ఎదుటి వాళ్ళు తమ చెవుల్లో పూలు పెడుతున్నారని మనసులో అనుకున్నా, పైకి మాత్రం మీ పూజ అలాంటిది, మీ దీక్ష గొప్పది, మీ తపస్సు పరమేశ్వరుడు మెచ్చాడు లాంటి మెచ్చుకోలు మాటలతో ఒకరినొకరు ఉబ్బేసుకుంటూ మర్రి చెట్టు కొమ్మలకు తలలు తాకించుకుంటూంటారు. అలాంటి సమయంలో చెట్టుకు మరో వైపు నుంచి వచ్చిన అనంతయ్య గారి మాటలు ఆ భక్తాగ్రేసరుల్ని పరవశింపజేశాయి.

ఉత్సాహంగా, వాళ్ళు అనంతయ్య గారి సరసకు వెళ్ళి కూర్చున్నారు.

“అవును, ఇంకో నిమిషంలో ఈ మర్రిచెట్టు కూకటి వేళ్ళతో సహా కూలిపోవచ్చు. మనం హాయిగా స్వర్గానికి ఎగిరి పోవచ్చు. ఎవరు చూడవచ్చారు,” అన్నారు భక్తుల్లో ఒకరు.

“ఇక్కడి వాళ్ళందరూ స్వర్గానికే వెడతారన్న భరోసా ఏమిటి?” సందేహం లేవనెత్తాడు మరో భక్తుడు.

వాళ్ళనలాగే వదిలేస్తే, మాటలనుంచీ పాటలదాకా, అక్కణ్ణుంచీ కీర్తనలు, భజనలు దాకా వెళ్ళి పోతారని, ప్రభల గురించి జరుగుతున్న చర్చ పక్క దోవ పడుతుందని భావించి, భక్తులు మినహా అందరూ లేచి, అరుగుకు మరో వైపుకు వెళ్ళారు. కొందరైతే అనంతయ్య వైపు కొర కొర చూశారు.

చర్చను కొనసాగిస్తూ “ముందు ముందు ఎవరైనా కడతారో లేదో తెలియదు కాని, ఇంతకు ముందు మాత్రం అంత ఎ్తౖతెన పెద్ద ప్రభలను ఎవ్వరూ కట్టలేదు. ఆ అలంకరణ, లైటింగులూ ఎవరూ చేయలేదు,” అన్నారు రెడ్డి గారు దృఢంగా. వీరు కాస్త పట్టు విడుపు గలవారు. వితండవాదం చేసి గొడవ పెట్టుకునే తత్వం కాదు వీరిది.

“ఇంతకు ముందు జరగలేదని ఎలా చెప్పగలరు? ఏమో ప్రక్క ఊళ్ళలో వారికంటే అఖండులు ఎవరైనా అంతకంటే అట్టహాసంగా ప్రభలను ఇంతకు ముందు కట్టారేమో?! అయినా, ఆ ప్రభలే గొప్పవని నిరూపించే సాధనాలు, యంత్రాలు, మంత్రాలు, రాళ్ళూరప్పలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?” కాస్త వెటకారం ధ్వనించింది నారాయణ గారి మాటల్లో.

“వారు చూసిన వాటిలో అవే గొప్పవేమో! అయినా, మీరు ఈ ప్రభల్ని చూడకుండా అవి గొప్పవి కాదని ఎలా చెప్పగలరు?” అడిగారు పూజారి గారు, చెట్టు చాటునుంచి తొంగి చూస్తూ.

మండుతున్న నారాయణ గారి వంటి మీద, మరి కాస్త పెట్రోలు పోసినట్లైంది. తిట్ల దండకం ఎత్తుకుందామనుకున్నాడు. అరుగు కట్టుబాట్లు గుర్తొచ్చాయి.

ఆ కట్టుబాట్ల కథ తెలియాలంటే ఆ అరుగు గతం కాస్త తెలియాలి.


ఆ అరుగు కట్టించిన క్రొత్తల్లో, ఉదయం సాయంత్రం చాలా మంది అక్కడకు చేరే వాళ్ళు. ఊరి రాజకీయాలు, ప్రక్క వూరి విశేషాలు పక్కింటి వాళ్ళ కబుర్లు, గుళ్ళో జరిగిన హరికథా కాలక్షేపం గురించిన అభిప్రాయాలు… ఇలా బుర్రకి తోచిన అన్ని విషయాల మీద ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎవరికి వారు, వారు చెప్పిందే కరెక్టని అనుకోవడం, అలా మిగిలిన వాళ్ళు కూడా అనుకోవాలనుకోవడంతో… గొడవలు మొదలయ్యేవి. అవి చిన్నగా అరుపులై, తర్వాత బూతులయ్యేవి. ఒక్కోసారి పరిస్థితి ఒకర్నొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునేదాకా పోయేది.

మర్రి చెట్టు దేవాలయం భూముల్లోనే ఉంది కనుక, గుడి మీద గౌరవం గల ఒక ధర్మకర్త గారు, అరుగు దగ్గరకు వచ్చే అందరినీ ఒకసారి సమావేశ పరచి రాజకీయాల గురించి మాట్లాడ్డాలు, తగాదా పడ్డాలు, కొట్టుకోవడాలు, ఒకడ్నొకడు బూతులు తిట్టుకోవడాలు లాంటివి అరుగు దగ్గర చెయ్యొద్దనీ, అలాంటివి చేయడం వల్ల గుడికి వచ్చే జనాలు తగ్గుతున్నారని చెప్పారు. మాటలతోటే వీళ్ళని దారిలో పెట్టడం సాధ్యం కాదని తెలిసిన వాడు కనుక ఎవరైనా తన మాట పెడచెవిన పెట్టినట్లు తెలిస్తే, అరుగు దగ్గరకు అతన్నే కాదు ఎవరినీ రానివ్వనని ప్రకటించారు. ఎందుకైనా మంచిదని ఈ విషయాలని ఒక బోర్డు మీద కూడ పెయింట్‌తో వ్రాయించి, చెట్టుకు వ్రేళ్ళాడగట్టారు. అరుగు దగ్గరి కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను గుడి పూజారి పైన ఉంచారు.

రాజకీయాలు, బూతులు, కనీసం ఒకర్నొకరు తిట్టుకునే స్వాతంత్య్రం కూడా లేని చోట కాలక్షేపమేమి దొరుకుతుందని కొంతమంది అరుగు దగ్గరకు రావడం మానేశారు. ఒక ఏడెనిమిది మంది మాత్రం క్రమం తప్పకుండా వచ్చి, మర్రి చెట్టుకు ఏడాదికి ఎన్ని ఆకులు పుడతాయి, ఆవు పేడతో అందంగా ఎలా పిడకలు కొట్టవచ్చు, పిడకలతో కళాత్మకంగా ఎలా పొయ్యి వెలిగించవచ్చు, మిరపకాయ బజ్జీలు రుచికరంగా ఎలా చేయవచ్చు — లాంటి రసవత్తరమైన విషయాలు ముచ్చటించుకుంటూ కాలక్షేపం చేయడం చూసి, అప్పుడప్పుడూ వచ్చి తొంగి చూసేవాళ్ళు కూడా, అటువైపు రావడం మానేశారు.

కానీ అరుగు దగ్గరకు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు మాత్రం వారి ముచ్చట్లు ఆ ఊళ్ళోనే గాక ప్రక్క ఊళ్ళల్లోనూ, పట్టణాల్లోనూ, దేశదేశాల్లోనూ ప్రచారమై, అందరిలోనూ భయంకరమైన మార్పులు తెస్తున్నాయనుకొని గర్విస్తుంటారు.