ప్రయాణం

” పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.సర్వం పోగొట్టుకున్నాను.”

గట్టిగా అరవాలనిపించింది వేణుకు.ఏమీ పట్టనట్టు ట్రాఫిక్‌!కరెంట్‌పోల్‌ ఖాళీగా నిలబడుకొని వుంది.ఎండిన చెట్టు ఏమరుపాటుగా తననే గమనిస్తున్నట్టనిపించింది వేణుకు.”ఏమిటా రోడ్డు దాటడం ??”
బైకు సడన్‌బ్రేకు వేసుకొని గుర్రుగా చూస్తూ ప్రశ్నించిందో భారీ శాల్తీ.అవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు వేణు.తనపాటి తాను రోడ్డు దాటాడు.పార్కులో పిల్లలు పెద్ద మోత చేస్తూ ఊయల ఊగుతున్నారు.
“వీళ్ళదే హాయి” నిర్వేదంగా నవ్వుకొన్నాడు.ఊరు వెళ్ళాలని లేదు.

వేణు అలోచనలన్నీ హేమ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.తను ఇంత దారుణంగా మోసపోతానని వేణు కలలో కూడా అనుకోలేదు.
“వేణు నీతో పర్సనల్‌గా మాట్లాడాలి,మా ఇంటికివస్తావా?!” అంటే తను ఏదో ఊహించుకొని ఎగిరిగంతేశాడు.చివరి సంవత్సరం పరీక్షలు ఐపోయాయి.బరువుగా ఒక్కొక్కరు స్నేహితుల దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు.హాస్టల్లో నిన్నటి దాకా ఉన్న నలుగురు వెళ్ళి పోయారు.మిణుకుమిణుకుమంటూ తనొక్కడే మిగిలాడు,హేమ గురించి కలలు కంటూ ! చివరికి తనకు మిగిలిందేమిటి ? జీర్ణించుకోలేక పోతున్నాడు.
ఏమంది హేమ ? ” ఈ నాలుగేళ్ళు చనువుగా ఉన్నానని ఏవేవో ఊహించుకోకు. అందరిలాగే నీవు జస్ట్‌ఫ్రెండ్‌వి అంటే.మన ఫ్రెండ్‌షిప్‌ఇక్కడితో కట్‌ నీవు నన్ను కలవాలని ఎప్పుడూ ప్రయత్నించకు.”
ఐనా తనేమైనా తగుదునమ్మా అని పిలవని పేరంటానికి వెళ్ళాడా ?
తను పిలిస్తేనే గదా వెళ్ళడం.తల కొట్టేసినట్లనిపించింది వేణుకి. ఆలోచనల్లో రైల్వేస్టేషన్‌వచ్చి పడ్డాడు.

2.

తను ఎన్ని ఊహించాడు. హేమ తనను సాగనంపడానికి స్టేషన్‌వస్తుందని , ” ఉత్తరాలు రాస్తుండుమళ్ళీ ఎప్పుడు వస్తావు ? నన్ను మీ ఊరు ఎప్పుడు తీసుకు వెళతావు ?” అని దిగులును కప్పి పెట్టుకొంటూ అంటుందని.తన స్థాయి తనకు బాగా తెలిసి వచ్చింది.కత్తిపీటతో సొరకాయ కోసినంత తేలికగా చెప్పివేసింది.
ఇవి వినడానికా తను పనిగట్టుకొని వారి ఇంటికి వెళ్ళింది అనిపించింది వేణుకి.

తనమీద తనకు అసహ్యం కలిగింది.ఎవరో గుడ్డి బిచ్చగాడు అడుక్కు తింటున్నాడు. “ధర్మం చేయండి బాబయ్యా” అని.తన కన్నా ఆ క్షణంలో వాడు నయమనిపించాడు. వాడి బ్రతుకేదో వాడు స్వతంత్రంగా బ్రతుక్కొంటున్నాడు.తన లాగా అమ్మాయిల చుట్టూ తిరక్కుండా.రైలు ఒక గంట లేటుందని తెలిసింది.క్లోక్‌రూమ్‌లో ప్రొద్దునే లగ్గేజి వేసి వచ్చాడు,సాయంత్రం హేమను కలవాల్సి వుందని.”ఆహా ఏమి జాగ్రత్త” తనమీద తనకే నవ్వు వచ్చింది.లగ్గేజి ప్లాట్‌ఫార్మ్‌మీదికి చేర్చేసరికి తాతలు దిగివచ్చారు.
నాలుగేళ్ళ లగ్గేజి.ముఖ్యంగా బరువంతా పుస్తకాలదే.
ఎంత మరచిపోదామన్నా అదే దృశ్యం పదే పదే గుర్తుకు వస్తోంది.
హేమ పిలిచినట్టుగానే ఠంచనుగా నాలుగు గంటలకు వారింటి గేటు తెరిచాడు.హేమ చామంతి పూలకు నీళ్ళు పడుతోంది; “రా వేణూ రా నీ గురించే చూస్తున్నా ” అంది నవ్వుతూ.పెరడు చాలా పెద్దది గానే వుంది.

ఒక వైపు బాదం చెట్టు.దాని ఆకులు వింతగా వెలుగుతున్నాయి సూర్యరశ్మి పడి.కుర్చీలు తెచ్చి వేసింది.తనకు గొంతు పెగలదని ముందే ఊహించిందేమో !
జగ్గు నిండా నీళ్ళు రెండు గ్లాసులు తెచ్చి పెట్టింది.”చెప్పు” అన్నట్టు చూసింది.
తను నేల చూపులు చూశాడు.గడ్డిపరకల మీద నీటి చుక్కలు మిల మిలా మెరిసిపోతున్నాయి.రాత్రంతా ఏవేవో ఆలోచించాడు.అంతా శూన్యం.హేమ చెప్పు కొచ్చింది.తనకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని..వేణు గుండె దడ హెచ్చింది.

కానీ తనకు ఇప్పుడిప్పుడే చేసుకోవాలని లేదనికూడా చెప్పింది. తెరపి పడ్డాడు.ఒక గ్లాసు నీళ్ళు ఖాళీ చేశాడు.పరిశీలనగా చూసింది హేమ.తొట్రుపడి,కొంచెం సర్దుకొని కూచున్నాడు.బిస్కట్లు తింటున్న మిష మీద కాసేపు మాట్లాడకుండా ఉన్నాడు.ఇంతలో హేమ నాన్న వచ్చాడు.తనకు పై ప్రాణాలు పైనే పోయాయి.ఆయన చాలా ఆదరంగా దగ్గరికి వచ్చి పలుకరించి ,నాలుగు మాటలు మాట్లాడి లోనికి వెళ్ళాడు.” హమ్మయ్య ” అని ఊపిరి పీల్చుకొన్నాడు.
” హేమా ” పిలిచారెవరో .ఒక్క నిమిషంలో వస్తానని లోనికి వెళ్ళింది.

తను ఎన్నెన్ని చెప్పాలనుకొన్నాడు.మాటలన్నీ అడుగంటిపోయాయి!
అక్కరకు వచ్చే మాట ఒక్కటి తోచడం లేదు.పదిహేను నిమిషాల్లో తిరిగి ప్రత్యక్షమయ్యింది.చీర కట్టుకొంది.. తన వైపు చూసి అల్లరిగా నవ్వు తున్నట్లనిపించింది.ఖచ్చితంగా తన భ్రమే అయ్యుంటుందనుకొన్నాడు.
అతి కష్టమ్మీద సంబంధం లేని మాటలు కొన్ని మాట్లాడాడు.ఇంకో గ్లాసు నీళ్ళు ఖాళీ చేశాడు.హేమకు కోపం చాలా తేలిగ్గా వస్తుందిఆ విషయం తనకు తెలుసు,కానీ తను ప్రసన్నంగానే ఉంది చివరిదాకా.తను ఒక పది నిమిషాల్లో బయల్దేరతాడనగా ఒక బరువైన పాకేజ్‌తన కందించి నవ్వుతూనే చెప్పింది.వేణు నిశ్చేష్టుడైపోవడానికి అట్టే సమయం పట్టలేదు.”bye” చెప్పేసి లోనికి వెళ్ళింది.గభాలున తను తిరిగి చూడకుండా గేటు తెరచుకొని రోడ్డున పడ్డాడు.

3

మళ్ళీ గుడ్డి బిచ్చగాడు ప్లాట్‌ఫార్మ్‌చివరిదాకా వెళ్ళి ,అడుక్కొని ,నేలకు కర్రను తాటించు కొంటూ వస్తున్నాడు.రైలు వస్తుందన్నట్టు గంట కొట్టారు.స్టేషన్‌లో అలజడి.అరుపులు గొడవల మధ్య కదిలింది రైలు బరువుగా ఊపిరి తీసుకొంటూ ఇవన్నీ తనకు మామూలే అన్నట్టు.సూర్యుడు పూర్తిగా అస్తమించాడు.ట్రైన్లో లైట్లు వెలిగాయి.పక్క సీట్లో మరాఠీ జంట చూడచక్కగా వుంది.ఆమె మొహం మీద వెండ్రుకలు పడుతుంటే సవరిస్తున్నాడతను. రైలు ఏదో వంతెన దాటుతున్నట్లుంది.పెద్ద చప్పుడు.

కొంచెం సేపు ఎవరి మాటలు ఎవరికీ వినిపించలేదు.ఊయలలా ఊగుతూ వెళుతోంది రైలు.
వేణు వైపు చూసి పలుకరింపుగా నవ్వాడతను.ఆమెందుకో సిగ్గుతో తలవంచుకొంది.
హేమ సిగ్గుపడితే చాలా అందంగా వుంటుంది !!

ఒకసారి second year లో నాగార్జున సాగర్‌టూర్‌వెళుతూ మధ్యలో ఎత్తిపోతల దగ్గర ఆగారు.బస్సులో అందరూ కునికిపాట్లు పడుతున్నారు.ఉత్సాహమున్న వారు జలపాతాన్ని చూడటానికి బయల్దేరారు.కొంచెం చలిగా ఉంది.జలపాతం మీద వెన్నెల.నీళ్ళ దగ్గర చలి పెరిగినట్టు అనిపించి ఒక్కొక్కరే జారుకొన్నారు.

తను ,హేమ ఇద్దరే మిగిలారు.ఇద్దరి తరపునా వెన్నెల ,జలపాతం మాట్లాడుతున్నట్టున్నాయి.” చలిగా లేదా ” హేమ నోరు విప్పింది.”నాకూ చలిగా అనిపిస్తుంది వెళదాం పద ” తను దారి తీశాడు.మెలకువగా ఉన్నవారు ఇద్దర్నీ చూసి ఏదో కామెంట్‌చేసి నవ్వుతున్నారు.హేమకు అమాంతం సిగ్గు ముంచు కొచ్చింది.పరిగెత్తుకు వెళ్ళి బస్సులో ఒకమూలన ముడుక్కుంది.నెమ్మది నెమ్మదిగా అందరూ నిద్రలోకి జారుకొన్నారు.ఇద్దరినీ వెన్నెల ,జలపాతం పట్టుకొని వదల్లేదు.

పిల్లిలా వేణు దగ్గర నిలిచి గుసగుసగా అంది హేమ “నిద్ర పట్టడం లేదా” లేదన్నట్టు తల ఊపాడు.”ఏమైనా మాట్లాడు ” పక్కన చేరింది.ఇద్దరూ మాటల్లో పడ్డారు.తూర్పురేకలు విచ్చుకొని ,వెన్నెల మాయమయి బయటి స్పృహ తెలిసే దాకా మాట్లాడుతూనే ఉన్నారు.వేణుకు మొదటి సారి తను వెదుకుతున్నదేదో దొరికినట్లనిపించింది.ఇద్దరి మొహాల్లో కొత్తవెలుగు.

T.C వచ్చి నిద్రలేపి మరీ టికెట్లు చెక్‌చేస్తున్నాడు.చక చకా తన పని ముగించుకొని ఇంకో పెట్టెలోకి వెళ్ళిపోయాడు.మరాఠీ జంటఆమె ఒడిలో అతను అతని మీద వాలి ఆమెఅన్యోన్యంగా నిద్రిస్తున్నారు.బయటి ప్రపంచం వారికి పట్టదు.రైలు వేగం మందగించింది.పెద్ద చప్పుడుతో ఇంకో రైలు చాలా వేగంగా దూసుకుపోయింది.ఒక్కనిమిషంలో వేగం పుంజుకొని ఎప్పటిలా పరిగెడుతోంది రైలు.

4.

హేమ ,తను నాగార్జునకొండలో అనుకోకుండా దగ్గరయారు.హేమ పూవులను చూసి మురిసి పోయి అటూ ఇటూ కలియదిరుగుతూ అక్కడే వుండిపోయింది.వేణు మ్యూజియం శిల్పాలను చూస్తూ వాటిలో మునిగిపోయాడు.గభాలున బయటికి వచ్చి చూస్తే అందరూ వెళ్ళిపోయారు.”వదిలేసి ఎలా వెళిపోయారబ్బా ” అని అటూ ఇటూ చూస్తుంటే హేమ కనిపించింది.సూర్యుడు తీక్ష్ణంగా వున్నాడు.
కృష్ణానది వెలిగి పోతుంది.పాదాలు నీటిలో వదిలి వడ్డున కూచుంది.

తన మొహమ్మీద సూర్య కాంతి పడి వింత అందాన్ని తెచ్చిపెడుతోంది.
“హేమా ! అందరూ వెళ్ళిపోయారు ,నీవు ఇక్కడే ఉండిపోతావా ఏమిటి ?” దూరం నుండీ అరిచాడు వేణు. బదులుగా తను నవ్వింది.దగ్గరగా రమ్మన్నట్లు చేయూపి పిలిచింది.ఎర్రని చేతులు..ఎండకు మరింత ఎర్రబారాయి.
సమీపంగా రానిచ్చి తన మొహం మీద నీళ్ళు చల్లింది అల్లరిగా నవ్వుతూ.
దిగంతాల దాకా వ్యాపించిన నది.ఏనాటివో శిల్పాలు..రంగురంగుల పుష్పాలు.
లాంచీ సైరన్‌వినిపించేదాకా నీటిఒడ్డున మైమరిచి ఉండిపోయారిద్దరు.

నదిలా తను తృళ్ళి పడుతుంటే ,తీరాన పాతేసిన పాత శిల్పంలా వేణు.
“వేణూ ! నీకేమనిపిస్తుంది ? ఈ క్షణంలో ఇప్పుడు ?”
“లాంచీ తొందరగా వచ్చినట్టనిపిస్తుంది!”
“నాకూ అంతే ”
లాంచీలో ఏమీ మాట్లాడుకోలేదు.వేణు భుజం మీద తలవాల్చింది.
గుసగుసగా హేమ స్వరం”ఎంత హాయిగా ఉందో తెలుసా ?”
ఊపిరి స్పర్శ చెక్కిలికి దగ్గరగా ..చివరి సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి ఇద్దరి మొహాల మీద .ఆవలి ఒడ్డు వచ్చేసింది.ఇద్దరినీ చూసి అందరూ షరా మామూలే.నవ్వుకొన్నారు. బాగా ఏడిపించారు.

5.

చల్లగాలి లోపలికి కొడుతోంది.కిటికీలు మూసేసరికి వెచ్చగా తయారైంది.ఎవరిదో గురక .వికృత శబ్దం చేస్తుంది ఫాను.దాన్ని ఆపేశాడు.రైలు లయబద్దంగా వెళుతున్నట్టనిపించింది.ఇంతకీ హేమ తనకిచ్చిన పాకేజ్‌తెరవనే లేదు ! ఆత్రంగా తెరచి చూశాడు.
“Alice in the Wonderland!” తనకిష్టమని చెప్పినట్టు గుర్తు.
ఆసక్తిగా పేజీలు తిప్పాడు.చాలా బొమ్మలు ఉన్నాయి !మడిచి పెట్టిన కాగితం పుస్తకం నించి జారి పడింది.హేమ చేతిరాత !
ఒక్క ఉదుటున చదివాడు వేణు.

” వేణూ ! ఆశ్చర్యంగా ఉందా ? నీకిలా రాయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.భరోసా లేని ప్రయాణం నేను చేయలేను. కొంచెం నా వైపు నుంచి ఆలోచించు నీ సందేహాలు తీరిపోతాయి. కనీసం ఒక్కసారైనా ‘నీవు నా ప్రాణం !నీవు నాకు కావాలి’ అని అంటావేమోనని ఎదురుచూశాను.నాలుగేళ్ళ కాలం తక్కువ అనిమాత్రం నేను అనుకోను.నిన్ను నిందించి ప్రయోజనం లేదు.నవంబర్లో నా పెళ్ళి ”

చాలా వేగంగా రాసినట్టుంది.రైలు మళ్ళీ వంతెన దాటుతోంది.పెద్ద చప్పుడు.నిద్రలో నుండీ ఒకరిద్దరు లేచి కళ్ళు చికిలించుకొని చూసి మళ్ళీ పడుకుండి పోయారు.ఉత్తరం ముడిచి పుస్తకంలో పెట్టాడు.పుస్తకంలో Alice బొమ్మ చాలా అమాయకంగా ఉంది,హేమ పోలికలు కనిపించాయి.తను Alice కన్నా పెద్ద wonderland లో కూరుకుపోతున్నట్టనిపించింది వేణుకి ఆ క్షణాన.

6.

మాగన్ను నిద్ర..ఏదో కల..కలలో ఎత్తిపోతల ఎప్పటిలాగే.కానీ హేమ లేదు.తనొక్కడేఉన్నట్టుండి జలపాతం కుంకుమ రంగులోకి మారిపోయింది.లాంచీ తనని వదిలేసి వెళ్ళిపోయింది.మ్యూజియం శిల్పాల్లో తను మునిగిపోయాడు.తను పరిగెత్తుకు బయటికి వెళితే అక్కడా హేమ లేదు.పూలు వాడు మొహం పట్టాయి.సూర్యుడు ఎప్పుడో అస్తమించాడు.బండరాళ్ళను తడుతూకృష్ణ ఊగిపోతోంది బుద్ధవిగ్రహం తనను చూసి నవ్వుతున్నట్టనిపించింది.దడాలున మ్యూజియం తలుపులు మూసుకొన్నాయి.చుట్టూ నది..పైన ఏవో తారలు వర్షం మొదలైంది.ఉద్ధృతంగా మారిపోయింది కృష్ణ.

తను తడిచి పోతున్నాడు ..ఎక్కడో దూరంగా దూరంగా ఒక లాంచీ వెలుతురు.అది అటూ ఇటూ తడబడి కనిపించడం మానేసింది.నిద్రలో అటూ ఇటూ కదిలాడు.కళ్ళు తెరచి చూశాడు.వేలాడుతున్న వాటర్‌బాటిల్‌తెరచి ,సగం ఖాళీ చేసి..గాఢ నిద్రలోకి జారుకొన్నాడు.

7.

లేచి చూసే సరికి మరాఠీ ఆలుమగలు పరాచికాలాడుకొంటున్నారు. ఈ సారి ఇద్దరూ తన వైపు నవ్వుతూ చూశారు.”నిద్రలో ఏమీ కలవరించ లేదు కదా” అనుమానం కలిగింది వేణుకు.ఆమె చేతులకు రాళ్ళగాజులు తన చెల్లి కూడా ఒకసారి ఏడ్చి పట్టుబట్టి తెప్పించుకొంది నాన్నతో. ఎప్పుడూ తెల్ల దుస్తుల్లో పావురంలా కనిపిస్తుంది.నాన్న పేపర్‌ముందేసుకొని ;అమ్మ చపాతీ పిండి తడుపుతూ ;గోరింటాకు ఎర్రగా పండిందని నిద్ర లేవగానే చూసుకొని మురిసిపోయే చెల్లి..చిరునవ్వు అలవోకగా మెరిసి మాయమైపోయింది.చీకటిలాగే దిగులు పటాపంచలైపోయినట్లనిపించింది. నదిలో నీళ్ళు లేవు.ఇసుకే ఇసుక.బిగ్గరగా చప్పుడు చేస్తూ వంతెన దాటుతోంది రైలు.ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా కనిపించాడు. “Alice in the Wonderland” ని బలంగా విసిరేశాడు.ఎక్కడో రెల్లు పొదల్లో పడిపోయినట్టుంది.ఆ వైపు చూడలేదు.మనసు కొంత కుదుట పడినట్లనిపించింది.

8.

రెండు నెలలు ఇట్టే గడిచి పోయాయి.ఇంటిపట్టునే విశ్రాంతిగా ఉండి వళ్ళు చేశాడు కూడా.మేడ మీద కూచుని రంగులు మార్చే కొండల్ని చూస్తాడు. బలంగా వీచే గాలి మొహాన్ని తడుముతుంటే ఆనంద పడతాడు.ఈ నాలుగేళ్ళు తను చిన్న చిన్న సుఖాలకు ఎలా దూరమయింది బాగా అనుభవం లోకి వచ్చింది వేణుకు. విసుగనిపిస్తే చెల్లితో కలిసి పొద్దుతిరుగుడు పొలాల దాకా వాకింగ్‌వెళ్ళి వస్తాడు.ఒకేకన్నుతో తీక్ష్ణంగా చూసే పొద్దుతిరుగుడు పూవులను తదేకంగా చూసి మురిసిపోతాడు. ఏదో మధ్యాన్నం వేపకొమ్మ వింతచప్పుడు చేసినప్పుడు ,కిటికీలో గుండా ఎండ తన వింతనీడను గోడమీద వేసినప్పుడు గాలానికి చిక్కిన ఎరలా గిలగిల లాడి పోతాడు.హేమ నవ్వు..దోబూచులాడుతూ..కాంటీన్‌దగ్గర అల్లరిగా తన పర్సు తీసిన జ్ఞాపకం.ఏదో పాత సినిమాకు వెళితే తనూ అదే సినిమాకు వచ్చి చేర బిలిచిన జ్ఞాపకం…పరీక్షహాల్లో సూటిగా తన దగ్గరికే వచ్చి పలుకరించి నవ్విన జ్ఞాపకం !!
జ్ఞాపకాలన్నీ కలగలిసిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతాడు.
ఒకరోజు మధ్యాన్నం రెండు టెలిగ్రాములు వచ్చాయి.ఒకటి resultsవచ్చాయి, తను పాసయ్యాడని;రెండవది ..హేమ నుండి start immediately అని.

9.

హేమ వారింటి ముందు పెద్ద షామియానా వేశారు.అలజడిగా ఉంది. చాలా మంది జనాలు గుమికూడి ఉన్నారు.హేమ వాళ్ళ నాన్న మరణించారు.కారణం ఇదమిత్థమని తెలియదు.వంట్లో నలతగా ఉందని పడుకొన్నారట.మరి లేవలేదు.హేమ అన్నయ్య ఆస్ట్రేలియాలో చదువుకొంటున్నాడు.అతనికోసం పడిగాపులు.

హేమ వేణుని చూడగానే భోరుమంది.వేణు ఓదార్చాడు.తన కోరికమీద ఒక పది రోజులు అక్కడే వుండటానికి నిశ్చయించుకొన్నాడు.వేణుకు చూచాయగా గుర్తు హేమ వాళ్ళ నాన్న.హేమకు ఆయన దగ్గర చనువు ఎక్కువ లాగుంది.అదిగాక,హేమ పుట్టగానే తల్లిని పోగొట్టుకొంది. ఉన్న పెద్ద దిక్కు నాన్నే.వారం తిరక్కుండానే హేమ అన్నయ్య ఆస్ట్రేలియా తిరుగుప్రయాణం కట్టాడు.ఇంట్లో ఎప్పటిలాగే చుట్టాలావిడ వంటా వార్పూ చూసుకొంటోంది.
హేమ నాన్నను తలచుకొని దిగులు పడని క్షణం లేదు.మధూకు కొంత అయోమయంగానే ఉంది.తనను ఈ స్థితిలో వదిలి వెళ్ళడానికి మనస్కరించడం లేదు.హేమకు గాలిమార్పు అవసరమనిపించింది;హేమ కు అదే విషయం చెబితే ఉత్సాహం కనబరిచింది.ఇద్దరికి టికెట్లు బుక్‌చేశాడు. ఆస్ట్రేలియా నుండి వాళ్ళన్నయ్య కాల్‌చేసి జాగ్రత్తలు చెప్పాడు.

10.

రైలు ఎప్పటిలాగే అలవాటైన పట్టాలమీద.చీకటి కమ్ముకొస్తోంది.
రైలు కూత..ఏదో మలుపు..ముందు పెట్టెలు కనిపిస్తున్నాయి.
హేమ వేణు భుజం మీద తల వాల్చి కొంచెం దిగులుగా అడిగింది.
నా Alice in the Wonderland చదివావా?
వేణు తికమక పడ్డాడు.”లేదు” అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
“తెరవనే లేదా” రెట్టించింది
“విసిరేశాను” వేణు కంఠంలో నిజాయితీ.
గిరుక్కున హేమ కంట నీరు.చేష్టలుడిగి తల వంచుకొంది.
“హేమా ఇటు చూడు ” దగ్గరికి తీసుకోబోయాడు.
విసురుగా విదిలించి కొట్టింది.
వేణు అనునయంగా చెప్పాడు “నీ ఉత్తరం చదివాను” .
తన మొహం వెలిగిపోయింది.మందహాసరేఖ.
సాలోచనగా వేణు వంక చూసింది.ఒక్క క్షణం మళ్ళీ ఎక్కడో నిరాశ ..దిగులు..
“నీవు నాకు ప్రాణమని ,నేను చెబితేగాని తెలుసుకోలేవా?”
దెబ్బ తిన్నట్టు చూసింది.కన్నీరు జల జలా రాలింది.
తడిచిన బుగ్గ మీద ,మెడ మీద మృదువుగా చుంబించాడు. వేణు వడిలో తలపెట్టుకొని పడుకొంది..చలిగాలి..కిటికీలు వేశాడు ..లోన వెచ్చగా ..హేమ నిద్రలోకి జారుకొంది.. రైలు కిటికీలను గాలి తడుముతోంది.బయట పూర్తిగా చీకటి. ఏదో లైటు కాంతిలో తృటికాలం వెలిగి స్పష్టంగా కనిపించింది హేమ మొహం.తమకంతో వేణు ముద్దాడబోతుంటే ,తన వైపుకు లాక్కుంది హేమబలంగా!!రైలు రాత్రిలో కలిసిపోయింది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...