ఆకురాలుకాలం మహెజబీన్‌ కవిత్వం ఒక విమర్శ

(జనవరి 2002 సంచిక లో వచ్చిన “కవిత్వ మీమాంస” అనే వ్యాసానికి ఇది కొనసాగింపు లాటిది. అక్కడ కవిత్వం గురించిన విశాలమైన చర్చ జరిగింది. ఏ గుణాలు కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని నిర్ణయిస్తాయో అక్కడ విపులంగా మాట్లాడాం. ఇప్పుడు ఆ గుణాల ఆధారంతో ఒక కవితాసంకలాన్ని పరిశీలించి చూద్దాం. కనుక ఏ ఆధారాలతో ఓ కవిత బాగుందనో లేక బాగాలేదనో ఇక్కడ అంటున్నామో సరిగా తెలియాలంటే ఆ వ్యాసాన్ని మళ్ళీ ఒకసారి చూడడం ఉపయోగిస్తుంది.)

మహెజబీన్‌ గతశతాబ్ది చివరిదశకంలో గొంతువిప్పిన కవయిత్రి. సమకాలీన కవుల ,విమర్శకుల మన్నన పొందినవారిలో అగ్రగణ్య. ఆకురాలు కాలంలో ఇరవై ఆరు కవితలు వున్నాయి. “A lyrical beauty” అని శివారెడ్డి గారి ముందుమాట. “ఈ దశాబ్దపు మరో వాగ్దానం జబీన్‌ ” అని పుస్తకం చివరన చే.రా. గారి ఉవాచ.

మహెజబీన్‌ కవిత్వం రెండుపాయలు గా చీలుతుంది. ఒకపాయ స్త్రీ వాద దృక్పథంతో రాసిన కవిత్వం. మరొకటి విప్లవ స్వానుభూతితో కరిగి రాసిన కవిత్వం. స్త్రీవాద దృక్పథంతో రాసినవి కొన్ని తేలిపోగా, మరికొన్ని పేలవంగా మిగిలి పోగా, సాంద్రమైన అనుభూతితో విప్లవ స్వానుభూతితో రాసిన కవితలు మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తాయి “అతని సమక్షంలో”, “జావళి”, “జ్ఞాపకం”, “ఎలిజీ”, “ఆకురాలు కాలం”, “నైసర్గిక స్వరూపం”.

“అతని సమక్షంలో” రెండు dimensions గల కవిత.

“సరిగ్గా అప్పుడే
కవిత్వీకరిస్తున్న క్షణాల్లో
అతను ముద్దు పెట్టుకొంటాడు.

అతని అడుగుల సవ్వడిలో
ఛందస్సు వెదుక్కొంటూ
నేను అలవోకగా కళ్ళు మూసుకొంటాను ”

The Double Flame – Love and Erotism అన్న గ్రంథం లో ఆక్టావియో పాజ్‌ (పాజ్‌ గురించిన కొన్ని వివరాలు ఈ వ్యాసం చివర్లో వున్నాయి)

“the relationship between erotism and poetry is such that it can be said without any affectation ,that the former is a poetry of body and the latter an erotism of language..”

కవిత్వానికి,శృంగారానికి సంబంధం వుందంటాడు పాజ్‌. ఇంకా కొంచెం ముందుకు పోయి శారీరక కవిత్వమే శృంగారము, భాషాగత శృంగారమే కవిత్వము అని వక్కాణిస్తాడు. తికమక ఏమీ లేదు రెండింటికీ కల్పన ప్రాణం. కలయిక అవసరం. ప్రగాఢమూ, నిగూఢమూ అయిన అనుభవ తీవ్రతతో భాషాదేహాలు, కొన్ని ప్రత్యేక క్షణాల్లో ఆనందశిఖరాల్లో విహరించేలా చేస్తాయి.

” అక్షరాలను వదిలి కవిత్వం
మమ్మల్ని పెనవేసుకొంటుంది ” అన్నప్పుడు వ్యక్తమయే భావమిదే.
కవిత్వానికి ,శృంగారానికి అభేదం చెప్పిన సున్నితమైన కవిత ! ఇతర కవితల్లో లేని కాల్పనికత ఇందులో ప్రశస్తంగా కనిపిస్తుంది.

జావళి లో పదచిత్రం (imagery) వర్ణోజ్వలం,కాంతిమంతం ! కానీ కవితారంభంలోని మూడు వాక్యాల్లో ప్రొసాయిక్‌ భావం పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతుంది.

చలినెగళ్ళ మధ్య రగులుకొన్న విరహగీతం
జీవితాన్ని వెనక్కి రప్పించే
వ్యర్థ ప్రయత్నం చేస్తుంది

దేహం అట్టడగుపొరల్లో
అనుభవాల నిక్షేపాల మధ్య
కదలాడే జ్ఞాపకానివి నువ్వు
శరీరారణ్యంలో వికసించిన
తొలి గుల్‌ మొహర్‌ సుమానివి నువ్వు

flame of the forest
దానిమీద పరచుకొన్న వెన్నెల
కోనిఫర్‌ వృక్షాల నీడలు
అన్నీ అలానే వున్నాయి
నీవు మాత్రం లేవు.

భాషకు చెర విడిపించడమే కవిత్వం చేయగల పని కాబట్టి వచనఛాయలు చెంతచేరకుండా జాగ్రత్త పడాలి.

తొలిపొద్దు చీకట్లో మొదలయ్యి “జ్ఞాపకం” తీయగా, అలవాటుగా సందిగ్ధంగా, అతనులేక చేదుగా, అయినా ఆత్మవిశ్వాసంగా తొలిసంధ్యకాంతిలో ముగుస్తూ జ్ఞాపక పరిణామాన్ని చాలా బలంగా వ్యక్తీకరిస్తుంది. ఎక్కడా తడబాటు , తప్పటడుగు లేకుండా సూటిగా తాకే కవిత. ఒక శకలం మచ్చుకు

“తొలిఝాము వెలుతురులో
కోడిపాడే ప్రభాత గీతాన్ని వింటూ
మనం ఊపిరితో చలికాచుకొన్న జ్ఞాపకం.”

ఇందులో, పదచిత్రాలు వైరుధ్యాలు లేకుండా కలగలిసిపోయి ఒక వాతావరణాన్ని, గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది.

స్నేహితుడు త్రిపురనేని శ్రీనివాస్‌ మరణించినపుడు నిస్సహాయతలోంచి ఉబికిన కవిత ఎలిజీ సారళ్యంతో గుండెను చుట్టుకొంటుంది, “రేపు ఫోన్‌ చేస్తానన్న మాట అబద్ధమేనా” అని జాలిగా ప్రశ్నిస్తూ.

ఆకురాలుకాలం టైటిల్‌ కవిత మొదటి సగం అద్భుతంగా వుంటుంది.

అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంటతెస్తాడు.
ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళలో
ఆకాశచిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది.

వద్దు..
నాకు వెన్నెలా వద్దు ,పున్నమీ వద్దు
సూర్యుడొక్కడే చాలు

అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ

కింద ఇచ్చిన రెండవసగంలో దృశ్యం పలుచ బడుతుంది. బాల్యం తిరిగి ప్రవహించడం, శరీరం అనుభవాల పాఠశాల కావడం, అంత concrete expressions కాకపోవడమే దీనికి కారణం. ఉజ్వలమైన ఆరంభాన్ని కవిత మధ్యలో సాదా వాక్యాలు దెబ్బ తీశాయి.

అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పక్షుల పాటల్ని వెంట తెస్తాడు.

అతని సమక్షంలో
పోగొట్టుకొన్న నా బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెలో దాక్కుని పడుకొంటాను
ఝాము రాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీర నాదాల్ని తూటాలు వేటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా నా గుండెలో దాచుకొంటాను

అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్థాంతరంగా వచ్చిన
ఆకురాలే కాలానికి ఎక్కడ రాలి పడ్డాడో!

” నైసర్గిక స్వరూపం ” మంచి ఎత్తుగడతో మొదలౌతుంది. మొదటి పదివాక్యాలు మంత్రించి వేస్తాయి.

కాలడం ఖాయమని తెలిశాక
ఒకే ఒక్కసారి సూర్యుణ్ణి
కౌగలించుకోవాలనుంది.

చిన్నప్పటినుండీ అంతే
నిషిద్ధంమీదే నా గురి

సరిహద్దులన్నీ చెరిపేసుకొన్నాక
ఆకాశమొక్కటే నాకు హద్దయింది.

నీలిసముద్రాల అలలపరదాలు తెరిచి
తరంగాలలో స్వేచ్ఛను
అధ్యయనం చేసాను.

పదచిత్రాలు చక్కగా కుదిరాయి.సూర్యుడి నుంచీ మొదలయి, తన స్వభావాన్ని పరిచయం చేసుకొని, ఆకాశమే హద్దని తేల్చి , సముద్రతరగల తత్వాన్ని తెలుసుకొని

“ప్రవాహానికి ఎదురెళ్ళి
సాగర సరిహద్దుల్లో జరిగే కెరటాల
యుద్ధంతో చేతులు కలిపాను ”

అనడంలో పై పదచిత్రాలతో పొత్తు కుదరడంలేదు. అందునా సాగర సరిహద్దులనడం కూడా బాగాలేదు. ఏది ఏమైనా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసిన కవిత ఇది.

ఇకపోతే ఇంకో పార్శ్వం
” ఏరకుమీ కసుగాయలు ” అన్నాడు సుమతి శతకకారుడు. కానీ ఏరవలసిన అగత్యం వుంది ఈ ఆకురాలుకాలంలో!

శివారెడ్డి గారి ముందుమాట A lyrical beauty నుండి మొదలెడదాం మన విమర్శ. మరోచోట ఆయనే విశదీకరించారు. “ఆమె కవిత్వం లో ఒక ఆప్తత ఉంది. అనుభవసాంద్రత ఉంది. ఆత్మీయ వ్యక్తీకరణ ఉంది ఒక lyrical touch – ఒక రూపశ్రద్ధ ఉంది.” ఈ మాత్రం చాలు !! lyric ను మూలార్థంలోనే ప్రయోగించారాయన; రూపశ్రద్ధ అనడంలో అది స్పష్టమవుతోంది.దాని కంటే ముందు “జబీన్‌ లో కనిపించే ముఖ్య లక్షణం ఒక lyrical voice – quite lyrical voice” అని వాక్రుచ్చి రష్యన్‌ కవయిత్రి అన్నా అఖ్మతోవా తో పోలుస్తారు. దానితో తప్పవలసిన తోవా తప్పారు.

గతంలో ఐరోపా ,అమెరికాల్లో తీవ్రమైన భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడించిన కవులను lyric poets అన్నారు. dramatic poetry, epic poetry లకు భిన్నంగా ఉన్న సదరు కవిత్వాన్ని lyric poetry అన్నారు. ఇది మన భావకవిత్వానికి ఖచ్చితంగా సరిపోతుంది శిల్ప రీత్యా కాలరీత్యా. కృష్ణశాస్త్రిని మించిన lyric poet మన తెలుగులో ఆ రోజుల్లో ఎవరూ లేరు. కీట్స్‌ ,షెల్లీ తదితర రొమాంటిక్‌ కవులు,రిల్కే లాంటి ప్రతిభావంతులు, ఎమిలీ డికిన్సన్‌, ఎడ్నా మిల్లే లాంటి అమెరికన్‌ కవయిత్రులు తమ odes, sonnets తో ఆ సంప్రదాయాన్ని పరిపుష్టం చేశారు. మన శ్రీ శ్రీ “నీ గళ గళన్మంగళ కళాకాహళ హళాహళి లో కలిసిపోతిని” అని ప్రస్తుతించిన స్విన్‌ బర్న్‌ ప్రభావానికి లోనయిన కవయిత్రి ఎడ్నా అంటే తన భాషా నైశిత్యాన్ని అంచనా వేయవచ్చు.

అన్నా అఖ్మతోవాది పూర్తిగా భిన్నమైన తోవ.ప్రపంచంలో సింబాలిస్ట్‌ ల గూఢతా,క్లిష్టతలకు వ్యతిరేకంగా 20 వ శతాబ్ది మొదట్లో వచ్చిన ఉద్యమాలు రెండు.రష్యాలో గుమిలేవ్‌ ఆరంభించిన చరమ వాదం (acmeism) (అక్కడి అణచివేత విధానాల వల్ల చాలాకాలం బాహ్య ప్రపంచానికి దీని పుట్టుపూర్వోత్తరాలు తెలిసిరాలేదు), బహుళ ప్రాచుర్యం పొందిన శిల్పకవిత్వం (imagism). ఎజ్రా పౌండ్‌ ,కార్లోస్‌ విలియమ్స్‌ తదితరులు దీన్ని విశ్వవ్యాప్తం చేశారు. పై రెండింటికి ప్రధాన సామ్యం “మూర్త పదచిత్రాలు” (concrete imagery) లో వుంది. అంటే కవిత్వం మూర్తిమంతంగా వుండాలి!! అయితే ఒక చిన్న వ్యత్యాసం కూడా వుంది. పదచిత్రవాదులు తమ కవితల్లో వ్యావహారిక రీతిని మన్నించారు. తమ కవిత్వానికి సరితూగే సొంతనడకను కూర్చుకొన్నారు. చరమ వాదులు తద్భిన్నంగా సంప్రదాయాన్నే ఆశ్రయించారు. ఛందోనియమాలను వదలలేదు. అందునా అఖ్మతోవా కవితలు చాలా క్లుప్తంగా,ఛందోబద్ధంగా శబ్దగుణాలతో అలరారుతుంటాయి.

ఇంత చర్చ ఎందుకు చేయవలసి వచ్చిందంటే నేటికాలపు తెలుగు కవులకు లేనిదే రూపశ్రద్ధ. దానికి మహెజబీన్‌ మినహాయింపు కాదు. రూపశ్రద్ధ కవిత్వ అవగాహనకు భిన్నమైనది కాదు. దాని లోనిదే. కాబట్టి స్థూలంగా మన కవులకు కవిత్వావగాహన లేదని సారాంశం. ఒక వేళ వున్నా అది గాఢమూ, గహనమైనది కాదు.

పూర్వం చెప్పినట్టు శిల్పకవిత్వ, చరమవాద సాహిత్యకారులు, సింబాలిస్టులకు భిన్నంగా కవిత్వంలో స్పష్టత కోసం తీవ్రంగా పరితపించారు. దానికి సాధనం మూర్త పదచిత్రాలుగా గుర్తించారు. అమూర్తభావాలను తీసి గట్టుమీద పెట్టారు. సకలేంద్రియాలతో మనం అనుభవించే లోకం అవిరళంగా ప్రవహించే కాంతీ , సూర్యచంద్రులు , వేడీ వెన్నెలా , తరంగితమయ్యే సముద్రం , నీలాకాశం , బలంగా తాకే గాలి కవిత్వంలోకి ప్రవేశపెట్టారు. పదచిత్రాలను అర్థసంపన్నం చేశారు. అంతేకాదు, వాటికి అర్థబాహుళ్యాన్ని సంతరించి పెట్టారు. అంటే అనుభవాన్ని అనుభవంగా అందించడానికి సరైన రంగం సిద్ధం చేశారన్నమాట. ఈ ప్రాతిపదికన సహజంగా లోతైన అనుభవాన్ని అనుభవంగా అందించేదే గొప్పకవిత.

సకలవర్ణ సమ్మేళనాన్ని సాధించగలిగిన వాడు చిత్రకారుడు. అనంత ప్రకృతి పద్ధతిగా, ఒద్దికగా ఒదుగుతుంది అతని కాన్వాసు మీద. కవి కూడా మెలకువ గల చిత్రకారుడిగా రూపెత్తి, పదచిత్రాలతో ప్రదర్శిస్తున్నాడు తన అంతరంగం లోతులను, అగాధానుభవాలను.

అనంత వర్ణాలలో చిత్రకారుడు ఎంచుకొనే రంగులు కొన్నే. అలాగే కవికూడా పదాలను పొదుపుగా సంగ్రహిస్తాడు. అనవసర పదం వచ్చిపడిందంటే , రావలసిన రంగు రానట్టే. ఎక్కువ పదాలు పడ్డాయంటే రంగు వలికిందే. చాలా సంయమనం, లాఘవం అవసరం; కవిత్వం లో మరీనూ కారణం అది అన్నిటికన్నా లలితమైన కళ కావడమే. చూసేకొద్దీ కొత్త కోణాలు వ్యక్తమయ్యే చిత్రంలా, తరచి చూసేకొద్దీ కొత్త లోతులు అనుభవం లోకి రావాలి. అదీ గొప్ప కవిత్వం!!

విడిపోయే క్షణాల్లో ప్రియురాలి చూపులో వ్యక్తమయ్యే అనేక భావాలు, మరణశయ్య మీద మాతృమూర్తి ఎదలో తిరుగాడే ఆవర్తాలు, కాందిశీకుని మనోకాననంలో నిలిచిన ఊహలు.. అన్నీ వ్యక్తం కావాలి. గొప్ప కవిత్వానికి ఒకటి కన్నా ఎక్కువ dimensions వుండటం సహజమే.

ఏ జర్నలిస్టయినా రాయగల కవితలు ఇందులో ఒక ఏడున్నాయి. లోయ,మేఘం రాల్చని వాన, నవస్మృతి, సరిహద్దు రేఖలు, స్ట్రీట్‌ చిల్డ్రెన్‌, డాటర్స్‌ కింగ్‌ డమ్‌,ఆధునిక సామాజిక సిద్ధాంతం.

కవిత్వం, అలవాటైన వార్తా పత్రిక కథనానికి ఆమడ కాదు సహస్రయోజనాలు, దూరం. నిపుణమతి ఐన కవి ఏ వస్తువుని పడితే ఆ వస్తువుని తాకడు. కారణం పేలవమైన వచనమై తేలిపోయే ప్రమాదం అడుగడుగునా పొంచి వుంది కనుక. కొండప్రాంతాల్లో ఉన్న చిత్రకారుడు, తను చూడని సముద్రాన్ని చిత్రించలేడు. ఒకవేళ చిత్రించాలని బయల్దేరినా ఆ వ్యవసాయం వికటిస్తుంది.. రంగులూ ,కాన్వాసు వ్యర్థమవుతాయి ! మధ్యాన్నం ఉబుసుపోక ఏ కాస్త సాహిత్యస్పర్శ గల గృహిణైనా రాయగల కవితలు ఖిల్వత్‌ ,అజ్నబీ. ఇవికాక ఫర్వాలేదనిపించే కవితలు మరో నాలుగు. ఒక పచ్చని జీవితం ,బతికినగోడలు, సన్నిహిత సంబంధం, ముందుజాగ్రత్త చర్య. ఎక్కువపదాలను వాడేసుకొని నీరసించిన కవిత అమ్మకళ్ళు. జీరో అవర్‌, చిన్నతల్లి, ఛాయాచిత్రం కవితల్లో కొన్ని కవిత్వస్ఫురణ కలిగించే వాక్యాలు వున్నాయి. కత్తిరించడం (pruning)మొక్కలకే కాదు కవితలకు కూడా చాలా అవసరం. ఎవరో పాత కవి చెప్పినట్లు,నాకు గుర్తున్న మేరకు

” hundred times consider what you say
sometimes add but often take away ..”

అనురాగ స్మృతి, చీకట్లోంచి వెలుతురులోకి, స్పర్శ, కొంత pruning, పునరాలోచన అవసరమైన కవితలు. కవయిత్రి ఇంకా వాటి మీద దృష్టి నిలపవలసి వుంది.
స్పర్శ లో కవిత్వ స్ఫురణ వున్న భాగం మచ్చుకు.

ఆకాశం అమృతగింజల్ని
రాల్చుతున్న ఆ చలిరాత్రి
నిన్ను నేను కప్పుకొని పడుకున్నాను
ద్రవీభవిస్తున్న యవ్వనం
పరవశత్వాన్ని కానుకిచ్చింది
వేగుచుక్కల జావళిగీతం
తొలకరిపగటిని మోసుకొచ్చింది
నేస్తం శతాబ్దాల కొత్తది మన స్పర్శ.

అమృతగింజల్ని అనడం ఎబ్బెట్టుగా వుంది. భాషాసౌష్ఠవం లోపించింది. అమృతాక్షతలను అనవచ్చు, కొంచెం నయం. అలాగే పరవశత్వం. పారవశ్యం, లేదా పరవశం అని వాడవచ్చు. తొలకరి పగటిని కొరుకుడు పడదు. centuries old ఫాయా లోని పదబంధం “శతాబ్దాల కొత్తది” పొసగలేదు. ఇదేకవితలో ఇంకొక చోట నిశ్చలనచిత్రం అని వుంది, నిశ్చలచిత్రం సరిపోతుంది.

ఆకురాలు కాలం లోని కవిత్వాన్ని lyric poetry అనడం, అన్నా అఖ్మతోవా తో పోల్చడం తప్పన్నది ఇందుకే. “భావ ప్రవృత్తి” (lyrical temperament) వున్న వారు ఇన్ని తప్పులు చేయరు. భాషాపరంగా చాలా మెలకువతో వ్యవహరిస్తారు. భాషాసౌష్ఠవాన్ని, భావగీతాన్ని(lyric) రెండింటినీ విడదీసి చూడలేము. కవన్న వాడికి భాషమీద పట్టు చాలా అవసరం. కారణం అది వాడి పనిముట్టు. ఇక అఖ్మతోవా విషయాని కొస్తే ఆమె చాలా పొదుపరి. ఒక పదాన్ని కాదు కదా ఒక అక్షరాన్ని కూడా వృధా చేయదు. అంతేకాక అవి మననానికి ఉద్దేశించినవి, రష్యన్‌ కవులు కాగితం మీద పెన్ను పెట్టినా ప్రమాదంలో ఇరుక్కొనే రోజులవి. ఆ పరిస్థితులకు తగ్గట్టు అఖ్మతోవా పద్యాలు గొప్ప శబ్ద సౌందర్యంతో, అంతకు మించి అనితరసాధ్యమైన సంయమనంతో అలరారుతుండేవి. వస్తువు ఎంపికలో తప్పులు చేసేంత స్థాయి కాదు ఆమెది.

శ్రీశ్రీతో మొదలై మనం ఛందోబందోబస్తులన్నీ తెంచేశాం ! దాని వల్ల మంచే జరిగింది. కానీ చెప్పుకోదగినంత చెడు కూడా. ” అక్షర క్రమం రాగానే మన వాళ్ళు కవులైపోయే కాలం వచ్చింది” (ఇస్మాయిల్‌ ). ఠాగోర్‌ తనని చూడ వచ్చిన వారికి పదే పదే చెప్పేవాడు కొన్ని పుస్తకాలు భాష కోసం ,కొన్ని పుస్తకాలు భావం కోసం చదువుతాం, తేడా తెలిసి మెసలండి అని!! ఇప్పుడు కవిత్వం ఎక్కడోగాని కానరాదు. పాండిత్యం ఊసు లేదు. సున్నకు సున్న, హల్లి కి హల్లి. సరిపోయింది.
ఇక జాలింతును!!
*********************************
The Double Flame- Love and Erotism -Octavio paz

Octavio paz

పేరు ప్రఖ్యాతులు గాంచిన కవి,విమర్శకుడు.మెక్సికో రాయబారి గా ఇండియా తో పాటు పలుదేశాల్లో నివసించాడు.బహుగ్రంథ రచయిత. 20 వ శతాబ్ది కవిత్వ చింతనను ప్రభావితం చేసిన అతికొద్ది మంది కవుల్లో ఇతను ముఖ్యుడు.నోబెల్‌ గ్రహీత.ఇతని కవిత్వానికి తెలుగు అనువాదాలు చాలా వచ్చాయి.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...