హైకూలు

అరుస్తోంది కొండల్లో
తప్పిపోయింది
మేకపిల్ల

పొద్దు గుంకింది
తల్లి రెక్కల్లో పిల్ల
ఎంత ఆనందం

కొలనులో చేపలు
కాలు మోపానో లేదో
ముద్దాడుతాయి

ఈతకొడుతుంటే
దూకింది నీటిపాము
ఎవరికి భయం ?

చొరబడ్డ కిరణం

నీటి అడుగున చేప
వెలిగిపోతున్నాయి

దాటుతున్నంతసేపు
కాళ్లకింది ఇసుకను
పెళ్లగిస్తుంది ఏరు

రేగుపళ్లు చప్పరిస్తుంటే
ముల్లుల బాధ
తెలిసేది కాదు

గుత్తులుగుత్తులుగా
మగ్గిన మేడిపళ్ళు
కోసుకోమంటోంది చెట్టు

నీడ

ఉదయమధ్యాహ్నాలు
వెన్నుదాకే ఉన్నా
నిన్ను మించుతాను
ఎదిగిసాయంత్రం

ఆనవాలు పట్టలేవు
ఆనక వెంబడిస్తున్నా
చీకట్లో కలిసిన మరుక్షణం
ఆకారం కోల్పోతామిద్దరం
సోఫా

నిలువలేక
కూలబడకు
స్థిరంగా ఉండు
మరణించే దాకా

మెత్తగా ఉన్నానని
చిత్తం వచ్చినట్టు చేయకు
నేలమీద కాళ్ళుంటే
చాలా మంచిది

లాంపు

వేడెక్కిన శరీరాన్ని
వాడిచూపులతో
ఏదో తడుముతావు
నీదేనని భ్రమించి

ఆరిపోయి ప్రతిరాత్రి
జారిపోతాను చీకట్లో
చల్లబడ్డాక గానీ
వళ్ళెలావుందో తెలియదు

తలుపు

బలంగా లాగి
తాళం వేశాక
వేసారి పోతాను
విసుక్కాదా మరి

ఓరగా తెరవగానే
గాలిచేతులతో
అలవోకగా చుట్టి
మేర మీరతాను.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...