తోడు: యుజీనియొ మొంటాలే

[యుజీనియొ మొంటాలే  (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. పత్రికా రంగం లో కళావిమర్శకుడిగా గణుతికెక్కాడు. ఇటాలియన్‌  భాషకు ఎన్నో హంగులు చేకూర్చాడు. ఇతని కవితల్లో వ్యంగ్యం ( irony ) అంతర్‌ గర్భితంగా ఉంటుంది. అంత తేలికగా అర్థమయ్యే కవి కాడితడు. 1920-30 ల్లో ఇటలీ లో వచ్చిన ఫాసిస్టు వ్యతిరేక కవితా ఉద్యమమైన hermetic movement  లో చురుగ్గా పాల్గొన్నాడు. hermetism  ను poetry of absence  (అభావ కవిత్వం) గా పిలుస్తారు. అభావ కవిత్వం లో స్వగతం ప్రధాన పనిముట్టు. తన భార్య చనిపోయిన తర్వాత మొంటాలే వేదనతో రాసిన SATURA  లోనివి ఈ కవితలు. ఇందులో అభావ కవిత్వపు ఛాయలు మెండుగా కనిపిస్తాయి. SATURA  కు నానార్థాలు చాలా వున్నాయి, ఒక కలగలుపు అని చెప్పుకోవచ్చు. నానుడి, గీతం, జ్ఞాపకం, వ్యాఖ్య, స్వప్నపద్ధతి అన్నీ నిగూఢంగా కలిసిపోయాయి అని విమర్శకులు భావిస్తారు. 1975 లో నోబెల్‌ పురస్కారం అందుకున్నాడు. సహస్ర పూర్ణ చంద్ర దర్శనం చేసుకొని, తన 85 వ ఏట తనువు చాలించాడు.]

నీచేయి నా చేతిలో, కనీసం ఒక లక్షమెట్లు దిగివచ్చాను
మరి నీవిప్పుడు లేవు, అడుగడుగునా ఆవులించే శూన్యం
మన సుదీర్ఘప్రయాణం, బహుక్లుప్తం
ఐనా, నేనింకా దారిలోనే, ఇక పై అవసరం లేదు
ఏ రిజర్వేషన్‌ కనెక్షన్‌ కపటనాటకం,
కనిపించేదే వాస్తవమనే
వారంటే ఎడతెగని అసహ్యం

లెక్కలేనన్ని మెట్లు దిగాను, నీ చేతిని పట్టుకొని
నాలుక్కళ్లు బాగా చూడగలవని కాదు
కిందిదాకా నీతో వచ్చాను, నాకు తెలుసు
ఎందుకంటే, ఎంతచీకటి కమ్మినా, అసలు కళ్లు
నీవేనని!

English Translation : William Arrowsmith

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...