ఇది “ఈమాట” మూడవ జన్మదిన సంచిక

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!

ఈ సంచిక సెప్టెంబర్‌ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల ఇప్పటిదాకా కుదర్లేదు. ఇకముందు ఇలాటి సమస్యలు రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీ జువ్వాడి రమణ గారు వారి సర్వర్‌ మీద మళ్ళీ “ఈమాట”కు నివాసం కలిగిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు.

ఇది “ఈమాట” మూడవ జన్మదిన సంచిక. ఇంతకాలం ఆదరించిన రచయిత్రు(త)లు, పాఠకులు ఇకముందు కూడ ఇతోధికంగా ఆదరిస్తారని మా ఆశ.

ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్‌ వారి పోటీల్లో గెలిచిన కవితలు-సూపర్‌ నోవా, అహం బ్రహ్మాస్మి, మెటమార్ఫసిస్‌, వ్యాసం –టెక్నాలజీ!కోవాడిస్‌ ఇస్తున్నాం. ఇందుకు ఉత్సాహంతో సహకరించిన శ్రీ చిట్టెన్‌ రాజు గారికి అభివాదాలు.

వచ్చే సంచిక నుంచి మరో కొత్త శీర్షిక ప్రవేశపెడుతున్నాం. “మనం మనం బరంపురం” అనే పేరుతో రాబోతోన్న ఈ శీర్షిక కోసం మీకెదురైన అనుభవాలను గురించిన “చిన్న చిన్నకథలు” ఆహ్వానిస్తున్నాం. ఈ చిన్న చిన్నకథలు ప్రింట్‌లో ఒక పేజీకి మించకుండా ఉండాలి. కొద్ది లైన్లైనా సరే ఓ కథనో అనుభవాన్నో చెప్పగలగటం ముఖ్యం. పెద్ద కథలు రాయటానికి సమయం దొరకని రచయిత్రు(త)లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని “ఈమాట” పాఠకులకు వారి నిర్మాణాత్మకతని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం.

“ఈమాట” కు వచ్చే అన్ని రచనల్లాగే ఇవి కూడ review చెయ్యబడతాయి. Reviewers అంచనాల ఆధారంగా ప్రచురణ నిర్ణయాలు తీసుకోబడతాయి.

తెలుగు వెబ్‌సైట్లు పండిన తాటిపండ్లలా రాలుతోన్న ఈ పరిస్థితుల్లో “ఈమాట” నిలబడ్డమే కాదు, అభివృద్ధిని సాధించటానికి కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు, లేఖ సర్వర్‌ నిర్వాహకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. “ఈమాట” కి ఎలాటి వ్యాపారదృష్టి లేదు, ఉండబోదు. కనుక ఈ మూడు వర్గాల వారు పాల్గొంటూ ప్రోత్సహిస్తున్నంత కాలం “ఈమాట”కు తిరుగుండదు. ఈ సందర్భంగా మరొక్కసారి రచయిత్రు(త)లకు తమతమ రచనావ్యాసంగాన్ని ఇంకా ఉత్సాహంతో కొనసాగిస్తూ “ఈమాట”లో ప్రచురణకు పంపవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం.