తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా?

(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్‌” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నాం. )

తెలుగువాడి జీవనాడి సినిమా పాట. దీనికి కులమత భేదాలు లేవు; ఆర్థిక, సామాజిక అంతరాలు లేవు; ఆడామగా తేడాలు లేవు. తెలుగు ముక్క రాని గాయకులు పదాల్ని చిత్రవధలు చేస్తున్నా, మాటల్లో తెలుగుదనం మచ్చుకైనా కనపడకపోయినా, ఏమాత్రం ఉద్రేకపడకుండా సినిమా పాటకి అతి పెద్దపీట వెయ్యటం తెలుగువాడి విశాలహృదయానికి తార్కాణం.

ఇలాటి తెలుగు పాట యాభై ఐదేళ్ళ పరిణామాన్ని ముచ్చటైన మూడు దృక్కోణాల నుంచి పరిశీలించటం మా లక్ష్యం. అవి సాహిత్యం, అనుభూతి కల్పనం (“మూడ్‌ క్రియేట్‌” చెయ్యటం), సంగీతం. టూకీగానే ఐనా కొంతలోతుగా ఈ విషయాల్ని చర్చించే ప్రయత్నం ఇది.

సాహిత్యం

“ఇప్పుడొస్తున్న సినిమా పాటలు ఎలా ఉంటున్నయ్‌?” అని ముప్ఫై ఏళ్ల పైబడిన వాళ్లని ఎవరినడిగినా సామాన్యంగా వినిపించే సమాధానం “మహా చెత్తగా ఉంటున్నయ్‌, అసలు వాళ్లేం పాడుతున్నారో గూడా అర్థమై చావటం లేదు” అనేది. అదే విధంగా, వాళ్లు ఆరాధించే పాతపాటల్ని ముప్ఫై లోపున్న వాళ్లకి వినిపిస్తే, “మహా బోరు బాబూ! ఇలాటి పాటల్ని అప్పటి వాళ్లు విని ఎలా భరించారో కదా!” అని జాలి పడటం కూడా మామూలే. రెహమాన్‌ సంగీతంలో వచ్చిన పాటల్ని వీళ్లు విని ఆనందిస్తుంటే, రాజేశ్వరరావు సంగీతంలో వచ్చిన పాటల్ని వాళ్లు ఆరాధిస్తుంటారు. దీనికి తరాల అంతరాలు, వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులు కారణాలా? సంగీతం విషయంలో అది నిజం కావొచ్చని ఒప్పుకోవటం తేలికే. మరి సాహిత్యం విషయంలో కూడా ఇది నిజమేనా? యాభై ఐదేళ్ల లోనే సినిమా పాటల భావజాలంలో అంతటి మార్పులు వచ్చాయా?

స్థూలంగా చూస్తే సినిమా కొత్తల్లో భక్తి, వేదాంత ధోరణి పాటలు ప్రబలంగా ఉండేవనీ, ఆ తర్వాత భావ గీతాలు అంటే ప్రకృతినీ, అమలిన శృంగార భావాల్నీ ప్రతిబింబించే పాటలు వచ్చాయనీ, ఆ తర్వాత ప్రేమనీ, ప్రేమించే వాళ్లనీ కీర్తిస్తూ, ఇంకొన్నాళ్లకి ప్రేమ స్థానంలో శృంగారం మొదట్లో “పవిత్రంగా అనిపించే” పదాల ముసుగు వేసుకునీ, ఆ తర్వాత ఆ ముసుగు తొలిగించుకునీ ప్రవేశించిందనీ, ఇక ఇప్పుడు అరమరల్లేని శృంగారాన్ని దాపరికం లేని భాషలో సినిమా పాటలు వినిపిస్తున్నాయనీ అనిపిస్తుంది.

అలాగే గ్రాంధిక భాష, సంప్రదాయ సాహిత్యంలోని కవిసమయాలు అప్పట్లో కనిపిస్తే (“ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా! ప్రియురాలికి విరహాగ్నిని పెంపుసేయరే!” అనేది ప్రబంధ భావాలకి పాట రూపమే కదా!) మెల్లమెల్లగా బజార్లో మాట్లాడుకునే భాష, వర్తమాన సమాజ ప్రతీకలు (“వలపు తేనె పాట, తొలివయసు పూలతోట, పరువాల తిన్నెల సయ్యాట” నుంచి “యమహో! నీ యమా యమా అందం, చెలరేగింది ఎడాపెడా తాపం, పోజుల్లో నేను యముడంటి వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి” అంటూ అంతకు కొద్దికాలం ముందే వచ్చిన యముడికిమొగుడు అనే సినిమాకి “రిఫరెన్స్‌” ఇవ్వటం లాటివి) పాటల్లో ప్రబలమైనాయని చెప్పుకోవచ్చు.

ఇక 50ల్లో, 60ల్లో వచ్చిన పాటల్లో, స్త్రీ పురుష సంబంధాల్లో సమతుల్యత లేకుండా, పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తే (“కనరాని దేవుదే కనిపించినాడే, కనిపించి అంతలో కన్నుమరుగాయె”; “దివి నుంచి భువికి దిగివచ్చె దిగివచ్చె పారిజాతమే నీవై నీవై, గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది, కోటిప్రభలతో నీవై నీవై”), 70ల మొదల్లోనే సమతుల్యతని ప్రతిపాదిస్తూ “ఫిఫ్టీ ఫిఫ్టీ, నీవో సగం నేనో సగం,సగాలు రెండూ ఒకటై పోతే జగానికే ఒక నిండుదనం, నిజం నిజం” అనటం జరిగింది. అప్పటినుంచి వచ్చిన పాటల్లో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ఈ సమతుల్యత సామాన్యమై పోయింది (“నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా, నీకు ఇంతలోనె నన్ను చూస్తె అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచ్చిన గండు తుమ్మెదా, నీకు ఇంతలోనె నన్ను చూస్తె అంత తొందరా”, “మబ్బులు రెండు భేటీ ఐతే మెరుపే పుడుతుంది, మనసులు రెండు పోటీ పడితే వలపే పుడుతుంది”, “నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట, నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట”, “కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి, వసంతుడే పెళ్లికొడుకు వనమంతా సందడి, పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరేయి”, “చినుకులా రాలి, నదులుగా పారి, వరదలై పొంగు నీ ప్రేమ, నా ప్రేమ” ఇలా ఎన్నో).

ఇది స్థూల దృష్టి. కాస్త నిదానంగా చూస్తే తెలిసేది సినిమా పాటల భావజాలంలో చెప్పుకోదగిన మార్పులు రాలేదనేది ఉదాహరణకి, దాదాపుగా యాభై ఏళ్ల నుంచీ “ప్రేమ”దే సినిమా పాటల్లో ప్రథమ స్థానం. టూకీగా చెప్పాలంటే, ప్రేమ పాటల భావజాలాన్ని ఇలా విభజించొచ్చు (అ) ప్రేమికులు ఒకరికొకరు “నువ్వంటే నాకు అంత ప్రేమ, ఇంత ప్రేమ” అని చెప్పుకోవటం, “నువ్వు అలాటిదానివి, నువ్వు ఇలాటి వాడివి” అని పొగడుకోవడం, (“నీ కోసం వెలిసింది ప్రేమమందిరం నీకోసం విరిసింది హృదయనందనం; కలలెరుగని మనసుకి, కన్నెరికం చేశావు, శిలవంటి మనిషిని శిల్పంగా మార్చావు, తెరవని నా గుడి తెరిచి దేవివై నిలిచావు,నువు మలచిన ఈ బ్రతుకు, నీకే నైవేద్యం” నుంచి “ఒక దేవత వెలసింది నా కోసమే, నా ముంగిట విరిసింది మధుమాసమే” దాకా), (ఆ) ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమికుల విశిష్టతనీ వర్ణించుకోవడం (“భలేమంచి రోజు,పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు,బృందావని నవ్విన రోజు, తొలి వలపులు పిలిచిన రోజు, కులదైవం పలికిన రోజు” నుంచి “ప్రేమకు మేమే వారసులం, ప్రేమే మాకు మూలధనం”, “ప్రేమా ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు”), (ఇ) ప్రేమకి అడ్డొచ్చే సంఘాన్నీ దేవుణ్ణీ తిట్టిపొయ్యడం,(“దేవుడికేం హాయిగ ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు”, “ప్రేమికులం మేం ప్రేమికులం”), (ఈ) “మన ప్రేమ ఇంత గొప్పది అంత గొప్పది” అని గంతులెయ్యడం (“నీవూ నేనూ వలచితిమి నందనమే ఎదురుగ నిలిచినది”,”నువ్వూ నేనూ ఏకమైనాము, ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము,లోకమంతా ఏకమైనా వేరుకాలేము”), (ఉ) ప్రేమ వల్ల కలుగుతోన్న అనుభూతుల్ని వివరించిచెప్పడం (“నీవు లేని క్షణమైనా నా కనులకు ఒక యుగమై, మన ఇరువురి కలయికలో ఇరుమేనులు చెరిసగమై”, “నిన్ను చూశాకే నా వయసుకు వయసొచ్చింది”, “ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు”). బహుశా “ప్రేమ” అనే భావం మన సినిమా పాటల్లోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ పాటలు వీటిలో ఒకటో, ఎక్కువో కోవలకి చెందుతయ్‌.

“ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్రమీ క్షణమో” అని నాటి కధానాయిక ప్రేమతీవ్రత గురించి ఆశ్చర్యపోతే, నేటి హీరోయిన్‌ “వయసా చూసుకో,చెబుతా రాసుకో, ప్రేమకు తొలిపాఠం” అంటూ వయసుకి ప్రేమపాఠాలు నేర్పగలుగుతోంది. చలం సాహిత్యాన్ని ఈసడించుకుని ఎవరికీ కనపడకుండా దాచే రోజుల్నించి, “డాక్టర్‌ సమరం” సమాధానాల్ని (కొండొకచో అంతకన్నా ముఖ్యంగా ఆయనకి వచ్చే ప్రశ్నల్ని) లొట్టలేసుకుంటూ చదువుకునే రోజులకి సమాజం చేసిన ప్రయాణానికి ఈ పరిణామం అనుస్పందన అని చెప్పుకోవచ్చు. తొలిరోజుల్లో ప్రేమంటే ఏమిటో ఎంత గొప్పదో, ఆ ప్రేమని అనుభవించే వాళ్లు ఎంత అదృష్టవంతులో, దాన్ని గుర్తించని వాళ్లు ఎంత కఠినాత్ములో సినిమా పాటలు చెప్పినయ్‌. భారతీయ సంప్రదాయానికి ఈ బహిరంగ ప్రేమ ప్రకటనా విధానం కొత్తది కాబట్టి, అప్పట్లో అలా చెయ్యడం తప్పలేదు. ఒకసారి అందరూ ప్రేమ గొప్పదనాన్ని ఒప్పుకున్నాక ఇంక అదే పనిగా దాని విశిష్టతని వివరించే అవసరం లేదు కదా! అందుకే ఆ దశ దాటాక వచ్చిన పాటలు, ప్రేమ నుంచి శృంగారానికి ప్రయాణించినయ్‌. ఆందువల్ల భావజాలంలో ఏదైనా కొద్ది మార్పు వచ్చివుంటే, అది చాలా సహజమైన మార్పు, కావలసిన మార్పు. ఎన్నాళ్లు “ప్రేమే నేరమౌనా, మాపై ఈ పగేలా, వేదనగానే మా బ్రతుకంతా వేసారునా?” అని పాడుకోవడం? “ఈడు ఈల వేసినా, గూడు గోల చేసినా, తేనెటీగ లాగ వచ్చి నన్ను కుట్టు, నీకు దక్కుతుంది కన్నెతేనె పట్టు!” అని ఇప్పటి హీరోయిన్‌ అంటోందంటే దాన్లో ఆశ్చర్యం ఏముంది?

నిజానికి ప్రేమ అనేదానికి ఎంత ఉన్నతస్థానం దొరికిందంటే, ఇదివరకు “నువ్వు చందమామలా ఉన్నావు” అనో “నీ నవ్వు వెన్నెల్లా ఉంది” అనో అన్నట్టు, ఆ తర్వాత “నువ్వు ప్రేమ లా ఉన్నావు” అనడం ఓ గొప్ప ఉపమానం ఐంది. ఉదాహరణకి, “వలపు వలె తియ్యగా, వచ్చినావు నిండుగా”, “ప్రేమంటె ఏమిటంటే, నిను ప్రేమించినాక తెలిసె, మనసంటె ఏమిటంటే, అది నీకివ్వగానె తెలిసె”.

భావజాలంలో పెద్దగా మార్పు రాకపోయినా దాన్ని ప్రకటించే విధానంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చినయ్‌. కవిత్వం అనేది ఒక రకమైన “కోడ్‌” భాష అనేది అందరికీ తెలిసిన విషయమే! సినిమా పాటలు కూడా ఎంతో కొంత కవిత్వమే కనక, ఇది వాటికీ వర్తిస్తుంది. ఇంతకు ముందు అనుకున్నట్లు, తొలిరోజుల్లో వచ్చిన పాటల్లో ఎక్కువగా సంప్రదాయ భాష, కవిసమయాలు వాడారు (ప్రేయసీ ప్రియులు నేరుగా ఒకళ్లతో ఒకరు మాట్లాడుకోకుండా, మధ్యలో ఏ చందమామనో పెట్టుకుని, తమ మనోభావాల్ని చెప్పుకోవడం దీనికో ఉదాహరణ. “రావోయి చందమామా”, “ఓహో మేఘమాలా నీలాల మేఘమాల, చల్లగ రావేలా మెల్లగ రావేల”, “రాధకు నీవేర ప్రాణం”, “పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక” ఇలా ఎన్నో).

ఆతర్వాత, వాడుకలో ఉన్న సామెతల ద్వారా భావాన్ని ప్రకటించే ప్రయత్నాలు జరిగినయ్‌ (“చిన్నవాడనుకుని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే”, “నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు”, “ఏ మొగుడూ లేకపోతే అక్కమొగుడే మొగుడంట”). ఇటీవలి కాలంలో సమకాలీన సంఘటనలకి విషయాలకి ఇలాటి స్థానం దొరుకుతోంది (“భద్రం! బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ! భర్తగ మారకు బేచిలరూ! ఇడీ అమీనూ, సద్దాం హుసేనూ, హిట్లరు ఎవరైనా ఇంట్లో ఉన్న పెళ్లాం కన్నా డిక్టేటర్లట్రా?!”, “బోడి చదువులు వేస్టు, నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టు, టెండూల్కర్‌ అయ్యేటట్టు”, “నువ్‌ నాతోరా తమాషాలలో తేలుస్తా, అవారా హుషారేమిటో చూపిస్తా”; “పొలము లోపల కుప్ప కుప్పగా కూలిపోవుటకె ఫ్లైటులున్నవి”, “లక్సు పాపా లక్సు పాపా లంచికొస్తావా” అంటూ మొదలయ్యే ఇటీవలి పాటలో (అన్నట్టు ఈ పల్లవిలో పదాలన్ని సాభిప్రాయాలే!) హీరోయిన్‌ “ఇరగదీసెయ్‌ సుబ్బరంగా” అని అంతకు ముందొచ్చిన సినిమాల్లో, అదే హీరో వాడిన “ఇరగదీస్తా” అనే ఊతపదాన్ని “రిఫరెన్స్‌” గా వాడటం జరిగింది).

విజయవంతమయ్యే సినిమా పాటల పదజాలం ఎప్పుడూ ఆ కాలంలోని కుర్రకారు భాషలో దొర్లుతుంటుంది. అందువల్ల అది పాతతరం వాళ్లకి అర్థం కాకపోవటం, లేదా అశ్లీలంగా అనిపించటం సహజం. బహుశ, ప్రతి తరం దాని తర్వాతి తరం వాళ్ల కోసం రాసిన పాటల్ని అపార్థం చేసుకుంటుంది. అంతేకాదు! సమకాలీన తరం వాళ్లకి కనపడని అర్థాలు పాతతరాల వాళ్లకి కనిపిస్తయ్‌. ఉదాహరణకి 50ల్లో, 60ల్లో వచ్చిన పాటల్లో “వలపు “అనే పదాన్ని “సెక్స్‌”కి పర్యాయంగా వాడడం జరిగింది.కాని, అప్పటి కుర్రకారుకి ఆ అంతరార్థం దొరికిందని నమ్మలేము (ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ పాటల్ని ప్రియంగానే దాచుకుంటున్నారు, తన్మయులై వింటున్నారు!).

అలాగే “ఉయ్యాలలూగడం” అనేది అప్పటి చాలా పాటల్లో వినిపించే పదజాలం.”మంచిమనసులు” చిత్రంలోని “హృదయాలు కలిసి ఉయ్యాలలూగి, ఆకాశమే అందుకొనగా, పైపైకి సాగి మేఘాలు దాటి, కనరాని లోకాలు కనగా” అనే వాక్యాలున్న “నన్ను వదలి నీవు పోలేవులే” అనే పాట ఇప్పటికీ పాతతరం వాళ్లకి గగుర్పాటు కలిగించే పాట. అలాగే “పొలం దున్నడం” అనే దాన్ని కూడ విరివిగా ఓ ప్రతీకగా వాడారు.(“తలపాగా బాగ చుట్టి, ములుకోల చేతబట్టి, అరకదిమి పట్టుకుని, మెరకచేనులో వాడు దున్నుతుంటె చూడాలి వాడి జోరు, వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు”); ఇంకా ప్రత్యక్షంగా ఈ విషయాన్ని వర్ణించిన “వెలుగునీడలు” సినిమాలోని “హాయిహాయిగ జాబిల్లి” అనే పాటలో “విరిసిన హృదయమె వీణగా, మధురసముల కొసరిన వేళల, తొలిపరువము లొలికెడి సోయగం,కని పరవశమొందెను మానసం” అనే చరణం; “దాగుడుమూతలు” సినిమాలో “మెల్లమెల్ల మెల్లగా, అణువణువూ నీదెగా, మెత్తగ అడిగితే లేదనేది లేదుగా” లాటి పాటలూ విని, పరవశమయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు.

వాళ్ల అనుభూతిని చెడగొట్టడానికి కాదు గాని, ఆ పదాల వెనక అర్థం ఏ ఇతర “పచ్చి శృంగార” గీతాలకీ తీసిపోదు కదా!

ఇదే విధంగా ఇప్పటి పాటల్లో “వాత్సాయనం”, “ఒడి చేరటం” లాటి పదాల్ని, అదే భావాన్ని అందించటానికి వాడడం కనిపిస్తోంది. “వలచి వలచి వాత్సాయనా! నా వగలమారి పడుచుపరుపు పరిచెయ్యనా, నడుమ నడుమ నారాయణా! ఈ తళుకులాడి తపనలిపుడు తీర్చెయ్యనా”, “వినవే చెలీ! ఓ జాబిలి! కౌగిళ్లలో కష్టేఫలి అమ్మో! భయం ఇంకా నయం, చేసెయ్యకు వాత్సాయనం” “అందమైనబంధనాల వరమా! పొందుగోర నిన్ను ఆప తరమా? తమే తీరగా ఒడే చేరుమా!” ఇలా ఎన్నో ఉదాహరణలు. ఐతే, “ఉయ్యాలలూగడం” చాలా శక్తివంతమైన పదం కనక ఇప్పటికీ ప్రచారంలో నిలిచిపోయింది నిన్నటి “పికాసో చిత్రమా! ఎల్లోరా శిల్పమా!” అనే పాటలో “ఏకాంతాన నువ్వూ నేను ఉయ్యాలూగగా, లోకాలన్ని నిన్నూ నన్ను దీవించెయ్యవా” (లోకాలకి వేరే ఇంకేం పన్లేదు కాబోలు!) అంటూ దాన్నింకా ఒక మెట్టు పైకెక్కించడం జరిగింది.

ఇక “బలపం పట్టి భామ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్లో ఆహా ఓహో పాడుకుంటా; అంఅహా అంటా అమ్మడూ, కమ్మహా ఉండేటప్పుడు”, “అబ్బ నీ తియ్యని దెబ్బ” అనే పాటలో “చిటపట నడుముల ఊపులో, ఒక ఇరుసున వరసలు కలవగా”, లాటి ప్రయోగాలు అద్భుతమైన ప్రజాదరణ పొందినయ్‌.

సినిమా పాటల్లో మరో విశేషం, కొత్త కొత్త పదాల్ని సృష్టించడం. “హలా”, “లాహిరి లాహిరి”, “బుల్‌బుల్‌” లాటి పదాల్ని పాతతరాల పాటలు సృష్టిస్తే, ఇప్పుడు “వాత్సాయనం”, “గండుచీమ కుట్టడం” లాటి పదాల్తో పాటు రకరకాల కొత్త శబ్దాలు, ఏకంగా వాక్యాలే తయారుచేస్తున్నారు. ఉదాహరణకి “అన్నమయ్య” సినిమాలో ఉన్న “అస్మదీయ మగటిమి, తస్మదీయ తకధిమి,రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా!” అని మొదలయ్యే పాటలో ఎన్నో విచిత్ర ప్రయోగాలున్నయ్‌. అలాగే, నిన్నమొన్నటి “మొన్నా కుట్టేసినాది,నిన్నా కుట్టేసినాది, మళ్లీ కుట్టేస్తున్నాది గండుచీమ; నే తిడతా తిడతా ఉన్నా, అది కుడతా కుడతాఉంది” అనే పాటలో అద్భుతమైన భావచిత్రాలున్నయ్‌.

మొత్తం మీద తేలేదేమిటంటే, ఒక కాలంలో వచ్చే పాటలు ఆ కాలపు కుర్రకారుని ఉద్దేశించి రాసినవి గనక వాళ్ల భాషలో ఉంటాయనేది. ఈ దృష్టితో చూస్తే, ఒక పాటలో సాహిత్యం ఎలా వుందనే విషయంలో ఖచ్చితమైన తీర్పు, ఆ తరం వాళ్లదే కానీ, వాళ్ల ముందు వాళ్లదీ కాదు; వెనక వాళ్లదీ కాదు. అలాగే, సాహిత్యం కూడా ఒక తరాన్నుంచి మరొక తరానికి వెళ్లడంలో చెడిపోవడం లేదు, బాగుపడడం లేదు అప్పటి తరానికి సరిపడేట్లు ఉండే ప్రయత్నం చేస్తోంది. అంతే!

అనుభూతి కల్పనం

సినిమా ప్రేక్షకుడికి “అనుభూతి” కావాలి. అది అతికొద్దిసేపట్లో అందాలి.సినిమాలో సన్నివేశాన్నిబట్టి ఆ అనుభూతి నవరసాల్లో ఏదో ఒకటై ఉంటుంది. ఈ రసానుభూతిని పండించడానికి సంగీతాన్నో, సాహిత్యాన్నో,దృశ్యచిత్రాన్నో వాడతారు. కారణం, ఊహాగతమైన భావాల్ని, ఒక మనస్సు నుంచి మరో మనస్సుకి ప్రసారం చేసే శక్తి లలిత కళలకి ఉండడమే! దీనికి కొన్ని ఉదాహరణలు “ఒక సినిమాలో తెల్లవారుతున్న సన్నివేశం చూపించడానికి, సూర్యుడు ఉదయిస్తున్నట్లు చూపించడం, లేదా, భూపాల రాగాన్నో,మోహన రాగాన్నో వేణువుపై ఊదడం”… ఇలా, అర్ధరాత్రి సినిమా చూస్తున్నా, ప్రేక్షకుడికి తాత్కాలికంగానైనా, తెల్లవారిన అనుభూతిని కలిగిస్తారు.

ఒక్కొక్కసారి, ఒక పాటలో ఒక కీలకమైన పదాన్నిరసవత్తరంగా పాడడం కూడా ఇలాంటి ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు, “సుమంగళి” సినిమాలో “ఆనాటి మానవుడు ఏమి చేసాడు” అన్న పాటలో, బుద్ధుని మహాభినిష్క్రమణాన్ని “మహరాజు భిక్షువై బయలుదేరాడు” అని మూడు మాటల్లోనే చెప్పినా, ఆ పంక్తిని విన్నపుడు భార్యాబిడ్డల్నీ, రాజ్యాన్నీ వదిలేసి వెళ్ళిపోతున్న బుద్ధుడి మనసు, మనముందు నిలబెట్టాడు ఘంటసాల.ఇలాటివే “మహాకవి కాళిదాసు”లోని “మదాలసాం మంజుల వాగ్విలాసాం”; “జయసింహ”లోని “ఈ ప్రేమ జవరాలా!”; “మల్లీశ్వరి” లో దాదాపు అన్నీ.. ఇలా చెప్పుకు పోతే ఎన్నెన్నో.

అనుభూతిని పొందడం అన్నది రకరకాల స్థాయిల్లో ఉండడం, మనిషి మనిషికీ ఆ స్థాయిలో తేడా ఉండడం .. ఇలాంటివన్నీ ఈ “అనుభూతి” అనే విషయాన్ని మరీ క్లిష్టంగా తయారు చేస్తాయి. కలగాపులగమైన మనస్తత్వాలున్న ప్రేక్షకజనానికి,అనుభూతిని పంచి సంతృప్తిపరచడం మాటలు కాదు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించడానికి రచయితల్లో, చిత్ర, సంగీత దర్శకుల్లో, గాయకుల్లో, నటీనటులలో చాలా నిష్ట, సృజనాత్మక శక్తి ఉండాలి.

మనం ప్రస్తుతం చర్చించబోయేది సినిమా పాటలద్వారా అనుభూతిని పొందడాన్ని గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే, సులభంగా అందుబాటులో ఉండడంవల్ల మనలో చాలామందికి కళాత్మకమైన అనుభూతి కలగజేసినవి సినిమా పాటలు మాత్రమే. సినిమా చూసినా, చూడకపోయినా పాటల్ని విని ఊహల్లో తేలడం అందరికీ అబ్బింది. (సినీమాల కన్న వాటి పాటలు ముందు రావడం మొదలెట్టడంతో, ఈ ఊహలు కొన్నిసార్లు ఆకాశాన్నంటి, సినిమాల లాభాలు తలక్రిందులయాయి కూడా!)

“పాటఊహ” అనగానే ముందుగా గుర్తొచ్చేది “ఇది మల్లెల వేళయనీ” అనే పాట. ఆ పాటకి అర్ధం చాలామందికి తెలియక పోయినా, పాడినవిధానం,సంగీతం, పదాల సుకుమారమైన కూర్పూ అందరినీ వింతలోకాలకి తీసుకుపోయాయి. అలాగే “భక్తజయదేవ”, “తెనాలిరామకృష్ణ” సినిమాల్లోని అష్టపదులు కూడా! అనుభూతిని అందించడంలో సంగీతానికున్న ప్రాధాన్యత వీటివల్ల అర్ధమవుతుంది. అందుకే ఒక్కొక్కసారి సంగీతం పొల్లుపదాలకి కూడా ప్రాణం పోసి గొప్ప అనుభూతినిస్తుంది. ఇలాంటి పాటలు మనకి పుష్కలంగా ఉన్నాయి.

“సాహిత్యంకూడా సంగీతానికి తీసిపోదు” అనిపించేలా పాటలు రాసారు కొందరు సినీకవులు. పాతతరం కవులు “కాదుసుమా కలకాదుసుమా”, “ఓ!తారకా! నవ్వులేలా”, “ఆ దొంగ కలువరేకుల్లో” “ముద్దబంతి పూవులో”,”సిగలోకి విరులిచ్చి”, “మనసుగతి ఇంతే”, “ముక్కుమీద కోపం”, “నీ మెడ చుట్టూ గులాబీలూ, ఈ సిగ పాయల మందారాలూ” అంటూ రాస్తే, ఈతరం కవులు ఏనాడు కనీవినీ ఎరుగని కొత్త ప్రయోగాల్తో పాటలు రాయడం మొదలు పెట్టారు.

పాతవాళ్ళు పౌరాణిక, జానపద సంఘజీవనంలోని ప్రేమని కాచివడబోస్తే, ఇప్పటివాళ్ళు మనం రోజూచూసే ఎన్నో సంగతుల్తో పోలికలు చెపుతూ ప్రేమపాటలు రాసి ఆశ్చర్యపరుస్తున్నారు. “కాదేదీ కవితకనర్హం” అని శ్రీశ్రీ అన్నాడు ఒకప్పుడు, వేటూరిలాంటి వాళ్ళు చేసి చూపిస్తున్నారిప్పుడు. (వేటూరి విషయంలో, ఎన్నో గొప్ప పాటలు; మంచి సంగీతం, గాత్రధారణాలేక వ్యర్ధమైపోవడం శోచనీయం.) ఈవిధంగా, ఎన్నోవిధాల ప్రేక్షకుడికి అనుభూతి కలిగించడానికి ప్రయత్నాలూ, ప్రయోగాలూ జరుగుతూనే ఉన్నాయి.దాంతోబాటు, ప్రేక్షక, శ్రోతలు ఆశించేదికూడా ఎక్కువై అసహనానికి దారితీస్తోంది.

తొలిరోజుల్లో సంగీతదర్శకులు రాగప్రధానమైన పాటలుకట్టి మన దేశీయ, లేదా జాతీయ, తత్వ్తాన్ని ప్రతిబింబించే ప్రేమభావాల్ని మనలో మొలకెత్తించారు. “లాహిరి లాహిరి లాహిరిలో”, “ఎంత ఘాటు ప్రేమయో”,”పయనించే మనవలపుల”, “మనసు పరిమళించెనే”, “వినిపించని రాగాలే”, “నీ చెలిమీ” లాంటివి ఉదాహరణలు. “వినిపించని రాగాలే” అని అంటూ వినిపించేటట్లు పాడుతూ, అంతటితో ఆగకుండా ఎన్నో ప్రేమరాగాల్నికూడ వినిపిస్తుంది ఆపాట. పాటలో వీణమీద స్వరాలు క్రిందకి (అవరోహణం) దిగుతూంటే,వాటితోబాటు మనంకూడ గుండె లోతుల్లోకి దిగుతాం. అలా సంగీత సాహిత్యసమ్మేళనంతో మన మనసుల్లో కొన్ని ప్రేమానుభూతుల్ని బలంగా నాటగలిగాలరనడానికి ఇలాంటి పాటలే నిదర్శనాలు. ఇలా ఎన్నో తెలియని ఊహాలోకాల్ని వాళ్ల కళద్వారా మనలో సృష్టించారు. ఇదంతా పాత పాటల కధ.

మనం పక్షపాత వైఖరిని వదిలి చూస్తే, కొత్త పాటల్లో కూడా ఇలా మరచిపోలేని అనుభూతుల్ని సృష్టించే పాటలు చాలా ఉన్నాయి. సంగీతం,సాహిత్యం అన్ని ప్రమాణాల్లోనూ తీసిపోకుండా నడిచాయి. పదేళ్ల క్రితంనుంచీ తీసుకుంటే నాటి “గీతాంజలి” నుంచి నిన్నమొనటి “సఖి” వరకూ వందలపాటలు ఉన్నాయి ఉదాహరణలుగా. హృదయాన్నీ, ఒంటినీ ఊపేసే బీట్స్‌ వచ్చాయి. వయసు మీరినవాళ్ళు ఈ శారీరకమర్దనాన్ని భరించలేకపోవచ్చుగాని, అది యువతరంలో అనుభూతిని రగిల్చే సాధనాల్లో ఒకటని గ్రహిస్తే
ఆగ్రహావేశాలు తగ్గవచ్చు.

సాహిత్యంలో వేటూరి మొదలైనవాళ్ళ ప్రయోగాలు, ఇళయరాజా, రెహమాన్‌ లాంటివాళ్ల కొత్త సంగీతరీతులూ ప్రేక్షకలోకానికి రంగురంగుల కొత్తప్రపంచాల్ని చూపించాయి. ప్రాచ్య, పాశ్చాత్య సంగీతాల్ని కలపడమూ (ఈ కోవలో ముఖ్యంగా చెప్పవలసినది “సీతాకోకచిలుక” సినిమా), ఆపెరా, మెక్సికన్‌ బాణీలు వినిపించడమూ, “స్ట్రాబెర్రీ కళ్ళు”, “కౌబాయ్‌ కన్నుకొట్టడం”లాంటి విదేశీయ వాతావరణానికి సంబంధించిన వర్ణనలూ,.. వీటిద్వారా పాశ్చాత్యుల ప్రేమ భావాల్ని మన మనసుల్లో నాటుతున్నారు. (వీళ్లంతా చేస్తున్నామంటున్న రీతులు కొన్ని రాజేశ్వరరావు సంగీతంలో కనిపిస్తూంటే నేను ఆశ్చర్యపోతూంటాను).

ఆంధ్రాలో పుట్టిపెరిగిన పిల్లవాడు “అమ్మా” అని పిలిచినప్పటి అనుభూతినే, అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లాడు “మామ్‌” అన్నప్పుడు పొందుతాడు. వీడు మామ్‌ అన్నాడుగాబట్టి వీడికా అనుభూతి తెలియదు అంటే తప్పు. అలాగే, అనుభూతిని కలిగించడానికి ఏసాధనాలు వాడుతున్నామో వాటిని గురించి చర్చమాని, అనుభూతిని కలగజేసే మూలపదార్ధాన్ని గురించి ఆలోచించాలి.

ప్రేమపాటల్లో, అందరినీ ఆకర్షించే అనుభూతి “విరహం”. దీన్ని ముందునుంచీ మనవాళ్లు పోషిస్తూ వచ్చినా, పారశీవాళ్ల ప్రభావంవల్ల “ఇది” మరింతయ్యింది. ఇంగ్లీషువాళ్ల “ట్రాజెడి”తో కలిసి మనసుల్ని ఊపింది. మన సినీసంగీత సాహిత్యాలు; ఇవన్నీ మన సొంతభావాలే అని అపోహపడేలా చేసాయి. ఈకృషి అభినందనీయం. ప్రతీ తరంవాళ్లు; పూర్వపువాళ్లని బోరుగాళ్లనీ, తమ తర్వాతవాళ్లని తొందరపాటుతనం, అసహనం ఉన్న తరంవాళ్లనీ బిరుదులిస్తూంటారు. నిజానికి అనుభూతి అన్నది హృదయానికి సంబంధించినది. సంగీత, సాహిత్యాల ద్వారా హృదయం కదల్చబడాలి.కదల్చడానికి చేసే ప్రయోగాలే ఇన్ని మార్పులకీ కారణం.

సినిమా పాటల్తో అనుభూతిని కలిగించడానికి ఒకసులువైన విధానమేమిటంటే, ఇదివరలో బాగా పేరుపొందిన అనుభూతుల్ని నెమరువేయించడం. ఉదాహరణకి, కొత్త పాటల బాణీలు పూర్వం హిట్టయిన పాటలకి బహుదగ్గరగా నడిపించడం; లేదా, పూర్వం హిట్టయిన పాటల్నో, వాటి ఇంటెర్య్లూడ్స్‌ నో నేపధ్యంలో మళ్ళీ మళ్ళీ వినిపించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలని చూడ్డం. (రాజేశ్వర్రావు నుంచి రెహమాన్‌ వరకూ అందరూ ఈపని ఏదోఒకప్పుడు చేసినవాళ్లే. అయితే, కొందరు వాళ్లని వాళ్లే కాపీ కొడితే, మరి కొందరు తనదా,మరొకడిదా అన్నది పట్టించుకోకుండా కాపీ కొట్టారు.)

ఇది ఒకవిధంగా ప్రేక్షకుడికి తెలిసిన రుచినే చూపించి, మూడ్‌ లోకి తీసుకొని రావడం. అంటే,ఒకసారి మనసులో ముద్రపడ్డ ఊహాలోకాలకి తెరతీసి చూపించడం. మన సినిమాల్లో ఈమధ్య ఇది ఎక్కువైపోయి, మళ్లీ మళ్లీ అవే అవే అయిపోయి విసుగొస్తోంది. కొత్త ఊహల్నీ, కొత్త లోకాల్నీ చూపించే దర్శకులొస్తే ప్రేక్షకులు ఒకసారి హాయిగా కొత్త ఊపిర్లు పీలుస్తున్నారు. ఒక గొప్ప అనుభూతిని కలిగించాలంటే, కేవలం “రిఫరెన్స్‌ “లు ఇస్తేనే చాలదు. “రెఫరెన్స్‌ “లని అనుభూతి చెందడానికి కావలసిన వాతావరణం తయారు చెయ్యడానికి మాత్రమే వాడాలి. ఆ తర్వాత, కళాకారులు వాళ్ల సృజనాత్మకత ద్వారా అనుభూతిలోని కొత్తకోణాల్ని, కొత్తలోతుల్ని చూపించాలి.

జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం అనుభవించగలిగిన భావజాలం,అనుభూతులూ సాధారణంగా ఒక పరిమితిలోనే ఉంటాయి. అవి అందుకునే స్థాయిలే మారతాయి. కొత్త సంస్కృతులతో సంపర్కం ఏర్పడ్డప్పుడు, కొత్త అనుభూతులని పొందే అవకాశం ఎక్కువ. ఆ అవకాశం ఈనాడు ఎక్కువవడంతో, కొన్నికొత్తభావాలూ, అనుభూతులూ మన యువతరంలో చొచ్చుకుంటున్నాయి. ఇవి పాత తరంవాళ్ళకి వింతగా కనుపిస్తున్నాయి. అమెరికానుంచి తిరిగొచ్చిన తాతగార్లకి కూడా “టేస్టుల్లో” మార్పురావడం మనం చూస్తూనే ఉంటాం.

వీటినిబట్టి చూస్తే, మూలపదార్ధంలో కావలసిన మార్పొస్తేనే ప్రేక్షకులు కొత్త అనుభూతినిపొంది ఎక్కువ ఆనందపడుతున్నారని తెలుస్తుంది.

దేశకాలమాన పరిస్థితుల్నిబట్టి, స్పందించే తీరు, దాన్ని అందించే సాధనాలూ మారడం సహజం. మారుతున్న తీరుని అర్ధంచేసుకుని, దాని ఆరోగ్యాన్ని పరిశీలించి, అరోగ్యకరమైన పదార్ధాన్ని అనువైన సాధనాల ద్వారా రుచిగా, శుచిగా అందరికీ నచ్చేలా వండివార్చే సిద్ధహస్తులు కరువయ్యారు తెలుగువాళ్లలో. పొరుగింట్లో పుల్లకూర హిట్‌ అనగానే అడిగితెచ్చుకుని తినేద్దామనే “ఆబ” పెరిగింది. అంతేకాని, మన ఇంట్లో వాళ్లకి ఏ రుచి ఇష్టం? అని క్షణంకూడా అలోచించటల్లేదు. “ఒరిజినాలిటీ” (తెలుగులో పదమేమిటి?) వస్తుందని ఆశిద్దాం.

సంగీతం

తెలుగు సినిమా పాటల్లోని సాహిత్యం, భావావేశంలో కాలక్రమాన మార్పులు వచ్చినట్టే, సంగీతంలో కూడా చాలా మార్పులు రావడం జరిగిందన్న విషయం సినిమా పాటల ప్రియులకి తెలిసిందే! సినిమా పాటల్లో ప్రేమ, శృంగారం గురించి మాట్లాడుకొంటున్నాం కాబట్టి, సినిమా పాటల్లోని సంగీతాన్ని కూడా వీటికే పరిమితం చేద్దాం!

“ఆనాటి” పాటల్లో వాయిద్య సహకారం తగినంతగా ఉంటూ, పాటలో ఎక్కువ భాగాన్ని గాయనీగాయకుల గాత్రంతో నింపేవారు. ఉదాహరణకి “షావుకారు” (1950)సినిమాలో ఘంటసాల కంపోజ్‌ చేసి, పాడిన “ఏమనెనే చిన్నారి ఏమనెనే” అన్న భావగీతంలో అసలు వాయిద్యాలు ఏమైనా ఉపయోగించారా అన్న అనుమానం రాక మానదు. ఈ పాట జాగ్రత్తగా వింటే, వినిపించీ వినిపించకుండా వాడిన “వీణ” వినిపిస్తుంది. అలాగే అప్పటి పాటలకి తగ్గట్టు తాళం ఇవ్వటం జరిగింది. కానీ ఈ పాటలో తాళం కూడా గట్టిగా వినపడదు.

సినిమా పాటల్లో రాను రాను “ఆర్కెష్ట్రా” కు జనాదరణ ఎక్కువ కావడం వల్ల, రకరకాల వాయిద్యాల ఉపయోగం కూడా పెరిగింది. అందువల్ల, కొంత మంచి సంగీతం ప్రజలకి 1950, 60 దశాబ్దాల్లో సినిమాల ద్వారా దొరికింది. ఇందుకు కారకులైన సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, సి.ఆర్‌.సుబ్బురామన్‌, ఆది నారాయణ రావు, అటువంటి హేమాహేమీల సరసన నిలబడ్డ గాయకసంగీత దర్శకుడు ఘంటసాల, వాళ్ల బాణీలకి పాటలు పాడిన జిక్కీ, లీల, సుశీల, జానకి, ఎం. ఎస్‌. రామారావు, మాధవపెద్ది సత్యం,పిఠాపురం వంటి వారిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం సమంజసం. ఈ ఆర్కెష్ట్రా ఎంత గమ్మత్తుగా ఉండేదంటే, “ఆడదాని వోరచూపులో జగాన ఓడిపోని ధీరులెవ్వరో” లాంటి పాటలో ఆర్కెష్ట్రా నిండుగా ఉన్నప్పటికీ, అశ్లీలత ఏమీ కనపడదు. ఈ పాటలో సాలూరు రాజేశ్వరరావు సృష్టించిన “ఆర్కెష్ట్రేషన్‌ మహత్తు అది”. రికార్డింగ్‌ టెక్నాలజీ అప్పట్లో వెనకగా ఉన్నా, “ఆనాటి పాటలు” ఈనాటికీ గుర్తున్నాయంటే, దానికి కారణం ఆ పాటల్లోని సంగీతం!

బాణీలు కట్టడంలో కూడా అప్పటి పరిస్థితి వేరు. ఎక్కువగా ప్రజాదరణ పొందిన బాణీలన్నీ కర్ణాటక లేదా హిందూస్తానీ రాగాల మీద లేదా ప్రజల సంగీతం అయిన దేశి సంగీతం మీద ఆధారపడ్డవే! అయితే సినిమా సంగీతం లలిత సంగీతం కాబట్టి, శాస్త్రీయ సంగీతం పెట్టే షరతులు కొన్ని పక్కకు నెట్టి, ఆనాటి సంగీత దర్శకులుకొంత స్వతంత్రించి, సినిమా పాటలకి బాణీలిచ్చారు. ఉదాహరణకి, ఒక రాగంలో శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించకూడని అన్యస్వరాలను, యధేచ్ఛగా వాడుకుంటూనే, రాగ లక్షణాన్నీ, సంగీతంలో వచ్చే అనుభూతినీ సమన్వయ పరచేవారు. ఈ రకంగా కంపోజ్‌ చేసిన పాటలు పాత సినిమాల్లో కోకొల్లలు.

తెలుగు సినిమా పాటల్లో సాధారణంగా వినపడని రాగం “పట్‌దీప్‌”. ఈ రాగంలో సాలూరు రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిన “నీ అడుగులోన అడుగు వేసి నడువనీ” పాట, మంచి ఆర్కెస్ట్రేషన్‌కి మరో ఉదాహరణ. ఇదే రాగాన్ని ఇతర సంగీత దర్శకులు “కలవారి స్వార్ధం”, “ఎవరో రావాలి” వంటి పాటల్లో వాడినా, రకరకాల వాద్యాలను తగు పాళ్లలో ఉపయోగించటం “నీ అడుగులోన అడుగువేసి” అన్న పాటలోనే వినపడుతుంది.

అతి పాత తెలుగు సినిమాలనుంచి, 1970 దశాబ్దం మధ్య దాకా ఒకరకం సంగీత దర్శకులు, సినిమా సంగీతాన్ని నిర్వచించారు అనుకోవచ్చు. ఆ తరవాత, ఇళయరాజా, రమేష్‌ నాయుడు వంటి అతిప్రతిభావంతులైన కంపోజర్స్‌ సినిమా బాణీల్లో, తమదైన ముద్ర వెయ్యగలిగారు. శుద్ధ కర్ణాట సాంప్రదాయ సంగీతంలోని రాగాలు తీసుకొని, పాశ్చాత్య సంగీతంలోని కొన్ని ప్రయోగాలు కలిపి అతి చక్కని సంగీతాన్ని ప్రజలకు అందించారు. ఉదాహరణకు, “సాగర సంగమం” సినిమాలో, “వే వేలా గోపెమ్మలా” అన్న పాటకి అధారం “మోహన” రాగమైనా, శుద్ధ మోహనంలో వెయ్యకూడని అన్య స్వరాలైన కోమల ధైవతం, తీవ్ర నిషాదం వంటి స్వరాలు వేస్తూనే, మంచి అనుభూతిని రాబట్టగలిగారు. అలాగే, రమేష్‌ నాయుడు తన బాణీలలో కావాలనే అతి తక్కువ వాయిద్యాలు ఉపయోగించినా, పాట సంగీతంలోని నిగ్గు ఎక్కడా తగ్గలా! శివరంజని సినిమాలోని “జోరుమీదున్నావు తుమ్మెదా” (కల్యాణిరాగం), మేఘసందేశం సినిమాలోని “ఆకాశ దేశాన” (శివరంజని రాగం) వంటి పాటలలో అతితక్కువ ఆర్కెష్ట్రాతో గొప్ప సంగీతాన్ని రమేష్‌ నాయుడు సృష్టించారు.

రాను రాను సాహిత్యంలోనూ, భావ ప్రకటనలోనూ ఇప్పటి సినిమా పాటల్లోలాగా,సంగీతంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకి, ఇప్పటి పాటల్లో వాయిద్యాలఘోష ఎంత ఎక్కువగా ఉందంటే, గాయనీగాయకులకు ఎక్కువ సామర్య్ధం ఇప్పుడు అవసరం లేకపోతోంది. దీనికితోడు, మన తెలుగు సినిమా పాటల్లో ఇదివరకు “కనపడని” కోరస్‌ డాన్సులు విపరీతంగా పెరిగిపొయినయ్‌. హీరోహీరోయిన్‌ల ప్రణయ ఘట్టాలలో, ఈ కోరస్‌ డాన్స్‌ వాళ్లు ఎందుకుంటున్నారో ఆ భగవంతుడికి తెలియాలి! ఐతే, దీనివల్ల పాటల్లో సంగీతం కూడా, ఈ అర్ధంలేని కోరస్‌ నృత్యాలకు తగ్గట్టు మారిపోతోంది. పాటల సంగీతంలోని పరిణామ దశలో ఇదొక ఘట్టం అని భావించొచ్చు.

అప్పుడప్పుడు శుద్ధ శాస్త్రీయ రాగాల ఆధారంగా కొన్ని కొన్ని పాటలు వినపడుతున్నా (నిజానికి ఈ ధోరణి, ఈ మధ్య పెరుగుతోందన్న మాట యదార్ధం!),మొత్తానికి పాట బాణీలు కట్టే పద్ధతి మారింది. డీనికి తగ్గట్టు, “ఆనాటి” పాటల్లా కాకుండా, లయ ప్రధానంగావచ్చే ఈనాటి పాటల్లో, ముందు నిర్ణయింపబడేది తాళమే! దాని తరవాత మిగిలిన వాయిద్యాలన్నీ ఈ తాళానికి తగ్గట్టు ఉపయోగించటం, పాటలో ఇంకా ఏమైనా కాస్త ఖాళీ మిగిలితే దాన్నిగాయనీగాయకులతో పూర్తి చేయటం జరుగుతోంది.

సినిమా సంగీతంలో కాలం తెచ్చిన మార్పుల్లో మరొక గమనించదగ్గ అంశం ప్రధానరసం! పాత సినిమాల్లో భక్తి లేక వేదాంత ధోరణిలో ఒక్క పాటైనా లేకుండా సినిమా ఉండేది కాదు. “అప్పుచేసి పప్పు కూడు”, “మిస్సమ్మ”, “దొంగరాముడు”, “అమాయకురాలు”, లాంటి సాంఘిక సినిమాల్లో కూడా ఏదోరకంగా భక్తి పాటని పెట్టి, ఆ వర్గం ప్రేక్షకులని తృప్తి పరిచేవారు. నిజానికి భక్తిరస ప్రధానమైన సినిమాలు, సినిమా నిర్మాతలకి ఆర్ధికంగా లాభాలు తెచ్చాయి. “భక్త పోతన”, “త్యాగయ్య” (శ్రీ చిత్తూరి నాగయ్య నటించిన), “కాళహస్తి మహత్యం”, “భూకైలాస్‌”, “సీతారామ కల్యాణం”,”భక్త ప్రహ్లాద” (1963) వంటి సినిమాల్లో సంగీతం గొప్పగా ఉన్నా, మొత్తం మీద సినిమా విజయానికి “భక్తి” చక్కని మార్గం అని తెలుసుకున్నారు అప్పటి చిత్ర నిర్మాతలు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో, భక్తి పాటలు లేకుండా వస్తున్న సినిమాలే ఎక్కువ! సాంఘిక సినిమాల్లో ఒక్క భక్తి రసప్రధానమైన పాటైనా లేకుండా వచ్చే సినిమాలే ఎక్కువ. దీనికి కారణం ఇప్పటి ప్రజలకు “భక్తి” రసం ఎక్కువ అవసరం లేకపోతోంది. “భక్తి” రసం లేని లోటుని “శృంగార” రసం ఇప్పటి సినిమాల్లో భర్తీ చేస్తోంది. భక్తిరస ప్రధానమైన సాంప్రదాయ కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తక్కువ అవటానికి ఈ మార్పు ఒక కారణం.

మొత్తం మీద తేలేదేమంటే

సినిమా పాటల సాహిత్యం, భావ ప్రకటన, సంగీతాల్లో కాలక్రమాన వచ్చిన మార్పుల మంచిచెడ్డా చెప్పడం చాలా కష్టం. ఏ కాలానికితగ్గట్టు అలాంటి పాటలు వస్తూ వచ్చాయి. ఇప్పటి పాటల గురించి ఇప్పటి కుర్రకారుని మరో 20 ఏళ్ళ తరవాత అడగండి? “ఇరవై ఏళ్ల క్రితం చాలా మంచి పాటలొచ్చాయి” అంటారు. ఎప్పటి సినిమా అయినా, ప్రజలకి కావలసిన సంగీతం అందివ్వడమే దాని పని.

ఏకాలంలో అయినా పదుగురాడుమాట సినిమా పాటయై ధరజెల్లింది!

మొత్తం మీద సినిమా పాట భావుకతని “ఇరగదీస్తోందా?”, శ్రోతల సహనాన్ని “అరగదీస్తోందా?” అన్నది ఏ తరానికి ఆ తరం అనుభవించి నిర్ణయించవలసిన విషయం!

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...