ఒక్క ప్రశ్న

ఒక్కోసారి, ఒక చిన్న ప్రశ్న చాలు

ఎండావానలకు చలించని
బండరాళ్ళను తలపించే
మన మనుగడకు అర్థం
మనమే వెతుక్కోవడానికి…

చప్పుడు చేయని చెరువులో
చలనం తెచ్చిన రాయిలా,
మౌనం పాటించే మనసుతో
మాటను పలికించడానికి…

పేరుకుపోయిన దుమ్ముపొరలు దులిపి
అటక మీది పుస్తకం తీసినట్టు,
మౌఢ్యం పొరల్లో మరుగైపోయిన
మానవతను వెలికితీయడానికి…

గతసంవత్సరపు దావానలాన్ని
అడవిలో బీళ్ళు గుర్తు చేసినట్లు,
ఆవేశంలో చేసిన అనర్థాన్ని
గుర్తుతెచ్చే ఆలోచన రావడానికి…