“నిశ్శబ్దంలో నీ నవ్వులు”

ఈ మధ్యనే అమెరికాకు వచ్చిన తమ్మినేని యదుకుల భూషణ్‌ కవితల సంకలనం ఈ కావ్యం. గత పదేళ్ళుగా రాసిన వాటిలో డెబ్భై కవితలు ఇందులో ఉన్నయ్‌.

ఈ కవికి చెప్పుకోదగ్గ ప్రతిభ ఉన్నట్టు నిరూపించే కవితలు చాలా ఉన్నాయిందులో.

“సాగిన చువ్వల నీడలను
మాయం చేసే
మెరుపుల్లా

నిశ్శబ్దంలో నీనవ్వులు
గలగలా వినిపిస్తాయి” లాటి ప్రతీకల్ని ఎంత కావాలంటే అంత లోతుకి వెళ్ళి ఆనందించొచ్చు.

“కాలశిల్పం”, “వృక్షమానవం”, “అపారదర్శకం” లాటి శీర్షికల్లోనే ఎంతో ఆలోచన కనిపిస్తుంది.

ఈ కవికి సముద్రంతో దగ్గరి అనుబంధం. నాలుగైదు కవితలు సాగరం లోతుల్ని, కెరటాల కొలతల్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తయ్‌.

నాకు దీన్లో కొంచెం వింత గానూ, ఆశ్చర్యకరంగానూ కనిపించింది ఇతను మంచి లయ ఉన్న కవితలు రాయటానికి వెనకాడకపోవటం.
“వంటగదిలో ఎన్ని
తంటాలు ఎండతో” అని సరదాగా అన్నా,

“మంచుకప్పిన కొండశిఖరం
ఎక్కలేనిక ఎదురుగాడ్పులు
చెప్పిరాదుగ చేటుకాలం
లోయదాగిన ఎముకలెన్నో!” అని మృత్యుముఖాన్ని ఆవిష్కరించినా, వస్తువుకు తగ్గ లయని ఎన్నుకోవటం జరిగింది.

ఎన్నో స్వతంత్రమైన ప్రయోగాలు, ఆలోచింపజేసే భావాలు, చిత్రాలు ఉన్నాయిందులో. ఇవి చూడండి
“దినపత్రికలు … తెల్లవారగానే
అక్షరాలు సింగారించుకొని
వాకిట్లోకొచ్చి పడుతూ ఉంటాయి” అన్న భావనలో నాకు తెల్లారగానే లేచి ఆడుతూ అటూఇటూ పరిగెడుతూ గుమ్మాలు తగిలి పడుతూ లేస్తూండే చిన్నపిల్లలు కనిపిస్తారు.

“మైదానమంతా
ఎగిరి ఎగిరి
అలసిన బంతి
ఎండిన గడ్డి మీద” అన్నా నాకు కనిపించేది బంతి కాదు.

“తలుపులేసి చూడు
కళ్ళల్లో తెల్లవారుతుంది

తీగ కదిపి చూడు
రాత్రికన్నీరు రాలుతుంది” చిన్నపదాల్లో పెద్దబాధలు దాగున్నయ్‌.

అన్నట్టు ఇతను మాటల్ని అసలు దుబారా చెయ్యడు. ఇది కూడా నాకు నచ్చిన మరో విషయం.

ఈ పుస్తకం గురించిన వివరాలకు thammineni@lycos.com అనే ఈమెయిల్‌ అడ్రస్‌ దగ్గర అతన్ని సంప్రదించండి. వెల ఐదు డాలర్లని పుస్తకంలో ఉంది, ఐతే అది అమెరికాకి రాకముందు కనుక ఇప్పటి వెల వేరుగా ఉండొచ్చు. నేరుగా సంప్రదించటమే శ్రేయస్కరం.