ఊరుకోలేక..

ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదు
ఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖం

వెడల్పాటి బాటలూ, ఎ్తౖతెన అరుగులూ,
అటూ ఇటూ నవ్వులతో కేరింతలతో పరుగెత్తే పిల్లలూ,
వెన్నెల వాకిట్లలో ముచ్చట్లాడుకునే యువతులూ
పలకరింపులతో పరాచికాలతో సాగిపోయే యువకులూ,
చెరువుగట్టు మీద చెట్ల కింద బాతాఖానీ పెద్దమనుషులూ..
ఇప్పుడవేం లేవు..ఇప్పుడెవరూ లేరు
శత్రువు దాడిచేసిన జాడా, యుద్ధం జరిగిన సూచనా ఏమీ లేవు

కూలిపోయిన ఇళ్ళూ, కుంగిపోయిన అరుగులూ,
మాయమైన చెట్లూ ఎగిరిపోయిన పిట్టలూ
జీవంతో పచ్చగా కళకళలాడిన ఊరంతా మలమల మాడిపోతోంది
శుష్కించిన దేహాలూ, శోకించని కన్నులతో
దేనికోసమో ఎదురుచూస్తూ కూచున్న ముసలీ ముతకా..
మనుషుల అలికిడే వినబడదు
నలుగురు నడిచిన బాటలనే కప్పేస్తూ పిచ్చిగా
అల్లుకుపోయిన గడ్డి..
చీకటి చెదలో చీడపురుగులో నెమ్మదినెమ్మదిగా
లోలోపల్నుంచే నమిలేస్తూ
శ్మశానం ఉత్తరాన్నుంచి ఊళ్ళోకి పాములా పాకుతూ
వచ్చి కబళించివేస్తూంది
మా ఊరిప్పుడు చచ్చిపోయిందో చచ్చిపోతూ ఉందో తెలియదు

ఒక రాజ్యం శిథిలమవుతున్న విధం తెలుస్తూంది
అట్లా ఎందుకు అయిందో ఎప్పటికీ తెలియకపోయినా!
కర్ణుడి చావుకు కారణమొకరని చెప్పలేం
అసలు శత్రువు ఎవరో ఎట్లా పసిగట్టగలం

బహుశా ఇది ఒక్క మా ఊరికథే కాకపోవచ్చు..
బహుశా ఇది నా ఒక్కడి దుఃఖమే కాకపోవచ్చు
అయినా కన్నీళ్ళు చిప్పిల్లకుండా జాగ్రత్తపడి
నాలుగు సిమిలీలూ రెండు మెటాఫర్లూ వెతుక్కుని
దుఃఖాన్ని కవిత్వంలోకి అనువదించుకుని
చేతులు దులిపేసుకుని తిరిగి
నా బతుకు పెట్టెలోకి ఒద్దికగా ముడుచుకుంటాను

ఎప్పుడన్నా అదంతా ఒక బాధావీచికై లేచి
కళ్ళల్లోకి దుమ్ము చిమ్ముతుంది గుండెకో దుఃఖపు పొర కమ్ముతుంది
మరుక్షణం మళ్ళీ మామూలే
అంతకుమించి నాకూ నా వూరికీ మధ్య బంధమేదీ ఉండదు
బహుశా అంతకంటే దుఃఖకారకమూ మరొకటి ఉండబోదు

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...