రాగాలూ స్వరాలూ

(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లోని లోతుపాతులను తేలికైన భావాల్లో వివరిస్తూ రాస్తున్న వ్యాసాలు “ఈమాట” పాఠకులకు చిరపరిచితాలు. సితార్‌ వాద్యకారుడిగా, గాయకుడిగా, సంగీతప్రయోక్తగా ఎంతో అనుభవం ఉన్న వీరి వ్యాసాలు సంగీతజ్ఞులకూ, (సంగీత)అజ్ఞులకూ కూడా ఆనందం కలిగిస్తున్నాయి.)

బహుశ మరేదేశపు సంగీతానికీ లేని ప్రత్యేకత మనకి ఉన్న రాగ పద్ధతి. సంగీతం తెలిసినవాళ్ళు ఎవరేది పాడినా, వాయిద్యంపై వాయించినా “ఇది ఫలానా రాగం” అని చెప్పేస్తూ ఉంటారు. తెలియనివాళ్ళకి ఇదంతా ఏదో ఛాదస్తం అనిపిస్తుంది. అసలు మనవాళ్ళకి ప్రతిదాన్నీ “క్లాసిఫై” చేసే అలవాటుంది. మిగతా విషయాల్లో అది పనికొస్తుందో లేదో కాని, సంగీతంలో మాత్రం ఈ గుర్తింపు తప్పనిసరి.

అసలు రాగం అంటే ఏమిటి? ప్రఖ్యాత సితార్‌ విద్వాంసుడు రవిశంకర్‌ చెప్పినట్టు, రాగం అంటే ఏమిటో చెప్పడంకన్నా, ఏది రాగం కాదో చెప్పడం సులభం. రాగం అనేది కేవలం స్వరాల సముదాయం కాదు. కేవలం ఒక ట్యూనో, బాణీయో కాదు. కానీ రాగంలో అవన్నీ ఉంటాయి. హిందూస్తానీ సంగీతంలో “మనసును రంగుతో నింపేదాన్ని రాగం అనా”లని అంటారు. ప్రఖ్యాత సంగీతకారుడూ, ప్రయోక్తా డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారిని “మీరు రాసిన పాటలకు బాణీ ఎలా కడతారు?” అని అడిగితే “పాటలోని భావం నా మనసుకు వెల్ల వేస్తుంది” అన్నారు. తన భావాలను ఒక వాగ్గేయకారుడు ఇంతకంటే బాగా ఎలా చెప్పగలడు?

అసలు రాగాలనేవి ఎలా, ఎప్పుడు వచ్చాయి? స్వరాలంటే ఏమిటి? వీటిని గురించి పెద్ద పెద్ద విద్వాంసులూ, పండితులూ చాలా పరిశోధనలు చేసి వ్యాసాలు రాసారు. ప్రజలు పాడుకొనే పాటలే, రాగాలకు మూలం. వారి భావాలే, రాగానికి ఆధారం. వారికి  స్వరాలంటే ఏమిటోననే అవగాహన ఉండకపోవచ్చు. దీన్నే మనవాళ్ళు దేశి (జానపద)  సంగీతం అన్నారు. సంగీతం క్రమబద్ధం అయ్యే దశలో, పండితులు వాటిని శాస్త్రీయ సంగీతంలో భాగాలుగా స్వీకరించక తప్పలేదు. ఇకపోతే, మనదేశానికి సామగానం వంటి వేద సాంప్రదాయం ఉంది కాబట్టి, ఏ శబ్దాన్ని ఏ స్థాయిలో ఉచ్ఛరించాలో నిర్దేశించడం అవసరమైంది. వేదపఠనంలో, మొదట్లో మూడు స్వరాలున్నా, తరవాత ఇతర స్వరాల ఏర్పాటు జరిగి ఉంటుందని ఊహించవచ్చు! ఇటువంటి ధోరణిలో, నిర్దుష్టతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుచేత మన శాస్త్రీయ సంగీతంలో, జానపద ధోరణికన్నా, ఈ “పండిత” లక్షణం బలపడడంలో ఆశ్చర్యంలేదు. పాశ్చాత్యపు సంగీతం కూడా, కొంతవరకు మధ్యయుగపు చర్చిలలో, బృందగానాల్లో పరిణతి చెందినప్పటికీ, తరవాత కంపోజర్లు కొన్ని సమకాలీన ఇతివృత్తాలను స్వీకరించి రచనలు చేసారు (ఉదాహరణకు బెథోవెన్‌ మూడో సింఫనీ, నెపోలియన్‌ ప్రభావంతో రచించాడుట!). మనవాళ్ళు మాత్రం పురాణాలమీదే ఆధారపడ్డారు. దక్షిణాదిలో “రామభక్తి” ప్రధానం కాగా, ఉత్తరాదిలో “రాధాకృష్ణుల” ప్రసక్తి  ఎక్కువ. ఈనాటి కంపోజర్లు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు.

మనదేశంలో నిత్యజీవితంలోని ప్రతిఘట్టానికీ సంబంధించిన సంగీతం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పెళ్ళిపాటలూ, లాలిపాటలే కాదు, ఇంటింటా జరిగే పూజలూ వగైరాలవల్ల రకరకాల సంగీతం నిత్యమూ మన చెవుల పడుతూనే ఉంటుంది.అందుకని సంగీతం జోలికి పోకుండా, ఏ సినిమాల్లోనో వినబడే నేపధ్య సంగీతం మాత్రమే విన్నవారికి కూడా, పేర్లు తెలియకపోయినా ఏ రాగం ఎటువంటి మూడ్‌ను సూచిస్తుందో చూచాయగా తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతపు ధోరణినిబట్టి చూస్తే కర్ణాటక సంగీతం దేవాలయాలలో పెరిగిందనీ, ఉత్తరాది సంగీతం రాచదర్బారుల్లో ఎదిగినదనీ తెలిసిపోతుంది. పూజలూ, కర్మకాండలూ మనకంటే ఎక్కువగా జరిపే తమిళులకు శాస్త్రీయ సంగీతంతో ఎక్కువ పరిచయం ఉండడంలో ఆశ్చర్యం లేదు (తమిళులందరూ సంగీత జ్ఞానులు అనుకునే తెలుగువారికి, అది తమిళ బ్రాహ్మణులకే ఎక్కువగా వర్తిస్తుందని చెప్పడం అవసరం).

ఇక స్వరాల సంగతి. “సప్తస్వరాల” సంఖ్య నిజానికి 12. స, ప లు తప్ప “రి, గ, మ, ధ, ని” లు రెండేసి ఉంటాయి. వీటిలో మొదటిది “కోమలం”,  రెండోది “తీవ్రం”. ఈరోజుల్లో హార్మోనియంలూ, ఎలక్ట్రానిక్‌ కీబోర్డులూ ప్రతివారికీ అందుబాటులో ఉన్నాయి. పాట నేర్చుకోటానికీ, స్వరస్థానాలు గుర్తుపట్టటానికీ ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి (“ఈమాట” సంచికల్లో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న వివరిస్తున్న రాగాల లక్షణాలను తెలుసుకోటానికి, ఆయన ఉదహరిస్తున్న సినిమా పాటలూ, వాటి స్వరాలూ బాగా పనికొస్తాయి). కాని ఇటువంటి వాయిద్యాల్లో వెస్టర్న్‌ సంగీతంలో ఉన్న 12 స్వరాలే ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో తప్ప చాలామటుకు వీటితో పని జరిగి పోతుంది. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో మాత్రం ఇవి చాలవు. ఎందుకంటే, కొన్ని రాగాలు ఈ చట్రంలో సరిగ్గా ఇమడవు. ఉదాహరణగా కర్ణాటక సంగీతంలోని ఆరభి ( సాధించెనే), దేవగాంధారి  (క్షీరసాగర శయనా) రాగాలను తీసుకోవచ్చు. ఈరెండు రాగాల ఆరోహణా (స రి గ మ ప ధ స), అవరోహణా (స ని ధ ప మ గ రి స) ఒకటే అయినా, పలకడంలో తేడా  ఉంటుంది. దేవగాంధారిలా కాకుండా, ఆరభిలో నిషాదం షడ్జమానికీ, గాంధారం మధ్యమానికీ అతి దగ్గరగా ఉంటాయి. ఇది పాట వింటే కాని తెలియదు. కేవలం పుస్తకంలో చూసి కీబోర్డు మీద వాయించబోతే ఈ తేడా వినిపించదు. అలాగే, హిందూస్తానీ దర్బారీ కానడలో (శివశంకరీ) గాంధారం రిషభానికి దగ్గరగానూ, భాగేశ్వరి (నీ కోసమె నే జీవించునది) ఆరోహణలో గాంధారం మధ్యమానికీ దగ్గరగా ఉంటాయి (ఎటొచ్చీ శాస్త్రీయ సంగీతంలో వినిపించినంత స్పష్టంగా ఈ లక్షణాలు పైన చెప్పిన సినిమా పాటల్లో వినపడవు). ఇలాటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ కారణాలవల్ల వి. బి. కేస్కర్‌ మంత్రిగా ఉన్నప్పుడు, రేడియోలో హార్మోనియం ఉపయోగాన్ని నిషేధించారు.

రాగాలు భాష అయితే స్వరాలూ, తక్కిన నిబంధనలు వ్యాకరణం వంటివి. వీటిలో ముఖ్యమైనది రాగపు ఆరోహణ, అవరోహణల్లో లేని “అపస్వరాలు” పడకూడదనే నిబంధన. భాష పుట్టాకనే వ్యాకరణం ఏర్పడుతుంది. మనవాళ్ళ రాగాల క్లాసిఫికేషన్‌ పద్ధతిలో జనక రాగాలనేవి ఉంటాయి.అంటే తక్కినవన్నీ వీటికి “పుట్టిన” జన్య రాగాలన్నమాట. జనక రాగాలను మేళకర్తలని  కూడా అంటారు. రాగం అనేదానికి కనీసం 5 స్వరాలుండాలని శాస్త్రం చెపుతుంది (ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ మాత్రం 4 లేక 3 స్వరాలతో కూడా రాగాలను విజయవంతంగా సృష్టించారు). ఇవి మొత్తం స్వరాలలో ఏవైనా కావచ్చు, ఏ వరసలోనైనా ఉండవచ్చు. ఆరోహణలో ఉన్న స్వరాలే అవరోహణలో ఉండాలని లేదు. మేళకర్త రాగాలు మాత్రం “వక్రగతి” లేకుండా సాఫీగా “స  రి గ మ ప ధ ని” స్వరాలన్నీ కలిగి, ఆరోహణ, అవరోహణల్లో ఒకే స్వరాలతో ఉంటాయి. కర్ణాటక తోడి (సంపూర్ణ రామాయణం సినిమాలో “వెడలెను కోదండపాణి”), భైరవి (విరిబోణి వర్ణం) వంటి రాగాలు పైన చెప్పిన 12 స్వరాల్లో ఇమడవు. నాట (జగదానంద కారకా) వంటి ప్రసిద్ధ రాగాలు కూడా ఇటువంటివే! కొన్ని రాగాలకు స్పష్టమైన జానపద లక్షణాలుంటాయి. ఉదాహరణకు, పున్నాగవరాళి (కనకశైల విహారిణీ) అనే రాగం వింటే పాములవాళ్ళ నాగస్వరం స్ఫురిస్తుంది.ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న ఇటువంటి రాగాలకు 12 స్వరాల కాంబినేషన్తో ఏర్పడిన జనకరాగాలు సరిపోవు. అందుకని, వీటన్నిటికీ కర్ణాటక సంగీతంలో 16 స్వరాలు ఏర్పాటుచేసి “వివాది” మేళకర్తలు సృష్టించారు. 12 స్వరాలతో 32 మేళకర్తలే ఉంటాయి. కాని, 16 స్వరాలతో 72 మేళకర్తలు వస్తాయి. వీటితో అన్నిరాగాలకూ “జనన సౌకర్యం” ఏర్పడింది.

స్వరాలు ఒకటే అయినా, లక్షణాల్లో తేడాలున్న రాగాలు హిందూస్తానీ పద్ధతిలో కొన్ని ఉన్నాయి. కర్ణాటక హంసానందిని పోలిన హిందూస్తానీ రాగం “సోహినీ” (“హాయి హాయిగా ఆమనిసాగే”), మార్వా (“పాయలియా బావరీ బాజే” అనే లతా పాట), పూర్యా (దీనికి పాప్యులర్‌ ఉదాహరణలు కనిపించవు) ఒకే స్వరాలను కలిగిన విభిన్నమైన రాగాలు. సోహినీ ఉత్తరాంగ ప్రధానమైనది. అంటే, రాగ సంచారం పై షడ్జమం దగ్గరే జరుగుతుంది. పూర్యాలో ఇందుకు భిన్నంగా మంద్రస్థాయిలో ఎక్కువగా సంచారం చెయ్యాలి. అంతే తేడా! మంద్రంగా, గంభీరంగా వినబడే దర్బారీకానడను పోలిన అడానా (ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే) రాగం ఉత్తరాంగ ప్రధానం. శంకరాభరణం సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ఆ రాగానికి న్యాయం చేకూర్చలేదు (ఈ టైటిల్‌ సాంగ్‌ లో శంకరాభరణం రాగలక్షణం ఎంతున్నదన్న విషయం సంగీతజ్ఞులకు తెలుసు)! కాంభోజిలా పైస్థాయిలో నిలపవలసిన రాగం కాదది. మన శాస్త్రీయ సంగీతంలో వినడానికి బావుండడం ఒక్కటే పరమావధి కాదు! రాగపు “పరిశుద్ధత” చెడకుండా చూసుకోవడం మరింత ముఖ్యం.

సంప్రదాయం, “పలుకుబడి” (ప్రయోగాల) దృష్య్టా, ప్రతీ రాగానికీ ఒక స్వభావం ఉంటుంది. సంగీతకారుడికి ఏదో ఒకరాగం తెలిస్తే చాలదు.దాన్ని పోలిన “ఇరుగు పొరుగు” రాగాలు కూడా తెలియాలి.  ఇతర రాగాలతో “సంకరం” జరగకూడదు. పోలికలున్న అనేక రాగాలలో ఒకదాన్ని తీసుకొని ఆలాపన చెయ్యడం కత్తిమీద సాము వంటిది. అలాగని అన్నీ “పడికట్టురాళ్ళు” వేసి పాడినా మెచ్చరు.కొన్ని లిబర్టీస్‌ తీసుకోవాలి. అదే క్రియేటివిటీ కదా! కాని ఇది ఎంతవరకు అనుమతించవచ్చు? దాన్ని పోలిన మరో రాగంలా అనిపించనంతవరకు ఫరవాలేదు.

రాగాలను గుర్తుపట్టడం నేర్చుకోవాలంటే, ముందుగా వాటి స్వరూపాన్ని స్థూలంగానైనా తెలుసుకోవాలి. మనుషుల్లో నల్లవాళ్ళకీ, తెల్లవాళ్ళకీ, పసుపుపచ్చవాళ్ళకీ కొట్టవచ్చేట్టు కనబడే తేడాలున్నట్టే, రాగాల్లోనూ  ఉన్నాయి. ముందు ఈ “రంగుల” తేడాలు తెలిస్తే, ఆ తరవాత “పసుపుపచ్చని” రాగాల్లో “చైనా” వారికీ, “జపాన్‌, కొరియా” వారికీ ఉన్న తేడాలు పసికట్టవచ్చు. ఉదాహరణకు మాయామాళవగౌళకూ, అభేరికీ ఉన్న తేడా అభేరికీ, ఖరహరప్రియకూ మధ్యనుండే తేడా కంటే ఎక్కువ. “కోమల” రిషభం, ధైవతం ఉన్న రాగాలు కాస్త “దిగులు”గా అనిపిస్తాయి. “తీవ్ర” రిషభం, ధైవతాలతో కోమల గాంధార, నిషాదాలున్న రాగాలు “మధురం”గా ఉంటాయి. ఈ సందర్భంలో, రాగాలను గుర్తు పట్టడానికి సినిమా పాటలను ఆధారంగా చేసుకోవడం చాలా సులువైన పని. దేవదాసు సినిమాలో “అందాల ఆనందం” పహాడి రాగానిదైతే, “కలయిదనీ నిజమిదనీ” లోని విషాదం వకుళాభరణం రాగానిది. “చక్రవాకం” అంటే ఏదో పేద్ద పేరులా ఉంటుందికాని, పెళ్ళిచేసిచూడు సినిమాలో “ఏడుకొండలవాడ” అనే పాట అదే రాగం అనితెలిస్తే ఇబ్బంది ఉండదు. అలాగే చారుకేశి రాగంలో, భళిభళి దేవా (మాయాబజార్‌), ఎవరో ఎవరో (పెళ్ళిచేసిచూడు), ఊరేది పేరేది ( రాజమకుటం), ఈ పగలురేయిగా (సిరిసంపదలు) మొదలైన పాటలున్నాయి. దీన్నిబట్టి రాగాల మూడ్‌ను నిర్ణయించేవి అందులో ఉన్న స్వరాలేనని తెలుస్తోంది. ఈ రాగంలో ఏ స్వరాలున్నాయో నిర్ధారణ అయ్యాక, ఆ స్వరాల మధ్యనుండే పరస్పర సంబంధం, వాటిని కలిపే గమకాలూ, రాగ స్వరూపంలో ముఖ్యమైన అంశాలవుతాయి. పాడేటప్పుడు నిలపవలసిన స్వరాల (వాది, సంవాది వగైరా) ప్రాముఖ్యత, హిందూస్తానీ పద్ధతిలో కాస్త హెచ్చు. ఇవికాక, చాలా రాగాలకు ప్రత్యేకత నాపాదించే లక్షణాలు (పకడ్‌) రాగ ప్రస్తారంలో “చూపిస్తూ” ఉండాలి. ఒక రాగం తెలియడమనేది, ఒక వ్యక్తిని తెలుసుకున్నట్టే ఉంటుంది. వినికిడితోనూ, సాధనతోనూ ఒక రాగాన్ని ఎన్ని కోణాలనుంచి “వర్ణించవచ్చునో” అర్ధమౌతుంది.

మన సంగీతం ఈ విధంగా రోజువారీ ప్రపంచం నుంచి వేరయి, క్రమంగా ఎంతో పరిణామం చెందడం వల్ల, పాటలతో సంబంధం లేకపోయినా, ప్రతి రాగానికి తనదంటూ ఒక స్వభావం ఏర్పడిపోయింది.అది అర్ధం  చేసుకున్న వాళ్ళు “వర్చువల్‌ రియాలిటీ” ప్రపంచంలో విహరిస్తూ ఆనందిస్తూ ఉంటారు. బైట ఉన్నవాళ్ళకు మాత్రం అదంతా అయోమయంగా అనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం శాస్త్రీయ సంగీతానికి “సామాజిక స్పృహ” లేకపోవడం! ఇవాళ ఒక కధో, కవిత్వమో రాస్తే అందులో చర్చించిన, చర్చించని విషయాల గురించి విమర్శకులు “కుడి, ఎడమల” నుంచి రచయితపై విరుచుకు పడతారు. శాస్త్రీయ సంగీతంలో అటువంటి ఇబ్బంది లేదు.

మొత్తం మీద రాగాలకు స్వరాలు ప్రధానమే అయినా, రాగానికి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. కొన్ని సినిమా పాటలు రాగాల మీద ఆధారపడినా, రాగలక్షణాలన్నీ ప్రతిపాటలోనూ కనపడాలన్న నిబంధన లేదు. అందుకని, రాగాలని గుర్తు పట్టడానికి సినిమా పాటలు ఒక “షార్ట్‌ కట్‌” గానే భావించాలి.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...