అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

“ఈమాట” ఈ సంచికా కాలంలోనే, అంటే వచ్చే సంచిక వచ్చే లోగానే, మరో ఉగాది రాబోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఈ సంచికలో దళితకవిత్వ, దళితవాదకవిత్వ ఉద్యమాల గురించి శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి విశ్లేషణాత్మక వ్యాసం ఒకటి ఇస్తున్నాం. ఈనాటి తెలుగు కవిత్వం గురించి ఏమాత్రం ఉత్సుకత ఉన్నవారికైనా ఈవ్యాసం ఉపయోగకరంగా ఉంటుందని మా భావన.
వేమూరి వేంకటేశ్వరరావు గారి కథ కొత్తగా కలం పడుతున్న వారికే కాక చెయ్యి తిరిగిన కథకులకు కూడ భాషాప్రయోగ రీతుల్లో మార్గదర్శకం కాగలిగింది. ఎన్నో జాతీయాల్ని, నుడికారాల్ని అతిసహజంగా వాడే ఇలాటి రచనలు అతితక్కువగా కనిపిస్తోన్న నేపథ్యంలో శ్రీ వేమూరి వారి కృషిని అభినందించి తీరాలి.
ఇక కనకప్రసాద్‌ ధారావాహిక నాటిక, సంగీత విశేషాల మీద వ్యాసాలు, ఆలోచింపజేసే కవితలు, ఆహ్లాదం కలిగించే కథలు మొత్తం మీద “ఈమాట” పాఠకులు ఆశించే విధంగా ఈ పత్రికను తీసుకురావడానికి కారకులైన రచయిత్రు(త)లందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా ఎందరో రచయిత్రు(త)లు ముందుకు వచ్చి వారి అనుభవాల్ని, ఆలోచనల్ని అందరితోనూ పంచుకోవాలని, పంచుకుంటారని మా ఆకాంక్ష.