తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు

(సెప్టెంబరు 2-3 తారీకుల్లో డాలస్‌ ఫోర్టువర్తు, టెక్సాస్‌లో జరిగిన తానా ప్రాంతీయ మహా సభల్లో, ప్రఖ్యాత సినీగేయ రచయిత శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు చేసిన ప్రధాన ప్రసంగ వ్యాసమిది. 3వ తారీకు రోజల్లా జరిగిన సాహితీ సమావేశంలో రెండు గంటలకి పైగా జరిగిన ఈ ప్రసంగంలోని కొన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. ఈ వ్యాసంలో భాష నాదయినా, భావాలు అభిప్రాయాలు శ్రీ వేటూరివే!)

సంగీత దర్శకులు మొత్తం సంగీతంతోటే “భావ ప్రాప్తి” కలిగిస్తున్నప్పుడు, ఇక పాటలోని సాహిత్యం ఎవరికి కావాలి? పాటలోని సాహిత్యానికి తగ్గట్టు సంగీతం ఇవ్వటం శ్రీ రమేష్‌ నాయుడు గారి వద్ద చూసాను.

నేను సినిమా పాటలు రాయటానికి పూర్వం కొంతకాలం పత్రికల్లో పనిచేసాను. తెలుగు భాష, సాహిత్యాలపై నాకు ఇష్టం కావడానికి కారణం మా పెదనాన్న గారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, తెలుగులో ప్రథమ జ్ఞానపీఠ గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గార్లు. సుమారు 1960 సంవత్సర ప్రాంతాల్లో మొదట ఆంధ్ర పత్రికలో పని మొదలు పెట్టాను. నెమ్మదిగా నన్ను ఆంధ్రపత్రిక వీక్లీకి సహాయ సంపాదకుడుగా వేసుకున్నారు. తరవాత కొంతకాలం ఆంధ్రప్రభ డైలీకి Chief Sub-editor గా ఉన్నాను. పత్రికల్లో పనిచేస్తున్నప్పుడే ప్రముఖ జర్నలిస్ట్‌శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆయన దగ్గరనుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఒకసారి ఏదో విషయమై ఒక item రిపోర్ట్‌చెయ్యవలసి వచ్చి, కొంచెం పొయిటిక్‌గా ఉంటుంది కదా అని నా కవిత్వ ధోరణిలో పెట్టిన హెడ్డింగు చూసి ఆయన నన్ను మెత్తగా మందలించారు. “Prose ఎప్పుడూ poetryగా రాయకూడదు!” అన్న విషయాన్ని ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఆ ప్రాంతంలోనే అనుకుంటా, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు చనిపోయిన వార్తని పేపర్లో ఎలా రిపోర్ట్‌చెయ్యాలా అని ఆలోచించి “ప్రకాశహీనమైన ఆంధ్రప్రదేశ్‌” అన్న హెడ్డింగుతో పూర్తి కవరేజి ఇచ్చాను. అది చూసి శ్రీ నార్ల గారు ఎంతో మెచ్చుకొని “న్యూస్‌పేపర్లో ఎలా రిపోర్ట్‌ చెయ్యాలో, మన ఆంధ్రప్రభని చూసి మిగిలిన పేపర్లు నేర్చుకోవాలి” అన్నారు. అది నాకు ఒక compliment.

ఆ రోజుల్లోనే ఆంధ్రపత్రిక వీక్లీకి “సినిమా కాలమ్‌” కి నన్ను ఇన్‌చార్జ్‌గా వేసారు. అప్పటికే సూపర్‌స్టార్‌లయిన NTR, ANR ల సినిమా విశేషాలు నేను కవర్‌ చేస్తూ ఉండేవాణ్ణి. కాని ఏది పడితే అది రాయటానికి వీలుండేది కాదు. ముఖ్యంగా NTR గురించి రాయవలసి వస్తే, ముందు NTR ని కలిసి ఆయనకు చదివి వినిపించి, approve అయిన తరవాతే పత్రికలో ప్రచురించే పరిస్థితి అది! అలాగే NTRతో పరిచయం ప్రారంభం అయింది.

NTR నన్ను సినిమాల్లో చేరమని ఎంతో ప్రొత్సహించే వారు. నాకు అంత ఇష్టం ఉండేది కాదు. కారణం ఏమిటంటే, నాకు సినిమా ఫీల్డ్‌గురించి ఎక్కువ తెలియక పోవడం వల్ల కొంత భయం ఉండేది. ఏదో వంక పెట్టి, NTR కలవమన్న వ్యక్తులను కలిసేవాడిని కాదు. ఒకసారి NTR నాకోసం కబురు పంపించారు. అప్పుడు ఆయన హైదరాబాదులో, OLd MLA Quarters దగ్గరలో ఉండేవారు. సాధారణంగా ఆయన రోజూ రాత్రి 9 గంటలకు పడుకొంటారని తెలిసి, కావాలనే ఆ రోజు రాత్రి 10 గంటలకు అక్కడకి వెళ్ళాను. “ఆయన నిద్ర పోతున్నారు, ఇప్పుడు కలవటానికి వీల్లేదు” అని అక్కడ వాళ్ళు చెపితే కలవకుండా తిరిగి రావచ్చు కదా అని నా ఆలోచన. కాని నాకోసం NTR రాత్రి పది గంటలకు కూడా మెలుకువగా ఉన్నారు. నన్ను కూర్చోపెట్టి మందలించటం మొదలు పెట్టారు. “ఏమిటి మీరు చేస్తున్నారు? మేము కలవమన్న వ్యక్తులను మీరు ఎందుకు కలవలేదు? మా మాటంటే మీకు అంత లక్ష్యం లేదా!” ఇలా సాగాయి ప్రశ్నల బాణాలు. ఏమి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. సరే ఇలా కాదని, మర్నాడు NTR కలవమన్న వ్యక్తుల దగ్గరికి వెడితే నేను ఎవరో తెలియదన్నట్టు మాట్లాడారు. NTR తో ఉన్నప్పుడు ఒక మాట. ఆయన లేనప్పుడు ఒక మాట. సినిమా వాళ్లమీద నాకు నమ్మకం పోయింది.

ఇలా సినిమాల్లో చేరే ప్రయత్నాలు విఫలం కావడంతో నేను ఇంక ఎక్కువ ప్రయత్నాలు చెయ్యలేదు. NTR నటించిన “దీక్ష” సినిమాలో మెదటిసారిగా నేను సినిమాకు గీతరచన చేసాను. అది సినిమాలో రాలేదు. 1972 సంవత్సరం “ఓ సీత కధ” సినిమాలో శ్రీమతి లీల పాడిన హరికధతో, సినిమా డైరెక్టర్‌ శ్రీ కె. విశ్వనాధ్‌ ప్రోత్సాహంతో సినిమా పాటల రచయితగా మొదలెట్టాను. ఇక అక్కడ నుంచి వరసగా సినిమాలకి పాటలు రాస్తూ వచ్చాను. ఇప్పటికి సుమారు 9,000 కి పైగా పాటలు రాసాను. మీముందు దాచటం ఎందుకు? కొన్ని చెత్త పాటల సాహిత్యానికి కూడా నేను కారకుణ్ణి. సినీఫీల్డ్‌లో కాంపిటీషన్‌గురించి అందరికి తెలిసిందే! ఒకసారి ప్రఖ్యాత సినీ గేయ రచయిత ఆత్రేయ గారు నాతో “ఏమయ్యా? నువ్వు ఇప్పుడే పాటల రచయితగా రావాలా! ఒక పది ఏళ్ళు ఆగి వస్తే నీకు ఏం తక్కువయ్యేది?” అన్నారు. నాకు ఆత్రేయగారంటే గౌరవం. సినీ ప్రపంచంలో ఇలాంటివి మామూలే కదా అని ఊరుకొన్నాను.

సినిమా పాటల రచయితగా నేను చాలామంది సంగీత దర్శకులతో కలిసి పనిచేయవలసిన సందర్భాలు అనేకం. ఇక్కడ అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ, ముఖ్యంగా ముగ్గురు సంగీత దర్శకుల గురించి చెప్తాను. నాకు సినిమా ఫీల్డ్‌లోకి రాక ముందు సంగీత దర్శకుడు శ్రీ కె. వి. మహాదేవన్‌మీద అంత మంచి అభిప్రాయం లేదు! అవి “అడవి రాముడు” సినిమా తీస్తున్న రోజులు. “ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చే మాకళ్ళకు” పాట రాసి, మహాదేవన్‌కి ఇచ్చాను. ఆయన దాన్ని ఒకసారి పైనుంచి కిందకు చూసి, కంపోజ్‌ చెయ్యటం మొదలుపెట్టి పూర్తిచేసారు. సరే, రెండవపాట “అమ్మతోడు అబ్బతోడు నాతోడు నీతోడు” తీసికెళ్ళి ఇచ్చా! ఒక చిన్న నిట్టూర్పు విడిచి, స్వరాలు వెదుక్కోవటంలో ములిగి పోయారు. తరవాత రెండు పాటలకి (“కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడీ..”, “కృషి ఉంటే మనుషులు ..” ) కూడా ఇలాగే జరిగింది. నాకు ఒకపక్క భయం. “ఏమిటి? సాహిత్యం బాగా లేదా!” అని. మహాదేవన్‌ఒక్క మాట మాట్లాడ లేదు. ఆ తరవాత పాట ” ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి..” పాట స్క్రిప్ట్‌పట్టుకెళ్ళా! అప్పట్లో ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఈ పాటని కోటి రూపాయల పాట అనేవారు. నేను ఒరిజినల్‌గా ” అరెరెరెరెరె .. ఆరేసుకోబోయి పారేసుకున్నాను …” అని రాసా (” అరెరెరెరెరె .. ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ ..” అన్న ఫక్కీలో అనుకుంటా). ఇక ఈ పాట రచన చూసి, మొహం చిట్లించి, “ఇలా అరెరెరెరె .. తో మొదలుపెడితే బాగోదు. దాన్ని కాస్తా హరి, హరి క్రింద మార్చి, ఆరేసుకొబోయి పారేసుకున్నాను తరవాత పెడితే బాగుంటుంది” అన్నారు. అలా ఆ పాట కంపోజింగ్‌అయిపోయింది. ఇక ఆఖరి పాట. “చూడర చూడర సులేమాన్మియా…” అని రచన పూర్తి చేసి ఆయన దగ్గరకు వెళ్ళా. పాట చూస్తూనే మహాదేవన్‌ తల కొట్టుకుంటూ “అన్నీ ఇలా ఒకే తాళంలో రాస్తే కంపోజ్‌చెయ్యటం ఎట్లా?” అని బాధ పడ్డారు. అప్పటికి నాకు మ్యూజిక్‌కంపోజింగ్‌లో ఉండే సాధక బాధకాల గురించి ఏమీ తెలియదు. తాళం మిగిలిన పాటలకన్నా తేడాగా ఉంచటం కోసం, నాలుగుసార్లు “చూడర” అన్న పదం వాడి మిగిలిన పాటలకన్నా తాళంలో వైవిద్యం చూపిస్తూ, ఆ చివరి పాట పూర్తి చేసారు. “అడవి రాముడు” సినిమా తరవాత అనేక సినిమాల్లో శ్రీ కె. వి. మహాదేవన్‌తో కలిసి పనిచేసాను. తరవాత తరవాత నాకు ఆయన పట్ల అభిప్రాయం మారి, నేను గౌరవించే సంగీత దర్శకుల్లో ముఖ్యుడుగా ఉండిపోయారు.

“శంకరాభరణం” సినిమా ప్రారంభంలో దర్శకుడు శ్రీ కె. విశ్వనాధ్‌నన్ను సినిమా షూటింగ్‌ముందు జరిగే పూజకి రమ్మన్నారు. సరే అని వెళ్ళాను. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో తియ్యబోయే సినిమాకు సంబంధించిన ఒక 50, 60 మందికి తక్కువ లేకుండా వచ్చి కొబ్బరి కాయలు కొట్టి, పూజ చేయడం ఆనవాయితీ. నేను వెళ్ళేసరికి రెండే రెండు కొబ్బరికాయలు కనపడ్డాయి! నాకు అర్ధం కాలేదు. అప్పుడు విశ్వనాధ్‌గారు నన్ను, మహాదేవన్‌గార్ని పక్కకి పిలిచి” నా సినిమా కధలోని హీరో 60 ఏళ్ళవాడు. నిజానికి ఈ సినిమాకి మీరిద్దరే హీరోలు. సినిమా ఫ్లాప్‌అయినా సక్సెస్‌అయినా అది మీ ఇద్దరి చేతుల్లో మాత్రమే ఉంది” అన్నారు. తరవాత ఏం జరిగింది అన్నది మీకందరికి తెలిసిందే!

మనకున్న వాళ్లలో మరో ముఖ్య సంగీత దర్శకుడు ఇళయరాజా. ఒక సినిమాకు పని చేస్తున్నప్పుడు, ఆ నిర్మాత నాతో “మీరు వెళ్ళి ఇళయరాజాను కలవండి” అన్నాడు. అలాగే అని ఇళయరాజాను చూట్టానికి ఆయన దగ్గరకి వెళ్ళాను.”మీరు ఇక్కడే కూర్చోండి. ఇళయరాజా గారు పనిలో ఉన్నారు. అది అవగానే మిమ్మల్ని పిలుస్తారు” అని చెప్పి నన్ను కూర్చోపెట్టారు. ఒక ఐదు నిమషాల తరవాత పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళి ఇళయరాజా గార్ని కలిసాను.” ఇప్పటి దాకా తమిళ్‌సినిమాకి పాటలు కంపోజ్‌ చేస్తూ ఉన్నాను. పాటల ట్యూన్‌లు బాగా వచ్చాయి. అబ్బా! ఏం రాస్తాడయ్యా ఆ కణ్ణదాసన్‌. అది సరే కాని ఇప్పుడు నేను బిజీ. రేపు వచ్చి కలవండి” అన్నారు ఇళయరాజా. నాకు కోపం వచ్చింది. ” నేను కూడా బిజీ ఆర్టిష్టునండి! మీకు మీ టైమ్‌ ఎంత ముఖ్యమో, నాకు నా టైమ్‌అంత ముఖ్యం. ఏదో నిర్మాతగారు కలవమన్నారు కదా అని వచ్చాను. మాట్లాడితే ఇప్పుడు మాట్లాడండి. రేపు నాకు వీలు కుదరదు” అన్నాను. “ఓహో, అలాగా! అయితే, ఈ ట్యూన్‌కి రచన ఇప్పుడు ఇవ్వగలరా?” అని ఇళయరాజా పాడి వినిపించారు. “సరే రాసుకోండి” అని చెప్పి ” సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో …” అంటూ చెప్పటం మొదలు పెట్టా! ఇళయరాజా ఆశ్చర్య పోయారు. “తమిళ్‌లోని ఒరిజినల్‌పాటకంటే బాగుందే” అని నన్ను మెచ్చుకున్నారు. ఆ సంఘటన తరవాత ఇళయరాజా సంగీత సారధ్యంలో కొన్ని వందల పాటలు రాసాను.

మరొక అనుభవం ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ రమేష్‌నాయుడు గారితో. “మేఘసందేశం” సినిమాకి పాటలు రాస్తూ, పాటల రికార్డింగ్‌చూడటానికి audio recording studios కి వెళ్ళాను. మామూలుగా పాటలు రికార్డింగ్‌చేస్తున్నప్పుడు, 30-40 వయొలిన్లు, 10-15 వీణలు, ఇలా రకరకాల వాయిద్యాలతో కనీసం 100 మందికి పైగా సంగీత బృందంతో సంగీత దర్శకుడు మంచిమంచి effects ఇస్తూఉంటారు. కాని నేను వెళ్ళి చూసే సరికి రమేష్‌నాయుడు గారు మొత్తం 20 మంది కూడా లేని ఆర్కెస్ట్రాతో రికార్డింగ్‌మొదలు పెట్టారు. 3-4 వయొలిన్లు, 1-2 వీణలు, ఇలా అన్ని వాయిద్యాలు రెండు, మూడు మాత్రమే! ఇంత తక్కువ ఆర్కెస్ట్రాతో మంచి సంగీతం ఎలా వస్తుందో అని చూస్తున్నాను. జేసుదాసు పాడిన “ఆకాశదేశాన ఆషాఢ మాసాన .. ” అన్న పాట శివరంజని రాగంలో స్వరం చేసి, పాట మొదలవుతూనే చాలా మంచి మూడ్ ‌సెట్ ‌చేసి పాడిస్తున్నారు. మిగిలిన సంగీత దర్శకులు మొత్తం సంగీతంతోటే “భావ ప్రాప్తి” కలిగిస్తున్నప్పుడు, ఇక పాటలోని సాహిత్యం ఎవరికి కావాలి? పాటలోని సాహిత్యానికి తగ్గట్టు సంగీతం ఇవ్వటం శ్రీ రమేష్‌ నాయుడు గారి వద్ద చూసాను.

నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని మేము పాట రాయాలి.

నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని మేము పాట రాయాలి. నిజానికి ఇప్పటి సినిమాల్లోని పాటల సాహిత్యంలోని విలువలతో ఎవరికీ పని లేదు. ఏదో వాళ్ళడిగినట్టు రాస్తే పని అయిపోతుంది. సంవత్సరానికి రిలీజ్‌అయ్యే సినిమాల సంఖ్య కూడా ఇప్పుడు తక్కువైపోయింది. సంవత్సరానికి 40-42 సినిమాలకన్నా ఎక్కువ రావడంలేదు.

ఒక రెండు విషయాలు చెప్పి ఇక్కడికి ఈ ఉపన్యాసం ఆపుతాను. నా సాహిత్యాన్ని ప్రజలకు పరిచయం చేసిన “సినిమా” అన్న మీడియంకు నేను సర్వదా ఋణపడి ఉంటాను. ఈ “సినిమా” అన్నది లేకపోతే నేను చాలా మందికి తెలియదు. రెండవ విషయం అమెరికా వచ్చినప్పటి నుంచి కలుస్తున్న తెలుగు వాళ్ళను “మీరు ఏం పని చేస్తారు?” అని అడిగితే, అందరూ దాదాపుగా, ” computer software” అంటున్నారు.మీకున్న సాహిత్యాభిమానం, సాహిత్యంతో పరిచయం, ముఖ్యంగా మీరు మీమీ రంగాలలో సాధించిన ప్రగతి చూస్తుంటే, మీరు soft మనుషులు కారు! గట్టివారే అని అనిపిస్తోంది.