సంగమం

(విన్నకోట రవి శంకర్‌ కవిగా లబ్ధప్రతిష్టులు. ఈమాట పాఠకులకు చిరపరిచితులు. “కుండీలో మర్రిచెట్టు” వీరి తొలి కవితాసంకలనం. మరో సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉంది. సామాన్యానుభూతుల్ని సరికొత్త దృష్టితో చూస్తూ పైకి కనపడని లోతుల్ని బయటికి తీస్తుంటాయి వీరి కవితలు.)

ఆత్మలెప్పటికీ కలవవు
అంతరాత్మలు చెప్పిన మాట వినవు
మనసులు గతాన్ని మరువవు
దేహాలు మోహాన్ని విడువవు.

గిరగిరా తిరిగే
ఉద్రేకాల కాంతివలయాల మీద
ఎక్కడ కలుస్తారో, ఎక్కడ విడిపోతారో తెలియదు.
అలలలలుగా తాకే అనుభూతులలో
ఎవరెంతవరకూ తడుస్తారో తెలియదు.
ఏ ప్రపంచాల్ని కలసి కనుగొంటారో
వేటిని కలగంటారో తెలియదు.
కాని, ఇద్దరిదీ ఒకే ప్రయాణం.

తదేకతతో, తాదాత్మ్యతతో కలసినా,
ఒకరికొకరు గమ్యం కానేకాదు.
ఒక తీరం నుంచి మరొక తీరానికి చేర్చే వాహకమే గాని,
ఏ మనిషీ తనకు తానే ఒక తీరం కాదు.

ఎవరి లోతులు వారివి
ఎవరి ఈతలు వారివి
ఎవరి వెతుకులాటలు వారివి
ఎవరి ఫలితాలు వారివి.

ఒడ్డున ఇసకలో తలదూర్చి వేచిన
గుడ్డి గవ్వకు మాత్రం,
ఎవరికైనా దొరకాలన్న కోరిక
తీరనే తీరదు.