ప్రతీకారం

చాలా ఆర్భాటంగా, హడావుడిగా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి.
రెండు వైపుల వాళ్ళూ మారుతోన్న ఎకానమీని నాలుగు చేతులా పిండుకుని దండిగా సంపాయించిన కొత్తరకం ధనవంతులు.
పెళ్ళికొడుకు అమెరికాలో ఆరేళ్ళ నుంచి పనిచేస్తూ వాళ్ళకన్నా ఎక్కువే సాధించిన వాడు.
పెళ్ళికూతురు యీ మధ్యనే ఫిజిక్స్‌ పి.ఎచ్‌.డి. పూర్తిచేసిన సరికొత్తతరం యువతి!

నగేష్‌ బిజినెస్‌ పని మీద బెంగుళూరు వెళ్ళి అక్కణ్ణించి అందర్నీ ఓ సారి చూసొద్దామని ఇంటికెళ్ళాడు. అలా వెళ్ళీవెళ్ళటంతోనే పట్టుపట్టి యీ పెళ్ళి జరిపించాడు అతని తండ్రి నాయనమ్మ చావుబతుకుల్లో ఉందనీ, ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత వచ్చిన వాడివి మళ్ళీ ఏ ఐదారేళ్ళకో గాని రావనీ, మరీ వయసు ముదిరిపోతే సరైన అమ్మాయిలు దొరకరనీ యిలా ఎన్నో కారణాలు చెప్పి అతన్ని మాట్టాడకుండా చేసి.

అంజన తల్లిదండ్రులు అమెరికా అల్లుడనే సరికి ఎగిరి గంతేశారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా కార్యక్రమం జరిపించారు.

అంజన కూడా యీ సంబంధానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అమెరికాలో ఉండటమే కాదు, అందంగానూ హుందాగానూ కూడా ఉన్నాడు నగేష్‌. చూడ్డం తోనే ఆమెకి నచ్చాడు.

పాస్‌పోర్టులూ, వీసాల పనులు చకచక జరిగిపోయినయ్‌. పెళ్ళయిన వారం రోజుల్లో హనీమూన్‌ సగంలో వదిలేసి దంపతులిద్దరూ డల్లాస్‌ చేరుకున్నారు.

ఎపార్ట్‌మెంట్‌కి చేరటంతోనే ఇండియాలో ఇద్దరి ఇళ్ళకూ ఫోన్లు చేసి బాగానే చేరామని చెప్పారు.
అంజనకి జెట్‌లేగ్‌ వల్ల కొంచెంగా ఒళ్ళు తూలుతున్నట్టుంది. ఐనా కొత్తచోట కొత్తజీవితం గురించిన ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నయ్‌.
పగటి కలలు కంటూ నిద్రా మెలకువా కాని స్థితిలో ఉంది.

ఇంతలో ఎలాటి ఉపోద్ఘాతాలూ లేకుండా మొదలుపెట్టి ఓ పెద్ద బాంబు పేల్చేడు నగేష్‌

“అంజనా! నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. జాగ్రత్తగా విను… నాకిక్కడ సూజన్‌ అని ఓ అమెరికన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంది. మేమిద్దరం త్వరలోనే పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాం. అసలా విషయం మా వాళ్ళకు చెబ్దామనే నేను ఇండియా వచ్చింది. ఐతే వాళ్ళు నాకా ఛాన్స్‌ ఇవ్వలేదు. ఇంకా నేను చిన్నపిల్లవాడి నన్నట్టు బలవంతపెట్టి మన పెళ్ళి చేసేశారు”

మాట్టాడుతూనే సూట్‌కేస్‌లోంచి పేపర్లు తీశాడతను. వాటిలోంచి ఓ బొత్తి బయటికి లాగేడు.
కిచెన్‌లోంచి ఓ గిన్నె తీసుకొచ్చి ఆ పేపర్లు గిన్నెలో పడేసి వాటికి నిప్పంటించాడు.
“అది మన మేరేజ్‌ సర్టిఫికెట్‌. బూడిదై పోయింది. ఇక మనిద్దరి మధ్య ఎలాటి సంబంధం లేదు. నీ ఇష్టమొచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపోవచ్చు.”

ఏదో జోక్‌ చేస్తున్నాడేమో అనుకుంది అంజన ముందు. తరవాత సరిగా నిద్రలేక ఊరికే పిచ్చిపిచ్చిగా ఊహించుకుంటున్నానేమో అని అనుమానించింది. కాని పేపర్లు తగలబట్టం పూర్తయే సరికి అది కల కాదని తేలిపోయింది.

ఆమెకి ముందు భయమేసింది.
తరవాత కోపం వచ్చింది.
ఆ తర్వాత అతన్ని చంపేద్దామా అన్నంత ఆవేశం వచ్చింది.
ఆఖరికి ఏం చెయ్యాలో తోచక కుర్చీలో కూలబడింది.

ఇంతలో ఇండియాకి మళ్ళీ ఫోన్‌ చేశాడు నగేష్‌. అవతల వాళ్ళు ఫోన్‌ తియ్యటంతోనే కీచుగొంతుతో అరిచాడు “డేడీ! ఇక్కడ కొంపలు మునిగినయ్‌. ఇంతకుముందే నేను మీకు ఫోన్‌ చేశాక లోపలికెళ్ళి సామాన్లు సర్దుతున్నా. బయట లివింగ్‌ రూమ్‌లో అంజన ఎవర్తోనో ఫోన్లో మాట్టాడుతోంది. ఐదు నిమిషాలు గడిచాయో లేదో ఎవరో వచ్చి తలుపు కొట్టారు. అంజనే పరిగెత్తుకెళ్ళి తలుపు తీసింది..” నగేష్‌ కంఠంలో విషాదం నిండిపోయి ఉంది. మాట్టాడలేక మాట్టాడుతున్నాడు. మధ్యమధ్య ఎక్కిళ్ళొస్తున్నాయి.
“అంతే. వాళ్ళిద్దరూ నా ఎదురుగానే కౌగిలించుకున్నారు. ఒక్కమాటైనా మాట్టాడకుండా తన సూట్‌కేస్‌ తీసుకుని అంజన వాడితో వెళ్ళిపోయింది” భోరుమన్నాడు నగేష్‌. “మీరు నా జీవితం నాశనం చేశారు. ఇప్పుడు నేనేం కావాలి? ఎలా తలెత్తుకు తిరగాలి?” ఏడుస్తూ ఫోన్‌ పెట్టేశాడు.

దిగ్భ్రాంతురాలై చూస్తూండి పోయింది అంజన.

మళ్ళీ ఫోన్‌ తీశాడు. ఈసారి ఫోన్‌ కంపెనీకి. “నా ఫోన్‌ సర్వీస్‌ వెంటనే డిస్కనెక్ట్‌ చెయ్యండి” చెప్పేడు వాళ్ళతో. ఓ గంటలో చేస్తామన్నారు వాళ్ళు.

ఫోన్ని గోడనుంచి పీకేశాడు. ఫోన్‌కున్న కేబుల్‌ని ఊడబీకి ఓ సుత్తితో చితక్కొట్టేసి చెత్తలో పారేశాడు. ఒక్కసారి అంజనకేసి తీవ్రంగా చూశాడు.
అంతలోనే చిరునవ్వు వచ్చేసింది.
“సారీ అంజనా! నేను చాలా ఎఫిషియంట్‌గా పనిచేస్తాను. ఏ పనైనా చాలా మెటిక్యులస్‌గా ప్లాన్‌ చేస్తాను. అందుకే ఆరేళ్ళలోనే ఇంత పెద్ద పొజిషన్‌కి రాగలిగాను. కేవలం మా నాన్నని ఎదిరించలేకపోవటం అనేదొక్కటే నా వీక్నెస్‌. అందువల్లనే నిన్ను పెళ్ళి చేసుకోవాల్సొచ్చింది. ఇప్పుడింత డ్రామా ఆడాల్సొచ్చింది. మొత్తం మీద నేననుకున్నది సాధించాను..”

చాలా సౌమ్యంగా ముఖం పెట్టాడు. “నేనేం రాక్షసుణ్ణి కాను. చాలా రీజనబుల్‌ పర్సన్ని. భయపడకు. నీకు అన్యాయం చెయ్యను. ఓ రెండుమూడు రోజులు నువ్విక్కడే ఉండొచ్చు. ఈలోగా నీకు మరోచోటు చూస్తా. నువ్వెళ్ళేప్పుడు ఓ క్రెడిట్‌కార్డ్‌, కొంత కేష్‌ ఇస్తా. రెండు నెల్ల పాటు డబ్బుకి లోటుండకూడదు నీకు… నువ్వు నామీద కోపం తెచ్చుకోకు. నిజానికి నిన్ను అమెరికాకి తీసుకొచ్చినందుకు నువ్వు నాకు థేంక్స్‌ చెప్పాలి. ఇలాటి అవకాశం వస్తే చాలు ఏమైనా ఇవ్వటానికి ఇండియాలో ఎంతోమంది రెడీగా ఉన్నారని నాకు తెలుసు, నీకూ తెలుసు. కనక నువ్విక్కడ ఏదో జాబ్‌ చూసుకుని హాయిగా, స్వేఛ్ఛగా బతుకు”.

బయటికెళ్ళి రెండు శాండ్‌విచ్‌లు పట్టుకొచ్చాడు. ఒకటామెకిచ్చాడు.
అంజనకి ఏమీ తిన బుద్ధికాలేదు. పక్కన పడేసింది.
రెండూ తనే తినేశాడు నగేష్‌.
“నాకు నిద్రొస్తోంది. పడుకోబోతున్నా.నువ్వూ రాకూడదూ సగంలో ఆపిన హనీమూన్‌ కంటిన్యూ చేద్దాం!” జోక్‌ చేస్తున్నాడేమోనని అతని ముఖం వంక చూసింది. అలాటి ఛాయలేం కనిపించలేదు.

ఏమిటితను? ఒకవంక తన జీవితాన్ని నాశనం చేశాడు బహుశా యీపాటికి ఇండియాలో ఉన్న బంధువులందరికీ అతను అల్లిచెప్పిన కథ తెలిసిపోయి ఉంటుంది; తరవాత ఎప్పుడో తను ఫోన్‌ చేసి చెప్పినా తన వైపు కథ ఎవరూ నమ్ముతారన్న నమ్మకం లేదు ఇంతా చేసి ఇంకో వంక తనేదో త్యాగమూర్తి లాగా మాట్టాడుతున్నాడు!

ఒకపక్క మేరేజ్‌ సర్టిఫికెట్‌ తగలబెట్టేసి యిక మనకేం సంబంధం లేదంటాడు. మరో పక్క హనీమూన్‌ కంటిన్యూ చేద్దాం రమ్మంటాడు. ఎలాటి మనిషితను?

లివింగ్‌ రూమ్‌ లోనే సోఫాలో వెళ్ళి పడుకుంది.
పీడకలల్తో, తెలీకుండానే నిద్రపట్టిందామెకి.

నగేష్‌కి జెట్‌లేగ్‌ ఏమీ ఉన్నట్టు లేదు. పొద్దున్నే ఠంచనుగా 6 గంటలకి లేచాడు. కాసేపు జాగింగ్‌కి వెళ్ళొచ్చాడు. స్నానం చేసి సరిగ్గా 7.30కి ఆఫీస్‌కెళ్ళిపోయాడు. సరిగ్గా 12కి తినటానికి ఏవో పట్టుకొచ్చాడు. 12.45కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం 7కి యింటికొచ్చాడు డిన్నర్‌తో. వరసగా మూడు రోజులు యిదే రూటీన్‌ ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూగా.

మూడో రోజు. అంజనకి జెట్‌లేగ్‌ చాలావరకు తగ్గింది. బుర్ర ఇప్పుడిప్పుడే ఆలోచించగలుగుతోంది. తన పరిస్థితిని బేరీజు వేసుకోగలుగుతోంది.

సాయంత్రం ఏడు గంటలు. యధాప్రకారం గానే డిన్నర్‌ పట్టుకొచ్చాడు నగేష్‌. అంజన కూడ కాస్త తిన్నది.
ఏడున్నర.

“అంజనా, నీ బట్టలూ వస్తువులూ సర్దుకో. నిన్నో చోటికి తీసుకెళ్తున్నా. ఐదు నిమిషాల్లో బయల్దేరదాం” అన్నాడతను.

సరిగ్గా ఐదు నిమిషాల్లో బయల్దేరాడు. గంటసేపు పట్టింది ప్రయాణం. ఓ చిన్న స్ట్రిప్‌మాల్‌ పార్కింగ్‌లాట్‌లో ఆపాడు కారుని.
ఇంతలో ఓ మినీవేన్‌ వచ్చి వాళ్ళ పక్కనే ఆగింది.

గబగబా చెప్పాడు నగేష్‌ “అదుగో ఆ మినీవేన్‌లోనే నిన్ను తీసుకెళ్తారు. వాళ్ళు నిన్ను కొన్నాళ్ళపాటు ఉంచుకుంటారు. సహాయం చేస్తారు. ఇదిగో నేనిస్తానన్న డబ్బు, క్రెడిట్‌కార్డ్‌. ఈ కార్డ్‌ మీద నెలకు ఎనిమిది వందలు వాడుకోవచ్చు నువ్వు రెండు నెల్ల పాటు. ఆ తర్వాత అది పనికిరాదు. ఐతే ఒకటి గుర్తుంచుకో. నేను నీమీద ఏమీ కోపం ఉంచుకోను. నువ్వూ అలాగే ఉండాలి. అనవసరంగా ఆవేశపడి నాకేదైనా అపకారం చెయ్యాలని ప్రయత్నించావంటే దానివల్ల నాకంటే నీకే ఎన్నోరెట్లు ఎక్కువ నష్టం కలిగేట్టు నేను చూస్తాను. కాబట్టి ఇద్దరం స్నేహితులుగానే విడిపోదాం. ఇప్పటివరకు మనమధ్య జరిగింది కలగా మర్చిపోయి ఎవరి బతుకులు వాళ్ళం బతుకుదాం ” చకచకా ఆమె సూట్‌కేస్‌ దించాడు.

పక్కకారు కిటికీ కొద్దిగా తెరుచుకుంది.
కిందికి దిగిన అంజన అటూఇటూ చూస్తూండగానే ఆమె సూట్‌కేస్‌నీ ఆమెనీ ఆ కార్లోకి చేర్చటం, అది వేగంగా అక్కణ్ణించి వెళ్ళిపోవటం జరిగాయి.

ఎవరో ఒకతను ఆ కారు డ్రైవర్‌ సీట్లో ఉన్నాడు. వెనక సీట్లో ఒకావిడ ఉంది. తన పేరు మేరీ అని పరిచయం చేసుకుంది.
అంజనని కొన్నాళ్ళ పాటు తన దగ్గర ఉంచుకుని సహాయం చేస్తానని చెప్పింది.
అరగంట తర్వాత ఓ ఇంటికి చేరుకున్నారు వాళ్ళు.

ఓ పదిమంది ఆడవాళ్ళున్నారక్కడ తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఓ నార్త్‌ ఇండియన్‌ అమ్మాయి.
ఆ అమ్మాయి పేరు సీమా. సరిగా ఇరవై ఏళ్ళు కూడా ఉన్నట్టు లేవు. ఎవడో ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని తీసుకొచ్చాడు. వచ్చిన మర్నాడే పార్క్‌కి వెళ్దామని చెప్పి వందమైళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఓ రెస్ట్‌ రూమ్‌ దగ్గర వదిలేశాడు. ఆమె బయటికొచ్చి చూస్తే మాయమైపోయాడు వాడు. నాలుగ్గంటల పాటు ఎదురుచూస్తూ అక్కడే కూచుంది. చీకటి పడుతుంటే ఓ పోలీస్‌కారొచ్చింది. అంతకు ముందు అక్కడ అగి వెళ్ళిన వాళ్ళెవరో సెల్‌ఫోన్‌లో పోలీసులకి ఆ అమ్మాయి గురించి చెప్పారట. పోలీసులామెని ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఆమె ఎంత అమాయకురాలంటే వాడి పూర్తి పేరు గాని, అడ్రస్‌ గాని, ఫోన్‌ నంబర్‌ గాని, కార్‌ నంబర్‌ గాని, చివరికి ఎలాటి కారో గాని తెలియవామెకి. ఆమె చెప్పగలిగిన సమాచారం అంతా ఇండియాలో ఉన్న వాళ్ళ గురించింది. “కనుక్కుంటాం” అన్నారు గాని పోలీసులకీ తెలుసు ఇండియా నుంచి ఇక్కడ ఈ అమ్మాయికి ఉపయోగపడే సమాచారం సంపాయించటం అసాధ్యమని.

మిగిలిన ఆడవాళ్ళంతా భర్తలూ బాయ్‌ ఫ్రెండ్‌ల చేతుల్లో బాగా దెబ్బలు తింటున్న వాళ్ళు. ఇంక భరించలేక పారిపోయి వచ్చిన వాళ్ళు.

ఇదంతా ఓ కొత్తలోకంలా ఉంది అంజనకి.
ఐతే ఇప్పుడేమిటి తన కర్తవ్యం?
తనకున్న బేక్‌గ్రౌండ్‌తో ఏదో ఓ ఉద్యోగం సంపాయించటం కష్టం కాదు. నగేష్‌ సలహా ఇచ్చినట్టు అన్నీ మరిచిపోయి అందాల అమెరికాలో సరికొత్త జీవితం ప్రారంభించొచ్చు.
కాదూ, తన కలల్ని తుంచేసి, తన మీద భయంకరమైన అభాండం వేసి అందుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా తనని ఉద్ధరించినట్టు పోజులు పెడుతున్న అతని మీద పగ తీర్చుకోవచ్చు.
ఏదీ దారి?

అందంగా, చురుగ్గా, చలాకీగా ఉండే అంజనని అల్లరిపెడదామని ఎంతోమంది కుర్రవాళ్ళు ప్రయత్నించారు కాలేజీ రోజుల్లో. వాళ్ళకు తగ్గట్టుగా చాచి లెంపకాయ కొట్టినట్టు సమాధానాలు చెప్పటం లోనూ అవసరమైతే తన కరాటే ప్రావీణ్యాన్ని వాళ్ళకి గుర్తు చెయ్యచెయ్యటం లోనూ అంజన అప్పుడే రాటుదేలింది. ఆమె వంక చూడాలంటేనే అల్లరిమూకకి వణుకు పుట్టేట్టు చేసేసింది.

అలాటిది, ఇప్పుడిలా తన జీవితంతో చెలగాటం ఆడుకున్న వాడిని యింత తేలిగ్గా వదిలెయ్యాలా? వదిలెయ్యగలదా?
లేదు. వీల్లేదు. ప్రతీకారమే దారి. ఆ తరవాతనే జాబ్‌ కోసం వెదుక్కోవటం, ఇండియాకి ఫోన్‌చేసి మాట్టాడటం.
ఆవేశం చల్లారక ముందే, ఆటంకాలు అడ్డురాకముందే పూర్తి చెయ్యాల్సిన కర్తవ్యం ఇది.

ఐతే వీడు సామాన్యుడు కాడు. ఇక్కడ ఆరేళ్ళ నుంచి వుండి యీ సమాజంలో బతకటానికి, బాగుపడటానికి కావలసిన మెలకువలు బాగా ఆకళింపు చేసుకున్నవాడు. బోలెడు డబ్బు సంపాయించిన వాడు. పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడు.
వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసేదేదో పకడ్బందీగా అనుమానం కలక్కుండా చెయ్యాలి.

***************************

అదృష్టవశాత్తూ ఆ ఇంట్లో ఓ కంప్యూటర్‌ ఉంది. దానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంది.
సలహాల కోసం, సహాయం కోసం ఎంతమంది నుంచో ఈమెయిల్స్‌ వస్తుంటాయి వాళ్ళకి.
అలాగే ఆ ఇంటిని నడపటానికి ధనసహాయం కోసం సానుభూతి చూపించే సంస్థలతోనూ, వ్యక్తులతోనూ ఈమెయిల్‌ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తుంటారు వాళ్ళు.

ఒకసారి తన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకున్నాక ఒక్క క్షణం ఆగలేదు అంజన. వెంటనే కార్యరంగంలోకి దూకింది.
మర్నాటి నుంచి కంప్యూటర్‌ ఖాళీగా ఉన్నప్పుడల్లా వెబ్‌ మీదికి వెళ్ళి సమాచారం సంపాయించటం మొదలెట్టింది.
తనకు ఉపయోగపడే చాట్‌ గ్రూప్‌లు ఎన్నో కనిపించాయామెకి. వెబ్‌ సైట్స్‌ కూడా చాలానే ఉన్నాయి.
అన్నీ ఓపిగ్గా వెదికింది ప్రతీకారం తీర్చుకునే ఐడియాల కోసం, మార్గాల కోసం.

తొందర్లోనే ఓ విషయం స్పష్టమైందామెకి
ఈ దేశంలో ముందుగా ప్లాన్‌ చేసుకుని ఓ వ్యక్తికి శారీరకంగా హాని చేసినా, చెయ్యాలని ప్రయత్నించినా అది పెద్ద నేరమౌతుంది. అలాటి నేరస్థుల్ని పట్టుకోవటానికి పోలీస్‌ యంత్రాంగమూ, శిక్షించటానికి న్యాయవ్యవస్థా ఏమాత్రం వెనకాడవు. అందులోనూ ఓ స్త్రీ అలాటి పని చేసి చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటం దాదాపు అసంభవం.

కాబట్టి అది కాదు పద్ధతి.
మానసిక హింసే మార్గం.
అదీ ఆఖరివరకూ దాన్లో తన చెయ్యి కనపడకుండా.

ఐతే
ఈ ఇంట్లో ఉన్నంత కాలం అది వీలుకాదు. ఇక్కణ్ణుంచి వెళ్ళటం, రావటం చాలా రహస్యంగా, వీలైనంతవరకు రాత్రి వేళల్లో జరుగుతయ్‌. తన పథకానికి కావలసింది పగలు, రాత్రి కాదు.

ఇంతలో అక్కణ్ణించి బయటకెళ్ళే అవకాశం రానే వచ్చింది
కొన్నాళ్ళ క్రితం వరకు ఆ ఇంట్లో ఉండి యిప్పుడు ఓ ఉద్యోగం చేసుకుంటూ తనంతట తనుంటోంది ఓ అమ్మాయి, వీనస్‌. అంజన ఆ ఇంటికి వెళ్ళిన ఐదో రోజు రాత్రి వీనస్‌ అక్కడికి మళ్ళీ తిరిగొచ్చింది తనలాగా బయటికెళ్ళటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళటానికి.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంజన వెళ్ళిందామెతో. ఆమెతోనే కలిసి కొన్నాళ్ళు ఉండదలుచుకుంది.
వీనస్‌ కూడ అంజన కథ విని ఆమెని ప్రోత్సహించింది.
తనకు చేతనైన సహాయం చేస్తానంది.

అంజన కోరిక మీద ఆమెకి కార్‌ డ్రైవింగ్‌ నేర్పించింది వీనస్‌.
తనని వర్క్‌ దగ్గర్‌ దించి పగలంతా తన కారు వాడుకోవచ్చనీ, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆఫీస్‌ దగ్గర తనని పిక్‌ చేసుకుంటే చాలనీ చెప్పింది.

అలా అంజనకి కారొచ్చింది. దాంతో కాళ్ళొచ్చాయి. ఆమె పథకానికి రెక్కలొచ్చాయి.

ఆరోజు ఉదయం ఏడుంబావుకి నగేష్‌ ఎపార్ట్‌మెంట్‌ దగ్గర పార్కింగ్‌ లాట్‌ లో తన కారు వెనక సీట్లో నక్కి కూర్చుని ఉంది అంజన.

అలవాటు ప్రకారం ఏడున్నరకి ఠంచనుగా బయటికొచ్చాడతను.
బయల్దేరాడు.
అతని కారూ, లైసెన్స్‌ ప్లేట్‌ నంబరూ, ముఖ్యమైన గుర్తులూ రాసుకుంది అంజన.
తనూ అతనికి కొద్ది దూరంలో బయల్దేరింది.

ఒకవేళ అతనిప్పుడు ఆమె వంక చూసినా, ఆమె పెట్టుకున్న విగ్‌ వల్ల, కళ్ళద్దాల వల్ల, ఆమెని గుర్తించటం చాలా కష్టమౌతుంది.
ఐనా ఇంత తొందర్లో ఛాన్స్‌ తీసుకోదల్చలేదు అంజన.
జాగ్రత్తగా దూరం నుంచే ఫాలో ఔతోంది.

అలా వరసగా ఓ వారం రోజులు చేసింది.
వీక్‌ డేస్‌ లోనూ, వీకెండ్స్‌ లోనూ అతని దినచర్య అంతా ఇప్పుడామెకి కరతలామలకం.

ఇంక అతని ఆయువు పట్లేవో తెలుసుకోవాలి. అందుకు అతని ఎపార్ట్‌మెంట్‌ తాళాలు కావాలి.

అతనుండేది చాలా పెద్ద ఎపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ లో.
అందువల్ల అక్కడ రెంటల్‌ ఆఫీసుకి అతను ఎప్పుడోగాని వెళ్ళడని, పైగా అక్కడ పనిచేసే వాళ్ళు చాలా విషయాలు చూడాల్సుంటుంది గనక ప్రతి విషయాన్నీ లాగీ పీకీ చూడకుండా చకచకా నిర్ణయాలు తీసుకుంటారనీ ఊహించింది అంజన.
ఆమె ఊహ నిజమే అయ్యింది!
ధైర్యంగా ఆ ఆఫీసుకి వెళ్ళి నగేష్‌ తన భర్తనీ, రెండు రోజుల క్రితమే తను ఇండియా నుంచి వచ్చానని వాళ్ళకి చెప్పింది. తనక్కూడా ఎపార్ట్‌మెంట్‌కీ, మెయిల్‌ బాక్స్‌కీ తాళాలు కావాలని అడిగింది.
వాళ్ళకి అనుమానం కలక్కుండా తన పెళ్ళి ఫోటోలు కొన్ని చూపించింది. ఆ ఫోటోల మీదున్న డేట్‌ కూడా చూపించింది కావాలనే. అది ఇరవై రోజుల క్రితంది!

వెంటనే ఇంటికీ, మెయిల్‌ బాక్స్‌ కీ తాళాలు ఆమె చేతికొచ్చాయి.
ముందుగా మెయిల్‌ బాక్స్‌ చెక్‌ చేసింది.
తరవాత ఎపార్ట్‌మెంట్‌లో ఉన్న పేపర్లన్నీ జాగ్రత్తగా చదివి, తనకి పనికొచ్చే సమాచారం అంతా రాసుకుంది. వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా ఎక్కడవి అక్కడ జాగ్రత్తగా తిరిగి పెట్టేసింది.

స్టాక్‌ మార్కెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు నగేష్‌. బాగానే సంపాయించాడు కూడా.
ఐతే
ఆ చరిత్ర ఇక ముగిసిపోబోతోంది ఆ ఎకౌంట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ అతనికే కాదు, మరొకరికి కూడా తెలుసునిప్పుడు!

మర్నాడే తన తొలి అస్త్రం ప్రయోగించింది అంజన.
అతని పోర్ట్‌ఫోలియో లో ఉన్న స్టాక్‌లన్నిట్నీ అమ్మేసింది.
ఆ డబ్బు మొత్తం పెట్టి ఓ నాలుగు కొత్త స్టాక్‌లు కొంది.

వాటిలో మూడు దివాళాకి సిద్ధంగా ఉన్నాయి. వాటి వేల్యూ విపరీతంగా పడిపోతోంది.
నాలుగోది ఆ రోజే రిజల్స్ట్‌ రాబోతోన్న ఓ ఇంటర్‌నెట్‌ స్టాక్‌!

ఆరోజు మార్కెట్‌ క్లోజయాక తన స్టాక్‌ పోర్ట్‌ఫోలియో చూసుకున్న నగేష్‌కి ముందు ఏమీ అర్థం కాలేదు. తర్వాత కొంచెం అర్థమై కళ్ళు తిరిగాయి. ఇంకాస్త అర్థమయాక గొంతు తడారిపోయింది. ఊపిరి తీసుకోవటం కష్టమై పోయింది.
పొద్దున నూట యాభై వేలున్నది ఇప్పుడు ముఫ్ఫై ఆరు వేలకి పడిపోయింది.

వీరావేశంతో బ్రోకర్‌కి ఫోన్‌ చేశాడతను. ఫోన్‌ తీసుకున్న వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు.
ఇలాటివి వాళ్ళకి మామూలే.
ముందుగా ఓ పది నిమిషాల పాటు హోల్డ్‌లో ఉంచారు. తరవాత కాసేపు ఒక డిపార్ట్‌మెంట్‌ నుంచి మరోదానికి, అక్కణ్ణించి ఇంకో దానికి, మళ్ళీ మొదటిదానికి ఇలా అటూ ఇటూ తిప్పారు.
చివరికి ఓ కరుకుగొంతు వ్యక్తి లైన్లోకొచ్చాడు.
పాతికేళ్ళు పోలీసాఫీసరుగా పనిచేసి రిటైరయ్యాడతను.

“మా రికార్డ్‌లన్నీ చెక్‌ చేశాం. నీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో చేసిన ట్రేడ్‌లే ఇవి. కనుక దీన్లో మా బాధ్యత ఏమీ లేదు” అని చల్లగా చెప్పాడు.
“మరీ ఇంత స్టుపిడ్‌గా నేను చేస్తానని ఎలా అనుకున్నారు మీరు?” అని ఎగిరిపడ్డాడు నగేష్‌.
అందుకు విలాసంగా నవ్వాడతను. “మా సైట్‌లో రోజుకి అరమిలియన్‌ పైగా ఆన్‌లైన్‌ ట్రేడ్స్‌ జరుగుతుంటయ్‌. వీటిలో ఏది స్టుపిడ్‌ పనో ఏది కాదో నిర్ణయించేది మేం కాదు, మా కస్టమర్లే. వాళ్ళకి కావాల్సిన ట్రేడ్స్‌ని  వీలైనంత త్వరగా చెయ్యటమే మా పని. అది మేం పూర్తిగా నిర్వర్తించామనే మా నమ్మకం” అన్నాడతను కటువుగా, కర్కశంగా.

ఏమనాలో తెలీక కోపంగా ఫోన్‌ విసిరికొట్టాడు నగేష్‌.

ఇది తన శత్రువులెవరో కావాలని చేసిన కుట్రే, అనుమానం లేదు.
ఐతే ఎవరు?
తను ఇప్పుడున్న పొజిషన్‌ లోకి రావటానికి చాలా మంది తలల మీదగా ఎక్కాల్సొచ్చింది అది బిజినెస్‌ నీతి.
ఐతే వాళ్ళలో అందరూ అలా ఆలోచించగలిగే వాళ్ళు కాకపోవచ్చు కదా!
లేకపోతే , వాళ్ళెవరూ కాకుండా నిన్న మొన్న వచ్చిన అంజన చేసి ఉంటుందా?
పూర్తిగా ఆలోచించకుండా ఆవేశంలో ఏమైనా హాని చెయ్యాలని అనుకుని ఉండొచ్చు; అది మామూలే. కాని కొన్నాళ్ళలో విషయాలు అర్థమై తనే సర్దుకుంటుందనుకున్నాడు తను.
కాని ఇంతలోనే ఇంతగా దెబ్బ తియ్యటం అలాటివాళ్ళకి సాధ్యమా?

మళ్ళీ బ్రోకర్‌ని కాంటాక్ట్‌ చేసి ఈ రోజు తన ఎకౌంట్‌కు వచ్చిన ట్రేడ్స్‌ ఏ కంప్యూటర్‌ అడ్రస్‌ నుంచి వచ్చాయో కనుక్కున్నాడు.
ఏ దేశంలో ఉందో కూడా తెలీని ఓ “ఎనానిమస్‌” సర్వీస్‌ ద్వారా వెళ్ళేయట అవి.
ఆ వివరాలు తీసుకుని పోలీసుల దగ్గరకి పరిగెత్తాడు నగేష్‌. ఎఫ్‌.బి.ఐ. కి పంపుతామన్నారు వాళ్ళు. “లో ప్రయారిటీ”లో పడేశారు. దాని వంతు రావటానికి ఎన్నాళ్ళు పడుతుందో?

ఆ రాత్రి నిద్రపోలేదు నగేష్‌.
తనకు శత్రువులెవరున్నారో వాళ్ళందరి లిస్ట్‌ తయారుచేశాడు. ఎవరు తన పాస్‌వర్డ్‌ సంపాయించగలరో అంచనాలు వేశాడు. మొత్తం మీద రాత్రంతా జాగారం చేశాడు.

ఎందుకైనా మంచిదని పొద్దున్నే అంజన కోసం ఫోన్‌ చేశాడు.
ఎవరో ఆపరేటర్‌ ఫోన్‌ తీసింది. మెసేజ్‌ వదిల్తే ఎవరో విని దానికి సమాధానం అవసరం అనుకుంటే ఫోన్‌ చేస్తారని అతని నంబర్‌ తీసుకుందామె.
వెంటనే ఓ ఐడియా వచ్చిందతనికి.
అంజనకి మెసేజ్‌ ఇచ్చాడిలా “అంజనా! నువ్వు నిన్న చేసిన పని నాకు తెలుసు. వెంటనే నాకు ఫోన్‌ చేసి మాట్టాడకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు చేసిన ఈ పనికి నిన్ను తేలిగ్గా వదుల్తాననుకోకు”.
ఆ మెసేజ్‌ అర్జంటుగా పోలీసులకి అందించబడింది. “డొమెస్టిక్‌ వయొలెన్స్‌ బ్యూరో” ఎలర్ట్‌ చెయ్యబడింది.
అంజనతో ఈ విషయం చెప్పటానికి వాళ్ళు ప్రయత్నించారు గాని ఆమె దొరకలేదు.

నగేష్‌ అసహనం పెరిగిపోతోంది. ఇది తనకు బోలెడంత నష్టమే కాదు, చేసిందెవరో తెలీకపోవటం తన తెలివితేటలకే గొడ్డలిపెట్టు.
ఏడింటికే ఎపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ రెంటల్‌ ఆఫీస్‌ కెళ్ళాడు. అప్పటికి వాళ్ళింకా తెరవలేదు. తొమ్మిదిగ్గాని తెరవరు.
ఆఫీసుకి బయల్దేరాడు, సాయంత్రం వాళ్ళతో మాట్టాడొచ్చుననుకుని.
అలాకాకుండా వాళ్ళు తెరిచేవరకు ఆగివుంటేనా ఈ కథ మరో మలుపు తిరిగుండేది!

ఆఫీస్‌ కెళ్ళాడు నగేష్‌. స్టాక్‌ మార్కెట్‌ ఓపెనయిందప్పటికే. తన పోర్ట్‌ఫోలియో చూసుకున్నాడు. నాలుగు స్టాకుల్లో ఒకటి నిన్న నాలుగు డాలర్లున్నది ఇవేళ నలభై సెంట్లకి పడిపోయింది. మొత్తం పోర్ట్‌ఫోలియో విలువ పంధొమ్మిది వేలకి దిగజారింది. దాంతో అతని నెత్తురు ఉడుకెత్తిపోయింది. ఏం చెయ్యాలో తెలియని అసహాయత పిచ్చెక్కిస్తోందతన్ని.

అతని గర్ల్‌ ఫ్రెండ్‌ సూజన్‌ కూడ అతన్తో పాటే పనిచేస్తోంది. మనశ్శాంతిగా ఉంటుందని కాసేపు మాట్టాడ్డానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు.

“ఎందుకలా నీరసంగా ఉన్నావ”ని పలకరించింది సూజన్‌.
ముందు కాస్త మొహమాట పడ్డాడు గాని తర్వాత మొదలెట్టేసరికి ఆగకుండా విషయమంతా బయటికొచ్చేసింది. అలాటి పరిస్థితి లోనూ అంజన విషయంగాని తనకు పెళ్ళయిందన్న సంగతి గానీ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.

అంతా విని అనుమానంగా చూసింది సూజన్‌.
ఆమెకి అదంతా ఓ కట్టుకథలా కనబడింది.
నేగీ చాలా ఆర్గనైజ్‌డ్‌గా ఉంటాడనీ, అన్ని విషయాల్లోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడనీ ఆమెకి తెలుసు.
అందుకే ఇంతగా అతన్నెవరో మోసం చేసి ఉంటారంటే నమ్మకం కలగలేదామెకు.
ఈ కథ వెనక ఏదైనా పన్నాగం ఉందా అని ఆలోచనలో పడిపోయిందామె.

“ఇలా ఎవరు చేసి ఉంటారని నీ అనుమానం?” అని అడిగిందతన్ని.
“నాకెవరూ కనపట్టం లేదు. నా పాస్‌వర్డ్‌ ఎవరికైనా ఎలా తెలుస్తుంది?”
“ఆ ఇన్‌ఫర్‌మేషన్‌ ఆఫీసులో ఉంచావా?”
“లేదు, లేదు. నా ఎపార్ట్‌మెంట్‌లోనే ఉంచా. ఎప్పటికప్పుడు దాన్ని లాకర్లో పెడదామనుకుంటూ వీలుకుదరక గడిపేస్తున్నా. అందులోనూ ఇండియా వెళ్ళే ముందు ఆ హడావుడిలో తీరిక దొరకలేదు. అక్కణ్ణించి తిరిగిరావటం తోటే చాలా పనుల్లో కూరుకుపోయాను.” దీర్ఘంగా నిట్టూర్చాడు నగేష్‌.
“మరైతే ఈ మధ్య ఎవరికైనా నీ ఎపార్ట్‌మెంట్‌ తాళాలిచ్చావా?” అనుమానంగా అడిగింది సూజన్‌.
“ఇంకెవరికీ ఇవ్వలేదు, నీకొక్కదానికే!” అంటూనే నాలిక్కరుచుకున్నాడు నగేష్‌. కాని అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.
“ఆహా! నన్నొదిలించుకోవటానికి ఇదా నీ పన్నాగం!” అనుకుంది సూజన్‌. “అంటే నన్నే అనుమానిస్తున్నావా?” తీక్షణంగా ప్రశ్నించిందతన్ని.
“కాదు, కాదు. నీమీద నాకు అనుమానమా? అది కాదు నా ఉద్దేశ్యం..” ప్రాధేయపడ్డాడు నగేష్‌.
“ప్లీజ్‌ లీవ్‌ మి ఎలోన్‌. ఇండియా నుంచి వచ్చిందగ్గర్నుంచి నీ వాలకం చాలా అనుమానం కలిగిస్తోంది నాకు. అక్కడ ఎవర్నన్నా పెళ్ళి చేసుకొచ్చావేమో కూడా! (ఊరికే మాట వరసకి అలా అన్నదే గాని తన ఊహ ఎంత నిజమో ఆమెీకి తెలీదు!) మళ్ళీ నాతో ఈ విషయాలు మాట్టాడొద్దు. ఫ్రెండ్స్‌గా ఉండగానే విడిపోదాం” వేల్తో బయటికి దారి చూపిస్తూ దృఢంగా చెప్పింది సూజన్‌.

ఏడుపు మొహంతో వెళ్ళి తన ఆఫీస్‌లో పడ్డాడు నగేష్‌.
లోకం అంతా తల్లకిందులై పోతున్నట్టనిపించిందతనికి.

ఆరోజు సాయంత్రం నగేష్‌ తన ఎపార్ట్‌మెంట్‌కి చేరేటప్పటికి ఎనిమిదయ్యింది.
ఎందుకిలా జరిగిందా అని ఆశ్చర్యపడుతున్న అంజనకి వెంటనే దొరికింది సమాధానం తూలుతూ మెట్లెక్కుతున్నాడతను. చేతిలో బీర్‌కేస్‌.
ఆమెకది విజయసోపానం తొలిమెట్టు!
మంచి ఉత్సాహం కలిగిందామెకి.
“ఒరేయ్‌! ఇప్పుడే మొదలయ్యింది నీ పతనం. నాకు నువ్వు చేసిన అన్యాయానికి అసలు ప్రతీకారం వచ్చే వారం చూపిస్తాను చూడు!” కసిగా అనుకుంటూ అక్కణ్ణుంచి బయల్దేరిందామె.

లోపలికి వెళ్ళటం తోనే డిన్నర్‌ కూడా తినకుండా పడి నిద్రపోయాడు నగేష్‌.
తన ఎపార్ట్‌మెంట్‌ తాళాల గురించి సాయంత్రం అడుగుదామనుకున్న విషయమే గుర్తురాలేదతనికి.

ఆమె తన ముఖ్యపథకానికి ముహూర్తం పెట్టిన రోజు మరుసటి గురువారం. ఆరోజుకి వాళ్ళ పెళ్ళయి సరిగ్గా నెల రోజులౌతుంది!

ఆ గురువారం నాడు ఉదయం ఎనిమిదింబావుకి ఎక్కడో మలేషియాలో ఓ కంప్యూటర్‌ నుంచి అతని ఆఫీసుకి ఓ ఈమెయిల్‌ మెసేజ్‌ వెళ్తుంది. చాలా అమాయకంగా, ఏమాత్రం అనుమానం కలిగించని విధంగా ఉంటుందది. అతని స్టాక్‌ బ్రోకర్‌ నుంచి వెళ్ళిన మెసేజ్‌లా ఉంటుంది.
దాన్ని తెరుస్తాడతను. “నీ కంప్లెయింట్‌ని మేం ఇన్‌వెస్టిగేట్‌ చేస్తున్నాం. కొత్త సమాచారం దొరికిన వెంటనే తెలియపరుస్తాం” అని ఉంటుందందులో.
ఐతే అసలు వ్యవహారం తెర వెనుక జరుగుతుంది.
అతనా మెసేజ్‌ని తెరవగానే అది ఓ తాజారకం వైరస్‌ని అతని కంప్యూటర్‌ మీదికి దించేస్తుంది.
ఆ వైరస్‌ అతనికి తెలీకుండా ఓ చైల్డ్‌ పోర్నోగ్రఫీ సైట్‌ని ఏక్సెస్‌ చేస్తుంది.
అది జరిగిన వెంటనే ఇంటర్‌నెట్‌ యాక్టివిటీని మోనిటర్‌ చేసే ఓ సర్వర్‌ నగేష్‌ పనిచేసే కంపెనీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజర్‌కి ఎమర్జెన్సీ రెడ్‌ ఎలర్ట్‌ పంపుతుంది.
అప్పుడే నగేష్‌ కంప్యూటర్‌ మీద భీభత్సకరమైన చైల్డ్‌ పోర్నోగ్రఫీ దృశ్యాలు ప్రత్యక్షమౌతాయి.
అతను ఒక విండోని మూసేస్తే నాలుగు కొత్తవి తెరుచుకుంటయ్‌. వాటిని ఆపటం అతని తరం కాదు.
కంప్యూటర్‌ని రీబూట్‌ చేసినా ఉపయోగం ఉండదు.

వాళ్ళ కంపెనీకి పోర్నోగ్రఫీ విషయంలో చాలా స్ట్రిక్ట్‌ పాలసీ ఉంది ఆఫీస్‌ నుంచి పోర్నోగ్రఫీ సైట్స్‌కి వెళ్ళే వాళ్ళెవరైనా వెంటనే ఫైర్‌ చెయ్యబడతారు.
దాన్లో సంజాయిషీలకీ సంప్రదింపులకీ తావే లేదు.

అలా, ఆ రోజు ఎనిమిదిన్నర లోగా నగేష్‌ ఉద్యోగం ఊడిపోతుంది!
సెక్యూరిటీ గార్డ్‌ అతన్ని ఉన్న ఫళంగా తీసుకెళ్ళి అతని కారు దగ్గర దిగబెట్టి అతనక్కణ్ణించి వెళ్ళేవరకు నిలబడతాడు.
ఆ విధంగా ఉద్యోగం పోగొట్టుకున్న వాడికి మరొకచోట దొరకదు కనీసం ఈ వూళ్ళో.
ఐతే మరో చోట ఎక్కడన్నా కూడా దొరికే అవకాశం తగ్గించటానికి అంజన రంగం సిద్ధం చేసి ఉంచింది

సెక్యూరిటీ గార్డ్‌తో సహా నగేష్‌ని ఫోటో తియ్యటానికి మంచి పవర్‌ఫుల్‌ హైక్వాలిటీ డిజిటల్‌ కెమేరాతో రెడీగా ఉంటాడో ఫోటోగ్రాఫర్‌.
ఆ వెంటనే ఆ ఫోటోలు వూళ్ళోని అన్ని టీవీ స్టేషన్లకీ న్యూస్‌పేపర్లకీ అందుతాయి.
ఫారెనర్స్‌ గురించిన చెడ్డ వార్తలు చూపించటానికి ఉవ్విళ్ళూరుతుండే టీవీ స్టేషన్లు అక్కణ్ణించి జరగాల్సిన వ్యవహారం చూస్తాయి.

అసలైన నరకం అంటే ఏమిటో అప్పుడు అనుభవం లోకి వస్తుందతనికి.
టీవీతో పాటే చైల్డ్‌ సెక్స్‌ అఫెండర్ల అడ్రస్‌లు ఆ చుట్టుపక్కల యిళ్ళ వాళ్ళకి ప్రచారం చేసే ఓ కమ్యూనిటీ ఇంటరెస్ట్‌ గ్రూప్‌కి కూడా ఈ ఫోటోలు అందజెయ్య బడతాయి.
అది నగేష్‌ ఉండే ఎపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ను వెంటనే కాంటాక్ట్‌ చేస్తుంది.
ఆ కాంప్లెక్స్‌ పాలసీ ప్రకారం నగేష్‌ అప్పుడే అక్కణ్ణుంచి గెంటెయ్యబడతాడు.
ఊళ్ళో ఇంకెవరూ అతనికి ఎపార్ట్‌మెంట్‌ ఇవ్వరు. తెలిసిన వాళ్ళెవరూ అతన్ని దగ్గరికి రానివ్వరు.

ఊరు వదిలెయ్యటమో
లేకపోతే
ప్రాణాలే వదిలెయ్యటమో
మరో మార్గం ఉండదతనికి.

స్త్రీజాతి శక్తేమిటో జన్మలో మరిచిపోలేని విధంగా తెలుసుకోబోతున్నాడతను.
ఈ జరగవలసిన తతంగమంతా జరిగాక
అప్పుడు కనిపిస్తుంది అంజన!
మొహాన ఉమ్మేసి మరీ చెప్తుంది అతని స్థితికి కారణమెవరో!
అప్పుడు గాని చల్లారదు ఆమె పగ!
ఈలోగా అతనెలా కృశించిపోతున్నాడో, మానసిక నరకం అనుభవిస్తున్నాడో చూడాలి తను, చూసి ఆనందించాలి!!

రోజూ అతన్ని ఫాలో ఔతోందామె ఎక్కడికెళ్ళినా.

అతని పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది.
రోజుకో బీర్‌కేస్‌ ఐపోతోంది.
ఐనా సరిపోతున్నట్టు లేదు సోమవారం నాడు ఇంటికెళ్తూ దార్లో ఓ బార్లో ఆగాడు పావుగంట సేపు. బయటకొచ్చేప్పుడు కొంచెం తూలుడు.
కార్లో కొత్త బీర్‌కేస్‌ ఎలాగూ ఉంది.

మర్నాడు సాయంత్రం మళ్ళీ అదే బార్‌ దగ్గర ఆగాడు.
రోడ్‌ పక్కనే కార్‌ పార్క్‌ చేసి చూస్తోంది అంజన.

ముప్పావు గంట గడిచింది. బయటికి రాలేదతను.

అంతలో
క్షణంలో పదో వంతులో బార్‌ తలుపు భళ్ళున తెరుచుకోవటం, అతను గాల్లో తేల్తూ వచ్చి బయటపట్టం జరిగిపోయాయి!
తలెత్తే సరికి అతని ముక్కు నిండా రక్తం.
నుదురు చిట్లి నేల ఎరుపెక్కింది.
వికారంగా, విషాదంగా ఉన్నాడతను.
పైకి లేవటానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇంతలో ఒకడు బార్లోంచి బయటికొచ్చాడు.
మాంచి వస్తాదులా ఉన్నాడు.
నగేష్‌ని జుట్టు పట్టుకుని పైకి లేపాడు.
కడుపులో ఓ గుద్దు గుద్దాడు. “అమ్మా” అని అరిచాడు నగేష్‌.
పడకుండా పట్టుకుని ముఖం మీద మరోటిచ్చాడు.
వెల్లికిల పడి లేచి ఊగుతూ తూలుతూ కరాటే చెయ్యబోయాడు నగేష్‌.

చాలా భీభత్సంగా ఉందా దృశ్యం. సర్రియల్‌గా ఉంది. నవ్వొచ్చేట్టుగా ఉంది.
అతన్ని నిశితంగా గమనిస్తోన్న ప్రత్యర్థి ఎగిరి కాల్తో తన్నాడతన్ని.
నాలుగ్గజాల దూరం ఎగిరి వెల్లికలా పడ్డాడు నగేష్‌. తల వెనక నుంచి కూడా రక్తం.

ఇంక పెద్దగా అక్కర్లేదు ఒకటి రెండు గుద్దులు చాలు నగేష్‌ కీర్తిశేషుడు కావటానికి.
కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నట్టౌతోంది, అంజనకి.
తను ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటోందో వాడిప్పుడు చావుకి వెంట్రుక  వాసిలో ఉన్నాడు!

ఇప్పుడేం చెయ్యాలి తను?
..
..

కార్లోంచి బయటికి దూకింది.
చెంగున వాళ్ళున్న దగ్గరికి గెంతింది.
వెళ్తూనే అరిచింది “నేనిప్పుడే పోలీసులకి ఫోన్‌ చేశా, వాళ్ళొచ్చేస్తున్నార”ని.

నగేష్‌ని చితకబాదుతున్న వ్యక్తి ఓ సారి ఆమె వంక చూసి లోపలికెళ్ళిపోయాడు.

మాంసం ముద్దలా పడున్న అతన్ని కష్టపడి మోకాళ్ళ మీదికి లేపింది అంజన.
కార్‌ దగ్గరికి ఈడ్చుకెళ్ళి వెనక సీట్లోకి నెట్టింది.
కార్‌ స్టార్ట్‌ చేసి బయల్దేరింది.

ఆమెని గుర్తించాడతను. “అంజనా! నన్ను క్షమించు. నేను వెధవని. నిన్ను పోగొట్టుకున్న నిర్భాగ్యుడిని. దయచేసి నా దగ్గరకు వచ్చెయ్‌” ఏడుస్తూ, మూలుగుతూ, ప్రలాపిస్తున్నాడతను.

జాలీ, అసహ్యం కలబోసుకున్న కళ్ళతో అతని వంక చూసిందామె.
ఇలాటి వాడి మీదా తను పగతీర్చుకునేది?

దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌ ముందు వదిలేసిందతన్ని.
ఒక్క మాటైనా మాట్టాడకుండా మాయమైంది నిజమైన ఆనందం, తృప్తీ, ఆత్మ విశ్వాసాలతో!