చాసో పాత్రలు వెల్చేరువారి ఆరోపణ

(తానా పత్రికకు చిరకాలంగా సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు చాసో పాత్రల మరో ముఖాన్ని మనకు చూపిస్తున్నారీ వ్యాసంలో.)

“ఈమాట” ఎనిమిదో సంచికలో శ్రీ వెల్చేరు నారాయణరావుగారు కొన్నిచాసో పాత్రలను పరిచయం చేస్తూ  “చాసో కథల్లో ఉన్న మనుషులకి అంటే ప్రధాన పాత్రలకి  ఆవేశాలుండవు; కామం, ప్రేమ , ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప” అన్నారు. ఈ ప్రతిపాదనని తరువాత రెండు పేరాల్లో విపులీకరిస్తూ, “…నువ్వు చెయ్యవలసిన పని అల్లా నీ తెలివితేటలు వాడుకుని అవసరమైనప్పుడు, అవసరమైన పని చేసి అది నీతా, అవినీతా, మంచా, చెడ్డా అనే మీమాంసలు మానేసి సుఖంగా ఉండడమే. ఇది చాసో అనే పేరుతో చాగంటి సోమయాజులు రాసిన కథల్లో పాత్రలతో చెప్పించిన సంగతి…” అని కూడా అన్నారు. దీనికిఉదాహరణలుగా ఏలూరెళ్ళాలి, లేడీ కరుణాకరం, బదిలీ అనే మూడు కథల్లో ముఖ్య (స్త్రీ) పాత్రల ప్రవర్తనల్ని విశ్లేషించారు.చివరగా, ఇలాంటి పాత్రలనూ, ప్రవర్తననూ సమర్థించే కథలువ్రాసిన చాసోని అభ్యుదయ కథకుడనటం పొరపాటు అన్నట్టు ధ్వనించారు.

వెల్చేరు మాష్టారు ఎత్తిచూపిన మూడు కథల్లో ముఖ్యపాత్రలు ఆయన ప్రతిపాదనను సమర్థించేట్లుగా ఉన్న మాట వాస్తవం.రచయిత చాసో ఈ మూడు పాత్రల ప్రవర్తననూ సమర్థించినట్టు కనిపించటమూవాస్తవమే. స్త్రీపురుష సంబంధాలలో, అవసరమైనప్పుడు సాంఘిక నియమాలని తోసిపుచ్చి ప్రవర్తించిన వాళ్ళపై ముఖ్యంగా ఆడవాళ్ళపై, ఈ రచయితకు సానుభూతి ఉన్నట్లు కనిపించడమూ వాస్తవమే. అయితే చాసో పాత్రలకు “ఆవేశాలుండవు; కామం, ప్రేమ , ఈర్య్ష, క్రోధం, ఇలాంటి ఉద్రేకాలుండవు. వాళ్ళు ఏ కోరికకీ లొంగిపోరు ఒక్క బతకాలనే కోరిక తప్ప” అన్నది కొన్ని చాసో పాత్రలకే గాని అన్నిటికీ వర్తిస్తుందని నేను అనుకోను. పై చెప్పిన మూడు కథల వస్తువుతోనే (అంటే వివాహేతర లైంగిక ప్రవర్తనని గూర్చిన)కథలు చాసో మరికొన్ని రాశాడు. వాటిలో మరి రెండు కథలు చూద్దాం.

మొదటిది ఆవెత (విందు). (చాలాకాలం మరుగునబడిన ఈ కథ 1995వరకూ అంటే చాసో చనిపోయిన రెండేళ్ల వరకూ వెలుగు చూడలేదు. చాసో కథల సంపుటాల్లో ఈ కథ లేదు కానీ కథాసాగర్‌ లో కనిపిస్తుంది).  పేరు లేని చాకలి పడుచు ఈ కథను తన మాండలికంలో చెప్పే కథానాయిక. ఆమె పెళ్ళి మేనమామతో వైభవంగా జరిగింది. ఆవెతకు అరవై రూపాయలు ఖర్చయ్యింది. ఆవెతకు తీసుకున్న అప్పూ, వడ్డీ కులవృత్తితో తీర్చలేక, డబ్బు కోసం ఆమె మొగుడు దాలిగాడు రంగమెళ్ళాడు. పంపుతానన్న డబ్బూ రాలేదు. మనిషీ అయిపు లేడు.దాలిగాడు రంగంలో లాండ్రీ పెట్టుకొన్నాడనీ, ఎవరో బరమా అమ్మాయిని చేరతీశాడని సంవత్సరం గడిచాక విన్న కబురు. దాలిగాడు తిరిగిరాడనే ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. రెండేళ్ళయినా దాలిగాడు రాలేదు. “ఇంక ఊల్లో గొడవ. ఎదవ గేమాల్లో రంకుతనం తప్పునేదు.గర్లంట గడ్డికి పోతే ఇదే గోల. పొలాల్లో పనికి పోతే ఇదే సంత… ముండ గేమంలో మనసు కట్టుకొన్న మాలచ్చిమి ఒక్కతె నేదు!” అయినా ఈమె ఎవరికీ అందకుండా దాలిగాడి కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఊళ్ళో షోకిల్లాపురుషుడు శాస్త్రి కన్ను ఈమెమీద పడింది. అప్పు తీరుస్తానని ఈమె తల్లికి  ఆశ చూపించగా, తల్లి బలవంతాన చివరకు ఈమె శాస్త్రికి లొంగిపోయింది.

“కాని సెడ్డ ఏడ్చినాను. ఎన్ని రూపాయలిచ్చినా సెడ్డ బతుకు సెడ్డ బతుకే. శీ! దాలిగోడికి అపశారం చేసినాను. ఆడు తిరిగొస్తే!” అని బాధపడింది. ఒకరోజు నిజంగానే దాలిగోడు తిరిగొస్తూ దూరంనుండి కనిపించాడు.”ఎదవ అప్పు తీరకపోతేనేం! గంజినేక పస్తులుంటేనేం! మూన్నాళ్ళ బతుకు తెల్లారకపోనా? నా దాలిగోడి కపశారం చేసినాను. సెడిపోనాను.కన్నీల్లు ఏకధారగా కారినాయి. వొళ్ళంతా కరిగి, కన్నీల్లై,కాలువగట్టి, మాయదారి సాకిరేవుకాడ, ఊటగెడ్డలో కలిసి పోకూడదూ? బండలా మరింత బరువెక్కి బతికినాను, బతుకు!.. దాలిగాడు దగ్గిరకొచ్చి ఎన్నుమీద సేతులేసి; “ఓ లేడవకే, నానొచ్చీనాను!” అంటూ లేవదీసినాడు. పాడుమొగం ఎత్తి సూపనేక సూపనేక తలెత్తినాను… నాదేముడు నా దగ్గిర కొచ్చినాడు. జనమ కేటి గావాల!” ఈ కథ ముగింపు చూడండి “…ఇసక పర్రని పచార్లు చేస్తున్నాడు శాత్తిరి. పొద్దున్నే సికారు కొచ్చేడు. సికారుకి! ఇంకా తోటనో కొత్తాననుకొంటున్నాడు గావాల!  ఈడి బుర్ర పడిపోను”!  ఈ కథానాయిక వెల్చేరుగారు ఎత్తిచూపిన మిగతా ముగ్గురు కథానాయికలకన్నా భిన్నమైనది. ఈమెకి ఆవేశాలు, ఉద్రేకాలు, కామం, ప్రేమ, క్రోధం ఉన్నాయో లేదో ఈపాటికి మీకు తెలిసిపోయే ఉండాలి. ఆమె చేసిన పని గ్రామంలో రోజూ జరుగుతున్నదే. దాలిగోడు వస్తాడన్న ఆశ కూడా మిగల్లేదు. అయిన అప్పు తనపెళ్ళిది. ఆ అప్పు తీర్చటం కోసం తనకిష్టం లేకుండానే శాస్త్రికి లొంగింది. నీతీ అవినీతీ అనిలేకుండా సుఖంగా ఉండాలనేనా ఈ పాత్ర మనకు చెప్పేది?

ఈ కోవలోదే ఇంకో కథ “చెప్పకు చెప్పకు”. ఈ కథ మనకు కథకుడే కథానాయకుడు సత్యం పరంగా చెపుతాడు; కథకుడి స్వంత గొంతుక ఎక్కువగా వినిపించదు. “మొగుడు చచ్చిపోయాక వాళ్ళమ్మ (అంటే సత్యం తల్లి) పిల్లలతో బతకడానికి ఓ మార్గాన్ని పడ్డది. ఆ మార్గం పట్టినవాళ్ళు సర్వ సాధారణంగా పాము నోట్లోపడి పాతాళానికి పోతారు. వాళ్ళమ్మ నిచ్చెనలు ఎక్కి పరమపదసోపానం చేరుకుంది! దానిపద్ధతిని అది “ఔరా” అని సంసారం చేస్తున్నది”. అయితే ఊహ తెలిశాక సత్యానికి ఈ పద్ధతి నచ్చలేదు. తల్లి స్నేహితుల్లో బాగా పలుకుబడి ఉన్న ఒకరు మంచి ఉద్యోగం ఇప్పిస్తానన్నా సత్యం వెళ్ళడు. అప్పుడు తల్లి ఏడుస్తూ సత్యం బాధ తనకు తెలుసని చెప్పి, ఈ ఉద్యోగం తెచ్చుకొని ఊరువదిలి అతనిక్కావాల్సిన విధంగా సుఖంగా బ్రతకమని బతిమాలుతుంది. తనపై తల్లికి ఉన్న ప్రేమకి చలించిన సత్యం ఆ ఉద్యోగంలో చేరుతాడు. సత్యం తమ్ముడు ఏనాడో సత్యానికి నచ్చని దారిలో వెడ్తూ చాలా పలుకుబడిని సంపాదించాడు.

తనకున్న ఒక్క చెల్లెలూ తల్లి దార్లో పడకుండా చూసి, చక్కగా పెళ్ళి చేద్దామని సత్యం తహతహ. సత్యం తెచ్చిన బ్యాంక్‌ గుమస్తా సంబంధానికి అతని చెల్లెలు ఒప్పుకోదు. కొన్నాళ్ళకు ఆమె ఓ కోటీశ్వరుణ్ణి “పట్టి” తనపేర ఓ మేడ రాయించుకున్నదన్న వివరాన్ని సత్యం తమ్ముడు మోసుకొస్తాడు. ఆ కోటీశ్వరుడెవరో కాదు, సత్యానికి ఒకప్పుడు ఉద్యోగాన్నిప్పించినాయనే, తల్లి “స్నేహితుడు”. ఇప్పుడు తాము ఉంటున్న మేడ అడ్రెస్‌ చెప్పబోతున్న తమ్ముణ్ణి, “చెప్పకు, చెప్పకు, అది నేను వొచ్చే చోటు కాదు” అని సత్యం వారించుతుండగా కథ ముగుస్తుంది.

ఈ కథలో తల్లి ప్రవర్తన అంటే సత్యానికి ముందు కొంత కష్టం ఉండవచ్చు కాని రచయితకి ఆవిడపట్ల సానుభూతి ఉంది అనిపిస్తుంది. సత్యానికి ఉన్న మొహమోటమూ, వెరపూ ఆమెకు లేవు. కాని సత్యం పట్ల ప్రేమ, సత్యం అభిప్రాయాల పట్ల సానుభూతి ఉన్నాయి. సత్యం తల్లికి తాను ఎన్నుకొన్న దారి జీవితావసరం. నీతిని నమ్ముకొని అష్టకష్టాలూ పడకుండా, సుఖంగా బతకడానికి ఆవిడకి ఎన్నుకున్నది తప్ప వేరే దారి లేదు. చాసో పాత్రలపై వెల్చేరుగారు వెలిబుచ్చిన అభిప్రాయం ఈ తల్లి పాత్రకు కూడా సరిపోతుంది. అయితే తేడా ఏమిటంటే సత్యం తమ్ముడు,చెల్లెళ్ళ ప్రవర్తన పట్ల రచయితకి సానుభూతి ఉన్నట్లు కనిపించదు.తన జీవన మార్గాన్ని సమర్థించుకుంటూ తమ్ముడు చెప్పిన మాటలు సత్యాన్ని కాని, కథకుణ్ణి కాని కదలించినట్లు కనపడదు. వేరే దారులూ, అవకాశాలూ ఉన్నా వాళ్ళు తామున్న మార్గాన్ని కావాలని ఎన్నుకొన్నారు. ప్రాథమికమైన అవసరాలు లేకుండా అవినీతిమార్గాన్ని ఎన్నుకోవటాన్ని చాసో హర్షిస్తున్నట్లు కనపడదు. (లేడీ కరుణాకరాన్ని చాసో సమర్థించలేదా అని వాదించొచ్చు. కుంతీదేవి పాతివ్రత్యాన్ని చాసో సమర్థించాడు అనుకుంటేనే ఆమెను కూడా సమర్థించినట్లు).

సత్యమూ, ఆవెత నాయికా మాత్రమే కాదు. వాయులీనంలో దంపతులు,ఎందుకు పారేస్తాను నాన్నాలో తండ్రీకొడుకులు,   కొండగెడ్డలో నాయకుడు,ఆఖరికి మాతృధర్మంలో కత్తెర పిట్ట  (ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్నో పాత్రలు)   కామం, ప్రేమ, ఈర్య్ష, క్రోధం లాంటి ఉద్రేకాలు లేనివారు కాదు. చాసో నీతి, అవినీతి విషయాల మీద సాధారణంగా ఉపన్యాసాలు చెప్పలేదు. (ఆమాటకొస్తే స్వార్థాన్ని సమర్థించే ఉపన్యాసాలను విలన్‌ పాత్రలూ, డాఫర్‌ పాత్రలూ చెప్పేవి రావిశాస్త్రి కథల్లో చాలాచూస్తాం). బతకాలనే కోరిక నీతినియమాల కన్నా, ఒక్కోసారి ప్రేమలాంటి ఉద్రేకాలకన్నా, బలీయమయిందని అతనికి తెలుసు. మనుషులు తమ అవసరాలకోసం ఏమయినా త్యాగం చేయగలరని, తెలిసినవాడే. వారి కథల్ని ఫొటోగ్రాఫుల్లాగా రికార్డ్‌ చేశాడు కాని వారి చర్యలపై తన తీర్పు ప్రత్యక్షంగా చెప్పలేదు. అయితే నారాయణరావు గారు ఆరోపించినట్లు, ” నువ్వు చెయ్యవలసిన పని అల్లా నీ తెలివితేటలు వాడుకుని అవసరమైనప్పుడు, అవసరమైన పని చేసి అది నీతా, అవినీతా, మంచా, చెడ్డా అనే మీమాంసలు మానేసి సుఖంగా ఉండడమే.” అని మాత్రమే ఆయన పాత్రలతో చెప్పించిన సంగతి అంటే మాత్రం ఒప్పుకోలేను. ఇంతకు ముందు చెప్పినట్లు, కొన్ని అవినీతిపరులైన పాత్రలని ఆయన సమర్థించినట్లు కనిపించినా, మరికొన్ని అవినీతిపరులైన పాత్రల పట్ల ఆయన గర్య్హాన్ని స్పష్టంగానేచూడొచ్చు.

ఎందుకు పారేస్తాను నాన్నా లాంటి కథ రాసిన రచయిత పాత్రలకు ప్రేమ లాంటి ఆవేశాలు ఉండవు అంటే ఎలా ఊరుకొంటాను! ఆ ఒక్క కథ చాలు చాసో అనే చాగంటి సోమయాజుల్ని అభ్యుదయ సాహిత్య వాదుల్లో చేర్చటానికి!

జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ...