ఆనంద విషాద యోగం

అనగనగా అమెరికాలో ఆనందరావనే ఆంధ్రుడున్నాడు.
ఆస్టిన్లో ఉండి అంతులేని ఆవేదన పడుతున్నాడు.
అతనికళ్ళలో ఏదో బాధ కనపడుతోంది.
ఉద్యోగంలేదా? బంగారంలాంటిది ఉంది.
భార్య లేదా? నిక్షేపంలాంటి భార్య ఉంది.
పిల్లలు లేరా? మాణిక్యాల్లాంటి వాళ్ళున్నారు.
ఇల్లు లేదా? బ్రహ్మాండమైన ఇల్లుంది.
కార్లు లేవా? హంగులతో హోండా,  సరికొత్త టొయోటా.
బాగా అప్పులున్నాయేమో! అతని క్రెడిట్‌ రేటింగ్‌ ప్లాటినం.
డబ్బులేదేమో! బాగా షేర్లు కూడా కొంటుంటే!
పెద్ద రోగమేమో! మొన్ననే  కాపిటల్‌ 10000 పరిగెత్తినవాడైతే!

ఎడతెగని ఎలర్జీలేమో! అబ్బే అలాంటిదేమీ లేదు.
బాస్‌ చండ శాసనుడేమో బాస్‌కి ఈయనంటే చాలా ఇష్టం!
భార్య బండ బూతులు తిడుతుందేమో అయ్యో! చాలా అనుకూల దాంపత్యం.
భారతదేశపు పేదలు గుర్తుకొచ్చారేమో పార్టీల్లో మాటల్తో దేశసేవ చేసేశాడే.
ఆనంద్‌ గారూ! “అదేదో  తిన్నగా చెప్పి చావండెహె” అన్నాడు మాయాబజార్లో జంబు.
అప్పుడన్నాడతను  “కాలిఫోర్నియాలో ఉన్న నా ఫ్రెండు కాంతా రావుకు
డాట్‌ కాం లో బోల్డన్ని స్టాక్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి!
మరి నాకు లేకుంటే నా కన్ను కుట్టదా?” అని.

ఇతి అమెరికా జీవనపురాణే ఆస్టిన్‌ మిత్ర బృంద సంవాదే
ప్రధమాధ్యాయే, ఆనంద విషాద యోగం సర్వం సంపూర్ణం!